• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో ఉద్యోగాలెన్నో!

* కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో వివిధ ఉద్యోగాలకు అవకాశం


వైట్‌ కాలర్‌ ఉద్యోగాలకు అత్యున్నత చదువులతో పనిలేదు. ఇంటర్మీడియట్‌ పూర్తయి, పదిహేడేళ్లు నిండితే చాలు.. సర్కారు కొలువుల్లో దూసుకుపోవచ్చు! వీటిలో ఏటా క్రమం తప్పకుండా వెలువడుతోన్న నియామక ప్రకటనలే ఎక్కువ. అందువల్ల లక్ష్యంగా చేసుకుంటే విజయం సాధించవచ్చు. ఆరు నెలలకు ఒకసారి నియామకాలు జరిపే ఉద్యోగాలూ ఉన్నాయి. ఆసక్తి ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు; రైల్వే, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్, కోస్టు గార్డు మొదలైనవి ఎంచుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో.. పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్‌ శాఖ... ఉద్యోగాల్లో చేరవచ్చు.


ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడే.. అన్ని ఉద్యోగాల గురించీ తెలుసుకుని, స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ముందస్తు సన్నద్ధత ఆరంభిస్తే కోర్సు పూర్తయిన వెంటనే తక్కువ వ్యవధిలోనే ఉద్యోగం పొందవచ్చు. చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరినవాళ్లు అనుభవం, ప్రతిభతో త్వరగా ఉన్నత హోదాకు చేరుకోవచ్చు. ఇంటర్‌/ ప్లస్‌ 2 విద్యార్హతతో ఉన్న ఉద్యోగాలు రక్షణ రంగంలోనే ఎక్కువ. ఎంపీసీ విద్యార్థులైతే మేటి అవకాశాలు పొందవచ్చు. పోస్టును బట్టి శిక్షణ అనంతరం నెలకు రూ.50 వేల నుంచి లక్షకు పైగా వేతనం అందించే ఉద్యోగాలు కేంద్ర దళాల్లో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రంలోని ఇతర విభాగాల్లో ఉద్యోగాలు పొందేవారు సుమారు రూ.35 వేలు, ఆపైన జీతం పొందవచ్చు. అన్ని పరీక్షల్లోనూ.. ఆప్టిట్యూడ్, ఆంగ్ల పరిజ్ఞానం, జనరల్‌ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అందువల్ల ఈ విభాగాలపై పట్టు సాధించాలి. పరీక్ష ఏదైనప్పటికీ పోటీ ప్రపంచంలో ముందు నుంచీ సన్నద్ధమైనవారే తుది జాబితాలో నిలవడానికి అవకాశాలెక్కువని గుర్తుంచుకోవాలి.


 రక్షణ రంగంలో...

ఈ నియామకాలు అగ్నివీర్‌ పేరుతో చేపడుతున్నారు. అందులో ఎంపికై, నాలుగేళ్లు సేవలు అందించాలి. తర్వాత దశలో అవకాశం వచ్చినవారు శాశ్వత ఉద్యోగులుగా కొనసాగవచ్చు. 


ఎయిర్‌ ఫోర్స్‌: 

ఎయిర్‌ మెన్‌ విభాగంలో గ్రూప్‌ ఎక్స్, వై ట్రేడుల్లో పలు ఉద్యోగాలకు ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు పోటీ పడవచ్చు.

గ్రూప్‌ ఎక్స్‌: ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌ తప్ప మిగిలిన పోస్టులకు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆంగ్లంలో 50 శాతం మార్కులు ఉండాలి.   

గ్రూప్‌ వై: మెడికల్‌ అసిస్టెంట్, మ్యుజీషియన్‌ కాకుండా మిగిలినవాటికి ఏదైనా గ్రూపుతో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్‌లో 50 శాతం తప్పనిసరి. మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌ కోసం బైపీసీతో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. విడిగా ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరి. అన్ని పోస్టులకు నిర్దేశిత ఎత్తు, అందుకు తగ్గ బరువు అవసరం. వయసు 17 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. 

ప్రకటనలు: ఏడాదికి రెండుసార్లు వెలువడతాయి. పరీక్షలో ప్రతిభ, ఫిజికల్, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. గ్రూప్‌ ఎక్స్‌ విభాగంలో ఎంపికైనవారికి ఫిట్టర్, గ్రూప్‌ వై విభాగంలో చేరినవారికి టెక్నీషియన్‌ ట్రేడులు కేటాయిస్తారు. నాన్‌టెక్నికల్‌ ట్రేడుల్లో అకౌంట్‌ అసిస్టెంట్,   అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్, ఎయిర్‌ ఫోర్స్‌ పోలీస్, సెక్యూరిటీ అసిస్టెంట్‌...తదితర ఉద్యోగాలు ఉంటాయి. శాశ్వత ఉద్యోగంలో అవకాశం వచ్చినవారికి గ్రూప్‌ ఎక్స్‌ ట్రేడుల్లో రూ.33,100, గ్రూప్‌ వై ట్రేడులకు రూ.26,900 మూలవేతనం అందిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం. వీరు కెరియర్‌లో ఎయిర్‌ క్రాఫ్ట్స్‌మెన్‌ నుంచి మాస్టర్‌ వారంట్‌ ఆఫీసర్‌ వరకు చేరుకోవచ్చు. ప్రతిభావంతులు ఆఫీసర్‌ హోదా అందుకోవడానికీ అవకాశం ఉంది. 


ఆర్మీ: 

సోల్జర్‌ క్లర్క్, స్టోర్‌ కీపర్‌ పోస్టులకు మ్యాథ్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌లో 60 శాతం మార్కులు అవసరం. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 50 శాతం మార్కులు తప్పనిసరి. 

సోల్జర్‌ టెక్‌: ఎంపీసీ గ్రూపులో 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 40 శాతం మార్కులు ఉండాలి. 

సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌: బైపీసీలో 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత, ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులు ఉండాలి. వయసు పోస్టు బట్టి 17 నుంచి 21 లేదా 23 ఏళ్లలోపు ఉండాలి. 

ప్రకటనలు: ఏడాదికి రెండుసార్లు వెలువడతాయి. పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. శాశ్వత ఉద్యోగిగా అవకాశం వచ్చినవారికి రూ.21,700 మూలవేతనంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం. 


నేవీ:

భారతీయ నౌకాదళంలో ఆర్టిఫీషర్‌ అప్రెంటిస్, సీనియర్‌ సెకెండరీ రిక్రూట్‌ పోస్టులకు ఎంపీసీతో ఇంటర్‌ పూర్తికావాలి. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టు, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడతాయి. శాశ్వత కొలువుకు ఎంపికైనవారికి రూ.21,700 మూల వేతనం అందుతుంది. దీనికి మిలటరీ సర్వీస్‌ పే రూ.5200 అదనం. ఏఏకు ఎంపికైనవారు రూ.6200 గ్రూప్‌ ఎక్స్‌ పే కింద అదనంగా అందుకుంటారు. వీటన్నింటితోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఉంటాయి. వీరు మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ హోదా వరకు చేరుకుంటారు. 

కోస్టు గార్డు:

కోస్టు గార్డులో నేవిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులకు ఇంటర్‌ ఎంపీసీ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 50 శాతం మార్కులు ఉండాలి. 18 - 22 ఏళ్లలోపు వయసుండాలి. రాత పరీక్ష, పీఈటీ, మెడికల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఈ ప్రకటనలు ఏటా రెండుసార్లు వెలువడతాయి. వీరికి రూ.21,700 మూలవేతనం అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు అదనం. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదాకు చేరుకోవచ్చు. 


చదువుతోపాటు ఉద్యోగం..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ అండ్‌ నేవల్‌ అకాడెమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఎ) పరీక్షను మహిళలతోపాటు ఇంటర్‌ అన్ని గ్రూపులవారూ రాసుకోవచ్చు. ఎంపికైనవారు బీఏ, బీఎస్సీ, బీటెక్‌ కోర్సులను ఉచితంగా చదువుకోవచ్చు. శిక్షణ అనంతరం వీరిని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్సుల్లో లెవెల్‌ 10 హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. అలాగే ఆర్మీ 10+2 టెక్‌ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ పోస్టులకు ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఐటీ-జేఈఈ స్కోరు, ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు. వీరికి నిర్దేశిత బ్రాంచీల్లో బీటెక్‌ కోర్సు ఉచితంగా అందించి, శిక్షణ అనంతరం లెవెల్‌ 10 హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. 

ఈ మూడు ప్రకటనలూ ఏడాదికి రెండుసార్లు చొప్పున వెలువడతాయి. రక్షణ రంగంలో సత్తా చాటాలనుకున్నవారు ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్షలో విజయం సాధిస్తే అత్యున్నత హోదాను అందుకోవచ్చు. భవిష్యత్తులో వీరు త్రివిధ దళాలకు అధిపతీ కావచ్చు. ఇంటర్‌ బైపీసీతో ఆర్మీ నర్సింగ్‌ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసుకుని, లెఫ్టినెంట్‌గా సేవలు అందించే అవకాశం మహిళలకు కల్పించారు. 


స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా...

సీహెచ్‌ఎస్‌ఎల్‌: కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) పోస్టులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) దాదాపు ఏటా భర్తీ చేస్తుంది. ఎంపికైనవారు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఎ), పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విధులను నిర్వర్తించవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ, స్కిల్‌ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్‌ అన్ని గ్రూపులవారూ అర్హులే.


స్టెనోగ్రాఫర్‌: కేంద్రానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఎస్‌ఎస్‌సీ ఏడాది/రెండేళ్లకు ఒకసారి ప్రకటనలు విడుదలచేస్తోంది. ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం స్టెనో స్కిల్‌ టెస్టు ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే స్టెనోగ్రాఫర్‌గా విధులు నిర్వర్తించవచ్చు. వయసు పోస్టును బట్టి 18 నుంచి 27/30 ఏళ్లలోపు ఉండాలి. (ఈ ప్రకటన వెలువడింది. ఆగస్టు 23 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు)


రైల్వే విభాగంలో..

జూనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్, అకౌంట్స్‌ క్లర్క్‌ కం టైపిస్ట్, జూనియర్‌ టైం కీపర్, ట్రైన్స్‌ క్లర్క్, కమర్షియల్‌ కం టికెట్‌ క్లర్క్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. 18 నుంచి 30 ఏళ్లలోపువారు అర్హులు. ప్రకటనలు మూడేళ్లకు ఒకసారి ఆశించవచ్చు. కమర్షియల్‌ కం టికెట్‌ క్లర్క్‌ లెవెల్‌ 3 ఉద్యోగం. మిగిలినవన్నీ లెవెల్‌ 2 ఉద్యోగాలు. లెవెల్‌ 3కి 21,700; లెవెల్‌ 2 పోస్టులకు రూ.19,900 మూలవేతనం అందుతుంది. ఈ పోస్టులను రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్షల్లో చూపిన ప్రతిభతో భర్తీ చేస్తారు. పోస్టు బట్టి టైప్‌ లేదా స్కిల్‌ టెస్టు ఉంటుంది. పరీక్షను తెలుగులోనూ రాసుకోవచ్చు. 


రాష్ట్ర స్థాయిలో..

కానిస్టేబుల్, జైలు వార్డర్, ఫైర్‌మెన్‌: ఈ ఉద్యోగాలకు ఇంటర్‌ అన్ని గ్రూపులవారూ అర్హులే. పరీక్ష, ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు 18 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జైలు వార్డర్, ఫైర్‌ మెన్‌ పోస్టులకు 32 ఏళ్ల వయసు వరకు అవకాశం ఉంటుంది. మూడేళ్లకు ఒకసారి ప్రకటన ఆశించవచ్చు. ఎక్సైజ్‌ డిపార్టుమెంట్‌లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్‌ విద్యార్థులు పోటీ పడవచ్చు. 

ఫారెస్ట్‌ సబ్‌ సర్వీస్‌లో.. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పరీక్షలో చూపిన ప్రతిభ, నడకతో పోస్టులు భర్తీ చేస్తారు. ఇంటర్‌ అన్ని గ్రూపులవారికీ అవకాశం ఉంది. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రాంప్ట్‌ ఇంజినీర్‌.. కోట్లలో ప్యాకేజీ!

‣ 'క్యాట్‌ 2023' సన్నద్ధత ఇలా..

‣ 'పది' మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం

‣ తండ్రి కష్టం.. తనయ విజయం

‣ ఇంటర్‌తో కేంద్ర కొలువులు

‣ 'నాసా' మెచ్చిన కుర్రాడు!

Posted Date: 11-08-2023


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌