• facebook
  • whatsapp
  • telegram

డీఈఈసెట్‌కి సిద్ధమేనా?

ఇంటర్‌తోనే బోధన వృత్తిలోకి దారి 

 

 

యువతరం కలల కొలువుల్లో బోధన (టీచింగ్‌) ముందు వరుసలో ఉంటుంది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంపై ఆసక్తి ఉన్నవారు ప్రాథమిక విద్యలో డిప్లొమా కోర్సు పూర్తిచేసుకోవడం ద్వారా తమ ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చు. ఇంటర్‌ పాసైతే చాలు ఈ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల ఏపీ డీఈఈసెట్‌ ప్రకటన వెలువడింది. పరీక్షలో ప్రతిభ చూపినవారికి అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో డైట్‌లు, ప్రైవేటు సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి.

 

చిన్న వయసులోనే స్థిరమైన కెరియర్‌కు డీఎడ్‌ కోర్సు దారిచూపుతుంది. దీన్ని తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, తమిళం మాధ్యమాల్లో అందిస్తున్నారు. ఇంటర్‌లో చదివిన గ్రూప్, పరీక్ష రాయడానికి ఎంచుకున్న మాధ్యమం ప్రకారం డీఎడ్‌ కోర్సును సంబంధిత భాషలో పూర్తి చేసుకోవచ్చు. డీఈఈ సెట్‌లో సాధించిన మార్కులు, రిజర్వేషన్లు అనుసరించి సీట్ల కేటాయింపులు ఉంటాయి. ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో డైట్‌లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా ఎయిడెడ్, మైనార్టీ, ప్రైవేటు సంస్థలు డీఎడ్‌ కోర్సు అందిస్తున్నాయి. వీటిలో ఎక్కడ చేరాలన్నా డీఈఈసెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కనీస అర్హత మార్కులు 35 పొందాలి. ఎస్సీ, ఎస్టీలైతే 25 సరిపోతాయి. 85 శాతం సీట్లు స్థానికులతో భర్తీ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు అందరూ పోటీపడవచ్చు. సీట్ల కేటాయింపు కౌన్సెలింగ్‌ ద్వారా ఉంటుంది. ప్రభుత్వ డైట్లలో వంద శాతం, మిగిలిన సంస్థల్లో 80 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో కేటగిరీ ఎ కింద భర్తీ చేస్తారు. ప్రైవేటు, మైనార్టీ సంస్థల్లో 20 శాతం సీట్లు కేటగిరీ బీలో భర్తీ అవుతాయి. రెండేళ్ల డీఎడ్‌ కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు ప్రాథమిక పాఠశాలల్లో బోధనకు అర్హత పొందుతారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సేవలందించడానికి ప్రకటన వెలువడినప్పుడు ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

 

పరీక్ష ఇలా... 

వంద మార్కుల ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్‌ ఏలో 60, పార్ట్‌ బీలో 40 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పార్ట్‌ ఏలో టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 5, జనరల్‌ నాలెడ్జ్‌ 5, ఇంగ్లిష్‌ 5, తెలుగు 5, ఆప్షనల్‌ లాంగ్వేజ్‌ (తెలుగు, ఇంగ్లిష్, తమిళం, ఉర్దూల్లో అభ్యర్థి ఎంచుకున్నది) 10, మ్యాథ్స్‌ 10, జనరల్‌ సైన్స్‌ 10, సోషల్‌ స్టడీస్‌ 10 ప్రశ్నలు వస్తాయి. సబ్జెక్టు, లాంగ్వేజ్‌ ప్రశ్నలన్నీ రాష్ట్రస్థాయిలో 6 నుంచి పదో తరగతి సిలబస్‌లో ఉన్న అంశాల నుంచే అడుగుతారు. పార్ట్‌ బీ.. అభ్యర్థి ఇంటర్‌లో చదివిన గ్రూపు, ఎంచుకున్న విభాగం బట్టి మారుతుంది. మ్యాథ్స్‌/ ఫిజికల్‌ సైన్స్‌/ బయాలజీ/ సోషల్‌ స్టడీస్‌లో 40 ప్రశ్నలు ఇంటర్‌ సిలబస్‌ నుంచి వస్తాయి. మ్యాథ్స్‌ తీసుకున్నవారికి మొదటి ఏడాది నుంచి 20, రెండో సంవత్సరం సిలబస్‌ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. ఫిజికల్‌ సైన్స్‌ ఎంచుకుంటే ఫిజిక్స్‌ నుంచి 20, కెమిస్ట్రీ 20 ప్రశ్నలు అడుగుతారు. బయాలజీ వారికి బోటనీ 20, జువాలజీ 20 ప్రశ్నలు ఉంటాయి. సోషల్‌ స్టడీస్‌లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌ ఒక్కో సబ్జెక్టు నుంచి 13 లేదా 14 ప్రశ్నలు చొప్పున మొత్తం 40 వస్తాయి. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, తమిళం, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. వీటిలో అభ్యర్థి నచ్చిన మాధ్యమం ఎంచుకోవచ్చు.

 

సీట్ల కేటాయింపు: ఇంటర్‌లో చదివిన గ్రూపుల వారీ డైట్లలో సీట్లు కేటాయిస్తారు. మ్యాథ్స్, ఫిజికల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్, సోషల్‌ స్టడీస్‌ ఒక్కో విభాగానికి 25 శాతం చొప్పున సీట్లు లభిస్తాయి. మ్యాథ్స్, ఫిజికల్‌ సైన్స్‌ సీట్లకు ఎంపీసీ; బయలాజికల్‌ సైన్స్‌ సీట్లకు బైపీసీ, సోషల్‌ స్టడీస్‌ సీట్లకు సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల వారు పోటీపడవచ్చు. 

అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం సరిపోతాయి. ఒకేషనల్‌ విద్యార్థులు అనర్హులు.

వయసు: సెప్టెంబరు 1 నాటికి కనీసం 17 ఏళ్లు నిండాలి. గరిష్ఠ వయసు నిబంధన లేదు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అక్టోబరు 15 వరకు స్వీకరిస్తారు. అయితే అక్టోబరు 14లోగా పరీక్ష ఫీజు రూ.600 ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. 

పరీక్షలు: అక్టోబరు 26, 27 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 

వెబ్‌సైట్‌: https://apdeecet.apcfss.in/
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వైద్య రంగంలో విలువైన కెరియర్‌

‣ ముచ్చటగా మూడోసారి!

Posted Date: 12-10-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌