• facebook
  • whatsapp
  • telegram

నేరుగా మన ఇంటికి.. కోరుకున్న కోర్సులు

కారణాలు ఏవైనా... ఏటా వేలాదిమంది దూరవిద్యలో అడ్మిషన్లు తీసుకోడానికి మొగ్గు చూపుతున్నారు. రోజు రోజుకీ ఆదరణ పెరుగుతుండటంతో సాధారణ కోర్సులు సహా సంప్రదాయ సంస్థల్లో లేని ఎన్నో రకాల వైవిధ్య కోర్సులను డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో అందిస్తున్నారు. రెగ్యులర్‌ పట్టాలతో సమానంగా ఈ డిగ్రీలకూ ప్రాధాన్యం లభిస్తోంది. దీంతో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధి పనులు చేసుకుంటూ ఉన్నత విద్యను సాగిస్తున్నారు. అవకాశాలను మెరుగు పరుచుకుంటున్నారు. ఇంటర్మీడియట్‌ అర్హతతోనూ వివిధ కోర్సులు దూరవిద్యలో ఉన్నాయి.

కాలేజీకి వెళ్లి చదువుకునే అవకాశం అందరికీ ఉండకపోవచ్ఛు అనారోగ్యం, ఆర్థిక నేపథ్యం, ఆసక్తి లేకపోవడం...కారణాలు ఏమైనా.. చదువులకు ఇంటర్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన పనిలేదు. ఇంటి వద్దే ఉంటూ ఆసక్తి, అభిరుచి ప్రకారం విద్యాభ్యాసాన్ని కొనసాగించుకోవచ్ఛు ఇంటర్మీడియట్‌ అర్హతతో సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ కోర్సులను పలు విశ్వవిద్యాలయాలు దూరవిద్యలో అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు ఉద్యోగాలకు పోటీ పడవచ్ఛు ఉన్నత చదువులు కొనసాగించవచ్ఛు.


 

రెగ్యులర్‌తో సమానంగా!
డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ అనగానే కొద్దిగా చిన్నచూపు చూస్తుంటారు. ఈ డిగ్రీలు వచ్చినా పరిజ్ఞానం అంతగా ఉండదని ఆలోచిస్తుంటారు. కొన్ని నియామక సంస్థలూ ఇదే ధోరణని ప్రదర్శిస్తున్నాయి. కానీ అది వాస్తవం కాదు. ఇగ్నో, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సహా పలు ఇతర సంస్థలు ఇప్పుడు నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ అందిస్తున్నాయి. తమ స్టడీ సెంటర్లలో నిర్దేశిత రోజుల్లో ప్రభుత్వ సీనియర్‌ డిగ్రీ లెక్చరర్లతో కాంటాక్టు తరగతులూ నిర్వహిస్తున్నాయి. సందేహ నివృత్తికీ అవకాశం కల్పిస్తున్నాయి. విద్యార్థి ఏ యూనివర్సిటీలో చేరినప్పటికీ స్వయం పోర్టల్‌, స్వయంప్రభ ఛానళ్ల ద్వారా తమ సిలబస్‌ ప్రకారం పాఠాలు వినవచ్ఛు అందువల్ల పాఠాలు అర్థం కాకపోవడమనే పరిస్థితి లేదు. పరిజ్ఞానం ఉండదనే మాటకు చోటు లేదు. సైన్స్‌ విద్యార్థులకు ప్రయోగాల కోసం స్టడీ సెంటర్లలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. దీంతో దూరవిద్యలో చదివినవారు రెగ్యులర్‌ విధానంలో చదువుకున్నవారితో సమానంగా పోటీపడుతున్నారు. దూరవిద్యలో డిగ్రీకి విలువ ఉంటుందా అనే సందేహం చాలామందికి తలెత్తుతుంది. కానీ యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ తదితర పరీక్షలు మొదలు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, బ్యాంకులు, రైల్వేలు, పోలీసు, రాష్ట్రస్థాయిలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 సహా పలు ఉద్యోగ పరీక్షలకు ఈ పట్టాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఏడాదికి రెండు సార్లు... 
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, ఉస్మానియా, శ్రీవేంకటేశ్వర, ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణ దేవరాయ తదితర అన్ని విశ్వవిద్యాలయాలూ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన వారికి దూరవిద్యలో కోర్సులను అందిస్తున్నాయి. ప్రవేశ ప్రకటనలు జులై/ ఆగస్టుల్లో వెలువడతాయి. రెగ్యులర్‌ విధానంలో కళాశాలల్లో ప్రవేశాలు ఏడాదికి ఒకసారే ఉంటాయి. దూరవిద్యలో మాత్రం అడ్మిషన్లు రెండుసార్లు లభిస్తాయి. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పలు సంస్థలు జనవరి, జులై సెషన్లలో ప్రవేశాలకు ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. జులై సెషన్‌లో చేరినవారు రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా అకడమిక్‌ సంవత్సరం వృథా కాకుండా డిగ్రీ పూర్తిచేసుకోవచ్ఛు ఏ కారణంతోనైనా జులైలో వీలుపడనివారు, సప్లిమెంటరీలో పాసైన అభ్యర్థులు మరో ఏడాది వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా జనవరి సెషన్‌లో చేరవచ్ఛు.

సర్టిఫికెట్‌ కోర్సులు: డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, ఎన్జీవో మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ స్కిల్స్‌, ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌, హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌, హెల్త్‌కేర్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం స్టడీస్‌, న్యూట్రిషన్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌, పౌల్ట్రీ ఫార్మింగ్‌, హ్యూమన్‌ రైట్స్‌, కన్సూమర్‌ ప్రొటెక్షన్‌, ఇంటర్నేషనల్‌ హ్యుమానిటేరియన్‌ లా, కమ్యూనికేషన్‌ అండ్‌ ఐటీ స్కిల్స్‌, వాల్యూ ఎడ్యుకేషన్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లైఫ్‌ అండ్‌ థాట్‌ ఆఫ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ట్రైబల్‌ స్టడీస్‌, జపనీస్‌ లాంగ్వేజ్‌, కొరియన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చర్‌, స్పానిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చర్‌, జర్మన్‌ లాంగ్వేజ్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, జనరల్‌ డ్యూటీ అసిస్టెన్స్‌, జెరియాట్రిక్‌ కేర్‌ అసిస్టెన్స్‌, ఫ్లెబోటమీ అసిస్టెన్స్‌, హోం హెల్త్‌ అసిస్టెన్స్‌, పర్షియన్‌ లాంగ్వేజ్‌, యోగా, పీస్‌ స్టడీస్‌ అండ్‌ కన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం ఆన్‌ జీఎస్టీ.

డిప్లొమాలు: ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌, పంచాయత్‌ లెవెల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, టూరిజం స్టడీస్‌, ఆక్వా కల్చర్‌, క్రియేటివ్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్‌, ఉమెన్స్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, పారా లీగల్‌ ప్రాక్టీస్‌, వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ ఫ్రం ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌, ప్రొడక్షన్‌ ఆఫ్‌ వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ ఫ్రం సెరియల్స్‌, పల్సెస్‌, ఆయిల్‌ సీడ్స్‌; ఫిష్‌ ప్రొడక్ట్స్‌ టెక్నాలజీ, వాటర్‌ షెడ్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌, మోడరన్‌ ఆఫీస్‌ ప్రాక్టీస్‌, మీట్‌ టెక్నాలజీ. డిప్లొమా ఇన్‌ డెయిరీ టెక్నాలజీ కోర్సును తెలుగు మాధ్యమంలో ఇగ్నో అందిస్తోంది.

డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌): యాక్సెంచర్‌ సంస్థతో కలిసి ఇగ్నో ఈ కోర్సు అందిస్తోంది. ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ అంశాలు, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌, ఐటీ స్కిల్స్‌లో మెలకువలు నేర్పుతారు. 50 శాతం మార్కులతో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్ఛు  కోర్సు వ్యవధి ఏడాది. ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. ఫీజు రూ.19,200.

బీబీఏ సర్వీసెస్‌ మేనేజ్‌మెంట్‌: దీన్ని మహారాష్ట్ర నాలెడ్జ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో కలిసి అందిస్తోంది. వ్యవధి మూడేళ్లు. ఫీజు ఏడాదికి రూ.20,000. సేవా రంగంలో ప్రారంభస్థాయి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పుతారు.

డిగ్రీ: బీఏ టూరిజం స్టడీస్‌, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ, అందుబాటులో ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌ (టూరిజం మేనేజ్‌మెంట్‌) కోర్సులను ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌) విధానంలో నిర్వహిస్తోంది. సీబీసీఎస్‌ ఆనర్స్‌ విధానంలో బీఏ- ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, ఇంగ్లిష్‌, హిందీ; బీఎస్సీ- ఆంత్రోపాలజీ కోర్సులను చదువుకోవచ్ఛు.

డిప్లొమా ఇన్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌: కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామిక విభాగాలు తమ బ్రాండ్‌ ప్రమోషన్‌, ప్రొడక్ట్‌ లాంచింగ్‌, ఆడియో ఫంక్షన్‌ వంటి కార్యక్రమాలకూ, ఇళ్లలో వేడుకలకూ ఈవెంట్‌ నిర్వాహకులపైనే ఆధారపడుతున్నారు. ఇగ్నో అందించే ఈ కోర్సు పూర్తిచేస్తే ఈవెంట్‌ సంస్థలో ఉద్యోగంలో చేరవచ్ఛు సొంతంగా ఈవెంట్స్‌ నిర్వహించుకోవచ్ఛు

ఒకటే సిట్టింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహించే పరీక్షలకు అనుమతించడం లేదు బీటెక్‌, ఎల్‌ఎల్‌బీ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులను దూరవిద్యలో చదువుకునే అవకాశం లేదు.

తక్కువ ఫీజులతో ఇగ్నో కోర్సులు
దూరవిద్య అనగానే వెంటనే గుర్తుకువచ్చేది ఇగ్నో. కోర్సుల్లో నాణ్యత, అందుబాటులో స్టడీ సెంటర్లు, తక్కువ ఫీజు మొదలైన కారణాలతో ఎక్కువమంది ఇగ్నోలో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటర్‌ విద్యార్హతతో ఆరు నెలల సర్టిఫికెట్‌, ఏడాది డిప్లొమా, మూడేళ్ల డిగ్రీ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో... 
బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు దూరవిద్య కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందించే కోర్సుల్లో చేరుతున్నారు. ఇక్కడ ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారి కోసం వివిధ సబ్జెక్టుల కాంబినేషన్‌తో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులను నిర్వహిస్తున్నారు.
ఆర్ట్స్‌ కోర్సులు: తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం; సోషల్‌ సైన్సెస్‌ (సామాజిక శాస్త్రాలు): అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతిశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం, ప్రభుత్వ పాలనశాస్త్రం, సమాజశాస్త్రం, జర్నలిజం.
విజ్ఞానశాస్తాల్రు (సైన్స్‌): వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, భూగర్భశాస్త్రం; వాణిజ్యశాస్త్రం. కామర్స్‌. కోర్సులను ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఏటా జనవరి, జులై నెలల్లో ప్రకటనలు వస్తాయి. 

ఆంధ్రా యూనివర్సిటీ 
ఇంటర్‌ విద్యార్హతతో బీఏ, బీకామ్‌, బీఎస్సీలను పలు కాంబినేషన్లతో ఇవ్వడంతోపాటు వివిధ సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులను అందిస్తున్నారు. ప్రకటన జులైలో వస్తుంది.
సర్టిఫికెట్‌ కోర్సులు: ఆఫీస్‌ ఆటోమేషన్‌ అండ్‌ అకౌంటింగ్‌, ఆఫీస్‌ ఆటోమేషన్‌ అండ్‌ మల్టీమీడియా టెక్నాలజీస్‌, ఆఫీస్‌ ఆటోమేషన్‌ అండ్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీస్‌లను ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. వ్యవధి ఏడాది.
డిప్లొమా కోర్సులు: మ్యూజిక్‌. వ్యవధి రెండేళ్లు. స్పోకన్‌ హిందీ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ 6 నెలలు.

 

ఉస్మానియా యూనివర్సిటీ
బీఏలో వైవిధ్యమైన సబ్జెక్టు కాంబినేషన్లు కోరుకునేవారు ఓయూలో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్ఛు. ప్రకటన: జులైలో. https://www.oucde.net/

ఆచార్య నాగార్జున వర్సిటీ
ఎకనామిక్స్‌, బ్యాంకింగ్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కాంబినేషన్‌తో బీఏ కోర్సులను అందిస్తోంది. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు పలు సబ్జెక్టులతో అందుబాటులో ఉన్నాయి.

 

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ
బీఏ కర్ణాటక మ్యూజిక్‌, బీఏ స్పెషల్‌ తెలుగు వంటి వివిధ కోర్సులను అందిస్తోంది.

ఇంకా ఎస్‌వీయూ, ఎస్‌కేయూ తదితరాలతోపాటు ప్రైవేటు సంస్థలూ దూరవిద్యలో ఎన్నో కోర్సులను ఇంటర్‌ అర్హతతో నిర్వహిస్తున్నాయి.

Posted Date: 19-10-2020


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌