• facebook
  • whatsapp
  • telegram

ఎదురులేని ఎదుగుద‌ల‌కు ఏవియేష‌న్‌!

నింగికి నిచ్చెనలు వేసే ఏవియానిక్స్‌ ఇంజినీరింగ్‌

విమానయాన రంగంలో ఉద్యోగం చేయాలనే ఆసక్తీ, అభిరుచీ మీకున్నాయా? అయితే సాంకేతికంగా అన్ని రంగాల విజ్ఞానం పెంపొందించుకుంటూ ఎదగొచ్చు. ఆకర్షణీయమైన భవిష్యత్తు ఉన్న ‘ఏవియానిక్స్‌’  ఇంజినీరింగ్‌ మీలాంటి వారికి మంచి ఎంపిక!  

ఆకాశయానం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది- తెల్లటి యూనిఫామ్, తలపై తెల్లని టోపీ ధరించి ఠీవిగా కాక్‌పిట్‌ను స్వాధీనంలోకి తీసుకుని విమానాన్ని గగనతలంలోకి దూసుకువెళ్లేలా చేసే పైలట్‌. ప్రయాణికులను సుదూర గమ్యాలకు క్షేమంగా చేర్చే విధిని పైలట్‌ సక్రమంగా నిర్వర్తించాలంటే ఆ విమానంలోని ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ వ్యవస్థ, విద్యుత్‌ వ్యవస్థ సక్రమంగా ఉండడమే కాదు, సమర్థంగా పనిచెయ్యాలి. ఈ వ్యవస్థల నిర్మాణ, నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు చేపట్టేవారే ఏవియానిక్స్‌ ఇంజినీర్లు! 

విమానాలే కాదు, ఏరోస్పేస్‌ రంగానికి సంబంధించి పౌరయాన విమానాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు, హెలికాప్టర్లు, ఉపగ్రహాలు, రాకెట్లు, ఆధునిక నౌకల్లో ఉపయోగించే- రహస్యంగా పనిచేసే భూపరిశీలన వ్యవస్థలు, డ్రోన్‌ లాంటి అత్యాధునిక యంత్రాల ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్‌ వ్యవస్థలతో పాటు వీటి కంప్యూటర్‌ ఆధారిత నియంత్రణల బాధ్యత కూడా వీరిదే. ఈ యంత్రాల సమగ్ర కమ్యూనికేషన్‌ వ్యవస్థ వీరి అజమాయిషీలోకి వస్తుంది.  ఇదివరకు ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో అంతర్భాగంగా ఉండి ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకుని ఏవియేషన్‌లోని ఏవియా, ఎలక్ట్రానిక్స్‌లోని ‘నిక్స్‌’ కలిపి ఏర్పడిందే ఈ ఏవియానిక్స్‌. గగనతలంలో, భూగర్భాల్లో పనిచేసే అధునాతన యంత్ర, క్షిపణులకు అవసరమైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ వ్యవస్థల నిర్మాణం, అభివృద్ధి, పరీక్ష, నిర్వహణ, మరమ్మత్తులపై ఈ నాలుగేళ్ళ ఇంజినీరింగ్‌ (ఏవియానిక్స్‌) ప్రత్యేక దృష్టి సారిస్తుంది. కోర్సు ముగించిన విద్యార్థులను ఈ ఉద్యోగాలకోసం సిద్ధం చేస్తుంది.

2018 గణాంకాల ప్రకారం మనదేశంలో గంటకు వందకు పైగా పౌర విమానాలు వివిధ విమానాశ్రయాలనుంచి బయలుదేరుతున్నాయి. ఇంత ప్రాముఖ్యమున్న ఈ రంగం గత ఆరేళ్లలో 100 శాతం వృద్ధిని సాధించింది.ఎన్నో ఉద్యోగావకాశాలకు నిలయంగా మారుతోంది. దీనికితోడు 600కు పైగా సరకులు మోసే విమానాలు, రక్షణ రంగంలో వివిధ యంత్రాల తయారీ.. ఇవన్నీ కలిసి ఎంతో ఆకర్షణీయ భవిష్యత్తు ఉన్న రంగంగా ఏవియానిక్స్‌ని చెప్పుకోవచ్చు. ఏవియానిక్స్‌ రంగంలో కచ్చితమైన, కఠినమైన నిబంధనలకు లోబడి నాణ్యమైన, విశ్వసనీయమైన ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలను అభివృద్ధి చెయ్యవలసి ఉంటుంది. పౌర విమానాల విభాగం తీసుకుంటే ఒక్క చిన్న పొరపాటు.. వందల ప్రాణాలకు ముప్పు తెస్తుంది. అందుకని ఉత్సాహవంతులై ప్రతి చిన్న అంశానికీ అత్యంత ప్రాముఖ్యం ఇచ్చేవారు మాత్రమే ఈ రంగంలో నిలదొక్కుకోగలరు. 

ఏవియేషన్‌లోని ఏవియా, ఎలక్ట్రానిక్స్‌లోని ‘నిక్స్‌’ కలిపి ఏర్పడిందే- ఏవియానిక్స్‌.

ఉద్యోగ అవకాశాలు

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో పురోగతి సాధిస్తున్న మనదేశంలో ఎన్నో కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రణాళికలు అమలు జరగడం, ఇతర దేశాలకు మనదేశం అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణులను విక్రయం చెయ్యాలని ఇటీవల తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఏవియానిక్స్‌ రంగంలో ఉద్యోగావకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి. 
బీటెక్‌ ముగించినవారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలకు చెందిన సంస్థల్లో వివిధ స్థాయుల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల విషయానికి వస్తే ఇస్రో, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, ఏర్‌పోర్ట్స్‌ అథారిటీ, హెలికాప్టర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఏవియానిక్స్‌ కోర్సులు ఉన్న ఐఐటీల్లో ప్రాజెక్ట్‌ అసోసియేట్లు, ఇండియన్‌ ఏర్‌ఫోర్స్, నౌకాదళం, డీ…ఆర్‌డీఓ, రక్షణ శాఖకు చెందిన సంస్థల్లో ప్రవేశం, ప్రవర ఏవియేషన్, నేషనల్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంది. ప్రైవేటు రంగానికి వస్తే- అన్ని ఏర్‌లైన్‌ సంస్థల్లో ఎన్నో అవకాశాలు లభిస్తాయి. హెచ్‌సీఎల్, టాటా, హనీవెల్, కాగ్నిజెంట్, బాష్, ఐబీఎం లాంటి సంస్థలు వాటిలో కొన్ని.

ఏ లక్షణాలుండాలి?

ఏవియానిక్స్‌ రంగంలో అద్భుతంగా రాణించాలంటే  కింది లక్షణాలు అవసరమవుతాయి. 

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ రంగం పట్ల ప్రత్యేక ఆకర్షణ. వివిధ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎలా పనిచేస్తాయి, ఏ పరిస్థితుల్లో పనిచెయ్యవు, మరమ్మతులు ఎలా అనే విషయాల పట్ల సహజ కుతూహలం. 

కంప్యూటర్‌ సైన్స్‌పై అవగాహన. 

ఇంజినీరింగ్‌ గణితశాస్త్రం  బాగా తెలిసివుండటం.

విమానాల నిర్మాణంలో వినియోగమయ్యే ఇంజినీరింగ్‌ సాంకేతిక శాఖల మౌలికాలపై అవగాహన

వివిధ విభాగాల వారితో కలసి జట్టుగా పనిచెయ్యాల్సివున్నందున బృందంలో సభ్యులుగా మసలుకునే తత్వం.  

డాంబికాలు లేకుండా సంయమనం పాటించడం. 

సమయ పాలన, సమయ స్ఫూర్తి.

సందర్భోచిత నిర్ణయాధికారం పెంపొందించుకోవటం.

ఆంగ్ల ప్రావీణ్యం తప్పనిసరి. కొన్ని ఇతర అంతర్జాతీయ భాషలు  (ఫ్రెంచి, అరబిక్, ఇటాలియన్, స్పానిష్‌..) నేర్చుకోవటం ఉత్తమం.     

శారీరక, మానసిక ఆరోగ్యం

విభిన్న రకాల కొలువులు

ఈ రంగంలో సాంకేతికపరమైన ఉద్యోగాలతోపాటు డిగ్రీ, డిప్లొమా చేసినవారికీ అవకాశాలుంటాయి. టెక్నీషియన్‌ మొదలుకొని మేనేజర్‌ స్థాయి వరకూ ఉద్యోగాలుంటాయి. ఏర్‌క్రాఫ్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీర్, ఏర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌ మేనేజర్, ఏర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్, ఏవియేషన్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్, ఏవియానిక్స్‌ ఎంబెడెడ్‌ ఇంజినీర్, టెక్నికల్‌ మేనేజర్, ఏవియానిక్స్‌ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, కస్టమర్‌ సపోర్ట్‌ ఇంజినీర్, అసోసియేట్‌ ఇంజినీర్, డిజైన్‌ ఇంజినీర్, హార్డ్‌వేర్‌ ఇంజినీర్, టెక్నాలజిస్ట్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు ఉంటాయి. సాంకేతికేతర కొలువుల మాటకు వస్తే- పైలట్, ఫ్లైట్‌ స్టివార్డ్, ఏర్‌ హోస్టెస్, టికెటింగ్‌ స్టాఫ్, గ్రౌండ్‌ స్టాఫ్‌ లాంటి అవకాశాలు ఉన్నాయి. ఇతర ఇంజినీరింగ్‌ బ్రాంచిల మాదిరే అర్హతతో పాటు అనుభవం పెరిగినకొద్దీ జీతాలు పెరుగుతూ ఉంటాయి. కెరియర్‌ మొదట్లో వార్షిక వేతనం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలతో మొదలై అంచెలంచెలుగా కాకుండా ఘాతాంకంలో పెరిగే అవకాశాలు అధికం. ఈ రంగంలో పని చెయ్యాలంటే నిర్దిష్ట సమయాలు ఉంటాయనే విషయం మర్చిపోవాలి. ఒక్కొక్కసారి ప్రణాళికలకు విరుద్ధంగా అత్యవసర సేవలూ అందించవలసి ఉంటుంది.

కోర్సులో ఏ పాఠ్యాంశాలు?

విమాన వ్యవస్థ అంటే ఎన్నో రంగాలకు సంబంధించిన సూత్రాల, పరికరాల సమన్వయంతో కూడుకుని ఉంటుంది. సాధారణ స్థాయిలోని పోలీస్‌ హెలికాప్టర్‌కి అమరిచిన సెర్చిలైట్‌ నుంచి అత్యాధునిక స్థాయికి చెందిన ముందస్తు హెచ్చరికలు జారీ చెయ్యగలిగిన వ్యవస్థ వరకూ అనేక పరికరాల అనుసంధానంతో పనిచేసే వ్యవస్థ విమానం. కాబట్టి దాదాపు అన్ని రంగాల సబ్జెక్టుల పరిచయ వేదికగా ఈ కోర్సు ఉంటుంది.  

ఏవియానిక్స్‌ కోర్సులో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ రంగాల ప్రాధాన్యం తగ్గకుండా సమతౌల్యం పాటిస్తూ ఏరోస్పేస్‌కి సంబంధించిన కోర్సులు ఉంటాయి. వీటితోపాటు నిబంధనల మేరకు భౌతికశాస్త్రం, గణితం, మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టులు ఉంటయి. ప్రత్యేకించి కంట్రోల్‌ సిస్టమ్స్, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌కి సంబంధించిన సబ్జెక్టులు, కంప్యూటర్‌ సిస్టమ్స్‌ సంబంధిత సబ్జెక్టులు హార్డ్‌వేర్‌ ప్రాధాన్యంతో నేర్పుతారు. ఏరోస్పేస్‌ రంగానికి సంబంధించి పటిష్ఠమైన ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ వ్యవస్థల నిర్మాణం నేపథ్యంతో ఈ కోర్సు ఉంటుంది. 

వాయు, వ్యోమ, అంతరిక్ష  వాహనాల, యంత్రాల పరిశోధన, రచన, అభివృద్ధి, నిర్మాణం,  నిర్వహణ లక్ష్యంగా ఈ కోర్సు తయారయింది. ప్రధానంగా మౌలికాలైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లు, కాల్‌క్యులస్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ మౌలికాలు, యంత్రశాస్త్రం (మెకానిక్స్‌), డ్రాయింగ్‌ సబ్జెక్టులు, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ మౌలికాలు, కంట్రోల్‌ సిస్టమ్స్, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టులు ఉంటాయి. కంప్యూటర్‌ రంగానికి సంబంధించిన సబ్జెక్టులు కొన్ని నిర్బంధ సబ్జెక్టులుగా, మరికొన్ని ఐచ్ఛికాలుగా ఉంటాయి. ఈ కోర్సులో సింహభాగం ఎలక్ట్రానిక్స్‌ రంగానికి సంబంధించినవే ఉంటాయి. ఎలక్ట్రానిక్స్‌ మౌలికాలు, అనలాగ్‌ ఎలక్ట్రానిక్స్, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, ఎలక్ట్రో మాగ్నెటిక్‌ తరంగాల అధ్యయనం, రేడియో తరంగాల కమ్యూనికేషన్, శాటిలైట్‌ కమ్యూనికేషన్, డిజిటల్‌ కమ్యూనికేషన్, కంట్రోల్‌- మార్గదర్శక వ్యవస్థలు మొదలైన సబ్జెక్టులుంటాయి. వీటికితోడు ఐచ్ఛికాలు. మొత్తం మీద చూస్తే ఈ కోర్సులో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టులు ప్రధానంగా నేర్పుతారు.

Posted Date: 23-08-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌