• facebook
  • whatsapp
  • telegram

ఉచిత విద్య... ఉన్నత శిక్షణ !

దేశ వ్యాప్తంగా సైనిక స్కూళ్లలో ప్రవేశాలకు ప్రకటన విడుదల

త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసింది. సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను, వసతిని ఉచితంగా అందిస్తారు. సంపూర్ణ క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంతోపాటు, దేశభక్తిని పెంపొందించే విధంగా ఇక్కడి బోధన ఉంటుంది. రక్షణ రంగంలోకి  ప్రవేశించడానికి  కావాల్సిన నైపుణ్యాలను పాఠశాల దశ  నుంచే  నేర్పిస్తారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 33 సైనిక స్కూళ్లలో 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని కోసం నిర్వహించే  ప్రవేశపరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది.

ఎంపిక ఎలా?
రాత పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆరో తరగతిలోకి ప్రవేశం పొందే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 125 ప్రశ్నలు ఇస్తారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. ఇంటలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.  భాషకు సంబంధించిన ప్రశ్నలు అయిదో తరగతి సిలబస్ ను అనుసరించి ఉంటాయి.  తొమ్మిదో తరగతిలో చేరే విద్యార్థులు 400 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది.  మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఆరో తరగతి విద్యార్థులకు పరీక్ష సమయం 2.30 గంటలు (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు), తొమ్మిదో తరగతి వారికి మూడు గంటల వ్యవధి (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు) ఉంటుంది.
సాధారణంగా ప్రశ్నలు కనీస అర్హత తరగతి స్థాయిలో ఉంటాయి. నోటిఫికేషన్ లో ఇచ్చిన సిలబస్ ప్రకారం ఆ తరగతుల్లోని అంశాలను అధ్యయనం చేసి పట్టు సాధిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల సరళి అర్థమవుతుంది.

అర్హతలు
ఆరో తరగతికి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2021 నాటికి 10-12 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే  ఏప్రిల్ 01, 2009 నుంచి మార్చి 31, 2011 మధ్యలో జన్మించిన వారు అర్హులు.  వయసు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఆడపిల్లలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.  
తొమ్మిదో తరగతిలోకి అడ్మిషన్ ఆశించేవారి వయసు మార్చి 31, 2021 నాటికి 13-15 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఏప్రిల్ 01, 2006 నుంచి మార్చి 31, 2008 మధ్యలో జన్మించిన వారికే అర్హత లభిస్తుంది.  ఎనిమిదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.

దరఖాస్తు విధానం
అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో అక్టోబరు 20, 2020 నుంచి డిసెంబ‌రు 03, 2020 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు రూ. 400, ఇతరులు రూ. 550 పరీక్ష రుసుం చెల్లించాలి. జనవరి 10, 2021న పరీక్ష నిర్వహిస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో, ఆరో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాయడానికి అవకాశం ఉంది.

సీట్ల కేటాయింపు
ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ట్రాల వారికి 33% సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50% సీట్లలో 25% మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25% ఇతర రాష్ట్రాలు/  కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయించవచ్చు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాంచడానికి వీలు లేదు.

పరీక్ష కేంద్రాలు: దేశ వ్యాప్తంగా ౧౮౧ కేంద్రాల(దాదాపు అన్ని సైనిక స్కూళ్లు)లో పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది.
 

నోటిఫికేష‌న్: https://www.eenadupratibha.net/notification_landing_pdf.php?sectid=8&catid=28&lang=2&id=20070003394
 

వెబ్‌సైట్‌లు: https://www.nta.ac.in/, https://aissee.nta.nic.in/webinfo/public/home.aspx

Posted Date: 02-12-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌