• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక వ్యవహారాల్లో ఆకర్షణీయ కెరియర్‌!

వ్యాపార, వాణిజ్య రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయా రంగాల్లో ఛార్టర్డ్‌ అకౌంటెంట్ల ప్రాముఖ్యం పెరిగింది. ఈ నేపథ్యంలో సీఏ ప్రాధాన్యాన్ని విద్యార్థులూ, తల్లిదండ్రులూ గుర్తిస్తున్నారు. ఈ కోర్సుపై అవగాహన బాగా విస్తరిస్తోంది. సీఏ పూర్తిచేస్తే ఆకర్షణీయమైన జీతాలతోపాటు గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది!

మన దేశంలో ఛార్టర్డ్‌ అకౌంటెంట్లను (సీఏ) తయారుచేసేందుకు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) అనే సంస్థ ఏర్పాటయింది. 1949లో పార్లమెంటు ఆమోదంతో ఇది ఆవిర్భవించింది. ఇది సీఏలను తయారుచేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూరుస్తూ, వారిని మంచి ఆర్థిక వ్యవహారాల పరిరక్షకులుగా తీర్చిదిద్దుతున్నాయి.

   ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూప్‌ పూర్తిచేసినవారైనా సీఏ చదివేందుకు అర్హులు. సీఏలో సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్‌ అనే మూడు దశలుంటాయి. ఈ కోర్సు మొత్తం పూర్తవడానికి ఇంటర్‌ తరువాత కనీసం 4 సంవత్సరాలు పడుతుంది.

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

   పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థీ సీఏ అభ్యసించటానికి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే సమయానికీ, సీపీటీకీ మధ్య రెండు నెలల వ్యవధి తప్పనిసరి. రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. ఈ మొత్తాన్ని దక్షిణ భారతదేశపు విభాగపు సీఏ కేంద్రం చెన్నై చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. అలా రిజిస్ట్రేషన్‌ పొందినవారు మాత్రమే సీపీటీ పరీక్ష రాసేందుకు అర్హులు.

   కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (సీపీటీ)ను ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థుల కోసం ప్రతి ఏడాదీ జూన్‌, డిసెంబర్‌ మాసాల్లో దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశపరీక్షగా నిర్వహిస్తారు.

   ఈ పరీక్ష రెండు వందల మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు సెషన్లుగా నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి ఒక్కో సెషన్‌కు రెండు గంటలు.

* మొదటి సెషన్‌లో కేటాయించిన మార్కులు: అకౌంట్స్‌ 60 మార్కులు, మర్కంటైల్‌లా 40 మార్కులు.

* రెండో సెషన్‌లో కేటాయించిన మార్కులు: ఎకనామిక్స్‌ 50 మార్కులు, మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ కలిపి 50 మార్కులు.

   ఇటీవలి కాలంలో సీఏ- సీపీటీలో కొన్ని మార్పులు చేశారు. ఒకప్పుడు సీపీటీలో నాలుగు సబ్జెక్టులు కలిపి 200 మార్కులకు గానూ 100 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులుగా ప్రకటించేవారు. కానీ ఇకపై సీపీటీలో కూడా ప్రతి సబ్జెక్టులో కనీసం 30% మార్కులు సాధిస్తూ నాలుగు సబ్జెక్టులు కలిపి 50% పైగా మార్కులు అంటే 100పైగా మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థి సీపీటీలోని అన్ని సబ్జెక్టులు తప్పనిసరిగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీపీటీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐపీసీసీ చేయడానికి అర్హత సాధిస్తారు.

ఇంటిగ్రేటెడ్‌ ప్రొఫెషనల్‌ కాంపిటెన్సీ కోర్సు (ఐపీసీసీ)

   ప్రతి ఏడాదీ మే, నవంబర్‌ మాసాల్లో ఐపీసీసీ పరీక్షలు నిర్వహిస్తారు. ఐపీసీసీ రెండు గ్రూపులుగా ఉంటుంది. గ్రూప్‌-1లో అకౌంట్స్‌ 100 మార్కులకు, లా, ఎథిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 100 మార్కులకు, ఇన్‌కం టాక్స్‌, సర్వీస్‌ టాక్స్‌, వ్యాట్‌ 100 మార్కులకు, కాస్టింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

   ఈ నాలుగు పేపర్లలో పరీక్ష 400 మార్కులకు జరిగితే ఒక్కో సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించి మొత్తంగా 50 శాతం మార్కులతో 200, ఆపై మార్కులు సాధించినవారే ఉత్తీర్ణులవుతారు.

   గ్రూప్‌- 2లో అడ్వాన్స్‌డ్‌ అకౌంటింగ్‌ 100 మార్కులకు, ఆడిటింగ్‌ 100 మార్కులకు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ- స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఈ గ్రూప్‌లో కూడా కనీసం 40 మార్కులు ప్రతి సబ్జెక్టులో సాధించాలి. అలాగే గ్రూప్‌ మొత్తమ్మీద 50 శాతం మార్కులు అంటే 150 ఆపై మార్కులు సాధించాలి. విద్యార్థి వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు.

   ఐపీసీసీ నమోదు చేసుకున్ననాటి నుంచి 9 నెలల్లో పూర్తిచేయాలి. ఆ తరువాత వారం రోజులపాటు నిర్వహించే ఓరియంటేషన్‌ కోర్సులో, ఐటీ శిక్షణలో నిర్వహించే 100 గంటల కోర్సులోనూ ఉత్తీర్ణత సాధించాలి.

ఆర్టికల్‌షిప్‌తో స్త్టెపెండ్‌

   ఐపీసీసీలో గ్రూప్‌-1 ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు/ రెండు గ్రూపులు పూర్తిచేసిన విద్యార్థులు ప్రొఫెషనల్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ దగ్గర రెండున్నర ఏళ్లపాటు తప్పనిసరిగా ఆర్టికల్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా శిక్షణ పొందుతున్న కాలంలో ఈ విద్యార్థులకు ప్రతినెలా రూ. 5000 నుంచి రూ. 7000 స్త్టెపెండ్‌ రూపంలో చెల్లిస్తారు. ఈ రకంగా సీఏ విద్యార్థి తన వృత్తికి కావాల్సిన నైపుణ్యాన్ని పొందడమే కాకుండా కోర్సు పూర్తి కావడానికి కావాల్సిన ఆర్థిక వనరులను కూడా సమకూర్చుకోవడానికి ఈ ఆర్టికల్‌షిప్‌ సహాయపడుతుంది.

సీఏ ఫైనల్‌

   సీఏ ఫైనల్‌ కూడా గ్రూప్‌-1, గ్రూప్‌-2లుగా ఉంటుంది. ఆర్టికల్‌షిప్‌ పూర్తయిన విద్యార్థి ఈ రెండు గ్రూపులను ఒకే సమయంలో రాసుకోవచ్చు. ప్రతి ఏడాదీ మే, నవంబర్‌ మాసాల్లో సీఏ ఫైనల్‌కు పరీక్షలు జరుగుతాయి. గ్రూప్‌-1లో ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ 100 మార్కులకు, స్ట్రాటజిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ 100 మార్కులకు, అడ్వాన్స్‌డ్‌ ఆడిటింగ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ 100 మార్కులకు, కార్పొరేట్‌ అండ్‌ ఎలైడ్‌ లాస్‌ 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో కూడా ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు, గ్రూప్‌ మొత్తం మీద 50% మార్కులు అంటే 400 మార్కులు 200 మార్కులు సాధించాలి. అపుడే ఆ గ్రూపులో ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రకటిస్తారు.

   గ్రూప్‌-2లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ 100 మార్కులకు, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ కంట్రోల్‌ అండ్‌ ఆడిట్‌ 100 మార్కులకు, డైరెక్ట్‌ టాక్స్‌ 100 మార్కులకు, ఇన్‌డైరెక్ట్‌ టాక్స్‌ 100 మార్కులకు ఉంటాయి. ఇందులో కూడా ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు, గ్రూప్‌ మొత్తం మీద 50% మార్కులు అంటే 400 మార్కులకు 200 మార్కులు సాధించాలి. అప్పుడే ఆ గ్రూప్‌లో ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రకటిస్తారు.

అకౌంటింగ్‌ టెక్నీషియన్‌ కోర్సు

   సీఏ ఉత్తీర్ణులవలేనివారి కోసం ప్రవేశపెట్టిన కోర్సు అకౌంటింగ్‌ టెక్నీషియన్‌. సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తిచేయలేను అనుకున్నపుడు ఐపీసీసీలోని గ్రూప్‌-1 పూర్తిచేసి ఒక సంవత్సరం పాటు ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ దగ్గర ఆర్టికల్‌షిప్‌ చేస్తే అకౌంటింగ్‌ టెక్నీషియన్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. పరిశ్రమలో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు, అంతర్జాతీయ గిరాకీ ఉంది. ఈ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ/ ప్రభుత్వేతర సంస్థల్లో అకౌంటెంట్‌గా చేరి నెలకు కనీసం రూ. 25,000పైగా జీతం పొందవచ్చు. ఉద్యోగం చేస్తూనే ఐపీసీసీ రెండో గ్రూపులో కూడా ఉత్తీర్ణత పొంది, ఫైనల్‌ రాసి ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ హోదా పొందవచ్చు.

డిగ్రీ విద్యార్థులకు నేరుగా ఐపీసీసీ కోర్సు

   నిన్నటివరకూ సీఏ చేయాలనుకునేవారు తప్పనిసరిగా సీపీటీ పరీక్షను రాయాల్సి వచ్చేది. అయితే ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా తమ చట్టంలో ఆగస్టు 1, 2012 నుంచి మార్పులను తీసుకువచ్చింది. డిగ్రీ, పీజీ అర్హత పొందిన విద్యార్థులకు సీపీటీ పరీక్షను మినహాయించి నేరుగా సీఏ ఐపీసీసీలోకి ప్రవేశాన్ని కల్పిస్తోంది. డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండి అకౌంటింగ్‌, ఆడిటింగ్‌, మర్కంటైల్‌లాస్‌, ఎకనామిక్స్‌, మేనేజ్‌మెంట్‌ (ఇన్‌క్లూడింగ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌), టాక్సేషన్‌ (ఇన్‌క్లూడింగ్‌ డైరెక్ట్‌ టాక్స్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్స్‌ లాస్‌), కాస్టింగ్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ సబ్జెక్టుల్లో ఏదైనా మూడు సబ్జెక్టులను కనీసం 100 మార్కులకు పరీక్ష రాసి ఉండాలి. అలా సబ్జెక్టులున్న డిగ్రీ విద్యార్థులు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే చాలు. ఈ సబ్జెక్టులు లేనివారికి తమ డిగ్రీ, పీజీల్లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే నేరుగా ఐపీసీసీలోకి ప్రవేశించవచ్చు.

ఎంపీసీ, ఎంఈసీ ... ఏది మేలు?

   సీఏ చదవడానికి ఇంటర్‌ ఏ గ్రూపు వారైనా అర్హులే. అంటే ఎంపీసీ నుంచి వచ్చినవారు కూడా సీఏ చేయవచ్చన్నమాట. ఎంపీసీ నుంచి వచ్చి సీఏ చేసేవారికి కామర్స్‌లోని ప్రాథమికాంశాలపై పట్టు ఉండదు. సీపీటీ వరకు ఎంపీసీ వారు మామూలుగా చదివినా పాసవ్వగలరు. కానీ వీరు ఐపీసీసీ, సీఏ ఫైనల్‌లో ఇబ్బంది పడతారు. కానీ ఎంఈసీ నుంచి వచ్చేవారు జూనియర్‌ ఇంటర్‌ నుంచే సీఏ ఓరియంటెడ్‌గా చదివి ప్రాథమికాంశాలపై పట్టు సాధించవచ్చు. అటువంటివారు సీనియర్‌ ఇంటర్‌ పూర్తి అవుతుండగానే సీపీటీ పరీక్ష తేలిగ్గా రాయగలుగుతారు. దీనిలో వారికి 9 నెలల సమయం మిగులుతుంది. అదే ఎంపీసీ వారయితే ఇంటర్‌ పూర్తయిన తరువాత 9 నెలలపాటు సీపీటీ కోచింగ్‌ తీసుకుని సిద్ధమవాల్సి ఉంటుంది. ఎంఈసీ నుంచి వచ్చినవారు తమకున్న పట్టుతో సీఏ- ఐపీసీసీ, సీఏ- ఫైనల్‌ కూడా సులభంగా పూర్తి చేయగలరు. ఇలా ఏరకంగా చూసినా సీఏ చేయడానికి ఎంఈసీనే మంచిదని చెప్పవచ్చు.

Posted Date: 25-01-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌