• facebook
  • whatsapp
  • telegram

కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

జెనరేటివ్‌ ఏఐ కెరియర్‌ వివరాలుఐటీ కెరియర్లలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాముఖ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు దానికి అదనంగా జెనరేటివ్‌ ఏఐ కొత్త అవకాశాలకు తెర తీస్తోంది. కెరియర్‌ ప్రారంభదశలో ఉన్నవారైనా, నైపుణ్యాలను మెరుగు పరుచుకోదలచుకునే వారైనా దీన్ని నేర్చుకుంటే అవకాశాలను మరింత విస్తృతం చేసుకోవచ్చు. 


జెనరేటివ్‌ (జెన్‌) ఏఐ ప్రధాన లక్ష్యం యూజర్లకు కంటెంట్‌ క్రియేట్‌ చేయడానికి ఉపయోగపడటం. అడిగిన క్వెరీలకు ఇది వివిధ ఇన్‌పుట్స్‌ను ఆధారంగా చేసుకుని జవాబు ఇస్తుంది. ఈ పద్ధతిలో ఇన్‌పుట్, అవుట్ప్‌ట్‌ మోడల్‌లో టెక్ట్స్, ఇమేజెస్, సౌండ్స్, యానిమేషన్, 3డీ మోడల్స్‌.. వంటి డేటా ఉంటుంది. దీన్ని ఉపయోగించడం తేలిక కావడం, సమీప భవిష్యత్తులో దీని వాడకం మరింత పెరుగుతుందనే అంచనాలతో ఈ అంశానికి ప్రాముఖ్యం పెరుగుతోంది.


నిజానికి ఇది పూర్తి కొత్త టెక్నాలజీ కాదు, దీన్ని 1960ల్లోనే చాట్‌బోట్స్‌ కోసం ఉపయోగించారు. అయితే 2014లో జెనరేటివ్‌ అడ్వర్సరల్‌ నెట్‌వర్క్స్‌- జీఏఎన్స్‌ (ఒక రకమైన మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌) తయారయ్యేవరకూ ఇది అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఇది ఏ విధమైన కంటెంట్‌నైనా మెరుగ్గా చేసేందుకు సహాయపడుతుంది. ఈ టెక్నాలజీతో అత్యంత ఉపయోగకరమైన ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌ను తయారుచేయవచ్చు. అదే సమయంలో దీని ద్వారా డీప్‌ ఫేక్‌ చిత్రాలు, వీడియోలు, నష్టదాయకమైన సైబర్‌ సెక్యూరిటీ అటాక్స్‌ వంటివి అధికమయ్యే ప్రమాదమూ పెరిగింది. 


ఎలా పనిచేస్తుంది?

జెనరేటివ్‌ ఏఐ పాత డేటాను ఉపయోగించడంలోనూ కొత్త కంటెంట్‌ను సృష్టించడంలోనూ న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ను ఉపయోగిస్తుంది. ఎక్కువ సంఖ్యలో అస్తవ్యస్తంగా ఉన్న డేటాను సక్రమంగా నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మల్టిపుల్‌ టాస్కులను నిర్వహించే ఏఐ సిస్టమ్స్‌కు ఈ ఫౌండేషన్‌ మోడల్స్‌ ఎంతగానో పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ టెక్ట్స్, ఇమేజ్, వీడియో, డిజైన్, మ్యూజికల్‌ నోట్స్, ఇతర ఏ విధమైన ఇన్‌పుట్‌ను అయినా ప్రాసెస్‌ చేసే విధంగా ఉంది. తొలుత ఉన్న జెన్‌ ఏఐ వెర్షన్స్‌లో డేటాను క్లిష్టమైన ప్రక్రియల ద్వారా ఇవ్వాల్సి వచ్చేది. డెవలపర్లు దీన్ని ఉపయోగించేందుకు పైతాన్‌ వంటి లాంగ్వేజ్‌లను వాడేవారు. అయితే ఇప్పుడు మెరుగైన యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు పరిశోధనలు జరిగాయి. తేలిక భాషలో అడిగినా సమాధానాలు చెప్పేలా కొత్త టెక్నాలజీ వస్తోంది. మొదట వచ్చిన జవాబు తర్వాత ప్రశ్నను మార్చవచ్చు, సంతృప్తికరమైన సమాధానం వచ్చేవరకూ ఎలా అంటే అలా అడగవచ్చు. 


జెన్‌ ఏఐ ఫౌండేషన్‌ మోడల్స్‌కు జీపీటీ-3, స్టేబుల్‌ డిఫ్యూజన్‌ వంటి వాటిని ప్రధాన ఉదాహరణలుగా చెప్పవచ్చు. చాట్‌జీపీటీ వంటివి చిన్న టెక్ట్స్‌ రిక్వెస్ట్‌ ఆధారంగా పెద్ద వ్యాసం రాసేందుకు సహాయపడగలవు. అదే సమయంలో స్టేబుల్‌ డిఫ్యూజన్‌ ఫొటోరియలిస్టిక్‌ ఇమేజెస్‌ తయారుచేసేందుకు ఉపయోగపడుతుంది. వర్క్‌ ఫ్లో క్రియేటివ్స్, ఇంజినీర్స్, సైంటిస్ట్స్, రిసెర్చర్లు.. అందరికీ తమ పనిలో జెనరేటివ్‌ ఏఐ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎమ్స్‌).. లక్షల కోట్ల సంఖ్య కలిగిన పారామీటర్స్‌తో ఎంతగానో మెరుగయ్యాయి.  


అయితే మనం జెన్‌ ఏఐను వినియోగించడంలో ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాం. తప్పు సమాధానాలు చెప్పడం, విచిత్రమైన జవాబులు రావడం వంటి సందర్భాలున్నాయి. ఇప్పటివరకూ ఇందులో జరిగిన అభివృద్ధి ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. వ్యాపారాలు నడిచే తీరును మార్చగలదు. ఈ టెక్నాలజీ కోడ్‌ రాయడం, కొత్త మందులను కనిపెట్టడం, ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, వ్యాపార ప్రక్రియలను తిరిగి డిజైన్‌ చేయడం, సప్లై చెయిన్స్‌ను నడిపించడంలో సహాయపడుతుంది. 


వీటిలో ఏమున్నాయి? 

జనరేటివ్‌ ఏఐ టూల్స్‌లో చాలా రకాలున్నాయి. టెక్ట్స్, ఇమేజినరీ, మ్యూజిక్, కోడ్, వాయిస్‌లను ఉపయోగిస్తూ క్వెరీలు అడిగేలా ఉన్న వీటిలో ఏమున్నాయంటే.. 

జీపీటీ, జాస్పెర్, ఏఐ-రైటర్, లెక్స్‌ వంటి టెక్ట్స్‌ జనరేషన్‌ టూల్స్‌ 

డాల్‌-ఈ 2, మిడ్‌జర్నీ, స్టేబుల్‌ డిఫ్యూజన్‌ వంటి ఇమేజ్‌ జెనరేషన్‌ టూల్స్‌  

మ్యూజిక్‌ జనరేషన్‌ టూల్స్‌లో యాంపర్, డేటాబోట్స్, మ్యూజ్‌నెట్‌  

కోడ్‌స్టార్టర్, కోడెక్స్, గిట్‌హబ్‌ కోపైలెట్, ట్యాబ్‌నైన్‌ వంటి కోడ్‌ జనరేషన్‌ టూల్స్‌ 

వాయిస్‌ సింథసిస్‌ టూల్స్‌లో డిస్క్రిప్ట్, లిస్టర్, పాడ్‌క్యాస్ట్‌ ఏఐ

ఏఐ చిప్‌ డిజైన్‌ టూల్‌ కంపెనీల్లో సినాప్సిస్, క్యాడెన్స్, గూగుల్‌ లాంటివి  


ఏఐకీ, జెన్‌ ఏఐకీ తేడా 

జెనరేటివ్‌ ఏఐ కొత్త కంటెంట్‌ను క్రియేట్‌ చేయడంపై, చాట్‌ రెస్పాన్స్‌లు ఇవ్వడంపై డిజైన్ల తయారీపై, డీప్‌ఫేక్స్‌పై దృష్టి పెడుతుంది. ఇది క్రియేటివ్‌ ఫీల్డ్స్‌లో బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో విధాలైన కొత్త అవుట్‌పుట్స్‌ను సిద్ధం చేస్తుంది. ట్రాన్స్‌ఫార్మర్స్, జీఏఎన్, వీఏఈ వంటి న్యూరల్‌ నెట్‌వర్క్‌ టెక్నిక్స్‌ మీద ఆధారపడి పనిచేస్తుంది. మిగతా రకాలైన ఏఐ సాధారణ న్యూరల్‌ నెట్‌వర్క్స్, రీయిన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ వంటి టెక్నిక్స్‌ను ఉపయోగిస్తాయి. జెన్‌ ఏఐ కంటెంట్‌ జనరేషన్‌కు అడిగిన క్వెరీలను ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. సాధారణ ఏఐ ముందుగా ఇచ్చిన నిబంధనలకు లోబడి పనిచేస్తుంది. రెండింటికీ తమవైన బలాలూ, బలహీనతలూ ఉన్నాయి. 


భవిష్యత్తు?

సమీప భవిష్యత్తులో జెన్‌ ఏఐ వాడకం చాలాచోట్ల పెరుగుతుందని అంచనా. అదేసమయంలో దీని వినియోగం మరీ అధికం అవ్వడం దీని సురక్షితమైన, బాధ్యతాయుతమైన వినియోగాన్ని గుర్తు చేస్తుంది. అయితే కొత్తలో వచ్చిన ఇబ్బందులు ఏఐ సృష్టించిన టెక్ట్స్, ఇమేజ్, వీడియో ఏదో, వాస్తవమైనవి ఏవో గుర్తించేలా చేయనున్నాయి. దీనికి ప్రాచుర్యం పెరగడంతో చాలా రకాల శిక్షణ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ఏఐ అప్లికేషన్ల రూపకల్పనలో డెవలపర్లకు సాయం చేస్తాయి. ఇతర కోర్సులు వ్యాపారాల్లో వినియోగాన్ని సులభతరం చేస్తాయి. జెన్‌ ఏఐ ఇంకా పరిణామం చెందుతోంది. ఎన్నో నూతన ఆవిష్కరణలకు కారణం అవుతోంది. దీని ద్వారా ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఎన్నో టూల్స్‌ మరింత మెరుగవుతాయి. రోజువారీ పనులు ఇంకా సులభమయ్యేలా చేయగలుగుతాయి.


ఏ ప్రయోజనాలు? 

వ్యాపార రంగంలో అనేక చోట్ల జెనరేటివ్‌ ఏఐని ఉపయోగించవచ్చు. ఇది పనులు జరిగే తీరును మెరుగుపరచగలదు.  

కంటెంట్‌ రైటింగ్‌ను ఆటోమేట్‌ చేస్తుంది. 

ఈ-మెయిల్స్‌కు జవాబిచ్చే పనిని తగ్గిస్తుంది. 

టెక్నికల్‌ క్వెరీలకు సంబంధించిన సమాధానాలను మెరుగుపరుస్తుంది.  

క్లిష్టమైన సమాచారాన్ని ఒక పద్ధతిలో సమర్పిస్తుంది.  


జెన్‌ ఏఐ వాడకం రాబోయే రోజుల్లో పెరగబోతోంది. దీనికి ప్రాచుర్యం పెరగడంతో చాలా రకాల శిక్షణ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ఏఐ అప్లికేషన్ల రూపకల్పనలో డెవలపర్లకు సాయం చేస్తాయి. ఇతర కోర్సులు వ్యాపారాల్లో వినియోగాన్ని సులభతరం చేస్తాయి. జెన్‌ ఏఐ ఇంకా పరిణామం చెందుతోంది. ఎన్నో నూతన ఆవిష్కరణలకు కారణం అవుతోంది. దీని ద్వారా ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఎన్నో టూల్స్‌ మరింత మెరుగవుతాయి.


నేర్చుకోవడం ఎలా? 

జెన్‌ ఏఐకి సంబంధించి ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో- ఇంట్రడక్షన్‌ టు జెన్‌ ఏఐ, జెనరేటివ్‌ ఏఐ విత్‌ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్, జెన్‌ ఏఐ ఫండమెంటల్స్, జెన్‌ ఏఐ ఫర్‌ డేటా సైన్సెస్‌ - సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్, జెన్‌ ఏఐ ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌ బేసిక్స్‌.. లాంటి కోర్సులు యుడెమీ, కోర్సెరా, స్కిల్‌ షేర్‌ వంటి పలు చోట్ల అందుబాటులో ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికెట్‌ ప్రోగామ్స్‌ కూడా పలు సంస్థలు అందిస్తున్నాయి. 


వచ్చే కాలంలో జెన్‌ ఏఐ వినియోగం కంటెంట్‌ క్రియేషన్, డేటా అనలిటిక్స్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, బిజినెస్‌ ఇన్‌సైట్, ఇంటర్నల్‌ కస్టమర్‌ సపోర్ట్, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్, సెక్యూరిటీ, ప్రాసెస్‌ ఆటోమెటేషన్‌.. వీటన్నింటిలో మరింత అధికం కానుంది. డేటా సైంటిస్ట్, మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్, ఏఐ రిసెర్చర్, అల్గారిదమ్‌ ఇంజినీర్, డీప్‌ లెర్నింగ్‌ ఇంజినీర్, ఎన్‌ఎల్‌పి ఇంజినీర్, ఏఐ చాట్‌బోట్‌ డెవలపర్, ప్రాంప్ట్‌ ఇంజినీర్స్, ఏఐ ఆర్టిస్ట్‌.. ఇలా ఈ రంగంలో పలు కెరియర్ల అవకాశాలున్నాయి. కంపెనీలు జెన్‌ ఏఐ సంబంధిత కెరియర్లలో పెరుగుదల కనిపిస్తున్నట్లు చెబుతున్నాయి. అందువల్ల దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా మంచి అవకాశాలను అందుకోవచ్చు. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

‣ పరీక్షలో మంచి మార్కులకు మెలకువలు

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

Posted Date: 20-03-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌