• facebook
  • whatsapp
  • telegram

మేనేజ్‌మెంట్ విద్య‌లో పీజీకి సిద్ధ‌మా!

ఐసెట్‌, మ్యాట్ నోటిఫికేష‌న్లు విడుద‌ల‌

మేనేజ్‌మెంట్‌ ఆశావహులు సన్నద్ధమవ్వాల్సిన సమయమిది! ఎంబీఏ ప్రవేశానికి ప్రకటనలు వరుసగా వెలువడుతున్నాయి. జాతీయ స్థాయితోపాటు రాష్ట్రీయస్థాయి సంస్థల్లో ప్రవేశానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా జాతీయస్థాయిలో మ్యాట్, రాష్ట్రీయ స్థాయి కళాశాలల్లో ప్రవేశానికి తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రవేశించాలనుకునే సంస్థ, స్పెషలైజేషన్‌ ఆధారంగా నచ్చినదాన్ని ప్రయత్నించవచ్చు.

ఇంజినీరింగ్, మెడిసిన్‌ తరువాత దేశంలో అంతటి ఆదరణ ఉన్నది మేనేజ్‌మెంట్‌ కోర్సులకే! అందుకే డిగ్రీలతో సంబంధం లేకుండా పీజీలో వీటివైపు మొగ్గు చూపుతుంటారు. ప్రతి రంగంలోనూ ఎంబీఏ పట్టభద్రుల పాత్ర తప్పనిసరి కావడమే అందుకు కారణం. కోర్సులో భాగంగా వ్యాపారాన్ని, సంస్థలను సమర్థంగా నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటారు. మేనేజ్‌మెంట్‌ కోర్సులను కామర్స్‌ నేపథ్యం ఉన్నవారితోపాటు సైన్స్, ఆర్ట్స్‌ విద్యార్థులూ చదువుకోవచ్చు. అన్ని నేపథ్యాలవారికీ అవకాశం ఉండడం వల్ల పోటీ ఎక్కువ. కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి రంగంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా ఆదరణ ఉంటుంది. పేరొందిన సంస్థల్లో చదువుకున్నవారికి ఆకర్షణీయ వేతనాలూ అందుతున్నాయి. తాజాగా రెండు ప్రధాన మేనేజ్‌మెంట్‌ ప్రవేశ ప్రకటనలు విడుదలయ్యాయి. తమ లక్ష్యాలను అందుకోవడంలో సాయమందించగలదేదో నిర్ణయించుకుంటే.. దానికి అనుగుణంగా సన్నద్ధమవడం తేలికవుతుంది.

మ్యాట్‌

మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) స్టాండర్డైజ్‌డ్‌ టెస్ట్‌. జాతీయ స్థాయి పరీక్ష. దేశవ్యాప్తంగా 800కుపైగా బీ స్కూళ్లలో ఈ స్కోరు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) దీనిని ఏడాదికి నాలుగుసార్లు- ఫిబ్రవరి, మే, సెప్టెంబరు, డిసెంబరుల్లో నిర్వహిస్తుంది. ఈ స్కోరు ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. ఫిబ్రవరి పరీక్ష ఇప్పటికే పూర్తయింది. మే పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది.

పరీక్షను పేపర్‌ ఆధారిత పరీక్ష (పీబీటీ), కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఇంటర్నెట్‌ ఆధారిత పరీక్ష (ఐబీటీ) మూడు విధానాల్లో రాసుకునే వీలుంది. ఏవైనా రెండు విధానాలను కలిపి రాసుకునే వీలునూ కల్పించారు. కానీ దానికి పరీక్ష ఫీజులో కొంత మొత్తం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

పేపర్‌ ఆధారిత పరీక్షకు క్వశ్చన్‌ బుక్‌లెట్‌ను అందజేస్తారు. సమాధానాలను ఓఎంఆర్‌ షీట్‌ మీద గుర్తించాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద వచ్చిన ప్రశ్నలకు కీబోర్డు లేదా మౌస్‌ సాయంతో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్‌ ఆధారిత పరీక్ష కూడా ఆన్‌లైన్‌ లాంటిదే కానీ దీనికి రిమోట్‌ ప్రొటెక్షన్‌ ఉంటుంది. అలాగే అభ్యర్థి దీనిని నచ్చిన ప్రదేశం నుంచి రాసుకునే వీలుంటుంది. ఇంటర్నెట్‌ సదుపాయం తప్పనిసరి. ఇక్కడ అభ్యర్థిని వీడియో, ఆడియో ఆధారంగా ఇన్విజిలేట్‌ చేస్తారు. 

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేని విభాగంలో గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయః పరిమితేమీ లేదు.

పరీక్షలో... 

ఆబ్జెక్టివ్‌ ఆధారిత పరీక్ష. విద్యార్థి ఆప్టిట్యూడ్‌ను అంచనా వేసేలా దీనిలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం అయిదు విభాగాలు- లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్, ఇంటలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్, మ్యాథమేటికల్‌ స్కిల్స్, డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు. రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. వదిలేసిన ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌: వెర్బ్, నౌన్, ప్రొనౌన్, ఆడ్జెక్టివ్, ఆడ్‌వెర్బ్, యాంటనిమ్స్‌- సిననిమ్స్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్, ఇడియమ్స్‌/ ఫ్రేజెస్, ఒకాబులరీ, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, సెంటెన్స్‌ కరెక్షన్, పారా జంబుల్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఇంటలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌: అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఫ్యామిలీ ట్రీ, కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్, అరేంజ్‌మెంట్, పై చార్ట్, కాలెండర్స్, స్టేట్‌మెంట్‌ కన్‌క్లూజన్స్, స్ట్రాంగ్‌ ఆర్గ్యుమెంట్‌ అండ్‌ వీక్‌ ఆర్గ్యుమెంట్స్, పజిల్స్, సిరీస్, బ్లడ్‌ రిలేషన్స్, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్, విజువల్‌ రీజనింగ్, సిలాజిజమ్, గ్రాఫ్స్‌లను చూసుకోవాలి.

డేటా అనాలిసిస్‌ అండ్‌ డేటా సఫిషియన్సీ: డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ రెండు వేర్వేరు విభాగాలు. వీటి నుంచి లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్, పై చార్ట్, డేటా కంపారిజన్, క్వాంటేటివ్‌ కంపారిజన్, డేటా సఫిషియన్సీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

మ్యాథమేటికల్‌ స్కిల్స్‌: ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ, మెన్సురేషన్, మోడర్న్‌ మ్యాథ్స్‌ అంశాలు చూసుకోవాలి.

ఇండియన్, గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌: కరెంట్‌ అఫైర్స్, జీకే అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

దరఖాస్తు విధానం

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, పుట్టినతేదీ, ఈమెయిల్, మొబైల్‌ నంబరు, పాస్‌వర్డ్‌ సాయంతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై వ్యక్తిగత, అకడమిక్‌ వివరాలతోపాటు ఫొటో, సంతకాన్నీ సమర్పించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఏదేని ఒకే విధానం- పీబీటీ/ ఐబీటీ/ సీబీటీలో రాయడానికి రూ. 1650. ఏదేని రెండు విధానాలను కలిపి రాయడానికి రూ.2750.

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మే 24, 2021

పరీక్ష తేదీలు: పీబీటీ- మే 30, 2021; సీబీటీ- జూన్‌ 13, 2021

వెబ్‌సైట్:‌ https://mat.aima.in/may21/ 

ఐసెట్‌ 

ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌) రాష్ట్ర స్థాయి పరీక్ష. ఏడాదికి ఒకసారి మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. స్కోరు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దీనికి సంబంధించి తెలంగాణలో ప్రకటన విడుదలైంది. ఏపీలో ఇంకా విడుదల కావాల్సి ఉంది. తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (టీఎస్‌సీహెచ్‌ఈ) తరఫున కాకతీయ యూనివర్సిటీ దీన్ని నిర్వహిస్తోంది. 

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ కళాశాల నుంచి బీఏ/ బీకాం/ బీఎస్‌సీ/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ లేదా ఏదేని మూడు లేదా నాలుగేళ్ల వ్యవధి గల డిగ్రీ పూర్తి చేసుండాలి. కనీసం 50% మార్కులు సాధించి ఉండటం తప్పనిసరి. ఎస్‌సీ, ఎస్‌టీ వారు కనీసం 45% మార్కులు సాధించి ఉండాలి.

పరీక్ష ఇలా...

ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మూడు విభాగాలు- సెక్షన్‌-ఎ, బి, సిలు ఉంటాయి. సెక్షన్‌ ఎ, బి ప్రశ్నలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటాయి. సెక్షన్‌-సి ఆంగ్లంలోనే ఉంటాయి. ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. మొత్తం ప్రశ్నల సంఖ్య 200. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. రుణాత్మక మార్కులు లేవు.

సెక్షన్‌-ఎ: అనలిటికల్‌ ఎబిలిటీ: ఈ విభాగం నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. 75 మార్కులు. దీనిలో డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ (సీక్వెన్స్‌ అండ్‌ సిరీస్, డేటా అనాలిసిస్, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్, డేట్, టైమ్‌ అండ్‌ అరేంజ్‌మెంట్‌) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

సెక్షన్‌-బి: మ్యాథమేటికల్‌ ఎబిలిటీ: ఈ విభాగం నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. 75 మార్కులు. అరిథ్‌మెటిక్‌ ఎబిలిటీ, ఆల్జీబ్రికల్‌ అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

సెక్షన్‌-సి: కమ్యూనికేషన్‌ ఎబిలిటీ: ఈ విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. 50 మార్కులు. ఒకాబులరీ; బిజినెస్, కంప్యూటర్‌ టర్మినాలజీ; ఫంక్షనల్‌ గ్రామర్‌; రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

దరఖాస్తు విధానం

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.650. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.450.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, కోదాడ, మహబూబ్‌నగర్, సిద్ధిపేట, నిజామాబాద్, కర్నూలు, విజయవాడ, వరంగల్, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: జూన్‌ 15, 2021

ఆలస్య రుసుము రూ.250తో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: జూన్‌ 30, 2021

ఆలస్య రుసుము రూ.500తో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: జులై 7, 2021

ఆలస్య రుసుము రూ.1000తో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఆగస్టు 8, 2021

పరీక్ష తేదీలు: 2021 ఆగస్టు 19 (ఉదయం 10గం. నుంచి మధ్యాహ్నం 12.30 వరకు; మధ్యాహ్నం 2గం. నుంచి సాయంత్రం 4.30గం. వరకు), 20 (ఉదయం 10గం. నుంచి మధ్యాహ్నం 12.30 వరకు) 

వెబ్‌సైట్‌: https://icet.tsche.ac.in/TSICET/TSICET_HomePage.aspx
 

Posted Date: 13-04-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌