• facebook
  • whatsapp
  • telegram

బయోటెక్నాలజీలో పీజీ అడ్మిషన్లు

దరఖాస్తు విధానం, పరీక్ష సరళి వివరాలుజాతీయస్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - బయోటెక్నాలజీ (జీఏటీ-బి) ప్రవేశపరీక్షకు సమయం ఆసన్నమైంది. బయోటెక్నాలజీ సంబంధిత కోర్సుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో చేరేందుకు, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (డీబీటీ -జేఆర్‌ఎఫ్‌) అందుకునేందుకు విద్యార్థులంతా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది.మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా..


నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఈ ఏడాది నిర్వహించే జీఏటీ-బి-2024 దరఖాస్తును ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా విడుదల చేసింది. ఎంటెక్‌, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇదే సరైన సమయం. వీరు వెబ్సైట్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన దరఖాస్తులను నింపి అప్‌లోడ్‌ చేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకుని, దరఖాస్తు నింపి, అవసరమైన డాక్యుమెంట్లు  అప్‌లోడ్‌ చేసి, పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహించే ప్రక్రియ. 2024, ఏప్రిల్‌ 20వ తేదీన ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తులను 2024, మార్చి 6వ తేదీ సాయంత్రం వరకూ స్వీకరిస్తారు.


దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత ఎన్‌టీఏ అప్లికేషన్‌ ఫామ్‌ కరెక్షన్‌ విండోను మార్చి 8వ తేదీన అందుబాటులోకి తీసుకొస్తుంది. దరఖాస్తును విజయవంతంగా పూర్తిచేసిన వారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే సమయంలో అడ్మిట్‌కార్డుతోపాటు ఫొటోతో కూడిన ఒక  ఐడెంటిటీ ప్రూఫ్‌ను తప్పక వెంట తీసుకెళ్లాలి. పరీక్ష అనంతరం పాసైన విద్యార్థులకు ర్యాంకులు  కేటాయిస్తారు. అలా ర్యాంకులు పొందిన వారు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. అనంతరం సీట్ల కేటాయింపు జరుగుతుంది.


దీని ద్వారా ఎంటెక్‌ బయోటెక్నాలజీ/అలైడ్‌ సైన్సెస్‌, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.


ఈ పరీక్ష రాసేందుకు జనరల్‌, ఓబీసీ - ఎన్‌సీఎల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1200 ఫీజుగా చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600    చెల్లించాలి.


పరీక్ష ఆన్‌లైన్‌లో 3 గంటలపాటు జరుగుతుంది. పూర్తిగా ఇంగ్లిష్‌లోనే ఉంటుంది.


మొత్తం 63 విద్యాసంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. వీటిలో 1206 సీట్లు విద్యార్థుల కోసం ఉన్నాయి. దేశవ్యాప్తంగా 56 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.


అర్హులెవరు?

పరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులు తప్పకుండా తమ బ్యాచిలర్‌ డిగ్రీను బయొలాజికల్‌, ఫిజికల్‌, వెటర్నరీ - ఫిషరీ సైన్సెస్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ, 4 ఏళ్ల బీఎస్సీ (ఫిజీషియన్‌ అసిస్టెన్స్‌ కోర్స్‌), మెడిసిన్‌ లేదా బీడీఎస్‌ చదివి ఉండాలి. కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలి, ఆఖరి సంవత్సరం పరీక్ష రాసేవారూ అర్హులే.


పరీక్ష విధానం

జీఏటీ-బి 2024 పరీక్షా విధానాన్ని కూడా ఎన్‌టీఏ విడుదల చేసింది. దరఖాస్తుదారులంతా కచ్చితంగా ఆ వివరాలు పరిశీలిచడం ద్వారా పరీక్షపై మరింతగా అవగాహన పెంచుకోవచ్చు. ఈ ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది.

పార్ట్‌ ఏ - ఇందులో 60 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది, తప్పు జవాబుకు అర మార్కు కోత వేస్తారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, బయాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పార్ట్‌ బి - ఇందులో ఇచ్చిన 100 ప్రశ్నల్లో అభ్యర్థులు ఏవైనా 60 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు లభిస్తాయి, తప్పు జవాబుకు ఒక మార్కు పోతుంది. ఇందులో బయాలజీ, లైఫ్‌ సైన్సెస్‌, బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఆలోచించి, విశ్లేషించడం ద్వారా జవాబులు ఇచ్చేలా ఈ ప్రశ్నలుంటాయి.


బీఈటీ 2024లో సెక్షన్‌ ‘ఏ’లో 50 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇవన్నీ ఇంటర్‌ స్థాయిలో జనరల్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, అనలిటికల్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, జనరల్‌ బయోటెక్నాలజీ వంటి అంశాల నుంచి అడుగుతారు. వీటిలో ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు రాగా, తప్పు సమాధానానికి ఒక మార్కు పోతుంది. అలాగే సెక్షన్‌ ‘బి’లో 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు బయోటెక్నాలజీలోని పలు ప్రత్యేకించిన అంశాలపై అడుగుతారు. అభ్యర్థి వీటిలో ఏవైనా 50 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు రాగా, తప్పు సమాధానానికి ఒక మార్కు పోతుంది.


సన్నద్ధత ఇలా..

సాధారణంగా ఈ పరీక్షలో సెక్షన్‌ ఏ ఇంటర్‌ స్థాయిలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరిశీలిస్తే.. సెక్షన్‌ బి గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఆలోచించి జవాబులు ఇచ్చేలా ఉంటుంది. అందువల్ల దీనికి సన్నద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రాథమిక అంశాలకు పదును పెడుతూనే.. ఆచరణాత్మక విధానంలోనూ సిద్ధం కావాలి. మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులకు కూడా సముచిత ప్రాధాన్యం ఉండటంతో సన్నద్ధత సమయంలో వాటికి తగిన సమయం కేటాయించడం తప్పనిసరి. ప్రతి సబ్జెక్టులోనూ ఏ టాపిక్‌ నుంచి ఎన్ని ప్రశ్నల వరకూ వస్తున్నాయనేది గత పరీక్షల ప్రశ్నపత్రాలు పరిశీలించడం ద్వారా తెలుసుకుని ఆమేరకు సన్నద్ధం కావొచ్చు. సరైన వ్యూహం, స్టడీ మెటీరియల్‌, ఆన్‌లైన్‌ వీడియో నోట్స్‌, రిఫరెన్స్‌ పుస్తకాల ద్వారా పరీక్షలో అనుకున్నస్థాయిలో మార్కులు పొందే వీలుంటుంది. సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడం, అంశాల వారీగా విశ్లేషించుకుంటూ చదవడం, పునశ్చరణ చేయడం తప్పనిసరి. నిజానికి ఈ పరీక్ష సిలబస్‌ కాస్త ఎక్కువనే చెప్పాలి. అందువల్ల సరైన వ్యూహం లేకపోతే అంశాలు అన్నింటినీ చదివి రివిజన్‌ చేయడం కష్టం అవుతుంది. ప్రతి సబ్జెక్టుకూ ప్రాథమిక అంశాల కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం సన్నద్ధతకు ఒక మంచి ప్రారంభాన్ని అందివ్వగలదు.


దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు

ఈ-మెయిల్‌ ఐడీ  

ఫోన్‌ నంబర్‌

వ్యక్తిగత వివరాలు

క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌ మార్కుల జాబితా

అప్‌లోడ్‌ చేయడానికి కావాల్సిన సర్టిఫికెట్లు

ఫొటో, సంతకాల స్కాన్డ్‌ కాపీలు.


వెబ్‌సైట్‌: https://dbt.nta.ac.in/ , https://www.nta.ac.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ ఆఫర్‌ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!

‣ ఇంటర్‌ పరీక్షల వేళ.. ఇవి ముఖ్యం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

Posted Date: 05-03-2024


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌