• facebook
  • whatsapp
  • telegram

మేనేజ్‌మెంట్‌ విద్యకు మేటి కాలేజీలు

అత్యున్నత ప్రమాణాలతో కూడిన మేనేజ్‌మెంట్‌ విద్యను అందించడం లక్ష్యంగా మనదేశంలో అనేక కార్పొరేట్‌ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రముఖ సంస్థలు... జేవియర్స్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ), ఇర్మా, నార్సీమోంజీ, సింబయోసిస్‌, ఫ్యాకల్టీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఢిల్లీ యూనివర్సిటీ), టిస్‌ మొదలైనవి. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ఆధారంగా ఈ సంస్థలు ఎంబీఏ లేదా పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఆధునిక స్పెషలైజేషన్‌లతో మేనేజ్‌మెంట్‌ కోర్సులను నిర్వహిస్తూ ఐఐఎంలతో పోటీ పడుతున్నాయి. ఈ సంస్థలు, అవి నిర్వహిస్తోన్న పరీక్షల వివరాలు...

అగ్రగామి... జేవియర్స్‌

ప్రమాణాలు, సౌకర్యాలు, ప్లేస్‌మెంట్ల పరంగా ఐఐఎంలకు తీసిపోని సంస్థ జేవియర్స్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ.). ఆసియాలో ప్రముఖ సంస్థగా దీనికి పేరుంది. ఇది 1949లో జంషెడ్‌పూర్‌లో ప్రారంభమైంది. అద్భుతమైన మౌలిక సౌకర్యాలు, అత్యున్నత ప్రమాణాలతో 'పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌' (పి.ఎం.ఐ.ఆర్‌.) కోర్సును ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ నిర్వహిస్తోంది. జనరల్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ కూడా చేయవచ్చు.

ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ.లో ప్రవేశానికి ఎక్స్‌.ఎ.టి. పరీక్ష రాయాలి. ఈ స్కోరును భువనేశ్వర్‌లోని ఎక్స్‌.ఐ.ఎం.; గోవా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఎస్‌.పి.జైన్‌ ఇనిస్టిట్యూట్‌; ముంబయిలోని వెలింకార్‌; చెన్నైలోని లయోలా ఇనిస్టిట్యూట్‌, లయోలా ఇనిస్టిట్యూట్‌ (సికింద్రాబాద్‌), తదితర సంస్థలు కూడా మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లకు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.


ప్రవేశ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. అవి...

1. డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ

2. ఎనలిటికల్‌ రీజనింగ్‌ అండ్‌ డెసిషన్‌ మేకింగ్‌

3. వెర్బల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ.

'టిస్‌'లో ఎం.ఎ. - హెచ్‌.ఆర్‌.ఎం. 
ఎం.ఎ. పేరుతో నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ డిగ్రీలను అందిస్తోన్న సంస్థ టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌, ముంబయి). హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌, డెవలప్‌మెంట్‌, సోషల్‌ వర్క్‌ సబ్జెక్టుల్లో శిక్షణకు మంచి సంస్థగా టిస్‌కు పేరుంది. దీనికి ముంబయితోపాటు హైదరాబాద్‌, గౌహతిలో క్యాంపస్‌లు ఉన్నాయి. పబ్లిక్‌ హెల్త్‌, ఎడ్యుకేషన్‌, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లలో ఎం.ఎ. కోర్సులను కూడా టిస్‌ అందిస్తోంది. సంబంధిత రంగాల్లోని కంపెనీలు టిస్‌ విద్యార్థులకు మంచి ప్లేస్‌మెంట్లను కల్పిస్తున్నాయి.

కార్పొరేట్‌కు దీటుగా ఎఫ్‌.ఎం.ఎస్‌. 

యూనివర్సిటీల ఆధ్వర్యంలో కొనసాగుతోన్న మేనేజ్‌మెంట్‌ స్కూళ్లలో అత్యంత ప్రముఖమైనది... ఫ్యాకల్టీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఎఫ్‌.ఎం.ఎస్‌.), ఢిల్లీ యూనివర్సిటీ. కార్పొరేట్‌ సంస్థలతో పోటీపడుతూ ర్యాంకింగ్స్‌లో ఎఫ్‌.ఎం.ఎస్‌. అగ్రస్థానాల్లో కొనసాగుతోంది. ఈ సంస్థ అందిస్తోన్న ఎంబీఏ, ఎంబీఏ - ఎం.ఎస్‌. ప్రోగ్రామ్‌లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. అతి తక్కువ ఫీజుతో అత్యున్నత స్థాయి శిక్షణను అందించడం ఎఫ్‌.ఎం.ఎస్‌. ప్రత్యేకత. ఇందులో ఎంబీఏ ఫీజు ఏడాదికి పదివేల రూపాయల పైచిలుకు మాత్రమే. ఐఐఎంలు, కార్పొరేట్‌ బిజినెస్‌ స్కూళ్ల ఫీజులతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ.  క్యాట్‌ స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. తర్వాత గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలు ఉంటాయి. క్యాట్‌లో ప్రతి విభాగంలోనూ కనీసం 50 పర్సంటైల్‌ అవసరం. అందువల్ల అభ్యర్థులు క్యాట్‌ పరీక్ష తప్పనిసరిగా రాయాలి. తర్వాత ఎఫ్‌.ఎం.ఎస్‌.కు విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

శ్నాప్‌ ద్వారా సింబయోసిస్‌లో...

పుణె (మహారాష్ట్ర)లోని ప్రతిష్ఠాత్మక సంస్థ సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ. ఇందులో ఎంబీఏ చేయాలంటే ఆ సంస్థ నిర్వహించే శ్నాప్‌ (సింబయోసిస్‌ నేషనల్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌) రాయాలి. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే బెంగళూరు, నాశిక్‌లలో మేనేజ్‌మెంట్‌ స్కూళ్లు ఉన్నాయి. పుణెలోని సింబయోసిస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌ఐబీఎం) అన్నిటికంటే పేరున్న సంస్థ.  శ్నాప్‌లో జనరల్‌ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూట్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, ఎనలిటికల్‌- లాజికల్‌ రీజనింగ్‌లతోపాటు జనరల్‌ ఎవేర్‌నెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. 

ఐఐఎఫ్‌టీ, నార్సీ మోంజీ...

ఐఐఎఫ్‌టీ: సెక్టోరల్‌ బిజినెస్‌ స్కూళ్లలో మరో అత్యుత్తమ సంస్థ... ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ). ఈ సంస్థ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో డీమ్డ్‌ యూనివర్సిటీ హోదాతో ఈ సంస్థ కొనసాగుతోంది. న్యూఢిల్లీతోపాటు కోల్‌కతాలో కేంద్రం ఉంది. ఐఐఎఫ్‌టీ నాలుగు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను వడపోత పోస్తుంది. అవి.. రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, వ్యాస రచన. రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ అవేర్‌నెస్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎనాలసిస్‌ అంశాల నుంచి ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నార్సీ మోంజీ: ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌, క్యాపిటల్‌ మార్కెట్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి ఆధునిక స్పెషలైజేషన్లతో ఎంబీఏ కోర్సులను అందిస్తోన్న సంస్థ... నార్సీ మోంజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ముంబయి). జాతీయస్థాయిలో నిర్వహించే 'ఎన్‌మ్యాట్‌' (నార్సీ మోంజీ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌) ద్వారా ఈ సంస్థలో ప్రవేశం లభిస్తుంది. హైదరాబాద్‌, బెంగళూరులలో కూడా క్యాంపస్‌లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

రూరల్‌ మేనేజ్‌మెంట్‌కు ఇర్మా

ప్రత్యేక అధ్యయన అంశాలకు ఎంబీఏలో డిమాండ్‌ పెరుగుతోంది. ఆధునిక స్పెషలైజేషన్‌లతో కోర్సుల నిర్వహణకు ప్రత్యేక సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఇలాంటి సెక్టోరల్‌ బిజినెస్‌ స్కూళ్లలో అత్యుత్తమమైనదిగా పేరు గడించిన సంస్థ... ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌. రూరల్‌ మేనేజ్‌మెంట్‌, అభివృద్ధి రంగాలు, స్వచ్చంధ సంస్థలకు అవసరమైన మేనేజ్‌మెంట్‌ నిపుణులను తయారుచేయడంలో ఈ సంస్థకు మంచి పేరుంది. దేశంలో శ్వేత విప్లవానికి పునాదులు వేసిన వర్ఘీస్‌ కురియన్‌ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని ఆనంద్‌లో ఈ సంస్థ ఏర్పాటైంది. జాతీయ స్థాయి పరీక్ష ద్వారా ఇర్మా మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రవేశం కల్పిస్తుంది. సామాజిక ప్రాధాన్యం ఉన్న అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడగటం ఇర్మా ప్రవేశ పరీక్ష ప్రత్యేకత. 

Posted Date: 23-09-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌