• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌లో - ఈఐఈ

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ప్ర‌త్యేక కోర్సు

ఇంజినీరింగ్‌ విద్యలో ఎలక్ట్రానిక్స్‌ అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఈసీఈ, ఈఈఈ. ఇవి రెండే కాకుండా ఈఐఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌) కూడా చదవవచ్చు. దీనిలో 40-60 శాతం సబ్జెక్టులు ఈసీఈ విద్యార్థులూ చదివేవే అయినా ఇది ప్రత్యేక కోర్సు. ఐటీ మాదిరే ఇన్‌స్ట్రుమెంటేషన్‌ కూడా అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధించిన తయారీ/ ఉత్పాదన ప్రక్రియలో తప్పనిసరి అవసరం. ఈఐఈ కోర్సులో బి.టెక్‌. చదివే విద్యార్థులు ఈసీఈ విద్యార్థుల్లాగా ఎలక్ట్రానిక్స్‌ రంగంలో, మెకానికల్‌ విద్యార్థుల్లాగా ఇన్‌స్ట్రుమెంటేషన్‌ రంగంలో, కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లాగా పారిశ్రామిక ప్రక్రియా నియంత్రణ రంగంలోనూ రాణించగలరు.

పారిశ్రామిక ప్రక్రియలను నియంత్రిస్తూ ఉత్పాదన లేదా తయారీ సరైన క్రమంలో సాగేలా చూడటం ఇన్‌స్ట్రుమెంటేషన్‌గా చెప్పుకోవచ్చు. ఇళ్లల్లో కనిపించే వాషింగ్‌ మెషీన్, ఏసీ, గీజర్, మైక్రోవేవ్‌ అవెన్, ఇన్‌డక్షన్‌ స్టవ్‌ లాంటి గృహోపకరణాల్లో జనాదరణ పొందిన  ఆటో కట్‌-ఆఫ్‌ వంటి ఫీచర్లు ఇన్‌స్ట్రుమెంటేషన్‌ వల్లనే సాధ్యం. ఈ మధ్యనే పెరిగిన ్డస్మార్ట్‌ గృహోపకరణాలు, వాహనాలు వంటివన్నీ కూడా ఈ ఇంజినీరింగ్‌ వలన లబ్ధి పొందుతున్న రంగాలే. పారిశ్రామిక విప్లవం 4.0 గా అభివర్ణిస్తున్న ఈ కాలంలో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పాత్ర అడుగడుగునా కనిపిస్తుంది. 

ఈఐఈ విద్యార్థులు బీటెక్‌ తర్వాత ఐఐటీల్లోనూ, ఐఐఎస్సీలోనూ కలిపి 20 విభాగాలకు పైగానే ఎంటెక్‌ కోర్సులు చేసే అవకాశముంది. ఎన్‌ఐటీలో, ఇతర విశ్వవిద్యాలయాల్లో మరిన్ని విద్యావకాశాలున్నాయి. కంట్రోల్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్, రోబోటిక్స్, ప్రాసెస్‌ కంట్రోల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్, బయోమెడికల్‌ ఇంజినీరింగ్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ, ఇమేజ్‌ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, వైర్‌లెస్‌ సెన్సార్‌ నెట్‌వర్క్స్‌- ఇవన్నీ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఎక్కువగా ఎంచుకుంటున్న ఉన్నతవిద్యా మార్గాలు. విదేశాలకు వెళ్ళదలచుకుంటే పైన పేర్కొన్నవే కాక ఇంజినీరింగ్‌ ఫిజిక్స్, ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్, నానోటెక్నాలజీ, డేటా ఎనలిటిక్స్‌ వంటి రంగాల్లోనూ విస్తృత విద్యావకాశాలున్నాయి. జర్మనీ, స్వీడెన్, నెదర్‌ల్యాండ్స్, యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో ఈ విద్యార్థులకు మంచి భవిష్యత్తుంది. ఆయా దేశాలలోనే ఉన్నతవిద్య, ఉద్యోగాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఐఓటీకి మూలాధారం! 

చరవాణి సహాయంతో వ్యవసాయక్షేత్రంలో మోటార్లను నియంత్రించటం లాంటివి ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్ల ప్రాజెక్టులుగా దశాబ్దానికి పైగా ఉన్నవే. నేడు ఐఓటీ పేర వినవస్తున్న సాంకేతికత మౌలికంగా ఇదే. కరోనావైరస్‌ విజృంభించిన ఈ కాలంలో ఎక్కడెక్కడి పనులనూ ఇంటి నుంచే నియంత్రించే అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సాంకేతికతల అవకాశంతో ఐఓటీ  తోడుగా మరిన్ని ఆవిష్కరణలకు అవకాశాలు పెరిగాయి. సుదూరప్రాంతం నుంచే వైద్యసహాయాన్ని అందించగల టెలి మెడిసిన్‌ కూడా ఐఓటీ సాంకేతికత ద్వారా కొత్త పుంతలు తొక్కుతోంది. 

ఈఐఈ బ్రాంచిలో బయోమెడికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఒక పాఠ్యాంశంగా ఉన్న కారణంగా శరీరశాస్త్రం, నాడీవ్యవస్థ వంటి జీవశాస్త్ర సంబంధ విషయాలతో కాస్తయినా పరిచయముండే అవకాశం బి.టెక్‌. సమయంలో ఈఐఈ విద్యార్థులకే ఉంటుంది. జీవౌషధ రంగంలో వివిధ సెన్సార్ల అవసరం, నాడీమండలాన్ని పోలిన నియంత్రణ వ్యవస్థ ద్వారా శారీరక విధుల నిర్వహణ, పని చేయని అవయవాల స్థానే కృత్రిమ అవయవాల రూపకల్పన వంటి అంశాలన్నీ మౌలికంగా ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు పాఠ్యాంశాలుగా చదువుకునే అంశాలే. 

Posted Date: 16-08-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌