• facebook
  • whatsapp
  • telegram

ఆకాశమే హద్దుగా... 

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌

ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌

ఏరోస్పేస్‌ టెక్నాలజీలు అపార ఉపాధి అవకాశాలకు గనులుగా మారుతున్నాయి. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిలో కొద్ది ఏళ్లుగా ఉద్యోగాలు బాగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా విమానయాన శాఖల ప్రైవేటీకరణ, డిఫెన్స్‌ వ్యవస్థల్లో ప్రైవేటు రంగం పాల్గొనడానికి ప్రభుత్వాల అనుమతి, అంతరిక్ష శాఖల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశం లాంటివి ఈ రంగంలో కొలువుల సృష్టికి వీలు కల్పిస్తున్నాయి. వీటికి అదనంగా- విమాన వ్యవస్థల ఆధునికీకరణ, కంప్యూటరీకరణ, ఎలక్ట్రానిక్‌ వ్యవస్థల ద్వారా నియంత్రీకరణ వంటి కొత్త పుంతల వల్ల నూతన ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి!  

ఏరోస్పేస్‌ రంగంలో దైనందిన నిర్వహణ నుంచి మొదలుకుని పరిశోధన, అభివృద్ధి వరకు ఎన్నో అవకాశాలు ఉండబోతున్నాయి. ఏరోస్పేస్‌ డిజైనర్, ఏర్‌క్రాఫ్ట్‌ ప్రొడక్షన్‌ ఇంజినీర్, మెకానిక్‌ డిజైన్‌ ఇంజినీర్, టెక్నికల్‌ ఆఫీసర్, మెయింటెనెన్స్‌ ఇంజినీర్, ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ కొలువులు కొన్ని. 

అనుబంధ బ్రాంచిలకు సంబంధించి- కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్, మెటీరియల్స్‌ ఇంజినీర్, ఇండస్ట్రియల్‌ ఇంజినీర్‌ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 

సంస్థల విషయానికి వస్తే వైమానిక దళం, నౌకాదళం, ఇస్రో, డీ…ఆర్‌డీ…ఓ, హెచ్‌ఏఎల్, ఎన్‌ఏఎల్, విమానయాన శాఖల్లాంటి ప్రభుత్వ రంగాలతోపాటు హనీవెల్, లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఇండియా, డెల్టా, ఏర్‌బస్, బోయింగ్, రోల్స్‌ రాయిస్, జీఈ ఏవియేషన్, టాటా, ఎల్‌ అండ్‌ టీ, మహీంద్ర మొదలైన ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థల్లో అద్భుత అవకాశాలు ఉంటున్నాయి.   

ఏ కోర్సులున్నాయి?

ఏరోస్పేస్‌ సైన్స్, అభివృద్ధికి సంబంధించి ఇంజినీరింగ్‌ స్థాయిలో ప్రధానంగా రెండు కోర్సులున్నాయి- ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్, ఏవియానిక్స్‌ ఇంజినీరింగ్‌. 

ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ అనేది విమానాల, అంతరిక్ష నౌకల, ఉపగ్రహాల, క్షిపణుల రచన, నిర్మాణ, నిర్వహణలకు సంబంధించిన కోర్సు. దీనిలో రెండు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

1) విమానయాన శాస్త్రం (ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌) 

2) వ్యోమయాన శాస్త్రం (ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌)

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో విమానాలు, చోదన వ్యవస్థల రచన, నిర్మాణం, విమానాల వ్యోమగతి పనిచేసే విధానం వంటి అంశాలపై అధ్యయనం కేంద్రీకృతమై ఉంటుంది. ఈ రంగం భూవాతావరణంలో  వ్యవస్థల సూత్రాల, టెక్నాలజీల అభివృద్ధికి కృషి చేస్తుంది. 

ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌ భూవాతావరణంతోపాటు ఆవల ఉన్న అంతరిక్షంలో యంత్ర వ్యవస్థల శాస్త్ర విజ్ఞాన అధ్యయనం, అభివృద్ధికి సంబంధించినది. భూవాతావరణానికి దగ్గరగా పనిచేసే క్యూబ్‌సాట్‌లు, అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాల గురించి కూడా ఈ విభాగంలో చదువుతారు.  

ఈ రెండు కోర్సులూ మౌలికంగా భౌతికశాస్త్ర సూత్రాల ఆధారంగా అభివృద్ధి చెందినవే కాబట్టి పరస్పర విరుద్ధాలుగా కాకుండా అంతస్సంబంధాలతో  ఉంటాయి. 

ఏరోస్పేస్‌ ఇంజినీర్లంటే..: ఖగోళ రంగంలో సృజనాత్మక ఆలోచనా పరులు. వీరికి విమానాలు, క్షిపణులు, దేశ భద్రతకు సంబంధించిన ఆయుధ వ్యవస్థలు, అంతరిక్షాలు వంటి ప్రధాన ఉత్పత్తులతో పాటు వాణిజ్య, మిలిటరీ విమానాలు, హెలికాప్టర్లు, రోటర్‌క్రాఫ్ట్, రిమోట్‌ పైలటెడ్‌ ఏర్‌క్రాఫ్ట్, ఉపగ్రహాల ప్రయోగ వ్యవస్థలు, రాకెట్ల వంటి అనుబంధ ఉత్పత్తుల తయారీ, నిర్మాణం, రచనా విశ్లేషణ, రచన, పరిశోధన, అభివృద్ధి విభాగాల్లో ఎన్నో అవకాశాలుంటాయి. అంతేకాదు, వీటికి అవసరమైన ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలు, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యం ఉన్నవారికి కూడా అవకాశాలు లభిస్తాయి. వివిధ వ్యోమ యంత్రాల వ్యవస్థల సృష్టి, రచన, నమూనాలను అభివృద్ధి చేసి అవి నిర్దిష్ట అంచనాలకు అనుగుణంగా పనిచేసేలా నిర్మించడం వీరి విధుల్లో అంతర్భాగమే.

ముఖ్యమైన విధులు

ఏరోస్పేస్‌ ఇంజినీర్ల విధుల్లో.. 

అంతరిక్ష, విమాన ఉత్పత్తుల రచన, తయారీ, పరీక్షించడంలో నిర్దేశన, సమన్వయం

వివిధ ప్రాజెక్టు ప్రతిపాదనల సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల మదింపు 

ప్రాజెక్టుల్లో నిర్దేశించిన లక్ష్యాల ప్రమాద రహిత సాధన, అవకాశాల మదింపు 

ఉత్పత్తులు ఇంజినీరింగ్‌ సూత్రాలు, వినిమయదారుల అంచనాలు, పర్యావరణ నియంత్రణలకు అనుగుణంగా నిర్మితమయ్యాయా అని మూల్యాంకనం చెయ్యడం

డిజైన్‌ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలు, ప్రాజెక్టుల పూర్తికి కాలపరిమితి, ఉత్పత్తుల స్థిరమైన బట్వాడా వ్యవస్థల ఆమోదయోగ్యతల అభివృద్ధి

సమస్యల మూలం గుర్తించి భవిష్యత్తులో పునరావృతం కాకుండా అనువైన మార్పులు లక్ష్యంగా చెడిపోయిన, అంచనాల మేరకు పనిచేయని ఉత్పత్తుల, పరికరాల నిశిత తనిఖీ ముఖ్యమైనవి. 

వీరు కొత్త టెక్నాలజీలను నిర్మించి ఇందులోని ఏరోడైనమిక్‌ ఫ్లూయిడ్‌లో స్ట్రక్చరల్‌ డిజైన్, నావిగేషనల్‌ గైడెన్స్, కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కమ్యూనికేషన్, రోబోటిక్స్, చోదనం, దహనచర్య లాంటి ఉపవిభాగాల్లో నిపుణులుగా, స్పెషలిస్టులుగా కెరియర్‌ను మలచుకోవచ్చు. వీటితో పాటు థర్మోడైనమిక్స్, మెటీరియల్స్, ఖగోళ యంత్రశాస్త్రం, వ్యోమ యంత్రశాస్త్రం, ధ్వనిశాస్త్రం లాంటి రంగాల్లో స్పెషలిస్టులయ్యే అవకాశాలున్నాయి. 

నేర్చుకునేవి ఇవీ..
ఇంజినీరింగ్‌ స్థాయిలో డిగ్రీ చెయ్యడం ఏరోస్పేస్‌ రంగంలో ప్రవేశించడానికి మొదటి మెట్టు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ మౌలికాలైన, థర్మోడైనమిక్స్, ఇంజినీరింగ్‌ మెకానిక్స్, ఇంజినీరింగ్‌ గణితం, హీట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్, ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ సబ్జెక్టులతో పాటు ఏరోస్పేస్‌కి సంబంధించిన ఏరో డైనమిక్స్, ఏరో ఎలాస్టిసిటీ, ఏరో అకాస్టిక్స్, చోదన వ్యవస్థ, ఏరోక్రాఫ్ట్‌ డిజైన్, కంప్యుటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్, రాడార్‌ ఇంజినీరింగ్, ఏవియానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్, సిమ్యులేషన్, మాడలింగ్‌ మొదలైన సబ్జెక్టులు నేర్చుకుంటారు. ఐతే భవిష్యత్తు బాగుండాలంటే ఈరంగంలో పీజీ, పీహెచ్‌డీ చేస్తే మంచిది. ప్రత్యేకించి పీహెచ్‌డీ చేస్తే పరిశోధన, అభివృద్ధి విభాగంలో అవకాశాలు అధికం. అభిరుచి ఉంటే బోధనా రంగంలోనూ చేరవచ్చు

ఈ రంగంలో సిమ్యులేషన్‌ ద్వారా నేర్చుకోవడం ఎక్కువ కాబట్టి నమూనాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. భౌతికంగా శిక్షణ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా ప్రమాదాలకూ, ప్రాణ నష్టానికీ అవకాశం ఉన్నందున సిమ్యులేషన్‌ ద్వారా నేర్చుకోవడం అధికం. ఈ రంగంలో కెరియర్‌కి ప్రోగ్రామింగ్‌ కూడా అవసరమే. పైతాన్, సి++, మాట్‌లాబ్, హెచ్‌టిఎంఎల్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలు నేర్చుకోవడం, కనీసం ఎక్సెల్‌ వంటి డాటాబేస్‌ సిస్టమ్స్‌పై అవగాహన చాలా అవసరం. మైక్రో, నానో లాంటి సూక్ష్మ స్థాయిలో కచ్చితత్వం ఉన్న లెక్కింపులు దాని మీద ఆధారపడి ఇంజినీరింగ్‌ నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా పరిణామం తీవ్రంగా ఉంటుంది. అందుకని ప్రమాదాలనూ, ప్రాణ, ఆస్తి నష్టాలనూ దృష్టిలో ఉంచుకుని ఏరో స్పేస్‌ ఇంజినీర్లు ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవడం చాలా అవసరం.

ఊహించండి..

గ్రహ శకలాల్లో (ఆస్టరాయిడ్స్‌) ఖనిజ అన్వేషణ సాధ్యమా? 

సెలవుల్లో అంగారక గ్రహానికి మానవుడు వెళ్ళవచ్చా? 

గ్రహాంతర జీవులతో సహజీవనం నిజం కావచ్చా? 

ఈ ప్రశ్నలు ప్రస్తుతం అర్థం లేనివిగా అనిపించవచ్చు. కానీ ఇవి సమీప భవిష్యత్తులో నిజమయ్యే అవకాశాలున్నాయి. విశ్వాంతరాళంపై మనిషి చేస్తున్న నిత్య ప్రయోగాల్లో ఇవే కాకుండా మరెన్నో అద్భుతాలు జరగొచ్చు. కేవలం ఆ సమయానికి అనుభవంలోకి వచ్చినప్పుడు అర్థం చేసుకోవడమే. ఇటువంటి కలలు నిజం అవ్వడానికి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విభాగం నిరంతరం కృషి చేస్తోంది. 

ఏ మెలకువలు అవసరం? 

ప్రతి ఇంజినీరింగ్‌ బ్రాంచికి కొన్ని సామాన్య మెలకువలు అవసరం. అలాగే శాఖకు సంబంధించి కొన్ని ప్రత్యేక మెలకువలను ఆ బ్రాంచి గుణాలుగా పరిగణిస్తారు. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ శాఖకి సంబంధించి ఈ కిందివి అవసరం

విశ్లేషణ: పొరపాట్లు అత్యంత ఖరీదు, అపార ప్రాణ నష్టం కలిగించే ప్రమాదాలకు దారితీసే ఆస్కారం ఉన్నందున విశ్లేషణ మెలకువలు చాలా అవసరం.

సమతౌల్యం: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ రంగంలో ప్రధానంగా ప్రభుత్వ నియంత్రణలకు లోబడి వ్యాపార అభివృద్ధి చెయ్యవలసి ఉంటుంది. నిబంధనలు పాటిస్తూనే సంస్థకు లాభాలు తెచ్చిపెట్టాలంటే వ్యాపార ప్రమాణాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు ప్రతిపాదించవలసి ఉంటుంది. ఈ రెండు విభిన్న లక్ష్యాల మధ్య సమతౌల్యం పాటించే నేర్పు నిజంగా ఒక గుణమే.

విమర్శనాత్మక ఆలోచన: ఏరోస్పేస్‌ ఇంజినీర్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో డిజైన్లు చెయ్యడమే కాకుండా ఒక ప్రతిపాదిత డిజైన్‌ ఎందుకు మంచిదో, ఏ కారణాల వల్ల ఉపయోగం కాదో అన్న విమర్శనాత్మక విశ్లేషణ జరపాలి. ఈ ప్రక్రియలో ముడి సరుకుల అవసరం, ఇతర వనరుల అవసరం, భద్రత, ప్రభుత్వ పరమైన ఆంక్షలు, నిర్దేశకాలు, సంస్థకు లాభం, నాణ్యతా ప్రమాణాలు, ఆమోదయోగ్యత లాంటి వైవిధ్య భరితమైన ఆంశాలను పరిగణించవలసి ఉంటుంది.

గణితం, భౌతిక శాస్త్రం: ఈ బ్రాంచిలో సంకలనం, వ్యవకలనం, త్రికోణమితి, పాఠ్యాంశాలతోపాటు గణిత శాస్త్రంలో సూత్రాలు విరివిగా ప్రయోగిస్తారు. అందుకే గణితం బాగా అభ్యాసం చెయ్యాలి. దీనితోపాటు భౌతిక శాస్త్ర మౌలికాలు కూడా బాగా వచ్చివుండాలి.

సమస్యా పరిష్కారం: సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే సునిశిత విశ్లేషణ అవసరం. విశ్లేషణకు సమాధానం కనుక్కోవడం, కొత్త డిజైన్‌లను నిర్మించడం, ఇంధన సామర్థ్యం పెంచడం, భద్రతా వ్యవస్థ లాంటి నిరంతర సమస్యలకు సమర్థ సమాధానాలు కనుక్కోవడం.. అంటే సమస్యా పరిష్కార మెలకువల ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు.

భావ వ్యక్తీకరణ: ఏరోస్పేస్‌ ఇంజినీర్లు తమ శాఖకే కాకుండా, ఇతర శాఖల ఇంజినీరింగ్‌ సిబ్బందితో, ప్రభుత్వంతో, పర్యావరణ, ఖగోళశాస్త్ర విభాగ సంస్థలు, ఇంకా ఇతర బృందాలతో సమన్వయం సాధిస్తూ పనిచెయ్యాల్సి ఉంటుంది. దీనికి మౌఖిక, లేఖన సమాచార సామర్థ్యం బాగా ఉండాలి. అలాగే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ నివేదికలను ప్రామాణికంగా తయారుచెయ్యగలగాలి. 

భవిష్యత్తులో కొత్త కొలువులు

ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిలో ఉద్యోగ అవకాశాలు ప్రస్తుత అంచనాలమేరకు 3 నుంచి 4% వృద్ధి చెందుతాయి. ఈ రంగంలో ఎదుగుదలకు చాలా అవకాశం ఉంది. కెరియర్‌ మొదట్లో నాలుగు నుంచి ఆరు లక్షల వార్షిక వేతనంతో మొదలై అనుభవం పెరిగినకొద్దీ జీతం కూడా చక్కని ప్రమాణంలో పెరిగే అవకాశాలున్నాయి. వార్షిక సగటు వేతనం రూ.ఎనిమిది నుంచి రూ.తొమ్మిది లక్షల వరకు ఉంటుంది. నిర్ణాయక పాత్ర వహించే యాజమాన్య స్థాయిలో వెళ్ళాలనుకుంటే దానికీ అవకాశాలుంటాయి. 

విమానాల నిర్మాణ పద్ధతుల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తక్కువ ఖర్చు, ఇంధన సామర్థ్యం పెంచడం, నానో టెక్నాలజీ, వర్చువల్‌ రియాలిటీల వినియోగం లక్ష్యాలుగా ఈ రంగం విస్తరిస్తున్నందున పరిశోధనలకూ, అభివృద్ధికీ అవకాశం ఉంది. అంకుర సంస్థలకు కూడా చక్కని అవకాశం ఉంది. అలాగే మానవరహిత వైమానిక, వాయుగత వ్యవస్థల అభివృద్ధికి వివిధ సంస్థలు చొరవ చూపిస్తున్నాయి. 

బోయింగ్‌ సంస్థ దక్షిణ ఆసియా దేశాల్లో తమ వ్యాపార లావాదేవీల నిర్వహణకు మనదేశాన్ని కేంద్రంగా చేసుకుంది. బెంగళూరు కేంద్రంగా పరిశ్రమను స్థాపించి, అంకుర సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుని వ్యాపారాభివృద్ధి చేసుకుంటోంది. ఈ సంస్థ అంచనా ప్రకారం 2024 నాటికి మనదేశం విమానయాన రంగంలో మూడో అతిపెద్ద విపణిగా అవతరించనుంది. దీనికి అనుగుణంగా వ్యాపారాలు విస్తరించుకోవడానికి బోయింగ్‌తోపాటు ఈ రంగంలో ఇదివరకే ఉన్న ఇతర బహుళ జాతి సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఏరోస్పేస్‌ ఇంజినీర్లతోపాటు, నైపుణ్యతలున్న డేటా అనలిటిక్స్, ఐఓటీ, మెషిన్‌ లర్నింగ్‌ ఇంజినీర్ల సేవలూ అవసరమవుతాయి. ఈ సేవలను సంస్థలు అంకుర సంస్థలద్వారా కానీ, నియామకాల ద్వారా కానీ వినియోగించుకునే అవకాశాలున్నాయి.

విదేశాల్లో కూడా అవకాశాలు బాగా ఉన్నాయి అయితే బీటెక్‌ స్థాయిలో నేరుగా ఉద్యోగాలు ఉండవు. ఎంఎస్‌ చేస్తే అవకాశాలుంటాయి. అమెరికాలో నాసా, లాక్‌హీడ్‌ మార్టిన్‌ లాంటి సంస్థల్లో ఈ రంగంలో ఉద్యోగం కోసం గ్రీన్‌కార్డ్‌ తప్పనిసరిగా కావాలి. బ్రిటన్‌లో కొంత వెసులుబాటు ఉంది. 

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో..

వివిధ సంస్థలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలను అందిస్తున్నాయి. 

ప్రఖ్యాత సంస్థ బోయింగ్‌  ఇటీవల తన ప్రధాన కార్యాలయం అమెరికాలోని సియాటెల్‌ తరువాత బెంగళూరులో రెండో అతి పెద్ద ఇంజినీరింగ్‌ వసతుల వ్యవస్థను నెలకొల్పింది. 

ప్రముఖ అమెరికా సంస్థ లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరో స్టక్చ్రర్స్‌ సంస్థ టాటా సంస్థతో సంయుక్త సంస్థను హైదరాబాదులో స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా తన మాతృ సంస్థ అవసరాలకోసం వివిధ విడిభాగాలు, విమానాల తోక అమరిక వ్యవస్థల నిర్మాణం చేస్తోంది. 

హనీవెల్‌ సంస్థ, జి.ఇ. ఏవియేషన్, డెల్టా ఏర్‌లైన్స్‌ లాంటి ప్రముఖ విమాన, అంతరిక్ష సంస్థలు తమ శాఖలను మనదేశంలో ఇదివరకే నెలకొల్పాయి. ఇక్కడి నాణ్యమైన మానవ వనరులను వినియోగించుకుని తమ సంస్థల అభివృద్ధిలో మన దేశానికీ¨, మనకూ భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నాయి. మనదేశంలో బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాలు ఏరోస్పేస్‌ సంస్థలు నెలకొల్పడానికి అనుకూలమైనవి. 

కరోనా తెచ్చిన చిక్కులకు అత్యంత తీవ్ర ప్రభావానికి లోనైన రంగం ఇదే. బెంగళూరులో కార్యాలయం ఉన్న ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ సంస్థ డస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ప్రకారం.. తగ్గిన మానవ వనరులను వినియోగించి ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం కరోనా కాలంలో ఒక తీవ్ర సవాలుగా పరిణమించింది. ఐతే ఇదే కరోనా కాలం డిజిటలైజేషన్‌ ప్రాముఖ్యాన్నీ, అవసరాన్నీ తెరముందుకి తెచ్చింది. ఈ ఇబ్బందుల నేపథ్యంలో ఈ రంగంలో కొన్ని కొత్త ఆవిష్కరణలు కూడా చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు కాబిన్‌ ఉపరితలాన్ని శానిటైజ్‌ చెయ్యడానికి హనీవెల్‌ సంస్థ కొత్త పోర్టబుల్‌ అల్ట్రా వయొలెట్‌ శానిటైజర్‌ని కనుక్కుంది. 

ఈ రంగంలో ప్రాజెక్టులు దీర్ఘకాలికమైనవిగా ఉండి, వివిధ ప్రభుత్వ, మంత్రిత్వ శాఖల, ఇతర ప్రమాణాల సంస్థల ఆమోదం పొందడానికి చాలా కాలం తీసుకోవడం మూలాన దీర్ఘకాలిక ఉద్యోగాలకు ప్రణాళికలు వేసుకోవచ్చు.
 

Posted Date: 30-12-2020


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌