• facebook
  • whatsapp
  • telegram

ఫార్మసిస్ట్‌

 ఏ మాత్రం నలతగా ఉన్నా అందరం ఆసుపత్రికి వెళ్లిపోతాం. వైద్యుడు వివరాలడిగి చిన్న చీటి మన చేతిలో పెడతాడు. ఆ బ్రహ్మరాతని సునాయాసంగా చదివేసి ఎలాంటి పొరపాటు లేకుండా మందులిచ్చే వాళ్లే ఫార్మసిస్ట్‌లు. అందరి ఆరోగ్యరక్షణే పరమావధిగా పనిచేసే ఈ ఫార్మసీ రంగంలోకి ప్రవేశించాలంటే కొన్ని కోర్సులు చేయాలి. హెల్త్‌కేర్‌కి సంబంధించి వివిధ విభాగాల్లో ఈ నిపుణులకు ఎప్పటికీ తరగని డిమాండ్‌ ఉంటోంది.

  అత్యంత ప్రాచీనమైన ఔషధ శాస్త్రాన్ని ఉపయోగించి పూర్వకాలంలో వైద్యులు తమ సొంత మందు చీటీలను తయారు చేసుకునేవారు. తర్వాత కాలక్రమేణా దీన్ని వైద్య శాస్త్రానికి అనుసంధానించడంతో ఔషధ నిపుణుల (ఫార్మసిస్ట్‌) అవసరం ఏర్పడింది. తయారుచేసిన ఔషధాలను ఫార్మసిస్ట్‌ ద్వారా వైద్యులకు, రోగులకు చేర్చాలనేది తప్పనిసరి నిబంధన. ఈ నేపథ్యంలో ఫార్మసిస్ట్‌లకు డిమాండ్‌ పెరిగింది.

  ఫార్మసీ విద్యను అభ్యసించడానికి మొదటగా కళాశాల ఎంపిక అత్యంత ప్రధానం. ఈ విద్యనందించే కళాశాలలు ఏఐసీటీఈ, పీసీఐ ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌లతో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఫార్మసీ విద్యలో చేరడానికి అర్హులు. కళాశాలల్లో 50 శాతం సీట్లు మొదట ఎంపీసీ చదివిన విద్యార్థులకు, మిగిలిన 50 శాతం బైపీసీవారికి కేటాయిస్తారు. ఇంటర్‌లో పొందిన మార్కుల ఆధారంగా డీఫార్మసీ అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇందుకోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఈ ప్రకటన సాధారణంగా జూన్‌ చివరి వారంలో వస్తుంది. మిగిలిన రెండు కోర్సులకు ఇంటర్‌తోపాటు ఎంసెట్‌లో అర్హత పొంది ఉండాలి.

విద్యార్థి తన ఆసక్తిని బట్టి ఫార్మసీలో ఈ కింది మూడు కోర్సుల్లో ఎందులోనైనా చేరవచ్చు.

డిప్లొమా ఇన్‌ ఫార్మసీ - 2 సంవత్సరాలు ‌

బ్యాచిలర్‌ ఇన్‌ ఫార్మసీ - 4 సంవత్సరాలు ‌

* డాక్టర్‌ ఇన్‌ ఫార్మసీ - 6 సంవత్సరాలు

ఫార్మా - డీ

  ఇది 6 సంవత్సరాల కోర్సు. ఇంటర్మీడియట్‌ ఎంపీసీ లేదా బైపీసీలో 50 శాతం మార్కులు కనీస విద్యార్హత. ప్రతి కళాశాలలో దీనికి 30 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ విద్యార్థులకు హాస్పిటల్‌, క్లినికల్‌, రోగ సంబంధిత విషయాలపై అవగాహన కల్పిస్తారు. వీరికి విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. 2008 నుంచి విదేశీ ఉద్యోగాలకు అనుగుణంగా ఈ కోర్సును మన దేశంలో ప్రారంభించారు. ఇది ఉన్న ప్రతి కళాశాల టీచింగ్‌ హాస్పిటల్‌కు గానీ, ప్రాక్టీస్‌ సంబంధిత హాస్పిటల్‌కు గానీ అనుసంధానమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 58, తెలంగాణలో దాదాపు 63 కళాశాలల్లో ఈ కోర్సు అందిస్తున్నారు.

  ఈ కోర్సు విద్యార్థులకు అనాటమీ, ఫిజియోలజీ, పాథోఫిజియోలజీ, ఫార్మాకో-థెరప్యూటిక్స్‌ వంటి సబ్జెక్టులపై మంచి పట్టును పెంచుతుంది. వీరు రెండో సంవత్సరం నుంచే హాస్పిటల్‌ను సందర్శిస్తారు. రోగుల సమస్యలపై అవగాహన పొందుతారు. తర్వాత ఆరో సంవత్సరంలో పూర్తిగా హాస్పిటల్‌లో ఉండి మెడికల్‌ డాక్టర్స్‌గా ఇంటర్న్‌షిప్‌ చేస్తారు. రెగ్యులేటరీ సంస్థల్లో కూడా ఈ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్‌ ఫార్మసీ, క్లినికల్‌ ఫార్మసీ విభాగాల్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి.

ఉద్యోగాలు: ఈ కోర్సు చేసిన విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేసిన విభాగాన్ని బట్టి న్యూక్లియర్‌ ఫార్మసిస్ట్‌, పిడియాట్రిక్‌ ఫార్మసిస్ట్ట్‌, అంకాలజీ ఫార్మసిస్ట్‌, జీరియాట్రిక్‌ ఫార్మసిస్ట్‌, వెటర్నరీ ఫార్మసిస్ట్‌, న్యూట్రిషనల్‌ సపోర్ట్‌ ఫార్మసిస్ట్‌, సైకియాట్రిక్‌ ఫార్మసిస్ట్‌, హైపర్‌టెన్షన్‌ ఫార్మసిస్ట్‌, డయాబెటిక్‌ ఫార్మసిస్ట్‌, డ్రగ్‌ ఇన్ఫర్మేషన్‌ ఫార్మసిస్ట్‌గా ఉద్యోగాలు పొందుతారు.

  క్లినికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సీఆర్‌వో)లో క్లినికల్‌ ట్రైల్స్‌ ఆర్గనైజర్‌, ఫీÆజిబిలిటీ స్టడీస్‌ ప్రోటోకాల్‌ డెవలప్‌మెంట్‌, కేస్‌ రిపోర్ట్‌ ఫామ్‌ రివ్యూ అండ్‌ డిజైనింగ్‌, ఏడీఆర్‌ రిపోర్టింగ్‌, పేషంట్‌ మానిటరింగ్‌, బయో అనలిటికల్‌ స్టడీస్‌, బయో అవైలబిలిటీ స్టడీస్‌, డేటా మేనేజ్‌మెంట్‌ ఫర్‌ గ్లోబల్‌ ట్రైల్స్‌, క్లినికల్‌ టాక్సికాలజీ, ఫార్మాథెరాప్యుటిక్స్‌ వంటి విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.

  ఈ కోర్సు పూర్తి చేసి ఉన్నత విద్య, పరిశోధనపై ఆసక్తి ఉన్న విద్యార్థులు పీహెచ్‌డీ వైపు తమ దృష్టిని సారించవచ్చు.

బీ-ఫార్మసీ

  ఇది నాలుగు సంవత్సరాల వ్యవధి ఉన్న కోర్సు. ఇంటర్మీడియట్‌, (ఎంపీసీ, బైపీసీ), డీ-ఫార్మసీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుకు అర్హులు. ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 175 కాలేజీలు బీ-ఫార్మసీ అందిస్తున్నాయి. ఇందులో ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, హ్యూమన్‌ అనాటమీ అండ్‌ ఫిజియాలజీ ఫార్మకాలజీ, పాథోఫిజియోలజీ, ఫార్మాస్యూటిక్స్‌, హెల్త్‌ఎడ్యుకేషన్‌, ఫార్మకాగ్నసీ, బయోకెమిస్ట్రీ, ఫార్మా మేనేజ్‌మెంట్‌, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మా ఇంజినీరింగ్‌, ఫార్మా జూరిస్‌, ఫార్మా ప్రాక్టీస్‌, హాస్పిటల్‌, ఫార్మసీ కమ్యూనిటీ ఫార్మసీ, క్లినికల్‌ ఫార్మసీ లాంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తారు. వీరు మూడో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం మధ్యకాలంలో సుమారు 250 గంటలు ఔషధ తయారీ కర్మాగారాల్లో శిక్షణ పొందాలి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీ, ప్రాక్టీస్‌ సెట్టింగ్‌, ఇతర ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీలో ఉద్యోగం సంపాదించినవారికి రోగులతోకానీ, డాక్టర్లతోగానీ ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. వీటిలో రిసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ కింద డ్రగ్‌ డిస్కవరీ, ఫార్ములేషన్‌ ప్రాసెస్‌, డెవలప్‌మెంట్‌ స్టెబిలిటీ టెస్టింగ్‌, ప్యాకేజింగ్‌ డెవలప్‌మెంట్‌ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. రిసెర్చ్‌ అసోసియేట్‌, రిసెర్చ్‌ ఎగ్జిక్యూటివ్‌, రిసెర్చ్‌ సైంటిస్టు, రిసెర్చ్‌ డైరెక్టర్‌, రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ వంటి ఉన్నతమైన ఉద్యోగాల్లోనూ స్థిరపడవచ్చు.

ఉన్నత విద్య: బీ-ఫార్మసీ తర్వాత భారతదేశంలో ఎం-ఫార్మసీ, ఫార్మా-డీ (పీబీ), ఎంబీఏ వంటి ఉన్నత విద్య కోర్సులను చేయవచ్చు. జీఆర్‌ఈ, జీమాట్‌, ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌ తదితర ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణులవడం ద్వారా విదేశాల్లో ఉన్నత శ్రేణి ఫార్మసీ విద్యను అభ్యసించవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఫార్మా-డీ కూడా చేయవచ్చు. క్లినికల్‌ విభాగంపై అవగాహన, పట్టు ఉన్న విద్యార్థులు బీ-ఫార్మసీ అయిన తర్వాత 3 సంవత్సరాల ఫార్మా-డీ (పోస్ట్‌ బ్యాచ్‌లరేట్‌ కోర్స్‌)ను చేయవచ్చు. కళాశాలకు 10 సీట్లు చొప్పున ఔషధ మండలి వీరికి సీట్లను కేటాయిస్తుంది.

ఎం-ఫార్మసీ: బీ-ఫార్మసీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు గ్యాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ జీప్యాట్‌ ద్వారా దేశంలోని ఏదైనా ఫార్మసీ కళాశాలలో ఎం-ఫార్మసీలో ప్రవేశం పొందవచ్చు. లేదా రాష్ట్రస్థాయి పీజీఈసీఈటీ ద్వారా రాష్ట్రంలోని ఫార్మసీ కళాశాలల్లో ఎం-ఫార్మసీలో చేరవచ్చు జాతీయస్థాయి ఎన్‌ఐపీఈఆర్‌ అర్హత పరీక్ష ద్వారా, దేశంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌, రిసెర్చ్‌ (ఎన్‌ఐపీఈఆర్‌) విద్యాసంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌, ఎన్‌ఏపీఎల్‌ఈఎక్స్‌, టోఫెల్‌ వంటి అర్హత పరీక్షల ద్వారా విదేశాల్లో ఎంఎస్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ కోర్సును పూర్తి చేయవచ్చు. క్యాట్‌, ఐసెట్‌ అర్హత పరీక్షల ద్వారా ఎంబీఏను కూడా అభ్యసించవచ్చు. వీరు ఎంచుకునే ప్రత్యేక విభాగాలను బట్టి ఆయా విభాగాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మన దేశంలో భారత ఔషధ మండలి ప్రకారం 12 విభాగాల్లో ఎం-ఫార్మసీలో ప్రవేశం లభిస్తుంది. ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాకెమిస్ట్రీ, ఫార్మాఅనాలిసిస్‌, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ విభాగాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

ఉపాధినిచ్చే రంగాలు

  ప్రొడక్షన్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌: బల్క్‌ డ్రగ్స్‌ తయారీ, ఔషధాలు, టీకాల తయారీ, జీవ ఔషధ ఉత్పత్తుల తయారీ, వైద్య పరికరాల తయారీ, పశు సంబంధిత ఔషధాల తయారీ.

ప్యాకేజింగ్‌: ఔషధ ఉత్పత్తిలో పలు దశలు, వాటి ప్యాకింగ్‌.

క్వాలిటీ కంట్రోల్‌: ఔషధాల తయారీలో ఉత్పత్తయిన ఔషధాల నాణ్యతా ప్రమాణాలను పాటించడం, ప్రొడక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌, కెమిస్ట్‌, అసిస్టెంట్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌, డైరెక్టర్‌ - ఈ విధులను ఫార్మసీ నిపుణులే నిర్వహిస్తారు.

క్వాలిటీ అస్యూరెన్స్‌: ఔషధాలకు, వాటి తయారీకి సంబంధించిన డాక్యుమెంట్లను తయారుచేయడం, పరిశీలన, తర్వాత సంబంధిత శాఖలకు సమర్పించడం, ఔషధాల నాణ్యతను పాటించడానికి తగిన శిక్షణ, ఇంటర్నల్‌ ఆడిటింగ్‌ వంటివి ఈ శాఖకు సంబంధించినవి.

సేల్స్‌, మార్కెటింగ్‌: ప్లానింగ్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌, ఔషధాల మార్కెటింగ్‌, ఎంట్రీ లెవల్‌, రిప్రజెంటేటివ్‌, టెరిటరీ మేనేజర్‌, ఏరియా మేనేజర్‌, జోనల్‌ మేనేజర్‌, రీజనల్‌ మేనేజర్‌, నేషనల్‌ సేల్స్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) వంటి వివిధ శాఖల్లో ఉద్యోగాలను ఎంచుకోవచ్చు.

ఎగ్జిక్యూటివ్‌: ఎంట్రీలెవల్‌, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, అసిస్టెంట్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌, ప్రోడక్ట్‌ మేనేజర్‌, గ్రూప్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ వంటి స్థాయుల్లో పలు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

రెగ్యులేటరీ అఫైర్స్‌ (మేనేజ్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌): మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, అసిస్టెంట్‌ మేనేజర్‌, కార్పొరేట్‌ అఫైర్స్‌ మేనేజర్‌, రీ-ప్యాకింగ్‌ మాన్యుఫ్యాక్చరర్‌, డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌, ప్రభుత్వ అనలిస్ట్‌, అనలిటికల్‌ కెమిస్ట్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ కెమిస్ట్‌ వంటి అవకాశాలు ఉన్నాయి.

విద్యా రంగం, క్లినికల్‌ రిసెర్చ్‌ (స్పెషలైజేషన్‌తో కూడినవి) వంటి వాటిలో కూడా ఆకర్షణీయమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి.

ఉద్యోగావకాశాలు

  భారతదేశంలో ఫార్మసీ విద్య చదివినవారికి ఉద్యోగ భద్రతతో కూడిన ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విదేశాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ పూర్తి చేసినవారికి ఉద్యోగ భద్రతతో పాటు ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఆకర్షణీయమైన వార్షికాదాయంతో ఉద్యోగాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. వీరి వార్షికాదాయం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.

  సైన్స్‌, హెల్త్‌కేర్‌, కంప్యూటర్‌ టెక్నాలజీ, మ్యాథ్స్‌, కౌన్సెలింగ్‌ రంగాల అనుసంధానమైన కొత్త సర్టిఫికెట్‌ కోర్సులతో ఫార్మసీ విద్యకు ఉపాధి అవకాశాలు ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. విద్యార్హత, అనుభవం, ప్రతిభను బట్టి అర్హులైనవారికి మంచి ఉద్యోగస్థాయి, తగిన వేతనం లభిస్తున్నాయి.

కొన్ని ప్రధాన విభాగాలు: * ఫార్మసిస్ట్‌ (పరిశ్రమలు/ ఆసుపత్రులు/ క్లినికల్‌/ కమ్యూనిటీ * ఫార్మకో ఎపిడిమీయోలాజిస్ట్‌/ డేటా అనలిస్ట్‌ (ప్రస్తుతం బాగా ప్రాధాన్యం కలిగింది) * రిటైల్‌/ హోల్‌సేల్‌ కెమిస్ట్‌/ డ్రగ్గిస్ట్‌ (వ్యాపారం) * రోగులకు ప్రిస్కిప్షన్‌ తయారు చేయడం (విదేశాల్లో దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది) * డ్రగ్‌ థెరపిస్ట్‌ * డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌, అనలిస్ట్‌ (ప్రభుత్వ ఉద్యోగాలు)* ఎకడమీషియన్స్‌ (ఫార్మసీ టీచర్స్‌) కెమికల్‌/ డ్రగ్‌ టెక్నీషియన్‌ * పాథోలాజికల్‌ లాబ్‌ * ఆర్‌ అండ్‌ డీ (బేసిక్‌, అప్లైడ్‌) * బయో-టెక్‌ పరిశ్రమలు* సేల్స్‌, మార్కెటింగ్‌ * ఫార్మాస్యూటికల్‌, బయో-టెక్‌ ఆర్‌ అండ్‌ డీ * ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలు (ప్రొడక్షన్‌/క్యూఏ-క్యూసీ/ డాక్యుమెంటేషన్‌) )* క్లినికల్‌ రిసెర్చ్‌ సంస్థలు * రెగ్యులేటరీ సంస్థలైన ఎఫ్‌డీఏ, డబ్ల్యూహెచ్‌ఓ, సీడీఎస్‌సీఓప్రభుత్వ రంగ ఆర్‌ అండ్‌ డీ సంస్థలు - సీఎస్‌ఐఆర్‌, ఎన్‌ఐఎన్‌, సీసీఎమ్‌బీ, ఐసీఎమ్‌ఆర్‌, డీటీఏబీ, సీడీఎల్‌, ఏఐసీటీఈ, పీసీఐ, ఫార్మాస్యూటికల్‌ అసోసియేషన్స్‌ (ఐపీఏ, ఐపీజీఏ, ఎఫ్‌ఐపీ, ఏపీటీఐ మొదలైనవి).

డీ-ఫార్మసీ

   ఇది రెండు సంవత్సరాల వ్యవధి ఉన్న కోర్సు. ఇందులో ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటిక్స్‌, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్‌ ఫార్మసీ, హ్యూమన్‌ అనాటమీ అండ్‌ ఫిజియాలజీ, డ్రగ్‌స్టోర్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాలపై మౌలిక అవగాహన కల్పిస్తారు. కోర్సు పూర్తి అయిన తర్వాత 500 గంటలు హాస్పిటల్‌లోని డిస్పెన్సరీల్లో శిక్షణను తీసుకోవాలి. తర్వాత రాష్ట్ర ఔషధ సంఘంలో పేరును నమోదు చేసుకొని రిజిస్టర్డ్‌ ఫార్మసిస్ట్‌గా అర్హత పొందవచ్చు. దీంతో వీరికి హాస్పిటల్‌ ఫార్మసిస్ట్ట్‌, రిటైల్‌ ఫార్మసిస్ట్‌, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌, హోల్‌సేల్‌ డీలర్‌; మాన్యుఫ్యాక్చరింగ్‌ కెమిస్ట్‌ ఫర్‌ కాస్మటిక్స్‌, రీ ప్యాకింగ్‌ ఆఫ్‌ డ్రగ్స్‌, కమ్యూనిటీ ఫార్మసిస్ట్‌ లాంటి ఉద్యోగాలు ఉంటాయి. దేశం మొత్తం మీద 564 కళాశాలల్లో ఈ కోర్సు ఉంది. వీటిలో 42 కళాశాలలు ఆంధ్రప్రదేశ్‌లో, 26 తెలంగాణలో ఉన్నాయి.

   డీ ఫార్మసీ పూర్తిచేసిన విద్యార్థులు ప్రభుత్వం నిర్వహించే ఈసీఈటీ (ఈసెట్‌) పరీక్షలో ఉత్తీర్ణత పొంది రెండో సంవత్సరం బీ-ఫార్మసీ కోర్సులో లేదా ఫార్మా-డీలో చేరవచ్చు. వీరికి 10 శాతం సీట్లను కేటాయిస్తారు.

డాక్ట‌ర్ కె. ప‌ద్మ‌ల‌త‌, విజ‌య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ సైన్సెస్ ఫ‌ర్ ఉమెన్‌, విజ‌య‌వాడ‌

Posted Date: 03-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌