• facebook
  • whatsapp
  • telegram

కొత్త కోర్సులు.. ఏ ప్రత్యేకతలు? 

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం కొన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. వాటిలో అత్యాధునిక సాంకేతిక కోర్సులూ ఉన్నాయి. వాటి ప్రాముఖ్యం, ప్రయోజనాలపై విద్యార్థులు తగిన అవగాహన పెంచుకోవాల్సివుంది. కొత్త కోర్సుల్లో సైబర్‌ సెక్యూరిటీ,  ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ల        భవిష్యత్తు, అవకాశాల గురించి తెలుసుకుందాం! 

మానవ జీవన విధానంలో నాణ్యత, ప్రామాణికత,  భౌతిక శ్రమ తగ్గించడం ప్రధాన లక్ష్యాలుగా జరిగే పరిశోధనలు కొత్త టెక్నాలజీల ఆవిష్కరణకు దారితీస్తాయి. ఐతే ఇవి అందరికీ అందుబాటులో వచ్చే పరిణామ క్రమంలో ఎమర్జింగ్‌ టెక్నాలజీ స్థాయి అతి ముఖ్యమైనది. ఈ ఉత్పత్తులు/సేవలు మానవ జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అప్పటివరకూ మూస పద్ధతిలో చేస్తున్న ఉద్యోగాలకు తెర దించి, మరింత నాణ్యమైన, స్వల్ప వ్యయంతో కూడుకున్న సేవలను కొత్త టెక్నాలజీల ద్వారా అందించవచ్చు. వీటి ఆధారిత సేవలు నూతన నైపుణ్యాలతో కూడుకున్న కొత్త తరహా కొలువులకు అవకాశమిస్తాయి.  కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో ఇంజినీరింగ్‌ స్థాయిలో కొన్ని  కొత్త కోర్సులను దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలూ ప్రవేశపెట్టాయి. వీటిలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, మెషిన్‌ లర్నింగ్‌ తరువాత చెప్పుకోదగినవి- బీటెక్‌ సీఎస్‌ఈ (ఐఓటీ),  బీటెక్‌ సీఎస్‌ఈ (సైబర్‌ సెక్యూరిటీ) కోర్సులు. 

సైబర్‌ సెక్యూరిటీ
కంప్యూటరీకరణ, మొబైల్‌ ఫోన్ల విస్తృతి, అంతర్జాల ఆధారిత వ్యాపారాలు, ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాల వంటివి అనూహ్య వేగంతో, మోతాదులో డేటాను సృష్టిస్తున్నాయి. ఐతే డిజిటల్‌ వ్యవస్థ ఎన్నో పనులను సులభతరం చేసింది కానీ సమాచార భద్రత అనే సమస్యను ఇచ్చింది. వివిధ శ్రేణులకు చెందిన విలువైన సమాచారాన్ని ఇతరుల చేతికి అందకుండా పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పరచడమే సైబర్‌ సెక్యూరిటీ లక్ష్యం. ఈ దిశలో కంప్యూటర్‌ వ్యవస్థలు, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, నెట్‌వర్కింగ్, ఇంటర్నెట్, క్లౌడ్‌ వ్యవస్థ, ఇతర టెక్నాలజీల పనితీరు, నిర్మాణ వివరాలపై శిక్షణ ఇచ్చేందుకు బీటెక్‌ స్థాయిలో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సులో భద్రతా లోపాలను గుర్తించడానికి ఉన్న పద్ధతులు, అందుబాటులో ఉన్న వివిధ ఆటోమేషనల్‌ టూల్స్, అవసరమైన           ప్రోగ్రామింగ్‌ మెలకువలు వంటి అంశాల్లో తర్ఫీదును అందిస్తారు. 

ఏం నేర్చుకుంటారు?
ఈ కోర్సులో కంప్యూటర్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు సంబంధించిన అన్ని అంశాల్లో శిక్షణ ఉంటుంది. ముఖ్యంగా డేటా స్ట్రక్చర్స్, పైతాన్, జావా వంటి లాంగ్వేజిలతోపాటు రుబి, జావా స్క్రిప్టింగ్, పెర్ల్‌ వంటి స్క్రిప్టింగ్‌ లాంగ్వేజిలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఇంకా వివిధ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల అంతర్గత నిర్మాణం గురించి క్షుణ్ణంగా నేర్పిస్తారు. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్, క్రిప్టోగ్రఫీ మొదలైన పాఠ్యాంశాలుంటాయి. వివిధ హార్డ్‌వేర్‌ పరికరాల నిర్మాణం, పనిచేసే విధానాల గురించీ నేర్పుతారు. వీటిలో లోపాలను గుర్తించడం, ఈ లోపాలను అలుసుగా చేసుకుని శత్రువులు సమాచార చౌర్యానికి పాల్పడకుండా దుర్భేద్యమైన, పటిష్టమైన భద్రతా వ్యవస్థను నిర్మించడంపై శిక్షణ ఇస్తారు. 

ఈ కోర్సు ఉపయోగం?
ఇతర బ్రాంచిలకన్నా తక్కువ మోతాదులో గణితం ఉంటుందీ కోర్సులో. గూఢచార సంస్థల్లో, ఇతర సంస్థల్లో మంచి ఉద్యోగావకాశాలు, ఉన్నత శ్రేణి జీతాలు, ఒక మోస్తరు స్థాయి వరకు అవసరమైన ప్రోగ్రామింగ్‌ మెలకువలు, తరచూ మెదడుకి మేత పెట్టే వాతావరణం, ప్రపంచవ్యాప్త గిరాకీ, అవధులు లేని అభివృద్ధికి అవకాశం.. ఇవీ ఈ కోర్సు పూర్తిచేస్తే లభించే ప్రయోజనాలు. 

ఏ తరహా ఉద్యోగాలు?
భద్రత ఇంజినీర్, సైబర్‌ భద్రత విశ్లేషకులు, భద్రత వ్యవస్థ నిర్మాణకర్త, భద్రత కార్యనిర్వాహకులు, భద్రతా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, క్రిప్టనలిస్ట్, ఫోరెన్సిక్‌ నిపుణులు మొదలైన హోదాల్లో ఈ కోర్సు చేసినవారు విధులు చేపట్టవచ్చు. ఇవన్నీ కేవలం            ఈ కోర్సు చేసిన వారికి వచ్చే అవకాశాలు. కంప్యూటర్‌ సైన్స్‌ వారికి ఉన్న అవకాశాలకు అదనం ఇవన్నీ.  భవిష్యత్తు మాటకొస్తే... ప్రతి వ్యాపార సంస్థా తమకూ తమ వినియోగదారుల సమాచార  భద్రతకూ పెద్దపీట వేస్తాయి. అందుకే చిన్న సంస్థల నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకూ సైబర్‌ సెక్యూరిటీ ఎన్నో అవకాశాలనిస్తుంది. ఈ ప్రత్యేకాంశంతో బీటెక్‌ చేసినవారు ఎంటెక్‌ కూడా చెయ్యవచ్చు.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌
సమీప భవిష్యత్తులో ఏకీకృత సమాచార వ్యవస్థలో మనిషి అంతర్భాగం కాబోతున్నాడు. తనచుట్టూ ఉన్న పరిసరాలతో పాటు ఒక సమాచార ఉత్పత్తి-వినిమయ కేంద్రంగా మనుగడ సాగించనున్నాడు. స్థూలంగా ఈ వ్యవస్థను ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ అంటున్నారు. బయట వస్తు (భౌతిక) ప్రపంచాన్ని మానవ జీవితానికి అనుసంధానం చేసే టెక్నాలజీగా ఈ ఐఓటీని నిర్వచించవచ్చు. నిపుణుల అంచనామేరకు- ఇప్పటివరకు రెండు నుంచి మూడు బిలియన్ల (200 నుంచి 300 కోట్ల) పరికరాలు అంతర్జాలం ద్వారా అనుసంధానమయ్యాయని అంచనా. 2020 నాటికి దాదాపు 300 బిలియన్‌ డాలర్ల నికర మూల్యం కలిగిన 24 బిలియన్ల ఐఓటీ పరికరాలు ఉత్పత్తి అవుతాయని అంచనా. అంతే కాకుండా ప్రతి సెకనుకూ దాదాపు 127 ఐఓటీ పరికరాలు అంతర్జాలంతో అనుసంధానమవుతున్నాయనీ, ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందనీ అభిప్రాయం. ఇన్ని పరికరాలు ఉత్పత్తి చేసే సమాచారాన్ని సద్వినియోగం చేసి మానవ సమాజానికి మేలు చెయ్యాలనే సంకల్పం, మానవ జీవన ప్రమాణాల నాణ్యతను పెంచాలనే లక్ష్యంతో ఐఓటీ టెక్నాలజీ ప్రస్థానం   మొదలయింది. ఈ గణాంక వివరాల సారాంశం- ఐఓటీ రంగం దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో కొత్త ఉద్యోగావకాశాలకు వేదిక కాబోతోందని. భవిష్యత్తులో ఐఓటీ కేంద్రిత పరికరాలు మనకు నమ్మకమైన సేవలు అందిస్తాయని అర్థమవుతుంది.

ఐఓటీ ఇంజినీర్ల విధులు?  
హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సమాచార వ్యవస్థలను అంతర్జాలంతో విలీనీకరించి అన్ని రంగాలకూ మేలు చేసే ‘స్మార్ట్‌ వరల్డ్‌’ వ్యవస్థను ఐఓటీ నెలకొల్పింది. అంతర్జాలం వేదికగా వ్యాపార వ్యవహారాలు చెయ్యాలనుకునే అన్ని రంగాలకూ ఈ అవకాశం ఉంటుంది. కావలసినదల్లా తమ సంస్థల్లోని ప్రతి సమాచారాన్నీ డిజిటల్‌ రూపంలోకి మార్చి, అవసరమైన ఆటోమేషన్‌ వ్యవస్థను నెలకొల్పడమే. ఈ కోణంలో చూస్తే ఐఓటీ ఇంజినీర్లు ప్రతి రంగంలోనూ అవసరమవుతారు. ఐఓటీ మౌలిక సదుపాయాల ఏర్పాటులో ప్రధానంగా మూడు రకాల వృత్తి పనులుంటాయి. నెట్‌వర్క్‌ కనెక్టివిటీ నిర్వహణ చేసేవారు నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్లు. డేటా అనలిస్టులు వివిధ పరికరాల నుంచి ఉత్పన్నమయ్యే సమాచారాన్ని సేకరించి, శుద్ధిచేసి ఈ డేటానుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారు. వీరు ప్రధానంగా డేటా సైంటిస్ట్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక మూడో రకంలో సంస్థలు తమ వ్యాపార అవసరాలకు అనుగుణమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, వివిధ ఉపకరణాలను స్థాపించి వాటి నిర్వహణ చూసుకుంటారు. ఈ రకంగా చూస్తే ఒక ఐఓటీ బృందంలో అన్ని  శాఖలకూ చెందిన నిపుణులు సభ్యులుగా ఉంటారు. 

ప్రత్యేక పాఠ్యాంశాలు.. నైపుణ్యాలు 
బీటెక్‌ పరిధిలో ప్రధానంగా కంప్యూటర్‌ సైన్స్‌లోని ముఖ్యమైన డేటా స్ట్రక్చర్స్, ఆపరేటింగ్‌ సిస్టమ్స్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ నిర్మాణ వివరాలు, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్, క్రిప్టోగ్రఫీ మొదలైన సబ్జెక్టులు చదువుతారు. ఎలక్ట్రానిక్స్‌ రంగానికి సంబంధించిన మైక్రో ప్రాసెసర్స్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, అనలాగ్, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ మౌలికాలు, మొబైల్‌ కమ్యూనికేషన్స్, వివిధ రకాల సెన్సర్ల అధ్యయనం లాంటి సబ్జెక్టులుంటాయి. ప్రోగ్రామింగ్‌ విషయానికి వస్తే పైతాన్‌ బాగా నేర్చుకోవాలి. దీనితోపాటు సి, జావా లాంగ్వేజ్‌లు నేర్చుకుంటారు. ఐఓటీలో ప్రధానంగా కొన్ని టూల్స్‌ ఉన్నాయి. పాఠ్యాంశాల్లో  కొన్ని నేర్చుకునే విధంగా సిలబస్‌ ఉండవచ్చు. అదనంగా ఎంబెడెడ్‌ సి వంటి ప్రత్యేక లాంగ్వేజ్‌ నేర్చుకుంటే మంచిది.

పరిశ్రమల్లో .. 
సమాచార సేకరణ, రవాణా, శుద్ధి, విశ్లేషణ, సందర్భోచిత నిర్ణయం, అనువర్తనం ఎక్కడ ఉంటాయో అక్కడ ఐఓటీ టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించవచ్చు. అంటే దాదాపు అన్ని రంగాల్లోనూ ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కనెక్టెడ్‌ కార్, స్మార్ట్‌ హోం, స్మార్ట్‌ సిటీ¨, నిర్దిష్ట సేద్యం, డ్రోన్‌ ఆధారిత వ్యవసాయం, స్మార్ట్‌ గ్రిడ్‌ వ్యవస్థ, అనుసంధానిత పరిశ్రమలు, స్మార్ట్‌ రిటెయిల్, గొలుసుకట్టు వ్యవస్థల సమర్థ నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ, కార్చిచ్చుల శోధన/ఆచూకీ, పరిశుభ్రమైన తాగు నీటి భరోసా, నిర్మాణాల-కట్టడాల నాణ్యత పర్యవేక్షణ, రేడియో ధార్మిక వ్యవస్థల పర్యవేక్షణ, మైదానాల సమర్థ నిర్వహణ, పాకేజింగ్‌ పరిశ్రమ, కొండ చరియలు విరిగిపడి జరిగే నష్టాల నియంత్రణ, వ్యర్థ పదార్థాల నిర్వహణ లాంటి ఎన్నో రంగాల్లో ఐఓటీ సాంకేతికత ఉపయోగపడుతుంది.  ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వివిధ నివేదికల ప్రకారం ఐఓటీ నిపుణుల అవసరం పరిశ్రమలకు లక్షల సంఖ్యలో ఉంది. కష్టపడి శ్రద్ధగా చదివి అవసరమైన  నైపుణ్యాలు నేర్చుకుంటే పురోగతికి ఆకాశమే హద్దు! 

Posted Date: 29-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌