• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకింగ్‌ టెక్నాలజీలో.. పీజీ డిప్లొమా

‣ తుది గడువు ఏప్రిల్‌ 30


 


బ్యాంకింగ్‌ వ్యవహారాలకు టెక్నాలజీ ఎంతో ముఖ్యం. నాణ్యమైన సేవలు అందించడమే కాకుండా, ఎలాంటి సైబర్‌ దాడులూ జరగకుండా రక్షణగా నిలవడంలో సాంకేతికతే దివ్యాస్త్రం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సాంకేతిక పరంగా సమర్థ మానవ వనరులను అందించడానికి.. ఆర్‌బీఐ ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ’ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. ఇక్కడ   పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా  ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ కోర్సు అందిస్తున్నారు. ఇందులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.


వ్యవహారాలన్నీ సులువుగా, సజావుగా, కచ్చితత్వం, పరిమిత వనరులతో పూర్తి కావడంలో డిజిటల్‌ టెక్నాలజీ దోహదపడుతోంది. బ్యాంకులు దీన్ని అందిపుచ్చుకునేందుకు 1996లో ఐడీఆర్‌బీటీని హైదరాబాద్‌లో మాసబ్‌ ట్యాంకు ఎన్‌ఎండీసీ సమీపంలో ఆర్‌బీఐ నెలకొల్పింది. ఈ సంస్థ భారతీయ బ్యాంకులు, ఆర్థిక విభాగాలకు అవసరమైన సాంకేతికతపై శిక్షణ అందించడంతోపాటు ఆ రంగాలకు అవసరమైన డిజిటల్‌ టెక్నాలజీపై పరిశోధనలూ నిర్వహిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం, బ్యాంకులకు నిర్వహణ ఖర్చులు తగ్గించడం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లాభదాయకంగా మారడం దిశగా రూపొందించిందే బ్యాంకింగ్‌ టెక్నాలజీ పీజీ డిప్లొమా కోర్సు. దీన్ని 2016 నుంచి అందిస్తున్నారు. తాజా ప్రకటన ద్వారా ప్రవేశం పొందినవారికి జులై ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ కోర్సులో చేరినవారు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అవసరమైన సాంకేతికాంశాలపై మేటి శిక్షణను సొంతం చేసుకోవచ్చు. కోర్సు చివరలో ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాన్నీ అందుకోవచ్చు.  


ఏడాది వ్యవధితో...

కోర్సును ఫుల్‌ టైం విధానంలో ఏడాది వ్యవధితో నడుపుతున్నారు. ఇందులో సాంకేతిక వినియోగం, సమన్వయం, నిర్వహణల గురించి తెలుపుతారు. మారుతోన్న సాంకేతికత బ్యాంకింగ్‌ రంగానికి ఎలా అనువర్తించాలో విద్యార్థులు నేర్చుకుంటారు. వీరికి ఆధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ అందించి టెక్నో నిపుణులుగా రూపొందిస్తారు. భారతీయ బ్యాంకింగ్‌, ఆర్థిక విభాగాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉండేలా అవసరమైన తర్ఫీదు అందిస్తారు. ఈ రంగాల్లో తాజా సాంకేతిక మార్పులను అనువర్తిస్తారు. నేర్చుకున్న టెక్నాలజీని పలు విధాలుగా ఉపయోగించి బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో ఉత్పాదకత పెరిగేలా చేయడంలో శిక్షణ అందిస్తారు. కోర్సులో ప్రాక్టికల్‌ లెర్నింగ్‌కు ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం దేశీయ, విదేశీ బ్యాంకులు ఉపయోగిస్తున్న టెక్నాలజీపై సమగ్ర అవగాహన కల్పిస్తారు.


ఏం నేర్చుకుంటారు?

కోర్సు ఫీజు వసతితో కలిపి రూ.5 లక్షలు. పన్నులు అదనం. బ్యాంకులు రుణ సౌకర్యం కల్పిస్తున్నాయి. కోర్సు మొత్తం 4 టర్మ్‌ల్లో ఉంటుంది. ఇందులో లెక్చర్లు, సెమినార్లతోపాటు ఐటీ నిపుణులతో ఇంటరాక్టివ్‌ సెషన్లు ఉంటాయి. సీనియర్‌ బ్యాంకర్లతోపాటు సంస్థకు చెందిన రిసెర్చ్‌ సెంటర్లు ఇందులో భాగమవుతాయి. క్రిప్టోగ్రఫీ, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఐవోటీ, బిగ్‌డేటా, అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, మొబైల్‌ బ్యాంకింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, పేమెంట్‌ సిస్టమ్‌.. మొదలైన అంశాల్లో విస్తృతంగా తర్ఫీదిస్తారు. చివరి టర్మ్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌. ఫ్యాకల్టీ సభ్యుల పర్యవేక్షణలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో దీన్ని పూర్తిచేయాలి. ప్రతిభావంతులు ప్రాజెక్ట్‌ వర్కు సమయంలో స్టైపెండ్‌నూ పొందవచ్చు. కోర్సులో విజయవంతమైనవారికి పీజీ డిప్లొమా ప్రదానం చేస్తారు.

కోర్సు ఆఖరులో ప్రాంగణ నియామకాలు చేపడతారు. వంద శాతం ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, బంధన్‌, ఐడీబీఐ, కరూర్‌ వైశ్య, ఫెడరల్‌, కొటక్‌, సౌత్‌ ఇండియా, ఎన్‌పీసీఐ.. తదితర సంస్థలు వీరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.


అర్హత, ఎంపిక  

సీట్లు: 40. వీటిలో 10 స్పాన్సర్డ్‌. వీటిని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కేటాయించారు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌ లేదా ఏదైనా సబ్జెక్టులో ఫస్ట్‌ క్లాస్‌తో పీజీ. అదీ 10+2+4 విధానంలో చదివుండాలి. గేట్‌, క్యాట్‌, జీమ్యాట్‌, జీఆర్‌ఈ, సీమ్యాట్‌, గ్జాట్‌, మ్యాట్‌, ఆత్మా... వీటిలో ఏదో ఒక స్కోరు తప్పనిసరి.

ఎంపిక: వచ్చిన దరఖాస్తులను స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు.

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30

వెబ్‌సైట్‌: www.idrbt.ac.in/pgdbt/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అవుతారా.. కేంద్ర ప్రభుత్వ ఇంజినీర్‌! 

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

Posted Date: 11-04-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌