• facebook
  • whatsapp
  • telegram

ఆతిథ్య రంగంలో  సత్తా చాటేద్దామా?

ఇంట‌ర్ విద్యార్హత‌తో హాస్పిటాలిటీ కోర్సులోకి ఆహ్వానం

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థుల ముందు ఎన్నో వృత్తివిద్యావకాశాలున్నాయి. విద్యార్థులు తమ ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా నచ్చినవాటిని ఎంచుకోవచ్చు. అన్ని గ్రూపుల విద్యార్థులూ ఆతిథ్య (హాస్పిటాలిటీ) కోర్సుల్లో చేరవచ్చు. కేంద్రం, రాష్ట్ర స్థాయుల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలెన్నో వీటిని అందిస్తున్నాయి. అలాగే కార్పొరేట్‌ సంస్థలు ఇంటర్‌ విద్యార్హతతోనే యూజీ కోర్సు, శిక్షణ అందించి విధుల్లోకి తీసుకుంటున్నాయి!

ఆతిథ్య రంగంలో సేవలు అందించాలనుకునేవారు ఇంటర్మీడియట్‌ అనంతరం ఆ దిశగా అడుగులేయవచ్చు. అన్ని గ్రూపుల విద్యార్థులూ బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సుల్లో చేరవచ్చు. వీటి వ్యవధి మూడేళ్లు. కోర్సు చివరలో స్పెషలైజేషన్‌ ఎంచుకునే అవకాశమూ ఉంది. ఆపై ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు లేదా ఉన్నత విద్య దిశగా అడుగులు వేయవచ్చు. చాలా సంస్థలు ఉన్నత చదువుల్లో భాగంగా పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ కోర్సులు అందిస్తున్నాయి. ఆతిథ్యంలో పేరొందిన ఐటీసీ, ఒబెరాయ్‌లు యూజీ, పీజీ, పీడీ డిప్లొమాలను ఉచితంగా అందించి, ఉద్యోగాలిస్తున్నాయి. 

ఇంటర్‌ విద్యార్థులు ఆతిథ్యంలో బీఎస్సీ, బీబీఎం, సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ఎంచుకోవచ్చు. యూజీలో ఫ్రంట్‌ ఆఫీస్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌; హౌస్‌ కీపింగ్, కిచెన్‌ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఐహెచ్‌ఎం, ఐఐటీటీఎం, ఐసీఐలు ఏర్పాటుచేశారు. టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ ఇన్‌స్టిట్యూట్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా ఈ సంస్థలు అందించే కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐహెచ్‌ఎంలు

అఖిల భారత స్థాయిలో ఆతిథ్య రంగంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం)లు పేరొందిన సంస్థలు. వీటి నిర్వహణకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) ఏర్పాటు చేశారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ద్వారా బీఎస్సీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఇందులో సాధించిన స్కోరుతో రాష్ట్ర స్థాయి, ప్రైవేటు సంస్థల్లో చదువుకోవచ్చు. వీటిలో శాకాహారుల కోసం ప్రత్యేకంగా కోర్సులు అందిస్తోన్న సంస్థలూ ఉన్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ (విద్యానగర్‌)లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్ర సంస్థ. ఇక్కడ బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులో చేరవచ్చు. రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, తిరుపతి; డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హైదరాబాద్‌; తెలంగాణ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, సంగారెడ్డిల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రైవేటు ఆధ్వర్యంలో శ్రీశక్తి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, హైదరాబాద్‌ (బేగంపేట), లియో అకాడెమీ, హైదరాబాద్‌ (షామీర్‌పేట) జేఈఈ స్కోర్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలన్నీ ఈ స్కోరు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. కొన్ని ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్లు సైతం ఈ స్కోరుతోనే విద్యార్థులను చేర్చుకుంటున్నాయి.  

ఐసీఐ

కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో తిరుపతి, నోయిడాల్లో ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ (ఐసీఐ) నెలకొల్పారు. ఇక్కడ బీబీఏ కలినరీ ఆర్ట్స్‌తోపాటు 18 నెలల వ్యవధితో డిప్లొమా, 6 నెలల వ్యవధితో సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నారు. పాకశాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులో చేరి భవిష్యత్తులో షెఫ్‌గా రాణించవచ్చు. కోర్సులో భాగంగా పలు రకాల వంటకాల తయారీ, పదార్థాల ఎంపికలో మెలకువలు నేర్చుకోవచ్చు.

ఐఐటీటీఎం

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం) ఇంటర్‌ విద్యార్హతతో బీబీఏ కోర్సు అందిస్తోంది. ఈ సంస్థకు నెల్లూరుతోపాటు గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడాల్లో కేంద్రాలున్నాయి. రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా కోర్సులో ప్రవేశం లభిస్తుంది. పర్యాటక కేంద్రాలు, టూరిజం ఏజెన్సీల్లో సేవలు అందించడానికి ఈ కోర్సులు దోహదపడతాయి.  

స్టెప్‌

సిస్టమేటిక్‌ ట్రెయినింగ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం (స్టెప్‌) పేరుతో ఒబెరాయ్‌ గ్రూప్‌ ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారికి అవకాశం కల్పిస్తోంది. ఫ్రంట్‌ ఆఫీస్, హౌస్‌ కీపింగ్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీస్, కిచెన్‌ విభాగాల్లో శిక్షణ ఇస్తారు. కోర్సులో చేరినవారికి ప్రతి నెలా స్టైపెండ్‌ అందుతుంది. వసతి, భోజనం, యూనిఫారం, ఆరోగ్య బీమా ఉచితంగా అందిస్తారు. మూడేళ్ల కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి బ్యాచిలర్‌ ఆఫ్‌ టూరిజం స్టడీస్‌ డిగ్రీని ఇగ్నో ప్రదానం చేస్తుంది. ఒబెరాయ్‌ గ్రూప్‌ హోటళ్లలో ఆపరేషన్స్‌ అసిస్టెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.  

ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఆన్‌లైన్‌ కోర్సు 

ఫుడ్‌ ఇండస్ట్రీ కెపాసిటీ అండ్‌ స్కిల్‌ ఇనీషియేటివ్‌ (ఎఫ్‌ఐసీఎస్‌ఐ) ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఆన్‌లైన్‌ కోర్సు అందిస్తోంది. ఎన్నో ఎడ్‌టెక్‌ సంస్థలు సైతం హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులు ఆన్‌లైన్‌లో బోధిస్తున్నాయి. వాటిలో చేరడానికి ప్రయత్నించవచ్చు. 

మరికొన్ని...

‣ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం), ఔరంగాబాద్‌ ఆనర్స్‌ విధానంలో నాలుగేళ్ల బీఏ - హోటల్‌ మేనేజ్‌మెంట్‌ / కలినరీ ఆర్ట్స్‌ కోర్సులు అందిస్తోంది. ఈ సంస్థలో తాజ్‌ గ్రూప్‌ భాగస్వామ్యం ఉంది. నాలుగో సంవత్సరం కోర్సులను భారత్‌ లేదా యూకేలో చదువుకోవచ్చు. ఇందుకోసం యూకేకు చెందిన హడర్స్‌ ఫీల్డ్‌ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. అన్నీ కలుపుకుని నాలుగేళ్ల కోర్సు భారత్‌లో చదవడానికి సుమారు 20 లక్షలు అవుతుంది.

ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తోపాటు 8 క్యాంపస్‌లు ఉన్నాయి. ఇంటర్‌ విద్యార్హతతో వివిధ కోర్సులు అందిస్తున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షతో ప్రవేశం పొందవచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో ప్రైవేటు సంస్థలు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నాయి. చాలావాటిలో నేరుగా ప్రవేశాలు లభిస్తాయి. పేరొందిన సంస్థలు ఇంటర్‌ మార్కులు లేదా ఏదైనా పరీక్ష స్కోర్‌ లేదా ప్రవేశ పరీక్షతో కోర్సులోకి తీసుకుంటున్నాయి.

ఉపాధి అవకాశాలు?

బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివినవారిని మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ లేదా ఎగ్జిక్యూటివ్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ అవుట్‌లెట్లు, రిసార్టులు, రైల్వే, డిఫెన్స్, ఏర్‌ లైన్స్, క్రూయిజ్‌ లైన్స్, స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు, కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు...ఇలా ప్రతిచోటా ఉద్యోగాలు లభిస్తాయి. 

పేరున్న సంస్థల్లో చదివినవాళ్లు దాదాపు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా కోర్సు పూర్తికాకముందే ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. లీలా, లెమన్‌ ట్రీ, ట్రైడెంట్, ఒబెరాయ్, తాజ్, పార్క్, స్టార్‌వుడ్, మారియట్‌...ఇలా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. ఫుడ్‌ చైన్‌ సంస్థలైన కేఎఫ్‌సీ, మెక్‌ డొనాల్డ్స్, పీజా హట్, డామినోస్‌..మొదలైనవి ప్రాంగణ నియామకాల్లో ఎక్కువమందిని తీసుకుంటున్నాయి. విదేశాల్లోనూ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. చదువుకున్న అనుభవంతో సొంతంగా ఫుడ్‌ చెయిన్‌ ప్రారంభించవచ్చు. బోధనపై ఆసక్తి ఉన్నవారు పీజీ అనంతరం నేషనల్‌ హాస్పిటాలిటీ టూరిజం ఎలిజిబిలిటీ టెస్టులో అర్హత సాధించి, మేటి సంస్థల్లో టీచింగ్‌ పోస్టుల్లో స్థిరపడవచ్చు. 

క్లౌడ్‌ కిచెన్‌ కాన్సెప్ట్‌ ఇప్పుడు విస్తరిస్తోంది. ఆన్‌లైన్‌ ఆహార విక్రయ సంస్థలను వేదికగా చేసుకుని మంచి వంటకాలు అందించవచ్చు. అలాగే స్థానికంగా బ్యాకరీ పదార్థాలు, జామ్, జెల్లీలు, పచ్చళ్లు, అప్పడాలు మొదలైనవాటిని తక్కువ పెట్టుబడితో తయారుచేసి, విక్రయించడంపైనా దృష్టి సారించవచ్చు.

వెల్‌ కం లీడ్‌

ఇంటర్‌ విద్యార్హతతో ఐటీసీ హోటల్స్‌ అందించే వెల్‌ కం లీడ్‌ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం ఎలాంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. ఒకవైపు చదువు, శిక్షణ పొందుతూనే ప్రతి నెలా స్టైపెండ్‌ అందుకోవచ్చు. ఈ విధానంలో చేరినవారు ఇగ్నో అందించే బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (టూరిజం స్టడీస్‌) పూర్తిచేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత వెల్‌కం లీడ్‌ సర్టిఫికెట్, అనుభవ పత్రాన్ని ఐటీసీ అందిస్తుంది. ఐటీసీ హోటళ్లలో ఫ్రంట్‌లైన్‌ ఆపరేషన్స్‌ ఉద్యోగాల్లో చేరిపోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో కోర్సులోకి తీసుకుంటారు.
 

Posted Date: 02-11-2021


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌