• facebook
  • whatsapp
  • telegram

దూరవిద్య మరింత దగ్గర

ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ఫలాల్ని ప్రజలకు చేరువ చేయాలన్న అధికారుల సంకల్పం దూరవిద్య విద్యార్థులకు చదువును మరింత దగ్గర చేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక విశ్వవిద్యాలయాలు దూరవిద్యా విద్యార్థులకు సంవత్సరానికి 15 నుంచి 30 రోజుల కాంటాక్టు తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నాయి. ఆ కొద్దిపాటి బోధన సమయం చాలక, విషయ పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో పెంచుకోలేక, గురువుల నుంచి సకాలంలో సందేహాల నివృత్తి జరగక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ దూరవిద్య విద్యార్థులకు వరంగా మారింది.

అంతర్జాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 'వెబ్‌ కాస్టింగ్‌' విధానంలో ఒక ప్రాంతం నుంచి సుదూరంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడే, సమావేశం నిర్వహించే సౌలభ్యం ఉంది. దీనికి గీతం దూరవిద్యావిభాగం (సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ లర్నింగ్‌/సి.డి.ఎల్‌.) అధికారులు మరింత సాంకేతికత జోడించారు. దేశవ్యాప్తంగా ఉండే దూరవిద్య విద్యార్థుల బోధనకు ఉపయుక్తంగా ఉండేలా సొంతంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. పాఠాల ప్రసారానికి అవసరమైన అధునాతన కెమెరాలను, అత్యాధునిక కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. ఆ వ్యవస్థ ఎలాంటి అడ్డంకులూ లేకుండా సమర్థంగా పనిచేయడానికి గీతం సి.డి.ఎల్‌.లో రూ.50 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా స్టూడియో నిర్మాణం చేశారు.

సాఫ్ట్‌వేర్‌ ప్రత్యేకతలివే....

స్టూడియోలో ఆచార్యుడు చెప్పే పాఠం ఒకేసారి 1500 మంది విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. రికార్డు చేసుకోవచ్చు. ఆ సమయంలో విద్యార్థి లేకపోతే మొత్తం ప్రసారాన్ని కావాల్సిన సమయంలో కావాల్సిన సమయంలో చూసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

బోధనలో భాగంగా బ్లాక్‌బోర్డ్‌ను వినియోగించడం తప్పనిసరి. ఇందులో కంప్యూటర్‌పై ఉండే తాకే తెరే బ్లాక్‌బోర్డ్‌గా కూడా ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. ఈ తెరపై రాసే అక్షరాలన్నీ విద్యార్థుల కంప్యూటర్‌ తెరపై కనపడతాయి.

బోధించే పాఠం, బోర్డుపై రాస్తున్న దృశ్యం రెండూ కూడా విద్యార్థుల కంప్యూటర్లలో రెండు భాగాలుగా (పక్కపక్కనే రెండు విండోలు) విడిపోయి కనిపిస్తుంటాయి. ఫలితంగా ఎలాంటి గందరగోళానికీ తావులేకుండా వీక్షించడానికి వీలవుతుంది.

బోధనలో భాగంగా ఏదైనా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను విద్యార్థులకు చూపడానికి కూడా వెసులుబాటు ఉంది. ఇతర కంప్యూటర్లలో, పెన్‌ డ్రైవ్‌లలో ఉన్న సమాచారాన్ని కూడా కనెక్ట్‌ చేసి ప్రదర్శించవచ్చు. తెరపై కనబడే వివిధ అంశాలపై పాయింటర్‌ ఫోకస్‌ చేసి వివరించే సౌలభ్యం కూడా ఉంది.

సాధారణంగా వీడియో దృశ్యాలు నిరంతరాయం ప్రసారం కాక ఇబ్బందులు పడుతుండడం సాధారణం. అధిక సామర్థ్యం ఉన్న సర్వర్లను వినియోగిస్తుండడం, వీక్షించాలనుకునేవారికి పాస్‌వర్డ్‌లు ఇచ్చి విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తుండడం వల్ల ప్రసార అంతరాయాలకు అవకాశం లేదు.

ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నప్పుడు విద్యార్థికి ఎలాంటి అనుమానం వచ్చినా నివృత్తి చేసుకునే వెసులుబాటు కూడా ఉండడం గమనార్హం. విద్యార్థి తన కంప్యూటర్‌ నుంచి తన అనుమానాన్ని టైప్‌చేస్తే అది క్షణాల్లో ఆచార్యుడి ముందుండే కంప్యూటర్లో ప్రత్యక్షమవుతుంది. దాని ఆధారంగా విద్యార్థుల సందేహాల్ని కూడా ఆచార్యుడు అప్పటికప్పుడే నివృత్తి చేస్తారు.

ఆన్‌లైన్‌ విధానం వల్ల విద్యార్థులు తమకు నచ్చిన రోజుల్లో కావాల్సిన పాఠాలు కావాల్సినంతసేపు పూర్తిగా వినొచ్చు. ఫలితంగా కాంటాక్టు తరగతుల కోసం ఉద్యోగులు ప్రత్యేకించి సెలవులు పెట్టుకోవాల్సిన అవస్థ తప్పుతుంది.

దూరవిద్య నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాలకు కూడా ఆన్‌లైన్‌ విధానం చేసే మేలు అంతా ఇంతాకాదు. ఒకసారి ఒక అంశంపై ఆచార్యుడి బోధనను రికార్డు చేస్తే దాన్ని సిలబస్‌ మారేవరకు విద్యార్థులకు అందుబాటులో ఉంచవచ్చు. ఆచార్యుల్ని ఎక్కడెక్కడో ఉండే వివిధ స్టడీ సెంటర్లకు పంపాల్సిన అవసరం ఉండదు. దూరవిద్య విద్యార్థుల కేటాయించే బోధన సమయాన్ని కూడా సంవత్సరానికి 15 నుంచి 30 రోజుల్లోపునకు పరిమితం చేయకుండా కళాశాలలో ఉండి చదువుకునే విద్యార్థితో సమానంగా బోధనను ఆన్‌లైన్లో అందించవచ్చు.

Posted Date: 02-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌