• facebook
  • whatsapp
  • telegram

ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేక శిక్షణ


   బహుళ విభాగాలతో విస్తరించిన అత్యాధునిక ఆస్పత్రులను సజావుగా, ప్రతిభావంతంగా నిర్వహించటం సుశిక్షితుల వల్లనే సాధ్యమవుతుంది. అందుకే హెల్త్‌కేర్‌/ హాస్పిటల్‌ మేనేజిమెంట్‌ కోర్సులు వెలిశాయి. వీటిలో చేరి శిక్షణ పూర్తిచేసుకున్నవారికి చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
   మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన, వ్యాధినిరోధకతపై శ్రద్ధ పెరుగుతున్నాయి. మరోవైపు మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం మొదలైన జీవనశైలి సంబంధమైన వ్యాధులు విజృంభిస్తున్నాయి. జీవావధి కాలం పెరగటం వల్ల వృద్ధుల జనాభా గణనీయంగా ఉంది. దీంతో ఆరోగ్య వైద్యసేవలకు ప్రాముఖ్యం అనివార్యమైపోయింది. ఈ పరిస్థితులన్నీ వైద్య ఆరోగ్య (హెల్త్‌కేర్‌) రంగం వేగవంతమైన ప్రగతికీ, విస్తృతికీ దారితీస్తున్నాయి.
   ఈ పరిశ్రమ ఏటా 15 శాతం వృద్ధి రేటుతో దూసుకువెళ్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, నేషనల్‌ రూరల్‌/అర్బన్‌ హెల్త్‌ మిషన్‌; ప్రైవేటు రంగంలో అసంఖ్యాకమైన ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ, నర్సింగ్‌హోములు, ఫ్యామిలీ క్లినిక్స్‌, డయాగ్నొస్టిక్‌ కేంద్రాలు ప్రజారోగ్య పరిరక్షణకు సేవలందిస్తున్నాయి.
   ఆకర్షణీయమైన పన్నుల రాయితీలను ప్రభుత్వం ఇస్తుండటం వల్ల అమెరికా, ఐరోపా సంస్థలెన్నో ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవన్నీ ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ వీటిలో ముఖ్యమైనది.

వృత్తివిద్యా కోర్సులు
హెల్త్‌కేర్‌ రంగంలో ఎన్నో కోర్సులున్నాయి. పోస్టుగ్రాడ్యుయేట్‌ స్థాయిలో వీటిని పరిశీలిద్దాం.
ప్రజారోగ్యం (పబ్లిక్‌ హెల్త్‌)లో మాస్టర్‌ కోర్సులను చాలా సంస్థలు అందిస్తున్నాయి. అలాంటి కొన్ని సంస్థలు-
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌ ( www.phfi.org )
*¤ డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ( http://ntruhs.ap.nic.in )
*¤ కర్నూలు మెడికల్‌ కాలేజి
   ప్రజారోగ్యంలో పట్టా పొందినవారికి ప్రధానంగా ప్రభుత్వ వైద్యశాఖల్లో అవకాశాలుంటాయి. ఆరోగ్యరంగంలో పనిచేసే ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థల్లోనూ చేరవచ్చు.
వైద్య కళాశాలలు సైతం ఈ తరహా కోర్సులను అందిస్తున్నాయి.
ఉదా: నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (http://nims.ap.nic.in/mhm.html) రెండున్నర ఏళ్ళ కాలవ్యవధి ఉన్న హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామును అందిస్తోంది.

రెండు రకాలు
   హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌పై ఆసక్తి ఉన్నవారికి రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మాస్టర్స్‌ ఇన్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ లేదా మాస్టర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/పీజీ డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌. ఇవి రెండేళ్ళ పూర్తికాలపు కోర్సులు. విశ్వవిద్యాలయాలు కానీ, వాటికి అనుబంధంగా ఉన్న కళాశాలలు గానీ ఎంబీఏ డిగ్రీని ఇస్తాయి.
*¤ అపోలో ఇన్‌స్టిట్యూట్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, డెక్కన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లు అందిస్తున్న కోర్సు- మాస్టర్స్‌ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌.
*¤ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అందిస్తున్న కోర్సు- ఎంబీఏ (హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌).
   విశ్వవిద్యాలయాలు అందించే కోర్సులు యూజీసీకి అనుబంధంగా ఉంటాయి. అటానమస్‌ కళాశాలలు అందించే కోర్సులను ఏఐసీటీఈ గుర్తిస్తుంది.
   అటానమస్‌ కళాశాలలు పీజీ డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ను అందిస్తున్నాయి. ఇలాంటివాటిలో అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా ( www.asci.org.in ) , అరోరాస్‌ బిజినెస్‌ స్కూల్‌ ( www.absi.edu.in/ ) ఉన్నాయి.

ఎవరు అర్హులు?
   మెడికల్‌, డెంటల్‌, ఫార్మసీ, ఫిజియోథెరపీ, నర్సింగ్‌, పారా మెడికల్‌ డిగ్రీ కోర్సుల్లో చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. బీటెక్‌, బీకాం, బీఎస్‌సీ గ్రాడ్యుయేట్లు కూడా అర్హులే.
   విశ్వవిద్యాలయాలు తమ సొంత ప్రవేశపరీక్షలను నిర్వహిస్తాయి. అటానమస్‌ కళాశాలలు CAT, MAT, ATMA, XAT, GMAT లలో ఏదో ఒక పరీక్ష స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. ఎంపికలో భాగంగా బృంద చర్చ (గ్రూప్‌ డిస్కషన్‌), కేస్‌ స్టడీ విశ్లేషణ, వ్యక్తిగత మౌఖిక పరీక్షలను కూడా ఎక్కువ కళాశాలలు నిర్వహిస్తాయి.

ఏమేం విధులు?
   ఆస్పత్రుల, క్లినిక్కుల, భారీ ట్రీట్‌మెంట్‌ కేంద్రాల నిర్వహణ బాధ్యత చూడటం హెల్త్‌కేర్‌ మేనేజర్ల ప్రధాన విధి. రోగులకు సక్రమంగా వైద్యసేవలు అందేలా చూస్తూనే విభిన్న విభాగాలు సాఫీగా, సమర్థంగా పనిచేసేలా వీరు చర్యలు తీసుకుంటారు.
   గవర్నింగ్‌ బోర్డు, వైద్యసిబ్బంది, విభాగాధిపతులు, సాంకేతిక సిబ్బంది మధ్య వారధిగా ఉంటూ సంస్థ కార్యకలాపాలను సమన్వయం చేస్తారు. సిబ్బంది నియామకం, పర్యవేక్షణ, పనితీరు మెరుగుదల, ఆస్పత్రి సేవల నిర్వహణ, బడ్జెట్‌, ఆర్థిక అంశాల అజమాయిషీ, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌, సెక్యూరిటీ- ఇవన్నీ హెల్త్‌కేర్‌ మేనేజర్ల విధులే!
   సవాళ్ళతో కూడుకున్న ఈ పోస్టుకు బహుళ నైపుణ్యాలు, సహానుభూతి చెందే స్వభావం అవసరం. బలమైన నాయకత్వ ప్రతిభ, భావ ప్రసారణ సామర్థ్యాలు, లౌక్యం, సమయ నిర్వహణ, పట్టువిడుపులతో వ్యవహరించే నేర్పు ఉన్నవారే దీనిలో రాణించగలుగుతారు.

ఉద్యోగ అవకాశాలు
   హెల్త్‌కేర్‌ రంగంలో పట్టా ఉన్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్నో అవకాశాలు స్వాగతిస్తున్నాయి. ప్రముఖ ఆస్పత్రుల్లోనే కాకుండా ఐటీ, ఫార్మా, ఇన్సూరెన్స్‌ సంస్థలు, క్వాలిటీ అక్రిడిటేషన్‌ ఏజెన్సీలు, స్వచ్ఛంద/ ప్రభుత్వేతర సంస్థలు, హాస్పిటల్‌ కన్సల్టెన్సీలు కూడా వీరిని నియమించుకుంటున్నాయి. అర్హత, అనుభవం, చేరే సంస్థను బట్టి ప్రారంభ వార్షిక వేతనం రూ. 3 లక్షల నుంచి 8 లక్షలమధ్య ఉంటుంది.

Posted Date: 02-12-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌