• facebook
  • whatsapp
  • telegram

జేఎన్ఏఎఫ్ఏయూలో ఫైన్ ఆర్ట్స్ కోర్సులు

అభిరుచికి త‌గ్గ‌ట్టుగా కోర్సులెన్నో ఉంటాయి. చక్కగా బొమ్మలు గీయ‌డం, అంద‌మైన క‌ళాకృతులు సృష్టించ‌డం, ఆక‌ర్షించేలా ఫొటోలు తీయ‌డం ఇలాంటి వాటిలో ప్రావీణ్యం ఉండేవాళ్లెంద‌రో ఉంటారు. వీరంద‌రికోస‌మే ఆర్ట్స్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటైంది. ఆస‌క్తి ఉన్న విద్యార్థులు త‌మ హాబీని పెంపొందించుకోవ‌డంతోపాటు ఆయా కోర్సుల్లో డిగ్రీల‌నూ సొంతం చేసుకోవ‌చ్చు. అనంత‌రం ఆ అభిరుచినే కెరీర్‌గా మ‌లుచుకోవ‌చ్చు కూడా.
   యానిమేష‌న్‌, పెయింటింగ్, ఫొటోగ్రపీ, స్కల్ప్‌చ‌ర్ ఇవ‌న్నీ ఫైన్ ఆర్ట్స్ విభాగంలోకి వ‌స్తాయి. వీటికోసం నిజాం రాష్ట్రంలో 1940లో ఫైన్ ఆర్ట్స్ కాలేజీని నెల‌కొల్పారు. క్రమేణా ఇది జ‌వహ‌ర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివ‌ర్సిటీగా హైద‌రాబాద్‌(మాస‌బ్ ట్యాంక్‌)లో ఏర్పాటైంది. ఈ సంస్థ ప‌లు యూజీ, పీజీ కోర్సులు అందిస్తోంది. ప్రవేశ ప‌రీక్ష ద్వారా ఈ కోర్సుల్లో ఏటా విద్యార్థుల‌ను చేర్చుకుంటారు.


ఇవీ కోర్సులు
  అండ‌ర్ గ్రాడ్యుయేష‌న్ బ్యాచిల‌ర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్ (బీఎఫ్ఏ)లో అప్లైడ్ ఆర్ట్స్‌, యానిమేష‌న్‌, పెయింటింగ్, ఫొటోగ్రఫీ, స్కల్ప్‌చ‌ర్ కోర్సులు ఉన్నాయి. పోస్టు గ్రాడ్యుయేష‌న్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్ఏ)లో అప్లైడ్ ఆర్ట్స్‌, పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ, స్కల్ప్‌చ‌ర్ స్పెష‌లైజేష‌న్లు అందిస్తున్నారు.


ప్రవేశించాలంటే...
   ఇంట‌ర్ ఉత్తీర్ణులు బీఎఫ్ఏ కోర్సుల్లో చేర‌డానికి అర్హులు. బీఎఫ్ఏ పూర్తిచేసిన‌వాళ్లు ఎంఎఫ్ఏ కోర్సుల్లో చేర‌వ‌చ్చు. రాత ప‌రీక్ష ద్వారా ప్రవేశం ల‌భిస్తుంది. బీఎఫ్ఏ కోర్సుల వ్యవ‌ధి నాలుగేళ్లు. సెమిస్టర్ విధానంలో బోధ‌న ఉంటుంది.
కోర్సుల వారీ వివ‌రాలు...


బీఎఫ్ఎ
అప్లైడ్ ఆర్ట్స్‌: ఈ కోర్సులో ఏటా 35 మందిని చేర్చుకుంటారు. అడ్వర్టైజింగ్ డిజైన్‌, మీడియా డిజైన్‌, గ్రాఫిక్ డిజైన్‌, వెబ్ డిజైన్, ప‌బ్లిషింగ్ డిజైన్‌ల గురించి నేర్చుతారు.
యానిమేష‌న్‌: ఈ కోర్సులో 60 మందిని చేర్చుకుంటారు. అభ్యర్థుల‌ను చిత్రప‌రిశ్రమ‌, ఎల‌క్ట్రానిక్ మీడియా, ఫీచ‌ర్ ఫిల్మ్‌లు, యానిమేష‌న్ ఇండ‌స్ట్రీ...త‌దితరాల అవ‌స‌రాల‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దుతారు.

యానిమేష‌న్‌లో ఫండ‌మెంట‌ల్స్‌, బేసిక్ కాన్సెప్టులు, 2డి, 3డి ల గురించి అవ‌గాహ‌న క‌ల్పిస్తారు.
పెయింటింగ్‌: ఈ కోర్సులోకి 20 మందిని తీసుకుంటారు. డ్రాయింగ్‌, క‌ల‌ర్ డిజైన్‌, క‌ళ‌లు, పోర్ట్రేచ‌ర్‌..త‌దిత‌రాల గురించి నేర్పుతారు. టెక్స్‌టైల్ డిజైన్‌, ఇంటీరియ‌ర్ డెక‌రేష‌న్‌, క్రియేటివ్ క్రాఫ్ట్స్‌, బుక్ ఇల‌స్ట్రేష‌న్‌...త‌దిత‌ర అవ‌స‌రాల‌కు త‌గ్గట్టుగా వీరు శిక్షణ పొందుతారు.
ఫొటోగ్రఫీ: ఈ కోర్సులో ఏటా 30 మందిని తీసుకుంటారు. ఫ్రొఫెష‌న‌ల్ ఫొటోగ్రఫీ, ఫొటో జ‌ర్నలిజం, ఆడియో విజువ‌ల్ క‌మ్యూనికేష‌న్‌, డిజిట‌ల్ ఫొటోగ్రఫీ, కంప్యూట‌ర్ గ్రాపిక్స్‌, మ‌ల్టీ మీడియా, ఫ్రొఫెష‌న‌ల్ వీడియోగ్రఫీ..త‌దిత‌రాంశాల‌ను నేర్పుతారు.
స్కల్ప్‌చ‌ర్‌: ఏటా ప‌ది మందిని ఎంపిక‌చేస్తారు. మ‌ట్టితోపాటు వివిధ ర‌కాల ప‌దార్థాలు ఉప‌యోగించి ప‌లు ఆకారాలు అందంగా రూపొందించ‌డంపై త‌ర్ఫీదునిస్తారు.
ఎంఎఫ్ఏ: పీజీ స్థాయిలో యానిమేష‌న్ త‌ప్ప మిగిలిన నాలుగు విభాగాల్లోనూ పీజీ కోర్సులను జేఎన్ఏఎఫ్ఏయూ అందిస్తోంది. అప్లైడ్ ఆర్ట్స్‌, ఫొటోగ్రఫీల్లో రెండేళ్ల, మూడేళ్ల పీజీ కోర్సులు ఉన్నాయి. పెయింటింగ్, స్కల్ప్‌చ‌ర్‌ల్లో రెండేళ్ల పీజీ కోర్సులు ఉన్నాయి. వీటిని కూడా సెమిస్టర్ విధానంలోనే బోధిస్తున్నారు.


ప్రవేశ ప‌రీక్ష ఇలా...
  యానిమిష‌న్‌, అప్లైడ్ ఆర్ట్స్‌, పెయింటింగ్, స్కల్ప్‌చ‌ర్ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికి...మొత్తం 3 పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్- ఎలో వంద మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. ప‌రీక్షలో భాగంగా డ్రాయింగ్ స్కిల్స్‌, కంపోజిష‌న‌ల్ సెన్స్‌...మొద‌లైన‌వాటిలో అభ్యర్థిని ప‌రీక్షిస్తారు. పేప‌ర్‌-బిలో వంద మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ప‌రీక్ష వ్యవ‌ధి 90 నిమిషాలు. ఇందులో అభ్యర్థి ప‌రిశీల‌న ద్వారా వివిద ఊహా చిత్రాలు గీయాలి. కూర‌గాయ‌ల దుకాణం, రైల్వే స్టేష‌న్‌, బ‌స్ స్టాప్‌..ఇలా చిత్రాల‌ను గీయాలి. పెయింటింగ్ స్కిల్స్‌, రంగుల ఎంపిక‌, అప్లికేస‌న్ ఇవ‌న్నీ ప‌రిశీలిస్తారు. పార్ట్ -సి 50 మార్కుల‌కు ఉంటుంది. ఇందులో జీకే, క‌రెంట్ అఫైర్స్ 15, ఇంగ్లిష్ 15, జ‌న‌ర‌ల్ ఆర్ట్ ఓరియెంటెడ్ 20 ప్రశ్నలు వ‌స్తాయి.
   ఫొటోగ్రఫీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికి కంపోజిష‌న్‌, విజువ‌ల్ క‌మ్యూనికేష‌న్‌లో వంద మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. వ్యవ‌ధి 90 నిమిషాలు. దీంతోపాటు పార్ట్ -సి 50 మార్కుల‌కు ఉంటుంది. ఇందులో జీకే, క‌రెంట్ అఫైర్స్ 15, ఇంగ్లిష్ 15, జ‌న‌ర‌ల్ ఆర్ట్ ఓరియెంటెడ్ 20 ప్రశ్నలు వ‌స్తాయి.
ఇంటీరియ‌ర్ డిజైన్‌కి ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థుల‌కు 200 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. వ్యవ‌ధి మూడు గంట‌లు. జీకే, క‌రంట్ అఫైర్స్ 20; జ‌న‌ర‌ల్ ఆర్ట్స్ 20; క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ 50; ఇల‌స్ట్రేటివ్‌, ఎన‌లిటిక‌ల్‌, డిజైన్ ఎబిలిటీ 50; మెమ‌రీ డ్రాయింగ్ 30, క‌ల‌ర్ కోఆర్డినేష‌న్ 30 మార్కుల‌కు ఉంటాయి.
వెబ్‌సైట్‌: http://jnafau.ac.in

Posted Date: 03-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌