• facebook
  • whatsapp
  • telegram

ఆసుపత్రులకు మేనేజర్లు

హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన

వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్లు. కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, ఉన్నవాటి విస్తరణ కారణంగా ఇప్పుడు వీరికి అవకాశాలు పెరిగాయి. అందువల్ల ఆసక్తి ఉన్నవారు హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరి, ఉద్యోగాలు పొందవచ్చు. విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్‌ ఆసుపత్రులతోపాటు కొన్ని సంస్థలూ ఈ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి.

మన దేశంలో శరవేగంగా విస్తరిస్తోన్న వాటిలో వైద్య రంగం ఒకటి. జీవనశైలి, కొత్తగా పుట్టుకొస్తోన్న వ్యాధులు, ఆరోగ్యంపై అవగాహన...వీటన్నింటి కారణంగా ఆసుపత్రులు, పడకల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అలాగే మన దగ్గర మెడికల్‌ టూరిజానికి గిరాకీ ఉంది. అందువల్ల హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదువులు పూర్తి చేసుకున్నవారి ఉపాధికి ఢోకా లేదనే చెప్పుకోవచ్చు.  

ఈ కోర్సులో చేరడానికి సైన్స్‌ నేపథ్యం తప్పనిసరి కాదు. అందువల్ల ఆసక్తి ఉంటే ఎవరైనా హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ పూర్తయిన తర్వాతే ఆ దిశగా అడుగులేయవచ్చు. దేశంలో కొన్ని సంస్థలు బీఎస్సీ/బీబీఏ- హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌/మేనేజ్‌మెంట్‌ పేరుతో మూడేళ్ల కోర్సు అందిస్తున్నాయి. అయితే వీటిలో ప్రైవేటువే అధికం. ఎక్కువ సంస్థల్లో ఈ కోర్సు పీజీ స్థాయిలో ఉంది. ఇవన్నీ ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారికి అవకాశం కల్పిస్తున్నాయి. మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంహెచ్‌ఏ), ఎంబీఏ (హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) పేరుతో ఆసుపత్రులతోపాటు, ప్రసిద్ధ విద్యాసంస్థలు ఈ చదువులు అందిస్తున్నాయి. ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలోకి తీసుకుంటారు. కొన్ని సంస్థలకు బృందచర్చ, మౌఖిక పరీక్ష తప్పనిసరి. 

ఎక్కడ చదవాలి?

అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ సభ్యులు, మౌలిక వసతులు ఉన్న సంస్థను ఎంచుకోవాలి. కరిక్యులమ్‌ గమనించాలి. ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న విద్యా సంస్థకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటిచోట క్షేత్రస్థాయి నైపుణ్యం పెంపొందించుకోవడానికి ఎక్కువ అవకాశం లభిస్తుంది. పేరున్న సంస్థల్లో కోర్సు పూర్తిచేసుకున్నవాళ్లు అవకాశాల పరంగా ముందుండవచ్చు.  

వీటిని నేర్చుకుంటారు..

ఈ కోర్సుల్లో చేరినవారు ఆసుపత్రులు సమర్థంగా ఎలా నిర్వహించాలో తెలుసుకుంటారు. సాంకేతికత, ఆర్థిక అంశాలు, నిర్వహణ నైపుణ్యాలు మొదలైనవి వీరికి బోధిస్తారు. ఫైనాన్స్‌ అకౌంటింగ్‌లో ప్రాథమికాంశాలు, హాస్పిటల్‌ సర్వీసులు, హెల్త్‌కేర్‌ మార్కెటింగ్, జనరల్‌ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్, హాస్పిటల్‌ ప్లానింగ్, పబ్లిక్‌ హెల్త్‌... తదితర అంశాలు కోర్సులో నేర్పుతారు. ముందుగా మేనేజ్‌మెంట్‌ రంగంలోని ఉమ్మడి అంశాలను బోధిస్తారు. వైద్యరంగ నిపుణులు, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్నవారితో తరగతులు నిర్వహిస్తారు. ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. వీరికి అకౌంట్స్‌ అండ్‌ ఫినాన్స్, లీగల్‌ అంశాల్లోనూ అవగాహన కల్పిస్తారు.

అందుబాటులో వైద్యులు ఉండేలా చేయడం, రోగికి చెప్పిన సమయానికి వైద్యుని సేవలు అందేలా చూడటం, వైద్యులు, సిబ్బంది, రోగులు వీరెవరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడగలగడం, ఆసుపత్రి స్థాయి, పేరుప్రఖ్యాతులు పెరిగేలా చేయడం, విస్తరణ ప్రణాళికలు ఇవన్నీ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌/మేనేజర్‌ విధుల్లో భాగమే. ఆసుపత్రులకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచడం, పరిశుభ్రత, స్టాఫ్‌ విధులకు హాజరయ్యేలా చూడటం, సకాలంలో వ్యవహారాలు నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం జరిగేలా చేయడం అన్నీ వీరి బాధ్యతే. తక్కువ ధరలో సత్వరమైన, నాణ్యమైన వైద్యసేవలు అందేలా చేయటంలో వీరి పాత్ర ఉంటుంది.

నైపుణ్యాలు...

సేవా దృక్పథం ఉండాలి. ఎక్కువ సమయం పని చేయడానికి సిద్ధ పడాలి. సహనమూ అవసరమే. కమ్యూనికేషన్‌ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, ఒత్తిడిలోనూ పనిచేయగలిగే నేర్పు తప్పనిసరి. మేనేజీరియల్‌ పరిజ్ఞానం, ఆసుపత్రి వాతావరణంపై ఆసక్తి, రోగులమీద శ్రద్ధ, సహాయపడే తత్వం, వైద్యరంగంపై ఆసక్తి ఉంటే హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు ఎంచుకోవచ్చు.

ఉద్యోగాలిక్కడ...

ఈ కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతోపాటు హెల్త్‌ ఏజెన్సీలు, లేబొరేటరీలు, క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌లు, జాతీయ, అంతర్జాతీయ వైద్య విభాగ సంస్థలు, ఆరోగ్య బీమా సంస్థలు, వైద్య కళాశాలలు, హెల్త్‌కేర్‌ సెంటర్లు, నర్సింగ్‌ హోమ్‌లు, మానసిక చికిత్స కేంద్రాలు, పునరావాస కేంద్రాలు, పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్లు, ఫార్మా సంస్థలు, హాస్పిటల్‌ సప్లై ఫర్మ్‌లు, మెడికల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, హాస్పిటల్‌ కన్సల్టింగ్‌ ఫర్మ్‌లు, కార్పొరేట్‌ ఫార్మసీలు... తదితర చోట్ల అవకాశాలు లభిస్తాయి. నైపుణ్యం ఉన్నవారు విదేశాల్లోనూ ఉద్యోగాలు పొందుతున్నారు. పీజీ అనంతరం అనుభవం పొంది, సంబంధిత సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు అధిక మొత్తంలో వేతనాలు అందుకోవచ్చు. 

కెరియర్‌...

అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్, ఆపరేషన్స్‌ అసిస్టెంట్‌ హోదాతో వీరి కెరియర్‌ ప్రారంభమవుతుంది. చదువుకున్న సంస్థ, అభ్యర్థి సమర్థత ప్రాతిపదికన హోదాలు కేటాయిస్తారు. కొందరికి మేనేజర్‌ ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులూ కేటాయిస్తారు. పేరున్న సంస్థలో కోర్సు పూర్తిచేసుకున్నవాళ్లు ప్రారంభంలోనే నెలకు సుమారు రూ.50,000 వరకు వేతనం పొందవచ్చు. ఎంబీబీఎస్‌ అర్హతతో కోర్సులు చదివినవారికి అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ హోదా కేటాయిస్తారు. తర్వాత డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్, మెడికల్‌ సూపరింటెండెంట్‌ హోదాలు వస్తాయి. మంచి పనితీరు, అనుభవంతో చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ లేదా సీఈఓ స్థాయి వరకు చేరుకోవచ్చు.

ఇవీ సంస్థలు

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంబీఏ హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందిస్తోంది. సీయూఈటీ పీజీతో ప్రవేశం లభిస్తుంది. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్‌; డెక్కన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, హైదరాబాద్‌ మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎండీహెచ్‌ఎం) కోర్సు అందిస్తున్నాయి. ఈ రెండు సంస్థల్లోనూ ప్రవేశాలకు జూన్‌ 27లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను కోర్సులోకి తీసుకుంటారు. వంద మార్కులకు నిర్వహించే ఆబ్జెక్టివ్‌ పరీక్షలో రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ యూసేజ్, హెల్త్‌ అండ్‌ హాస్పిటల్‌ నాలెడ్జ్, కరంట్‌ అఫైర్స్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఒక్కో సంస్థలోనూ 60 చొప్పున సీట్లు ఉన్నాయి. జులై 21న పరీక్ష ఉంటుంది. 

అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌  

విశ్వవిశ్వాని, హైదరాబాద్‌ (ఈ సంస్థ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏతోపాటు బీబీఏ కోర్సునూ అందిస్తోంది)

నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, హైదరాబాద్‌  

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్, జైపూర్‌  

దేవీ అహల్య విశ్వవిద్యాలయ, ఇండోర్‌  

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ముంబై

భారతీ విద్యాపీఠ్‌ యూనివర్సిటీ

సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్, పుణె   

బిట్స్, పిలానీ  (వీటిలో కొన్నింటికి ప్రకటనలు వెలువడ్డాయి. మిగిలినవాటికి వెలువడాల్సి ఉంది)

దూరవిద్యలోనూ...

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఎంబీఏ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అపోలో, కిమ్స్‌లతో కలిసి రెండేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఫైన్‌ ఆర్ట్స్, ఓరియంట్‌ లాంగ్వేజ్‌లు మినహా ఏదైనా డిగ్రీలో 50 (ఎస్సీ, ఎస్టీలు 45) శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలతో కోర్సులోకి తీసుకుంటారు. ప్రకటన త్వరలో వెలువడుతుంది. 

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం: ఎంబీఏ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌   

సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌: ఏడాది వ్యవధితో హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ డిప్లొమా. 

ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేటర్స్‌: ఏడాది వ్యవధితో హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌  

ఎంబీబీఎస్‌తో...

ఎంబీబీఎస్‌ పూర్తిచేసుకున్నవారు పీజీలో ఎండీ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులో చేరవచ్చు. మూడేళ్ల వ్యవధితో ఈ కోర్సును కొన్ని వైద్య కళాశాలలు అందిస్తున్నాయి. పీజీ నీట్‌తో ప్రవేశాలు లభిస్తాయి. ఆర్మ్‌డ్‌ మెడికల్‌ కాలేజ్, పుణె; కస్తూర్బా మెడికల్‌ కాలేజ్, మణిపాల్‌; నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, హైదరాబాద్‌; నారాయణ మెడికల్‌ కాలేజ్, నెల్లూరు తదితర సంస్థలు వైద్యుల కోసం కోర్సులు నడుపుతున్నాయి. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, న్యూదిల్లీ ఐఎన్‌ఐ సెట్‌తో ఎండీ (హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులోకి ప్రవేశం కల్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచే కొన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మూడేళ్ల వ్యవధితో బీబీఏ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ప్రారంభిస్తున్నారు. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరుల్లో ఈ కోర్సు చదువుకోవచ్చు.
 

Posted Date: 21-06-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌