• facebook
  • whatsapp
  • telegram

స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌

మహేంద్ర సింగ్ ధోని ఎంత పేరున్న ఆటగాడో మనందరికీ తెలుసు. ప్రపంచ వ్యాప్త అథ్లెట్లను అధిగమించి అతడు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. మరి ధోని తానొక్కడే తన వ్యాపార విలువ, ప్రచార కార్యక్రమాల సమయపాలన లాంటివన్నీ చూసుకోలేడు కదా.. ఆ పర్యవేక్షణ బాధ్యత, సంబంధిత వ్యాపార లావాదేవీలను చూసుకోవడానికి నిష్ణాతుడైన క్రీడా నిర్వాహకులు అవసరమవుతారు. జట్టు విజయానికి, ప్రాచుర్యానికి క్రీడాకారుల‌ ప్రతిభ ఒక్కటే కొలమానం కాదు. వారి అవసరాలు, బ్రాండ్ ఇమేజ్, మార్కెటింగ్ తదితర అంశాలను నిరంతరం ఎవరో ఒకరు పర్యవేక్షిస్తుంటేనే ఇది సాధ్యం. ఇవన్నీ సక్రమంగా జరిగిన‌ప్పుడు మాత్రమే ఒక ఆటగాడు మైదానం లోపలే కాకుండా బ‌య‌ట‌ కూడా రాణించ‌గ‌ల‌డు. ఇలాంటి బహుముఖ బాధ్యతలను పర్యవేక్షించేవారే "స్పోర్ట్స్ మేనేజర్". తెరవెనక ఉండి జట్టు సిబ్బందికి మార్గనిర్దేశం చేసే గొప్ప బాధ్యత స్పోర్ట్స్ మేనేజర్‌ది. క్రీడలపై ఆసక్తి, అభిరుచి ఉండేవారు ఈ సవాళ్లను సులభంగానే అధిగమించవచ్చు. వీటికి వ్యాపారాత్మక లక్షణాలు, నిర్వహణ మెలకువలు తోడైతే ప్రస్తుత క్రీడాలోకంలో కీలక రంగంగా ఎదుగుతున్న స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో మీరూ రాణించవచ్చు.

స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌ గురించి

నిజానికి 'క్రీడా నిర్వహణ ' అనేది కొత్త రంగమేమీ కాదు. గ్రీకులు ప్రారంభించిన నాటి ఒలింపిక్స్ నుంచే ఈ రంగానికి ఆవశ్యకత ఏర్పడింది. ప్రపంచీక‌రణ, విస్తృతమవుతున్న మీడియా పుణ్యమా అని నేడు అనేక క్రీడలు ప్రపంచవ్యాప్త ఆదరణను చూరగొంటూ అద్భుత వ్యాపార వనరులుగా మారాయి. ఇదివరకు ఎక్కువమంది ఆటగాళ్లు, సిబ్బంది ఉన్న జట్లు మాత్రమే స్పోర్ట్స్ మేనేజర్‌ను నియమించుకునేవి. నేడు క్రీడాకారులు తమ అవసరాలను ఎల్ల‌వేళ‌లా పర్యవేక్షించేందుకు వ్యక్తిగత స్పోర్ట్స్ మేనేజర్‌లను నియమించుకుంటున్నారు. విదేశాల్లోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌లకు ఎంత ఆదరణ ఉందో, వాటి మేనేజర్లకు కూడా అంతే ఖ్యాతి ఉంది. కోచ్ సహా క్రీడాకారుడు లేదా జట్టు సిబ్బంది అవసరాలను వ్యాపారాత్మక, మార్కెటింగ్ విలువను మరింత పెంచడమే స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ లక్ష్యం. సమర్థమైన నాయకత్వ, వ్యాపారాత్మక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి క్రీడలే అభిమతమైతే మీరు మంచి స్పోర్ట్స్ మేనేజర్‌గా ఎదగవచ్చు.

అంతేకాకుండా ఈ రంగం నుంచి స్పోర్ట్స్ ఏజెంట్, వ్యాఖ్యాత, రిపోర్టర్, కోచ్, అంపైర్లుగా కూడా కెరీర్‌ను మలచుకోవచ్చు. మన దేశంలో అత్యధిక లాభం ఆర్జిస్తున్న కంపెనీలన్నీ క్రీడల ఆధారంగానే తమ వ్యాపారాన్ని మార్కెట్ చేసుకుంటున్నాయి. అలా క్రీడాపరంగా మార్కెటింగ్ చేసే సత్తా, నిర్వహణ సామర్థ్యం ఉన్నవారిని ఆయా కంపెనీలు తమ స్పోర్ట్స్ మేనేజర్లుగా నియమించుకుంటున్నాయి. క్రీడాధారితమైన కంపెనీలు సైతం ఆయా క్రీడలకు సంబంధించి మార్కెటింగ్ నిర్వహణ బాధ్యతలను తమ స్పోర్ట్స్ మేనేజర్లకు అప్పగిస్తున్నాయి.

కోర్సు స్వభావం

కోర్సులో భాగంగా స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్, స్పోర్ట్స్ జర్నలిజం, స్పోర్ట్స్ - లా, ఎకనామిక్స్, మార్కెటింగ్, స్టాటిస్టిక్స్ , క్వాంటిటేటివ్ మెథడ్స్, రిసెర్చ్ మెథడాలజీ లాంటి అంశాలతో పాటు ప్రాక్టికల్ వర్క్, ప్రాజెక్టు ట్రైనింగ్ లాంటి అనేక అంశాలు శిక్షణలో ఉంటాయి.

అర్హతలు:

స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేసేందుకు కనీస అర్హత 10+2+3 కాగా, మాస్టర్స్ డిగ్రీని పొందేందుకు బ్యాచ్‌లర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) పట్టభద్రులై ఉండాలి. ముంబయిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఏ డిగ్రీ ఉన్నా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీల‌ను దూరవిద్యలో అందిస్తున్నాయి. అంతేకాకుండా పీజీ కోర్సులు చేయాల‌నుకునేవారికి చాలా కళాశాలలు స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి. ఆస‌క్తి ఉంటే ఈ విభాగంలో పీహెచ్‌డీ కూడా చేయ‌వ‌చ్చు.

శిక్షణ సంస్థలు:

మన దేశంలో రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో సంవత్సర వ్యవధితో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు మూడేళ్ల డిగ్రీ కోర్సులను కూడా అందిస్తున్నాయి.

కరైకుడి (తమిళనాడు) లోని అళగప్ప యూనివర్సిటీ ఎన్ఐపీ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారికి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ ఇస్తోంది. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ శిక్షణకు ఈ సంస్థ పెట్టింది పేరు.

వెబ్‌సైట్: http://goo.gl/Yim7Rw

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ కళాశాల స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది.

వెబ్‌సైట్: http://igipess.du.ac.in/

కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కూడా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ పీజీ డిప్లొమాకు ప్రసిద్ధి చెందింది.

వెబ్‌సైట్: http://goo.gl/VYpWti

పాటియాలాలోని నేతాజీ సుభాష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఎస్ఐఎస్) ఆసియాలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ట్రైనింగ్ సంస్థ. ఇది క్రీడాశిక్షణ పొందేవారికి 'మక్కా'గా పేరొందింది.

ఇక్కడ నాలుగు విభాగాలుగా అథ్లెటిక్స్, జూడో, హాకీ, సైక్లింగ్ ల్లో బీపీఈడీ శిక్షణను అందిస్తోంది.

వెబ్‌సైట్: http://www.nsnis.org/

ఇవేకాకుండా దేశంలోని వివిధ కళాశాలలు స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌కు అవసరమైన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీకి శిక్షణ అందిస్తున్నాయి.

వాటిలో ప్రముఖమైనవి:

1. ఇంట‌ర్నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌, ముంబ‌యి.

వెబ్‌సైట్: http://goo.gl/K5vNmC

2. జార్జ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్‌, గంగూలీ స్ట్రీట్‌, కోల్‌క‌త‌, ప‌శ్చిమ బెంగాల్‌.

వెబ్‌సైట్: http://goo.gl/mxnxAm

3. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌, కోల్‌క‌త‌, ప‌శ్చిమ బెంగాల్‌.

వెబ్‌సైట్: http://goo.gl/VYpWti

4. నేతాజీ సుభాష్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్సోర్ట్స్‌, పాటియాలా, పంజాబ్‌.

వెబ్‌సైట్: http://www.nsnis.org/

5. ఆంధ్ర యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామ‌ర్స్‌, విశాఖ‌ప‌ట్నం, ఆంధ్రప్రదేశ్‌.

వెబ్‌సైట్: http://goo.gl/XEhyR5

6. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాల‌యం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌

వెబ్‌సైట్: http://goo.gl/cZgo4j

7. ల‌క్ష్మీబాయ్ నేష‌న‌ల్ కాలేజ్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌, క‌రైవ‌ట్టం, తిరువ‌నంత‌పురం, కేర‌ళ‌

వెబ్‌సైట్: http://goo.gl/UMtsJh

8. లక్ష్మీబాయ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్వాలియర్, పంజాబ్.

వెబ్‌సైట్: http://www.lnipe.gov.in/

9. అమిటీ స్కూల్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్‌,ఉత్తర్‌ప్రదేశ్‌

వెబ్‌సైట్: http://goo.gl/E4eGKS

10. తమిళ‌నాడు ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ స్పోర్ట్స్ యూనివ‌ర్పిటీ, చెన్నై, తమిళ‌నాడు.

వెబ్‌సైట్‌: http://www.tnpesu.org/

Posted Date: 08-03-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌