• facebook
  • whatsapp
  • telegram

ఆర్కిటెక్చర్‌లో అగ్రశ్రేణి సంస్థలు ఇవీ!

నిర్మాణ రంగంలో ఆర్కిటెక్టుల సేవలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆర్కిటెక్చర్‌ విభాగంలో సేవలు అందించడానికి యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు ఆర్కిటెక్చర్లుగా రాణించగలరు. దేశంలో ఆర్కిటెక్చర్‌ కోర్సులు అందించే సంస్థల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), రవుర్కెలా ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్ర మానవ వనరుల విభాగానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2018 నుంచి ఆర్కిటెక్చర్‌ విభాగంలో ర్యాంకులు కేటాయిస్తోంది. గతంలో వరుసగా మూడేళ్లపాటు ఖరగ్‌పూర్‌ ఐఐటీ నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఆర్కిటెక్చర్‌ కోర్సుకున్న ప్రాధాన్యం నేపథ్యంలో దేశంలో ఈ చదువులు అందిస్తోన్న మేటి సంస్థలు, ప్రవేశ మార్గాలను తెలుసుకుందాం...

కొన్ని నిర్మాణాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. చూపుల్ని తిప్పుకోనివ్వవు. ఇప్పుడు ఆధునిక కట్టడాలు ఆకాశహర్మ్యాల్లా మేఘాలను తాకుతూ ఔరా అనిపిస్తున్నాయి. వీటి వెనుక నిపుణుల సృజన దాగి ఉంది. నిర్మాణం ఏదైనప్పటికీ దాని రూపశిల్పులు ఆర్కెటెక్చర్లే. ఆర్కిటెక్చర్లు నిర్మాణ రంగానికి సృజనాత్మకత జోడిస్తారు. ఆకట్టుకునేలా ఆకృతి (డిజైన్‌) రూపొందించడం వీరి ప్రధాన విధి. ఈ కోర్సులు పూర్తి చేసుకున్నవారికి నిర్మాణ, స్థిరాస్తి సంస్థల్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ విభాగాలు, రైల్వే, రక్షణ శాఖ, ఏర్‌ పోర్టు అథారిటీ, హౌసింగు బోర్డులు, కార్పొరేషన్లు, కార్పొరేట్‌ సంస్థలు.. మొదలైన చోట్ల ఉద్యోగాలు ఉంటాయి. 

జేఈఈ ఆర్క్‌ స్కోరుతో... 

దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు ఆర్కిటెక్చర్‌లో బీఆర్క్, ఎంఆర్క్, పీహెచ్‌డీ కోర్సులు అందిస్తున్నాయి. చాలా ఐఐటీలు బీఆర్క్‌లో భాగంగా ఆర్కిటెక్చర్‌ కోర్సులు నడుపుతున్నాయి. ఐఐటీ-జేఈఈ ఆర్కిటెక్చర్‌ స్కోరుతో ప్రవేశం లభిస్తుంది. పీజీలో సిటీ ప్లానింగ్, సస్ట్టెయినబుల్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌..ఇలా పలు స్పెషలైజేషన్‌ కోర్సులు ఉన్నాయి. గేట్‌ స్కోర్‌తో వీటిలో చేరవచ్చు. బోధన, పరిశోధనల్లో ఐఐటీ రవుర్కెలా చూపిన వైవిధ్యం కారణంగా ఆర్కిటెక్చర్‌ విభాగంలో ప్రధమ స్థానంలో నిలిచింది.

మేటి పది సంస్థలు

1 ఐఐటీ రవుర్కెలా, 

2 ఎన్‌ఐటీ కాలికట్, 

3 ఐఐటీ ఖరగ్‌పూర్, 

4 స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, న్యూదిల్లీ, 

5 సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ అహ్మదాబాద్, 

6 స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, భోపాల్, 

7 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తిరుచిరాపల్లి, 

8 స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, విజయవాడ, 

9 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, షిబ్‌పూర్, 

10 జామియా మిల్లియా ఇస్లామియా, న్యూదిల్లీ

తెలుగు రాష్ట్రాల్లో... స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ విజయవాడ 8వ స్థానంలో నిలిచింది. మొత్తం 25 సంస్థలకే ఈ ర్యాంకులు కేటాయించారు. అందువల్ల మిగిలినవి చోటు దక్కించుకోలేకపోయాయి. దేశంలో ఎన్నో సంస్థలు అయిదేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశం జేఈఈ ఆర్కిటెక్చర్‌ స్కోరుతో లభిస్తుంది. కొన్ని సంస్థలు నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా)తో అవకాశం కల్పిస్తున్నాయి.
 

Posted Date: 13-12-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌