• facebook
  • whatsapp
  • telegram

వాణిజ్యయమ్ము నిశ్చయమ్ముగా!

దేశం అంటే ఆర్థిక వ్యవస్థ.. మిగతావన్నీ ఆ తర్వాతే. అంత అత్యంత ముఖ్యమైన ఆ వ్యవస్థను భుజాలకెత్తుకునే నిపుణులందరినీ కామర్స్‌ విభాగమే అందిస్తుంది. దేశాల స్థితిగతులను శాసించగలిగిన శక్తి ఈ ఆర్థికవేత్తల అదుపులో ఉంటుంది. అందుకే ఇంజినీరింగ్‌, మెడికల్‌ కోర్సులకు దీటుగా వాణిజ్యశాస్త్రం ఎదిగింది. జీఎస్‌టీ వంటి ఆధునిక అనువర్తనలతో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. కామర్స్‌ సబ్జెక్టుగా ఉన్న సీఈసీ, ఎంఈసీ తదితర గ్రూప్‌లతోపాటు ఇతర గ్రూప్‌లతో ఇంటర్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు వాణిజ్య విద్య వరంలాంటిది. కాలంతోపాటు పరుగులుపెట్టే కామర్స్‌ను కొలువుల కామధేనువుగా చెప్పుకోవచ్చు. 
 

ఇంటర్మీడియట్‌లో కామర్స్‌ను మ్యాథ్స్‌తో పాటు (ఎంఈసీ) చదివినవారు బీసీఏ, బీఎస్సీ చేయవచ్చు. వీటితో పాటు వివిధ డిప్లొమాలు, సర్టిఫికెట్‌ కోర్సులు చేస్తే కామర్స్‌లో ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. బ్యాంకింగ్‌, మేనేజ్‌మెంట్‌, అకౌంటింగ్‌, టాక్సేషన్‌లలో, ఆర్థిక సంస్థల్లో విధులు నిర్వహించాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది సరైన గమ్యం.  ఇంటర్‌ను ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ... తదితర ఏ గ్రూపు సబ్జెక్టులతో చదివినవారైనా కామర్స్‌ స్ట్రీమ్‌లోని ప్రొఫెనల్‌ కోర్సుల్లోకి ప్రవేశించవచ్చు. కామర్స్‌ విద్యార్థులు ఫారిన్‌ ట్రేడ్‌, ఫైనాన్స్‌ అనలిస్ట్‌, మార్కెటింగ్‌, లా, జర్నలిజం-మాస్‌ కమ్యూనికేషన్‌, ఎడ్యుకేషన్‌, ఫారిన్‌ లాంగ్వేజెస్‌ మొదలైన ప్రొఫెషనల్‌ కోర్సుల్లో కూడా ప్రవేశించి రాణించవచ్చు. ఇంటర్‌ తర్వాత ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లు కాకుండా మూడో ప్రత్యామ్నాయ మార్గంగా కామర్స్‌ (వాణిజ్యశాస్త్రం) ప్రాచుర్యం పొందింది. సామాన్య గుమాస్తాల దగ్గర్నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే ఆర్థిక నిపుణుల వరకు అందరూ ఈ రంగం నుంచే వస్తున్నారు. తార్కిక, విశ్లేషణ నైపుణ్యాలున్నవారు కామర్స్‌లో రాణించే అవకాశం ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీల అమలు తర్వాత ఈ వృత్తినిపుణుల అవసరం ఎంతో పెరిగింది. అకౌంటెన్సీ లాంటివి మాత్రమే కాకుండా బీపీఓలు, ఇన్సూరెన్స్‌, బిజినెస్‌ కన్సల్టెన్సీ లాంటి ఆధునిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కామర్స్‌ కోర్సులు మార్గం సుగమం చేస్తున్నాయి! గణిత నేపథ్యం, నిర్వహణ- మార్కెటింగ్‌ నైపుణ్యాలతో కలిసివుండే ఈ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. వీటిలో థియరీ, ప్రాక్టికల్స్‌ ఉంటాయి.

ఇంటర్మీడియట్‌లో కామర్స్‌ సబ్జెక్టుగా ఉన్న సీఈసీ, ఎంఈసీ తదితర గ్రూప్‌ల అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో కామర్స్‌ కోర్సులు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ ఇంటర్‌లో ఏ గ్రూప్‌ చదివిన వారైనా తర్వాత స్థాయిలో వాణిజ్య విద్యలోకి ప్రవేశించవచ్చు. ఈ కోర్సుల్లో ప్రధానంగా బీకామ్‌, సీఏ, సీఎంఏ, సీఎస్‌ ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని డిప్లొమాలు, ఇతర కోర్సులు, కొన్ని రకాల ఉద్యోగాలు చేసుకోవచ్చు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ (బీకామ్‌)


ఇంటర్లో కామర్స్‌ గ్రూపులైన సీఈసీ, ఎంఈసీ చదివినవారు బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ (బీకామ్‌) కోర్సు చదవొచ్చు. దీనిలో అకౌంట్స్‌, మర్కంటైన్‌ లా, అర్థశాస్త్రం, గణాంక శాస్త్రం, కాస్టింగ్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌, కంప్యూటర్‌ లాంటివి ప్రధాన సబ్జెక్టులు. మూడేళ్ల ఈ కోర్సులో విద్యార్థులు ఆసక్తి ఉన్న ఒక విభాగాన్ని ఎంచుకోవచ్చు.
విభాగాలు: జనరల్‌ బీకామ్‌, బీకామ్‌ (ఆనర్స్‌), బీకామ్‌ (అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌), బీకామ్‌ (బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌), బీకామ్‌ (ఫైనాన్షియల్‌ మార్కెటింగ్‌). 

చాలా కళాశాలల్లో బీకామ్‌ను సెమిస్టర్‌ విధానంలో అందిస్తున్నారు.
బీకామ్‌ కోర్సులను పూర్తిచేసినవారు ఎం.కామ్‌, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్‌ లాంటి కోర్సులు చదవొచ్చు.
బీకామ్‌ తర్వాత బ్యాంకు పరీక్షలు, సివిల్స్‌, గ్రూప్స్‌ ..ఇలా అన్ని పోటీ పరీక్షలకూ సన్నద్ధం కావొచ్చు.
బోధనపై ఆసక్తి ఉన్నవారు డిగ్రీ తర్వాత బీఎడ్‌ చేయవచ్చు.

వృత్తివిద్యా కోర్సులు

ఇంటర్‌ తర్వాత కామర్స్‌ వృత్తివిద్యా కోర్సులైన సి.ఎ.; సి.ఎం.ఎ.; సి.ఎస్‌. కోర్సులు చేయవచ్చు. ఇవి పూర్తిచేయాలంటే సుదీర్ఘ కాలం పడుతుందనేది ఒకప్పటి మాట. తక్కువ వ్యవధిలోనే, తక్కువ ఖర్చుతోనే వీటిని విజయవంతంగా పూర్తిచేయవచ్చు. అంతే కాదు; ఈ కోర్సులు చదివే విద్యార్థులు బీకామ్‌ను దూరవిద్యలో అభ్యసించవచ్చు.

చార్టర్డ్‌ అకౌంటెన్సీ(సీఏ)

కామర్స్‌ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయమైన విభాగం- ఈ చార్టర్డ్‌ అకౌంటెన్సీ. సి.ఎ. అంటే 9, 10 సంవత్సరాలు పడుతుందని చాలామంది భయపడుతుంటారు. ఇటీవలి ఫలితాలు చూస్తే 21-22 సంవత్సరాల వయసుకే చాలామంది సీఏ పూర్తి చేస్తున్నారు. ఇంటర్‌ తర్వాత ఫౌండేషన్‌ కోర్సు చేయటం ద్వారా సీఏను త్వరగా పూర్తిచేయవచ్చు.

ఎవరు చదవొచ్చు: ఒకప్పుడు డిగ్రీ తర్వాతే సీఏ కోర్సులోకి ప్రవేశించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్‌ తర్వాతనే సీఏ చదవటం ఆరంభించవచ్చు. ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ..ఇలా ఏ గ్రూపువారైనా ఈ కోర్సు చదవొచ్చు. కానీ చాలామంది ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపుతోపాటే ఏకకాలంలో సీఏ కోర్సు అంశాలను అధ్యయనం చేయటానికి మొగ్గుచూపుతున్నారు. 

ఎన్ని దశలు: దీనిలో సీఏ ఫౌండేషన్‌, సీఏ ఇంటర్మీడియట్‌ (తర్వాత ఆర్టికల్‌ షిప్‌), సీఏ ఫైనల్‌ అనే మూడు దశలుంటాయి.
ఏ గ్రూపుతోనైనా ఇంటర్‌ రాసినవారు మే, నవంబరు నెలల్లో రెండుసార్లు జరిగే ఫౌండేషన్‌ కోర్సుకు నమోదుచేసుకోవాలి.

కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ (సీఎంఏ)
సీఏ తర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందిన కోర్సు ఇది. ఇంటర్‌ ఎంఈసీతో పాటు సీఎంఏ చదివినవారు ఇంటర్‌ తర్వాత రెండేళ్లలోనూ; ఇంటర్‌ తర్వాత సీఎంఏ చదవటం ఆరంభించినవారు రెండున్నర ఏళ్లలోనూ సీఎంఏ పూర్తిచేయవచ్చు.

ఎవరు చదవొచ్చు: ఇంటర్లో ఏ గ్రూపు వారైనా అర్హులే.

ఎన్ని దశలు: సీఎంఏ ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌ (తర్వాత ప్రాక్టికల్‌ శిక్షణ), ఫైనల్‌ అనే మూడు దశలుంటాయి.
ఏ గ్రూపుతోనైనా ఇంటర్‌ చదివినవారు జూన్‌, డిసెంబర్‌లలో జరిగే ఫౌండేషన్‌ కోర్సుకు నాలుగు నెలల ముందు నమోదు చేసుకోవాలి.

కంపెనీ సెక్రటరీ (సీఎస్‌) 
కంపెనీల విధానాల రూపకర్తలుగా కంపెనీ సెక్రటరీలది ఉన్నత బాధ్యత. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు సలహాలు ఇవ్వడం, కంపెనీకి న్యాయసలహాలు ఇవ్వడం, యాజమాన్యానికీ, వాటాదారులకూ, రుణదాతలకూ అనుసంధానకర్తగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించవచ్చు.

ఎవరు చదవొచ్చు: ఇంటర్‌ను ఏ గ్రూపుతో చదివినవారైనా అర్హులే.

ఎన్ని దశలు: సీఎస్‌ ఫౌండేషన్‌, ఎగ్జిక్యూటివ్‌, (అప్రెంటిస్‌ ట్రెయినింగ్‌), ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ అని మూడు దశలుంటాయి.
జూన్‌, డిసెంబర్‌లలో ఏటా రెండు సార్లు జరిగే సీఎస్‌ ఫౌండేషన్‌కు ఇంటర్‌ విద్యార్థులు 9 నెలల ముందు నమోదు చేసుకోవాలి.

ఎన్నిరకాల మార్గాలు?
ఇంటర్‌ తర్వాత కామర్స్‌ విద్యార్థులకున్న విద్యావకాశాలను డిగ్రీ, డిప్లొమా, ప్రొఫెషనల్‌ ప్రోగ్రాములుగా చెప్పవచ్చు.
డిగ్రీ కోర్సులు (3 నుంచి 4 ఏళ్ల వ్యవధి) :

బీకామ్‌
బీబీఏ
బీబీఎం
బీబీఏ-ఎల్‌ఎల్‌బీ
బీఏ-ఎల్‌ఎల్‌బీ
బీసీఏ
బీఏ
 

డిప్లొమాలు (6 నెలల నుంచి 2 ఏళ్ల వ్యవధి):
డిప్లొమా ఇన్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం ‌
డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ‌
డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌
 

ప్రొఫెషనల్‌ కోర్సులు (3 ఏళ్లు, ఆపై వ్యవధి):
చార్టర్డ్‌ అకౌంటెన్సీ
కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ (గతంలో-ఐసీడబ్ల్యుఏ)
కంపెనీ సెక్రటరీ

Posted Date: 27-08-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌