• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌లో ప్ర‌త్యేక కోర్సులు

తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల తరుణం వచ్చేసింది. ఈ సందర్భంగా నూతన తరానికి చెందిన బీటెక్‌/ బీఈ కోర్సులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడం అవసరం. ఈ అత్యాధునిక టెక్నాలజీలకున్న ఆదరణ, విస్తృతి, ప్రయోజనాల దృష్ట్యా  బీటెక్‌ స్థాయిలో ఎన్నో కళాశాలలు వీటిని ప్రవేశపెడుతున్నాయి. మరోపక్క కొవిడ్‌ పరిణామాల మూలంగా వైద్యసేవల విలువ పెరిగి, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లాంటి బ్రాంచీలకు ప్రాధాన్యం ఎక్కువవుతోంది. వీటన్నిటి ముఖ్యాంశాలను తెలుసుకుందాం! 
 

ఇటీవలి కాలంలో వివిధ పరిశ్రమల ఉద్యోగ నియామకాల్లో గుణాత్మకంగా మార్పు వచ్చింది. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో ప్రాథమిక పరిజ్ఞానానికి బదులుగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లర్నింగ్, డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్‌లో నిర్దిష్ట నైపుణ్యం ఉన్నవారివైపే నియామక సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. కేవలం కంప్యూటర్‌ సైన్స్‌లోనే కాకుండా ఇంజినీరింగ్‌లోని అన్ని రంగాల్లో ఈ అత్యాధునిక టెక్నాలజీల ప్రమేయం విస్తృతంగా ఉంది. వీటి ప్రమేయంలేని ఇంజినీరింగ్‌ బ్రాంచీనే లేదని చెప్పాలి.
 

ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన, సేవతో కూడిన ఉద్యోగాల్లో ‘ఇంజినీరింగ్‌’ ఒకటని చెప్పొచ్చు. ఏ ఇంజినీరింగ్‌ విభాగంలో ఉపాధి లేదా ఉద్యోగం దొరికినా మంచి జీతంతోపాటు ఆత్మసంతృప్తి కూడా దక్కుతాయి. ఇంజినీరింగ్‌ డిగ్రీ కేవలం సాంకేతిక అంశాలనే కాకుండా కార్యనిర్వహణ, వ్యాపార నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, సంభాషణ నైపుణ్యం వంటివి కూడా నేర్పిస్తుంది. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి?
 

ఒక వ్యక్తి ఏ ఇంజినీరింగ్‌ డిగ్రీ తీసుకున్నా జీవితంలో స్థిరపడటానికీ, రాణించడానికీ కావాల్సిన అన్ని అంశాలూ నేర్చుకోగలుగుతాడు. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కెమికల్, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్‌ తదితర అన్ని ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ ఈ సాంకేతికతలు అంతర్గతంగా ఉండి, ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాలతోపాటు ఈ ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని జోడించడం ద్వారా స్వయంచాలక వాహనాలు, ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్స్, కెమికల్‌ ప్రాసెస్‌ పరిశ్రమలు, సమర్థ వ్యవసాయం వంటి ఏఐ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి సాధ్యమవుతుంది. 
 

కంప్యూటర్‌ సైన్స్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ విభాగాలు ప్రాథమికమైన ప్రోగ్రామింగ్‌ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తే.. ఏఐ, డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్‌ వంటివి ఐటీ ఆధారిత అంశాలపై లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరికీ ఈ ఆధునిక కోర్సుల్లో కొంతైనా అవగాహన ఉండాల్సిందే!
 

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌

దీన్ని బీటెక్‌లో ఎంచుకుంటే మంచి జీతంతోపాటు వృత్తిలో మరింత ఎత్తుకు ఎదిగే అవకాశాలను పొందొచ్చు. ఏఐ ప్రొఫెషనల్‌ సగటు ఆదాయం అమెరికాలో లక్ష డాలర్ల నుంచి లక్షా యాభై వేల డాలర్ల వరకూ ఉంటే.. మనదేశంలో రూ. 14-15 లక్షల వరకూ ఉంది. ఏఐ పూర్తిచేసినవారు మెషిన్‌ లర్నింగ్‌ ఇంజినీర్, డేటా సైంటిస్ట్, బిజినెస్‌ ఇంటలిజెన్స్‌ డెవలపర్, రిసెర్చ్‌ ఇంజినీర్‌లుగా పనిచేయవచ్చు. ఏఐ కేవలం కంప్యూటర్‌ రంగానికే పరిమితం కాదు. ఆరోగ్యం, ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్‌స్ట్రక్షన్‌ వంటి అనేక ఇతర రంగాల్లోనూ ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఏదో ఒకరోజు ఏఐ.. మానవులు చేసే ప్రతి పనినీ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ విధంగా ఇది చాలా ఉద్యోగాలనూ భర్తీ చేయగలదు.

 

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌

ఇంటర్నెట్‌తో అనేక ఎలక్ట్రానిక్‌ సాధనాలను అనుసంధానిస్తే అదే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌. అపారమైన అవకాశాలున్న రంగంగా దీన్ని చెప్పుకోవచ్చు. విస్తారంగా పెరిగిన మొబైల్‌ ఫోన్స్‌ వాడకంతో పాటు ఇంçర్నెట్‌ అనుసంధానించటంతో అనేక నూతన ఆవిష్కరణలు మొదలయ్యాయి. దాదాపు అన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అంతర్జాలంతో అనుసంధానించి ఉపయోగించడమనేది సర్వసాధారణంగా మారింది. ఈ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు మైక్రో కంట్రోలర్స్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, వంటి వాటిలో కాస్త పట్టు సాధిస్తే సరిపోతుంది. ప్రస్తుతం భారీ డిమాండ్‌ ఉన్న రంగంగా ఐఓటీని చెప్పుకోవచ్చు.
 

డేటా సైన్స్‌

గత శతాబ్దంలో పారిశ్రామిక ప్రగతికి చమురు ముడి వనరుగా ఎలా తోడ్పడిందో ప్రస్తుత శతాబ్దంలో డేటా చోదక శక్తిగా మారింది. దాదాపు అన్ని రంగాల్లోనూ డేటాను వినియోగించి విస్తృతమైన ఉత్పత్తులను అందించడమే కాకుండా డేటా రూపంలో ఆలోచించే శక్తిమంతమైన యంత్రాలను సైతం తయారు చేస్తున్నారు. అత్యధిక డిమాండ్‌ ఉన్న డేటాసైన్స్‌ను వృత్తిగా తీసుకుని రాణించాలంటే తగిన ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. అంతర్జాలంలో అనేక పుస్తకాలు, వనరులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ ఆచరణాత్మక దృష్టితో నేర్చుకోవడం కష్ట సాధ్యం. అందువల్ల బీటెక్‌లో డేటాసైన్స్‌ చదవడం వల్ల జ్ఞానం, అనుభవం రెండూ సంపాదించవచ్చు. ప్రాథమికంగా ఇది గణితానికి సంబంధించిన అనువర్తనం. కాబట్టి, ఇందులో దాగి ఉన్న పోకడలను గమనించి ప్రత్యేక నైపుణ్యాన్ని అలవరచుకుంటే మంచి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
 

సైబర్‌ సెక్యూరిటీ

ఇంటర్నెట్‌ ఎంత వేగంగా ప్రజలందరికీ చేరువ అయిందో ఇంటర్నెట్‌ ఆధారిత నేరాలు కూడా అంతే వేగంగా పెరిగాయి. ఈ కంప్యూటర్‌ ఆధారిత నేరాలను అరికట్టడానికి వచ్చిన ప్రత్యేక విభాగమే ‘సైబర్‌ సెక్యూరిటీ’. ఇంటర్నెట్‌ ఉన్నంతకాలం కచ్చితంగా ఉండే అద్భుతమైన ఉపాధి అవకాశంగా దీన్ని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ నేరాలు పెరుగుతున్న తరుణంలో, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి అంశాల్లో పట్టు సాధించడం ద్వారా అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. సైబర్‌ సెక్యూరిటీలో మంచి నైపుణ్యం సాధించటం ద్వారా ప్రపంచంలోని 500 ఉత్తమ కంపెనీల్లో అవకాశం పొందవచ్చు. ఇవే కాకుండా అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సైబర్‌ నేర విభాగాల్లోనూ ఉపాధి అవకాశాలు పుష్కలం. ప్రోగ్రామింగ్, నెట్‌ వర్కింగ్‌ లాంటి వాటిలో అభిరుచి ఉండి గణితంలో కొంత తక్కువ పరిజ్ఞానం ఉన్నా ఈ రంగంలో రాణించవచ్చు.
 

బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌

ఆరోగ్యరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులకు మంచి ఉదాహరణ - బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌. అత్యాధునిక మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ డిజైన్, తయారీ వంటి అంశాలు ఈ రంగంలో మిళితమైవుంటాయి. ఇందులో రాణించాలనుకునేవారు ఎలక్ట్రానిక్స్‌లోని అంశాలతో పాటు కొన్ని శరీరధర్మ శాస్త్రానికి సంబంధించి కూడా పరిజ్ఞానాన్ని పొందాల్సివుంటుంది. ఒక అంతర్జాతీయ సంస్థ సర్వే ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంజినీరింగ్‌ విభాగంగా బయోమెడికల్‌ విభాగం పేరుపొందింది. అమెరికాలో బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌కి ఉన్న ఆదరణ అత్యధికం. డిజైన్‌ ఇంజినీర్‌గా పరిశ్రమల్లోనే కాకుండా వైద్యశాలల్లో కూడా ఉపాధి అవకాశాలు ఉండటం ఈ రంగం ప్రత్యేకత.  
 

బిజినెస్‌ అనలిటిక్స్‌

‘డేటా’ అనేది నాగరికత ప్రారంభమైన దగ్గర్నుంచీ ఉన్నప్పటికీ విభిన్నమైన పద్ధతుల్లో దానిని విశ్లేషించడం మాత్రం ఈమధ్యే ప్రారంభమైంది. భారీ మొత్తంలో పోగుపడుతున్న డేటాను సాంకేతిక పద్ధతులను ఉపయోగించి విశ్లేషించడానికి ప్రధాన కారణం- అత్యాధునిక కంప్యూటర్లు, వాటి గణనశక్తిలో వచ్చిన పెరుగుదల. డేటా అనలిటిక్స్‌ విభాగంలో నిపుణుల కొరత పెరుగుతుండగా ఇందులో అవకాశాలు విస్తారమవుతున్నాయి. ఇంటర్నెట్‌ అందరికీ చౌకగా లభ్యం కావడం; డేటా విస్తారంగా పోగు పడుతుండటంతో రోజురోజుకీ డేటాసైన్స్‌ రంగంలో అపరిమితమైన అవకాశాలు రాబోతున్నాయి.
 

ప్రస్తుత పోటీ ప్రపంచంలో వినియోగదారులకు అత్యాధునిక ఉత్పత్తులు, సేవలు అందించాలంటే డేటా విశ్లేషణ చాలా అవసరం. అధునాతన కంప్యూటర్లను వినియోగించడం ద్వారా వ్యాపారాన్ని విశ్లేషించే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. వినియోగదారుల అభిరుచులనూ, పోకడలనూ విశ్లేషించడం ద్వారా వ్యాపారాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయవచ్చు. తమ పోటీదారులు ఎలా ఉన్నారో కూడా అంచనావేయవచ్చు. ఇవన్నీ కంప్యూటర్‌ సైన్స్‌లో బిజినెస్‌ అనలిటిక్స్‌ని భాగంగా చేయడం ద్వారా సులభంగా సాధించవచ్చు.
 


 

Posted Date: 09-09-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌