• facebook
  • whatsapp
  • telegram

ఆర్కిటెక్చ‌ర్ కెరియ‌ర్‌లోకి 'నాటా' బాట‌

వెలువ‌డిన నోటిఫికేష‌న్ 

అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌/ డిప్లొమా

ఆర్కిటెక్చర్‌ విద్యపై ఆసక్తి ఉన్నవారికి ప్రవేశావకాశం వచ్చిందిపుడు! జాతీయ స్థాయి పరీక్ష- నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) నుంచి అడ్మిషన్‌ ప్రకటన వెలువడింది. అర్హత సాధిస్తే అయిదేళ్ల బీఆర్క్‌ డిగ్రీలో ప్రవేశం పొందొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది!

నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) జాతీయస్థాయి పరీక్ష. దీన్ని కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (సీఓఏ) నిర్వహిస్తుంది. 2019 నుంచి దీన్ని ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా సీఓఏ నిర్ణయించింది. విద్యార్థులు ఈ రెండింట్లో తమకు నచ్చినదాన్ని రాయొచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష. ఆర్కిటెక్చర్‌ విభాగంలో అభ్యర్థి ఆప్టిట్యూడ్‌ని పరీక్షించడం దీని ఉద్దేశం. డ్రాయింగ్, పరిశీలనా నైపుణ్యాలు, కాగ్నిటివ్‌ స్కిల్స్, కళాత్మక దృష్టి, క్రిటికల్‌ థింకింగ్‌ వంటి అంశాలను పరీక్షలో భాగంగా పరీక్షిస్తారు. మొత్తంగా అభ్యర్థిలో అంతర్గతంగా దాగిన నైపుణ్యాలను పరిశీలిస్తారు.  

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌తో ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్య లేదా మ్యాథమేటిక్స్‌తో 10+3 డిప్లొమా చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కనీసం 50% మార్కులు సాధించి ఉండటం తప్పనిసరి. ఇంటర్మీడియట్‌/ 10+3 డిప్లొమా తుది సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. బీఆర్క్ కోర్సులో చేరిన మొద‌టి ఏడాదిలోపు ఇంటర్మీడియ‌ట్ అర్హ‌త సాధించాల్సి ఉంటుంది. ప్రవేశపరీక్షలో అర్హత సాధించినవారు దేశవ్యాప్తంగా సీఓఏ గుర్తింపు పొందిన ఆర్కిటెక్చరల్‌ విద్యాసంస్థల్లో అయిదేళ్ల వ్యవధిగల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీ ఆర్క్‌) కోర్సులో ప్రవేశం పొందుతారు.

పరీక్ష విధానం ఏమిటి? 

రెండు పరీక్షలనూ రెండేసి సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ ఉదయం 10గం. నుంచి మధ్యాహ్నం 1 గం. వరకూ, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకూ ఉంటాయి. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. మొత్తం ప్రశ్నల సంఖ్య 125. మొత్తం మార్కులు 200.

ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ (ఎంసీక్యూ), మల్టిపుల్‌ సెలెక్ట్‌ (ఎంఎస్‌క్యూ), ప్రిఫరెన్షియల్‌ చాయిస్‌ (పీసీక్యూ), న్యూమరికల్‌ ఆన్సర్‌ (ఎన్‌ఏక్యూ) విధానాల్లో ఉంటాయి. డయాగ్రమాటిక్‌ రీజనింగ్, న్యూమరికల్‌ రీజనింగ్, వెర్బల్‌ రీజనింగ్, ఇండక్టివ్‌ రీజనింగ్, సిచ్యువేషనల్‌ జడ్జ్‌మెంట్, లాజికల్‌ రీజనింగ్, ఆబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నను బట్టి మార్కుల్లో తేడాలున్నాయి. సాధారణంగా ప్రశ్నను బట్టి 1, 2, 3 మార్కులుంటాయి. ప్రశ్నలన్నీ ఆంగ్లమాధ్యమంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. 

మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌ అండ్‌ జామెట్రీ ప్రాథమికాంశాలు, లాంగ్వేజ్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్, ఎలిమెంట్స్‌ అండ్‌ ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ డిజైన్, ఈస్థటిక్‌ సెన్సిటివిటీ, కలర్‌ థియరీ, లేటరల్‌ థింకింగ్, లాజికల్‌ రీజనింగ్, విజువల్‌ పర్సెప్షన్‌ అండ్‌ కాగ్నిషన్, గ్రాఫిక్స్‌ అండ్‌ ఇమేజెస్, బిల్డింగ్‌ అనాటమీ అండ్‌ ఆర్కిటెక్చరల్‌ ఒకాబులరీ, బేసిక్‌ టెక్నిక్స్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్, నాలెడ్జ్‌ మెటీరియల్, జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలను ఆశించవచ్చు.

దరఖాస్తు ఎలా? 

మొదటి పరీక్ష ఏప్రిల్‌ 10న, రెండోది జూన్‌ 12న జరగనున్నాయి. అభ్యర్థులు ఏదో ఒకదానికైనా, రెండింటికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండో పరీక్ష రిజిస్ట్రేషన్‌ విండో మొదటి సెషన్‌ ఫలితాలు విడుదలైన 14 రోజుల తరువాత ప్రారంభమవుతుంది. రెండింటినీ రాసినవారికి విడివిడిగా ర్యాంకు కార్డులు ఇస్తారు. దేనిలో మెరుగైన మార్కులు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. 

అధికారిక వెబ్‌సైట్‌: http://www.nata.in/ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంలో మూడు విభాగాలు- వ్యక్తిగత వివరాలు, డాక్యుమెంట్‌ అప్‌లోడింగ్, ఫీజు చెల్లింపు ఉంటాయి. దరఖాస్తు పూర్తిచేశాక  దాన్ని డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోవాలి. ప్రింటవుట్‌లను పంపాల్సిన అవసరం లేదు. 

దరఖాస్తు ఫీజు: ఒక పరీక్షకు రూ. 2000. రెండింటికీ దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి రూ.4000. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూవారికి ఒక పరీక్షకు రూ.1500; రెండింటికి రూ.3000.

పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌ - గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణ - హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: ఏప్రిల్‌ 01, 2021

పరీక్ష తేదీలు: మొదటి పరీక్ష- ఏప్రిల్‌ 10, 2021; రెండో పరీక్ష: జూన్‌ 12, 2021
 

Posted Date: 28-03-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌