• facebook
  • whatsapp
  • telegram

వేరే దారిలో వెళ్తారా?

చాలామంది భవిష్యత్‌ కెరియర్‌ నిర్ణయంతోనే ఇంటర్‌లో బ్రాంచిని ఎంపిక చేసుకుంటారు. బ్యాచిలర్‌ స్థాయి కోర్సులైన ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, సీఏ లేదా డిగ్రీ.. వీటి ఆధారంగానే ఎక్కువమంది నిర్ణయం తీసేసుకుంటారు. అందుకు తగ్గట్టుగానే విపరీతమైన పోటీ ఉంటుంది. ఇలా సంప్రదాయ మార్గం కాకుండా భిన్నంగా ప్రయత్నించాలనుకునేవారికీ ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నలుగురితోపాటు కాకుండా భిన్నంగా కెరియర్‌ ఎంచుకోవాలనుకునేవారు వీటిని ప్రయత్నించవచ్చు.

ఇంటర్‌ తర్వాత కెరియర్‌ ఎంచుకోవడం, నాలుగు రోడ్ల కూడలిలో నిల్చోవడం లాంటిదే. ఎక్కువమంది ఎంచుకుంటున్న దాన్ని ఎంచుకోవాలా? లేదా ప్రస్తుత ట్రెండ్‌ ఆధారంగా ఎంచుకోవాలా? చాలామంది విద్యార్థుల ఆలోచన దీని చుట్టే తిరుగుతుంటుంది. నిజానికి గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రంగాల్లో తీవ్రమైన పోటీ ఉంది. దీంతో ఒక నిలకడైన ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి కేవలం డిగ్రీ సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు పోటీ, పరిశ్రమ అవసరాలపై అనిశ్చితిని ఎదుర్కోవడం కొంత కష్టంతో కూడుకున్న పని. ఇలా కాకుండా నేరుగా డిగ్రీతో తక్కువ పోటీతో కొలువు మార్గం సులువు చేసుకోవాలనుకునేవారికి సంప్రదాయేతర కోర్సులు మార్గం. ఇవి నలుగురిలో ప్రత్యేకంగా నిలపడమే కాదు. ఉపాధి అవకాశాలనూ మెరుగుపరుస్తాయి. అలాంటి వాటిలో కొన్ని..

జెమాలజీ
సహజ, కృత్రిమ జెమ్స్, జెమ్‌స్టోన్స్‌కు సంబంధించిన శాస్త్రం ఇది. మన సంస్కృతిలో వీటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆభరణాల్లోనూ ఉపయోగిస్తారు. సుశిక్షితులైన జెమాలజిస్టులు వీటిని గుర్తించడం, విలువను అంచనావేయడం వంటివి చేస్తారు. వివిధ రాళ్ల అంతర్గత, బాహ్య నిర్మాణాలను పరిశీలించడం, అందుకు వివిధ పద్ధతులను ఎంచుకోవడం వంటివి చేస్తుంటారు. అవసరాలకు అనుగుణంగా కటింగ్, మాన్యుఫాక్చరింగ్, పాలిషింగ్‌ వంటివి చేస్తారు. ఈ అంశాల్లో వివిధ కోర్సులు వీరిని సుశిక్షితులుగా తీర్చిదిద్దుతాయి.
డిప్లొమా (డైమండ్‌ ప్రాసెసింగ్, జెమాలజీ), డిగ్రీ (బీఎఫ్‌ఏ, బీఎస్‌సీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. మెరిట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఇంటర్‌ ఏ గ్రూపువారైనా అర్హులే. వీరికి జెమ్‌ టెస్టింగ్‌ పరిశ్రలు, జ్యూలరీ తయారీ సంస్థలు మొదలైన వాటిల్లో అవకాశాలుంటాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
వోగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, బెంగళూరు
‣ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెమాలజీ, దిల్లీ
జెమలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సౌత్‌ఈస్ట్, దిల్లీ
సెయింట్‌ జేవియర్‌ కాలేజ్, మహారాష్ట్ర
జ్యూలరీ డిజైన్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్, నోయిడా
జెమాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ముంబయి
ఎన్‌ఐడీ, అహ్మదాబాద్‌ మొదలైనవి.

యోగా
హడావిడి జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో అందరి చూపూ శారీరక, మానసిక ఆరోగ్యంవైపునకు మళ్లుతున్నాయి. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నవాటిలో యోగా ఒకటి. ఇది కేవలం ఆసనాలకే పరిమితం కాదు. భౌతిక, మానసిక అంశాలతో కూడుకున్నది. భావోద్వేగాల నియంత్రణకూ ఇది సాయపడుతోంది. కోర్సుల్లో భాగంగా స్థిరమైన ఆరోగ్యాన్ని యోగా ద్వారా ఎలా సాధించొచ్చో నేర్చుకుంటారు.
డిప్లొమా (యోగా సైన్సెస్, యోగా), బీఎస్‌సీ (యోగా సైన్సెస్‌), బీఎస్‌సీ యోగా, బీఎస్‌సీ యోగా థెరపీ, బీఏ యోగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌ దేనితో పూర్తిచేసినవారైనా అర్హులే. డిగ్రీ కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. డిప్లొమాలకు ఏడాది నుంచి రెండేళ్లు. కొన్ని సంస్థలు ప్రవేశపరీక్షలతో ప్రవేశాలు కల్పిస్తుండగా, కొన్ని మెరిట్‌ ఆధారంగా కల్పిస్తున్నాయి. వీరికి హెల్త్‌ క్లబ్‌లు, యోగా అండ్‌ పైలేట్స్‌ స్టూడియోలు, స్పెషల్‌ నీడ్‌ సెంటర్లు, ప్రైవేటు జిమ్‌ల్లో శిక్షకులుగా అవకాశాలుంటాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ
పద్మావతి యూనివర్సిటీ, తిరుపతి
మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా
ఎస్‌ వ్యాసా (స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన), బెంగళూరు
ఎన్‌ఐపీఎస్, న్యూదిల్లీ నీ కురుక్షేత్ర యూనివర్సిటీ.

స్పోర్ట్స్‌ కోచింగ్‌
ఆటను, ఆటగాళ్లు ఆడే తీరును భిన్నంగా అంచనా వేసేవారే స్పోర్ట్స్‌ కోచ్‌లు. ఆడేది ఆటగాళ్లే అయినా బయటి నుంచి కావాల్సిన తోడ్పాటు, ప్రణాళిక వంటి అంశాలన్నింటిపై దృష్టిపెట్టేదీ, ప్రోత్సహించేదీ కోచ్‌లే. శారీరకంగానే కాకుండా మానసికంగానూ అవసరమైన శిక్షణనిస్తారు. స్పెషలైజ్‌డ్‌ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. వీటిని నచ్చిన ఆట ద్వారా ఎంచుకోవచ్చు. అయితే ఆటల్లో ప్రావీణ్యం ఉండటం మాత్రం తప్పసరి అర్హత.
ఇంటర్‌ వారికి డిప్లొమా (స్పోర్ట్స్‌ కోచింగ్, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌), డిగ్రీ (బీఎస్‌సీ- స్పోర్ట్స్‌ కోచింగ్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, బీఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సులకు ఏడాది నుంచి రెండేళ్లు. డిగ్రీ కోర్సులకు మూడు- నాలుగేళ్లు. కొన్ని సంస్థలు మెరిట్, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మరికొన్ని అకడమిక్, ఆటల్లో నైపుణ్యాల ఆధారంగా ప్రవేశాలు అందిస్తున్నాయి. ఇంటర్‌ ఏ బ్రాంచి వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, న్యూదిల్లీ, మణిపూర్‌
లూథియానా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ
స్వర్ణిమ్‌ గుజరాత్‌ యూనివర్సిటీ
ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సైన్స్, న్యూదిల్లీ మొదలైనవి.

ఫైర్‌ అండ్‌ సేఫ్టీ
ఇళ్లలో చిన్న తప్పిదాలు, పరిశ్రమల్లో రసాయనాలు, విపరీతమైన ఎండలు.. ఇలా ఎన్నో కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. వాటిని నివారించడానికి నిపుణులు అవసరమవుతుంటారు. మంటలను అదుపులోకి తేవడంతోపాటు వాటిలో చిక్కుకున్నవారిని రక్షిస్తుంటారు. అందుకు విభిన్న పరికరాలు, పద్ధతులను ఉపయోగిస్తుంటారు. సంబంధిత కోర్సులను చేయడం ద్వారా నైపుణ్యాలను చేజిక్కించుకోవచ్చు. ఫైర్, ఫైర్‌ ఫైటింగ్, ఫైర్‌ ప్రివెన్షన్, ఫైర్‌ ఫైటింగ్‌ ఎక్విప్‌మెంట్, కమ్యూనికేషన్స్‌ సిస్టమ్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైన అంశాలను కోర్సుల్లో భాగంగా చదువుతారు.
ఇంటర్‌ వారికి డిప్లొమా (ఫైర్‌ అండ్‌ సేఫ్టీ టెక్నాలజీ, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌), డిగ్రీలో (బీఎస్‌సీ, బీటెక్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సుల కాలవ్యవధి ఒకటి నుంచి ఒకటిన్నరేళ్లు వీటికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్‌సీ కోర్సులకు మూడేళ్లు, బీటెక్‌కు నాలుగేళ్లు. వీటికి ఇంటర్‌లో సైన్స్‌ కోర్సులను చదివినవారు అర్హులు. మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలుంటాయి. కొన్ని సంస్థలు ప్రవేశపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
గురుకుల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ, దిల్లీ
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్, నాగ్‌పుర్‌
కేఏపీఎస్, ఆంధ్రప్రదేశ్‌
ఐసీఎఫ్‌ఎస్, లోథా మొదలైనవి.

ఇంకా.. కళలపై ఆసక్తి ఉన్నవారికి ఫైన్‌ ఆర్ట్స్, విదేశీ భాషలకు ఫారిన్‌ లాంగ్వేజెస్, కమ్యూనికేషన్‌ సంబంధిత అంశాలపై ఆసక్తి ఉన్నవారికి కమ్యూనికేషన్‌ డిజైన్, వర్చువల్‌ గేమింగ్‌ వారికి గేమింగ్, పర్యావరణంపై ఆసక్తి ఉన్నవారికి ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, వేడుకలూ, వాటి నిర్వహణపై ఆసక్తి ఉన్నవారికి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిమేరకు విద్యార్థులు ఎంచుకోవచ్చు.

Posted Date: 20-10-2020


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌