• facebook
  • whatsapp
  • telegram

నయా ఐచ్ఛికాలతో నవీన ఎంబీఏ!

ఆధునిక టెక్నాలజీలైన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ లర్నింగ్‌, డేటా సైన్స్‌ తదితరాలు మేనేజ్‌మెంట్‌ విద్యలో కొత్త ధోరణులకు కారణమవుతున్నాయి. దీంతో సంప్రదాయ ఎంబీఏలకు మించిన నైపుణ్యాలను కలిగిన కొత్త మేనేజర్లను కార్పొరేట్‌ రంగం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంబీఏలో సరికొత్త స్పెషలైజేషన్స్‌ వస్తున్నాయి. వాటిపై అవగాహన ఉంటే తగినదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.


రెండేళ్ల కాలవ్యవధి గల కోర్సు మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ). ప్రథమ, ద్వితీయ సెమిస్టర్లలో విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ విద్య ప్రాథమిక విషయ పరిజ్ఞాన (కోర్‌) సబ్జెక్టులైన నిర్వహణ సూత్రాలు, హ్యూమన్‌ రిసోర్సెస్‌, స్టాటిస్టిక్స్‌, ఆర్థికశాస్త్రం, ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్‌ సబ్జెక్టులను అభ్యసిస్తారు. ప్రాథమిక సబ్జెక్టులు విద్యార్థులకు మేనేజ్‌మెంట్‌ భావనలు, సిద్ధాంతాల పట్ల పటిష్ట్టమైన పునాదిని వేస్తాయి. మొదటి ఏడాది పూర్తిచేసినవారు రెండో సంవత్సర ప్రవేశానికి ముందు స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.


ఎంబీఏను ఎంచుకున్నవారు ముందు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఇది ఇతర పీజీ కోర్సుల్లా కాకుండా మల్టీ డిసిప్లినరీ కోర్సు. కాబట్టి, విద్యార్థి వివిధ కోణాల నుంచి ఆలోచించగల తత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అసలు విద్యార్థి ఎంబీఏ జీవితం కళాశాల ఎంపిక నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మెరుగైన బి స్కూల్‌/ కళాశాలను ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, పూర్వవిద్యార్థుల నియామకాలు, కంపెనీల రిక్రూట్‌మెంట్‌ ఆధారంగా ఎంచుకోవాలి. విద్యార్థి చురుకుగా, వివిధ కమిటీల స్థాపనలో, కమిటీల్లో ఉదాహరణకు- ప్లేస్‌మెంట్‌ కమిటీ, మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌ కమిటీల్లో ఆక్టివ్‌ మెంబర్‌గా ఉండాలి.


మొదటి సంవత్సరం నుంచే విద్యార్థి పాఠాలతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నాయకత్వ లక్షణాలు, సమకాలీన అంశాలపట్ల అవగాహన పెంచుకోవాలి. డిబేెట్లు, క్విజ్‌ పోటీల్లో మొదటి నుంచీ చురుగ్గా పాల్గొనాలి. సీనియర్లు, కళాశాల పూర్వ విద్యార్థులతో సత్సంబంధాలు పెంచుకోవడం ద్వారా రిక్రూట్‌మెంట్‌లో ముందడుగు వేయొచ్చు. నెట్‌వర్క్‌ కూడా అభివృద్ధి చెందుతుంది. ఎంబీఏ విద్యార్థులకు నెట్‌వర్క్‌ ఎంతో అవసరం కూడా.

వినూత్న ధోరణులు

ఎంబీఏ విద్య ప్రపంచీకరణ, కొత్త పరిణామాలు, చట్టాలు, టెక్నాలజీ మేళవింపుతో కొత్త పోకడలు సంతరించుకుంటూనే ఉంటుంది. కొత్తగా ఈ రంగంలో డేటా అనలిటిక్స్‌/ డేటా సైన్స్‌ తమదైన ముద్ర వేస్తున్నాయి. వివిధ కొత్త స్పెషలైజేషన్లూ అందుబాటులోకి వస్తున్నాయి. మూక్స్‌ డిజిటల్‌ విస్ఫోటాన్ని ఎంబీఏలో సృష్టిస్తున్నాయి. ఈ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంలిజెన్స్‌, డీప్‌ లర్నింగ్‌ టెక్నిక్‌లు నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఈ రంగాల్లోనూ తమ ప్రతిభను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా ఇంటర్న్‌షిప్‌ల గురించి తెలుసుకుంటూ, తమకు తగ్గవాటిని చేస్తుండాలి.

సరికొత్త ఉద్యోగాలు పొందాలంటే..?

సానుకూల జీడీపీ అంచనాలు, స్టాక్‌ మార్కెట్ల బుల్‌ ట్రెండ్‌, అనుకూల వ్యాపారావకాశాల వల్ల ఇండస్ట్రీలో హైరింగ్‌ పెరిగింది. తరగతికే పరిమితం కాకుండా ఇంటర్న్‌షిప్‌లు, స్టార్టప్‌ల ద్వారా తమ కొత్త ఆలోచనలకు కార్యరూపం ఇవ్వొచ్చు. ఎంబీఏ చదివినవారు ఉద్యోగం చేయడానికే కాకుండా ఉద్యోగకల్పన ఇవ్వగల ఆలోచనలకూ పదును పెట్టగలగాలి. కార్పొరేట్‌ రంగంలో పైకి రావాలనుకునేవారు బృందంలో పనిచేసే నేర్పు, నాయకత్వ లక్షణాలతోపాటు తమ స్పెషలైజేషన్‌లో సాంకేతిక నైపుణ్యాలనూ అభివృద్ధి చేసుకోవాలి.


బిజినెస్‌ అనలిస్ట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, డేటా అనలిస్ట్‌, ఆంత్రప్రెన్యూర్‌ అడ్వైజర్‌, అండర్‌ రైటర్‌, ప్రొడక్ట్‌ అనలిస్ట్‌ వంటి కొత్త తరహా ఉద్యోగాలకు ఎంబీఏ ప్రాతిపదికగా ఉంటోంది. ఈ ఉద్యోగాలకు అర్హత సంపాదించాలనుకునేవారు.. కోర్సు పూర్తయ్యేలోగా నిర్దిష్టంగా కొన్ని చేయాల్సి ఉంటుంది. కంపెనీల్లో చోటు చేసుకుంటున్న మార్పులు, ప్రపంచీకరణ, అధిక పోటీతత్వం కారణంగా కొత్త/ నూతన తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి.

బిజినెస్‌ అనలిస్ట్‌గా ఉద్యోగాన్ని పొందాలనుకునేవారు ఆపరేషన్స్‌, మార్కెటింగ్‌ స్పెషలైజేషన్‌ను ఎంచుకుంటే మంచిది.

ప్రొడక్ట్‌ అనలిస్ట్‌ అవ్వాలనుకునేవారు మార్కెటింగ్‌, కన్సల్టెన్సీ/ ఆపరేషన్స్‌ను ఎంచుకోవచ్చు. డిగ్రీలో ఇంజినీరింగ్‌ చదివినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, అండర్‌ రైటర్‌ ఉద్యోగాలు ప్రతి ఎంబీఏ ఫైనాన్స్‌ విద్యార్థి స్వప్నం. కానీ ఈ రోల్‌ను సాధించాలంటే టాప్‌ టైర్‌ బిజినెస్‌ స్కూల్స్‌ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ రంగంలో రాణించాలంటే సీఎఫ్‌ఏ, సీపీఏ, జీఏఆర్‌పీ వారు అందించే ఎఫ్‌ఆర్‌ఎం కోర్సులను చేయడం అవసరం.

డేటా అనలిస్ట్‌ కావాలనుకునేవారు డేటా అనలిటిక్స్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌లను ఎంచుకుని స్టాటిస్టిక్స్‌, బిగ్‌డేటా టూల్స్‌ అయిన ఆర్‌, పైథాన్‌, ఎస్‌ఏఎస్‌, మ్యాట్‌ల్యాబ్‌ వంటి టూల్స్‌పై పట్టు సాధించాలి.

ఆంత్రప్రెన్యూర్‌ అడ్వైజర్‌గా రాణించాలంటే కన్సల్టెన్సీ, మార్కెటింగ్‌ లేదా ఆపరేషన్స్‌ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలి. సాధారణంగా అడ్వైజర్‌/ కన్సల్టెంట్‌ రోల్స్‌ టాప్‌ టైర్‌ ‘బి' స్కూల్‌ విద్యార్థులకు దొరుకుతాయి. విద్యార్థి దశలోనే ఇంటర్న్‌షిప్‌ చేయడం, కొత్త టూల్స్‌ నేర్చుకోవడం ద్వారా తాము ఎంచుకున్న రంగంలో స్థిరపడొచ్చు. ప్రముఖ బీ స్కూల్సులో ఆధునిక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రాధాన్యం దృష్ట్యా హెచ్‌సీయూ, ఐపీఈ, సీబీఐటీ లాంటి సంస్థల్లో వీటిని ప్రవేశపెడుతున్నారు. సాధారణ మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో చదివేవారు కూడా ఆన్‌లైన్‌ ద్వారా నూతన స్పెషలైజేషన్లకు సంబంధమున్న కోర్సులను అభ్యసించవచ్చు.

విభిన్న స్పెషలైజేషన్లు

మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌లే కాకుండా ఎంబీఏలో ఎన్నో విభిన్న, కొత్త స్పెషలైజేషన్లున్నాయి. వాటిలో కొన్ని..

అనలిటిక్స్

ప్రస్తుత పోటీ ప్రపంచంలో అంకెలు, డేటా పాత్ర చాలా కీలకం. ప్రతి వ్యాపార సంస్థకూ వివిధ నిర్ణయాలు తీసుకోవడంలో డేటా కలెక్షన్‌, ఇంటర్‌ప్రిటేషన్‌, కండెన్సింగ్‌ ఆఫ్‌ డేటా చాలా విలువైంది. ఇటీవలి కాలంలో అనలిటిక్స్‌ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ రంగం అందిస్తున్న ఉన్నత వేతనాలు, విరివిగా ఉన్న ఉద్యోగావకాశాలే ఇందుకు కారణం.  గ్రాడ్యుయేషన్‌లో మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌సైన్స్‌, బీటెక్‌ చేసినవారు ఎంబీఏలో దీన్ని ఎంచుకోవడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అంకెలపట్ల మక్కువ, త్వరగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, మేథమేటికల్‌ స్కిల్స్‌, చురుకుదనం, కోడింగ్‌ నైపుణ్యాలు గల అభ్యర్థులకు ఇది తోడ్పడుతుంది. యాడ్‌ఆన్‌ కోర్సులైన ఆర్‌ సాఫ్ట్‌వేర్‌, హడూప్‌, పైథాన్‌, బిగ్‌డేటా, అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టిక్స్‌ వంటి కోర్సులను కోర్స్‌ఎరా, ఎడెక్స్‌ వెబ్‌సైట్లలో నేర్చుకోవచ్చు. ఎంబీఏ అనలిటిక్స్‌ పూర్తి చేసినవారికి డేటా అనలిస్ట్‌, డేటా సైంటిస్ట్‌, బిగ్‌డేటా కన్సల్టెంట్‌, డేటా ఆర్కిటెక్ట్‌, బిజినెస్‌ అనలిస్ట్‌ వంటి ఉద్యోగావకాశాలు ఉన్నతవేతనంతో దేశవిదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. 2020 నాటికి మనదేశంలో అయిదు లక్షలమంది డేటా అనలిస్టుల అవసరం ఉందని అంచనా.

బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌

దేశంలో బీమా, ఇన్సూరెన్స్‌ రంగాలు పరివర్తన దశలో ఉన్నాయి. గతంతో పోలిస్తే నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం, ఉద్యోగులకు మంచి జీతాలు రావడం వల్ల ప్రజల్లో పొదుపు పట్ల ఆసక్తి పెరిగింది. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, చలాకీగా పనిచేసే తత్వం, అంకెలపట్ల ఆసక్తి, కస్టమర్‌ మేనేజ్‌మెంట్‌, అమ్మకపు నైపుణ్యాలను విద్యార్థులు కలిగివుండాలి. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్స్‌, ఫండ్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, కార్పొరెట్‌ బ్యాంకింగ్‌, ట్రేడ్‌ ఫైనాన్స్‌ వంటి సబ్జెక్టులను విద్యార్థులు చదువుతారు. ఉద్యోగావకాశాలపరంగా అభ్యర్థులకు పర్సనల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌, ఫండ్‌ మేనేజర్స్‌, బ్యాంకింగ్‌ స్పెషలిస్ట్‌, సిప్‌ అడ్వైజర్‌, రిస్క్‌ మేనేజర్‌, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ అభ్యర్థులకు అవకాశాలున్నాయి.

కన్సల్టింగ్‌

ప్రతి వ్యాపార సంస్థ తమ నిర్ణయాలను తీసుకునే క్రమంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి లేదా కన్సల్టెంట్‌ సలహాలు, సూచనలను తీసుకుంటుంది. కన్సల్టెంట్‌ సంబంధిత రంగంలో విశేష అనుభవం, జ్ఞానం, లోతుగా అధ్యయనం చేసే నేర్పరితనం, స్పష్టత, పోటీ తట్టుకుని వ్యాపారం చేయగలిగిన సామర్థ్యం, రిస్క్‌ మిటిగేషన్‌ వంటి నైపుణ్యాలు ఉండాలి. ఐటీ, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, టాక్స్‌, స్ట్రాటజీ, స్టార్టప్‌ కన్సల్టింగ్‌ వంటి వాటిల్లో తమకంటూ ఒక రంగంలో ప్రత్యేకతను ఏర్పరచుకోవాలి. మంచి బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ కన్సల్టింగ్‌ చేసినవారికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బూజ్‌, మెకిన్సే కన్సల్టింగ్‌, ఏటీ కార్నీ వంటి సంస్థలు ఎర్రతివాచీ పరుస్తున్నాయి.

ఆంత్రప్రెన్యూర్‌షిప్‌

ఉద్యోగం కాదు.. తమ ఆలోచనలను వ్యాపార రూపంలో కార్యరూపం దాల్చుకోవాలనుకునేవారు ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చు. తద్వారా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబ వ్యాపార నేపథ్యం, కొనసాగింపు, అభివృద్ధి చేయాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు. దేశాభివృద్ధిలో ఆంత్రప్రెన్యూర్ల పాత్ర విడదీయలేనిది. మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఫండింగ్‌, ఏంజిల్‌ ఇన్వెస్టింగ్‌ వంటివి యువతను తమ సొంత సంస్థలు నెలకొల్పేలా ప్రేరేపిస్తున్నాయి. సృజనాత్మకత, రిస్క్‌ టేకింగ్‌, పీపుల్‌ స్కిల్స్‌, దూరదృష్టి, అపజయాలకు కుంగిపోని మనస్తత్వం, పట్టుదల వంటి లక్షణాలున్నవారు దీన్ని ఎంచుకోవడానికి అర్హులు. దీన్ని పూర్తిచేసినవారు స్టార్టప్స్‌, కుటుంబ వ్యాపారం, సొంత సంస్థలను నెలకొల్పుకోవచ్చు.ఆంత్రప్రెన్యూర్‌గా రాణించవచ్చు.

రిటైలింగ్‌

వేగంగా మార్పులు చెందుతున్న రంగాల్లో రిటైలింగ్‌ మొదటి వరుసలో ఉంటుంది. విరివిగా ఉద్యోగావకాశాలూ అందిస్తున్నదీ రంగం. మనదేశంలో టాటా, బిర్లా, అంబానీ, అదానీలు రిటైలింగ్‌లో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సేల్స్‌, అడ్వర్టైజింగ్‌, మార్కెట్‌ రిసెర్చ్‌, కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులకు అవకాశాలు పుష్కలం. వినియోగదారుడు కొత్తదనాన్ని ఎప్పుడూ కోరుకుంటాడు. ఆ కొత్తదనాన్ని అందించగలిగే నైపుణ్యం ఉన్నవారు ఈ రంగంలో రాణిస్తారు. మర్చెండైజింగ్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, ఎక్స్‌పీరియన్స్‌ మేనేజ్‌మెంట్‌, స్టోర్‌ ఆప్టిమైజేషన్‌, కస్టమర్‌ సైకాలజీ వంటి సబ్జెక్టులను విద్యార్థులు అభ్యసిస్తారు. క్రియేటివ్‌ అడ్వర్టైజింగ్‌ హెడ్‌, రిటైల్‌ మేనేజర్‌, కస్టమర్‌ రిలేషన్‌ మేనేజర్‌, బ్రాండ్‌ స్పెషలిస్ట్‌ పోస్టులుంటాయి. ఈ-కామర్స్‌ రంగంలోనూ అవకాశాలుంటాయి. విద్యార్థులు సిక్స్‌ సిగ్మా, లీడ్‌ మేనేజ్‌మెంట్‌, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ వంటి యాడ్‌ ఆన్‌ కోర్సులను చేసి తమ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
 

Posted Date: 02-12-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌