• facebook
  • whatsapp
  • telegram

ఏ బ్రాంచిలో ఏముంది? 

ప్రాచుర్యం పొందిన ఇంజినీరింగ్‌ కోర్సులు

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి, కొత్తగా బీఈ/బీటెక్‌లోకి అడుగుపెడదామనుకునేవారు అందుబాటులో ఉన్న బ్రాంచీలన్నిటి గురించీ అవగాహన పెంచుకోవటం మంచిది. ఇంజినీరింగ్‌లో ఎన్ని కోర్సులు ఉన్నప్పటికీ ఎక్కువమంది విద్యార్థులను ఆకర్షించే ప్రధాన బ్రాంచిలు కొన్ని ఉన్నాయి. దాదాపు ప్రతి కళాశాలలోనూ ఇవి ఉంటాయి. వీటి గురించిన ముఖ్యాంశాలను తెలుసుకుందాం! 
 

దేశ ఆర్థిక ప్రగతిని నిర్దేశించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే మార్గం- ఇంజినీరింగ్‌. ఈ వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసినవారు సరైన నైపుణ్యం సంపాదించి చిన్నతరహా పరిశ్రమల నుంచి బహుళ జాతి సంస్థల వరకు ప్రతిచోటా ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు పాఠ్యాంశాలను ఆచరణాత్మకంగా నేర్చుకుంటారు. దీంతో దేశ విదేశాల్లో ఉన్నత విద్యాకోర్సులు చదువుకునేలా, ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా వారి ఆలోచనా విధానం నైపుణ్యతను సంతరించుకుంటుంది.  
 

ఎలక్ట్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ)
ఈసీఈ బ్రాంచిలో చేరాలంటే.. తార్కిక నైపుణ్యాలు, గణిత పరిష్కార నైపుణ్యాలు ఉండాలి. ఈ కోర్సును ప్రస్తుత పోకడల ప్రకారం నవీకరించారు.  ప్రపంచం చిన్నదవుతూ టెక్నాలజీ మెరుపు వేగంతో ముందుకు సాగుతోంది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ వివిధ వ్యవస్థల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ పరికరాల పరిశోధన రూపకల్పన, అభివృద్ధిలను కలిగి ఉంటుంది. ఈ ఇంజినీర్లు ప్రసార వ్యవస్థలనూ తయారుచేస్తారు; పర్యవేక్షిస్తారు. గత కొన్ని ఏళ్లుగా ఈసీఈ రంగంలో ఉపాధి గణనీయంగా పెరిగింది. ఇంజినీరింగ్‌ రంగంలో అత్యంత ఆదరణ పొందిన కోర్సుల్లో ఇదొకటి. ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ దాదాపు ప్రతి ఇంట్లో ఒక అనివార్యమైన అంశంగా మారింది. సాంకేతికంగా నడిచే ఈ యుగంలో పరిశ్రమల్లో, రోజువారీ జీవితంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ సేవలు అనివార్యం. ఈ బ్రాంచిలో కోర్సు పూర్తి చేశాక చాలామంది ఐటీ ఉద్యోగాలను ఎంచుకుంటారు. కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థల్లో, టెలి కమ్యూనికేషన్‌ అండ్‌ ఐటీ పరిశ్రమల్లో, మొబైల్‌ కమ్యూనికేషన్‌ 2జి,  3జి, 4జి, ఇప్పుడు 5జి ఇంటర్నెట్‌ టెక్నాలజీ,  పవర్‌ ఎలక్ట్రానిక్స్, ఇతర పరిశ్రమల్లో ఉద్యోగం పొందవచ్చు. వైద్య పరికరాల తయారీ, టెలికమ్యూనికేషన్స్, ఏరోనాటికల్, మిలటరీ రంగాల్లో కూడా పని చేయవచ్చు. ఈసీఈ బ్రాంచి వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు, మంచి ప్యాకేజీలు ఉన్నాయి. సీమెన్స్, మోటోరోలా, ఇంటెల్, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్, బెల్, ఇస్రో, బిఎస్‌ఎన్‌ఎల్, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ఫిలిప్స్‌ ఎలక్ట్రానిక్స్, నేషనల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, క్యాప్‌ జెమిని లాంటి ప్రసిద్ధ  కంపెనీల్లో ఉద్యోగం పొందవచ్చు.
ఉన్నత చదువులు, పరిశోధనలకు వెళ్లడానికీ అవకాశాలున్నాయి. గేట్‌ ద్వారా ఐఐటీలూ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. గేట్‌ స్కోరును ఐఐటీలూ, ఎన్‌ఐటీలూ, సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాలూ, ప్రభుత్వ సంస్థలూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. 
మరింత అధ్యయనం కోసం మాస్టర్స్‌ చేయడానికి సిద్ధంగా ఉంటే జీఆర్‌ఈ, టోఫెల్‌ స్కోర్‌ పొందిన తర్వాత తమ కలల యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌; ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

ప్రోగ్రామింగ్‌ను కెరియర్‌గా చేసుకోవాలనుకునేవారికి ఈ బ్రాంచీలు ఉత్తమ ఎంపిక. 

కంప్యూటర్‌ సైన్స్‌; ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాల్లో చేరే విద్యార్థులు కాలానుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సివుంటుంది. వీరు కోడింగ్‌లో మెలకువలను నేర్చుకోవడం ద్వారా బహుళజాతి సంస్థల్లో సులువుగా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఐదు లక్షల రూపాయిల కనీస వేతనంతో వచ్చే కంపెనీలు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం నుంచే ఎక్కువగా నియామకాలు జరుపుకుంటున్నాయి.
అన్ని రంగాల్లో కంప్యూటర్‌ వినియోగం పెరగడంతో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, మెషిన్‌ లర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, 5జీ టెక్నాలజీలపై పట్టు సాధించిన విద్యార్థులకు గూగుల్‌ మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మైక్రాన్‌ వంటి బహుళజాతి సంస్థల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంతే కాదు; సొంతంగా స్టార్ట్టప్‌నో, కంప్యూటర్స్‌ సంస్థనో స్థాపించి  ఇతరులకూ ఉద్యోగావకాశాలను కల్పించవచ్చు. 
 

మెకానికల్‌ ఇంజినీరింగ్‌
మెకానికల్‌ ఇంజినీరింగ్‌ను విస్తారమైన, పరిధి లేని రంగంగా చెప్పవచ్చు. ఈ విభాగంలో సాఫ్ట్‌వేర్‌ అనేది అంతర్భాగం అవ్వడం వల్ల వాహన రంగం మొదలుకొని కృత్రిమ మేధ వరకు ఈ మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు అన్వయించవచ్చు. 
ఈ బ్రాంచిలో చేరే   విద్యార్థులకు సృజనాత్మకత, సమస్య పరిష్కరించే సామర్థ్యం, గణిత నైపుణ్యం ఎంతో అవసరం. వాటితో పాటుగా ఆటో కాడ్, కేటీయా, సాలిడ్‌ వర్క్స్, క్రీయా లాంటి డిజైన్‌ సాఫ్ట్‌వేర్, మ్యాట్‌ ల్యాబ్, ఫైవ్‌ ఎయిట్‌ ఎలిమెంట్‌ ఎనాలిసిú,Ã కంప్యుటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ లాంటి విశ్లేషణ సాఫ్ట్‌వేర్‌లు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. వీటితో పాటుగా పైతాన్, జావా, సి వంటి  కోడింగ్‌ సాఫ్ట్‌వేర్‌లు నేర్చుకున్నట్లయితే మంచి వేతనాలతో ఇటు కోర్‌ ఉద్యోగులతో పాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వీరి సొంతమవుతాయి.
మారిన పరిస్థితులకనుగుణంగా రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, ఆటోమేషన్, డ్రోన్స్‌ రంగాల్లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ప్రాముఖ్యం గణనీయంగా పెరిగింది. ఈ బ్రాంచి విద్యార్థులకు ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, ఇండియన్‌ ఆర్మీ, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, ఓఎన్‌జీసీ, డీఆర్‌డీఓ, డీఎంఆర్‌ఎల్, హెచ్‌ఎఎల్, ఎన్‌టీపీసీ మొదలైనవాటిలో ఉద్యోగ అవకాశాలు పుష్కలం. ప్రైవేటు రంగంలో రిలయన్స్, హిందుస్థాన్‌ లీవర్‌ లిమిటెడ్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, అశోక్‌ లేలాండ్, హీరో హోండా, రెనాల్ట్‌ నిస్సాన్, ఇసుజు వంటి ప్రైవేటు రంగాల్లోనూ కొలువులు ఉన్నాయి. విమానయాన రంగంలో కూడా ఉద్యోగాలు లభిస్తున్నాయి.
 

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ)
ఇంజినీరింగ్‌ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్న బ్రాంచీల్లో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ ఒకటి. ఈ రంగంలో విద్యార్థులు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో రాణించవచ్చు. 
ఈ బ్రాంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ కంప్యూటర్, టెలికమ్యూనికేషన్‌ సిస్టమ్స్, సంబంధిత పరిశ్రమల ఇంజినీరింగ్‌ సమస్యలు, అవకాశాలు, అవసరాలకు సంబంధించినది. ఈ శాఖ విద్యార్థులకు పవర్‌ సిస్టమ్స్, కంట్రోల్‌ సిస్టమ్స్, సిగ్నల్‌ ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెసర్లు, మైక్రో ఎలక్ట్రానిక్స్, విద్యుత్‌ ఉత్పత్తి, ఎలక్ట్రికల్‌ మెషీన్స్‌ లాంటి ప్రధాన విభాగాల్లో ప్రాథమిక జ్ఞానం అందిస్తుంది. ప్రస్తుత తరుణంలో సోలార్‌ విద్యుత్తు వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ బ్రాంచి ప్రాముఖ్యం పెరిగింది. పవన శక్తి, విద్యుత్‌ వాహన రంగంలో కూడా సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్న తరుణంలో వాటి తయారీ రంగంలో ఎలక్ట్రికల్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  ఈ బ్రాంచి విద్యార్థులకు జెన్కో, ట్రాన్స్‌కో, పవర్‌ గ్రిడ్, ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల తో పాటు శాంసంగ్, రిలయన్స్, సీమెన్స్, క్రాంప్టన్‌ గ్రీవ్స్, హిటాచి వంటి ప్రైవేటు సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీతో పాటు ఈ బ్రాంచి విద్యార్థులు ఐఓటీ, మెషిన్‌ లర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ లాంటి కోర్సులు నేర్చుకొని కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌ కంపెనీలు పెట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువ.ప్రత్యేకించి ఈ బ్రాంచి విద్యార్థులకు విద్యుత్‌ సంబంధిత ప్రభుత్వళళళ- ప్రైవేటు ఉద్యోగ అవకాశాలతో పాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా విద్యుత్‌ రంగంలో అమలుపరుస్తున్న పథకాలు, హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు ద్వారా రానున్న కాలంలో ఎలక్ట్రికల్‌ ఇంజనీర్ల ఆవశ్యకత చాలా ఉంటుంది. మరోవైపు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను దేశీయంగానే తయారుచేసే దిశగా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. 
 

సివిల్‌ ఇంజినీరింగ్‌

సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం కొత్త టెక్నాలజీల వినియోగంతో ప్రాముఖ్యత సంతరించుకుని సరికొత్త అవకాశాలను అందిస్తోంది.  ఆటో క్యాడ్, స్టాడ్‌ ప్రో, బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడలింగ్, ఆర్క్‌ జీఐఎస్‌ లాంటి కంప్యూటర్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను సివిల్‌ ఇంజినీరింగ్‌కు అన్వయించటం వల్ల ఉన్నత ఉద్యోగావకాశాలకు ఆస్కారం ఏర్పడింది. ఈ బ్రాంచి విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతోపాటు ఎల్‌ అండ్‌ టి, మెగా ప్రైవేట్‌ లిమిటెడ్, బిఎస్‌సీపీఎల్, టాటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి కోర్‌ కంపెనీల్లోనూ ఉద్యోగాలు సాధిస్తున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు కట్టడాల డిజైన్లకు సంబంధించిన నైపుణ్యాన్ని సంపాదిస్తే నిర్మాణ రంగంలో అవకాశాలు కోకొల్లలు. దేశవిదేశాల్లో విస్తరిస్తున్న నిర్మాణ రంగం, స్మార్ట్‌ నగరాలు, అర్బన్‌ డెవలప్‌మెంట్, భారీ ప్రాజెక్టులు, జీఐఎస్, జీపీ‡ఎస్‌ వంటివి ఉద్యోగావకాశాలను విస్తరింపజేస్తున్నాయి. ఈ కోర్సు ఎంచుకుని పూర్తిచేసిన విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్,  పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్, ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా అసిస్టెంట్‌ ఇంజినీర్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, జూనియర్‌ ఇంజనీర్, ఇతర పోస్టుల్లో అవకాశాలు పొందుతున్నారు. 
 

Posted Date: 27-08-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌