• facebook
  • whatsapp
  • telegram

వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

వ్యాపార సంస్థల్లో ఉద్యోగావకాశాలు



డేటాను మనం చూసే తీరు, అర్థం చేసుకునే విధానాన్ని విజువల్‌ అనలిటిక్స్‌ చాలా మార్చేసింది. క్లిష్టమైన సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకునేలా సమర్పించే ఈ విధానం వివిధ వ్యాపార సంస్థల్లో ముఖ్యమైన అంశంగా మారిపోయింది. ఈ రంగానికి సంబంధించి టెక్నాలజీ అంతకంతకూ మారుతూ ఉండటం వల్ల ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉండటం అవసరం. ఇందులో అవకాశాలను పరిశీలిస్తే .. 


గత కొన్నేళ్లలో విజువల్‌ అనలిటిక్స్‌ సాధారణ గ్రాఫులు, చార్టుల స్థాయి నుంచి సమర్థమైన ఇంటరాక్టివ్‌ డాష్‌ బోర్డ్స్, వర్చువల్‌ రియాలిటీ అనుభవంగా మారింది. ఈ టెక్నాలజీ మార్పుతో ప్రస్తుతం మనం అత్యధికంగా ఉన్న డేటాను సైతం రియల్‌టైమ్‌లో విజువలైజ్‌ చేయగలుగుతున్నాం. దీని ద్వారా విలువైన ఇన్‌సైట్స్‌ పొందగలుగుతున్నాం. 


డేటా విజువలైజేషన్‌కు, విజువల్‌ అనలిటిక్స్‌కు కచ్చితమైన తేడా ఉంది. మొదటిది మనకు ఏదైనా అంశం గురించి.. ఏమిటి అనే ప్రశ్నకు జవాబు మాత్రమే ఇవ్వగలదు, కానీ రెండోది అలా ఎందుకు జరుగుతుందో లోతుగా విశ్లేషించి చెప్పగలదు.


తాజాగా ఇందులో జరిగిన ముఖ్యమైన మార్పు.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) అల్గారిదమ్స్‌ కలయిక. ఈ టెక్నాలజీ డేటాలో ఉన్న పాటర్న్స్, ట్రెండ్‌ను గుర్తుపట్టి మరింత కచ్చితమైన ఇన్‌సైట్స్‌ తయారుచేసేలా ప్రోత్సహిస్తుంది. ఏఐ సంబంధిత విజువల్‌ అనలిటిక్స్‌ డేటా విశ్లేషణను పూర్తిస్థాయిలో ఆటోమేట్‌ చేయడం వల్ల మరింత సులభంగా ఇన్‌సైట్స్‌ తీసుకోవడం కుదురుతుంది.


ఏఆర్, వీఆర్‌ పెరుగుదల

ప్రస్తుతం ఆగ్‌మెంటెడ్, వర్చువల్‌ రియాలిటీ అనేవి కేవలం గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమకే పరిమితం కాలేదు. ఈ ముఖ్యమైన టెక్నాలజీలను ప్రస్తుతం విజువల్‌ అనలిటిక్స్‌లో ఇంటరాక్టివ్, ఎంగేజింగ్‌ అనుభూతిని కలిగించేందుకు ఉపయోగిస్తున్నారు. ఏఆర్, వీఆర్‌ సాయంతో వినియోగదారుడు డేటాను త్రీడీ స్పేస్‌లో చూడగలుగుతాడు. దీనివల్ల సమాచారానికి సంబంధించిన క్లిష్టమైన అంశాల గురించి సైతం లోతైన అవగాహన ఏర్పడుతుంది.


నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌

ఎన్‌ఎల్‌పీ - నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌.. విజువల్‌ అనలిటిక్స్‌ భవిష్యత్తును రూపుదిద్దుతున్న మరో ముఖ్యమైన అంశం. దీని ద్వారా వినియోగదారులు విజువలైజేషన్‌తో నేచురల్‌ లాంగ్వేజ్‌ కమాండ్స్, క్వెరీలతో సంభాషించవచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రోగ్రామింగ్‌ కానీ, క్లిష్టమైన క్వెరీ తయారీ కానీ అవసరం పడదు. ప్రక్రియ సులభమవుతుంది. 

తద్వారా అంతగా అవగాహన లేని వినియోగదారులు కూడా సులభంగా విజువల్‌ అనలిటిక్స్‌ను ఉపయోగించుకునే వీలుంటుంది.


సహకార పద్ధతిలో..

పరస్పర సహకారం విజువల్‌ అనలిటిక్స్‌లో మరో ముఖ్యమైన అంశంగా మారుతోంది. విజువలైజేషన్స్‌ను రియల్‌ టైమ్‌లో షేర్, కొలాబరేట్‌ చేసుకునే పద్ధతి వల్ల బృందాలు కలిసి పనిచేయవచ్చు, ఇన్‌సైట్స్‌ పంచుకోవడంతోపాటు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఒకేసారి అధిక సంఖ్యలో వినియోగదారులు విజువలైజేషన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా వారు మరింత సమర్థంగా పనిచేసే వీలు కలుగుతుంది. 


ప్రస్తుతం తప్పనిసరి అవసరంగా మారిన మొబైల్స్‌ వినియోగం వల్ల యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండే మొబైల్‌ విజువల్‌ అనలిటిక్స్‌ సొల్యూషన్స్‌కు డిమాండ్‌ ఏర్పడింది. డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌తో అవసరం లేకుండానే యూజర్స్‌ విజువలైజేషన్స్‌ను ఫోన్‌లోనే చూసుకునేలా వీటి అవసరం ఉంటుంది. ఈ ట్రెండ్‌ను విజువల్‌ అనలిటిక్స్‌ టూల్స్‌ అర్థం చేసుకున్నాయి. ఎక్కడైనా ఎప్పుడైనా యూజర్స్‌ దీన్ని ఉపయోగించేలా డిజైన్స్, యాప్స్‌ను ఇప్పటికే సిద్ధం చేస్తున్నాయి.



కెరియర్‌ అవకాశాలు

అనలిటిక్స్‌ రంగంలో నిపుణులకు గిరాకీ నిత్యం పెరుగుతూనే ఉంటోంది. తగిన నైపుణ్యాలు కలిగిన వారెవరైనా ఇందుకోసం ప్రయత్నించవచ్చు. పరిశ్రమ ఆధారిత అప్‌స్కిలింగ్‌పై దృష్టి సారించడం ద్వారా ఇందులో ఉద్యోగాలు సాధించడంతోపాటుగా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు, అధిక వేతనాలు డిమాండ్‌ చేయవచ్చు. ఏఐ, ఏఆర్‌/వీఆర్, ఎన్‌ఎల్‌పీ టెక్నాలజీ మార్పులతో విజువలైజేషన్‌ మరిన్ని సానుకూల మార్పులకు లోనుకానుంది. ఈ అభివృద్ధి మనం డేటాను చూసే విధానం, తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ముందుకు వెళ్లే క్రమంలో తాజా మార్పులకు అనుగుణంగా మనమూ మారాలి.


సక్రమ వినియోగం

విజువల్‌ అనలిటిక్స్‌ అంతకంతకూ శక్తిమంతంగా తయారవుతున్న నేపథ్యంలో.. దీన్ని సక్రమమైన రీతిలో ఉపయోగించడం చాలా ముఖ్యం. సున్నితమైన సమాచార సంరక్షణ, డేటా సెక్యూరిటీ, అల్గారిదమ్స్‌ను జాగ్రత్తగా పరిశీలించడం ప్రధానం. బాధ్యతాయుతమైన పద్ధతిలో మాత్రమే వీటిని వినియోగించేలా రక్షణ కల్పించాలి.


ముఖ్య కొలువులు

విజువల్‌ అనలిటిక్స్‌లో నైపుణ్యం సాధించిన అభ్యర్థులు మార్కెటింగ్‌ స్పెషలిస్ట్, డేటా స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ అనలిస్ట్, బిజినెస్‌ సిస్టమ్స్‌ అనలిస్ట్, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ డెవలపర్, అనలిటిక్స్‌ మేనేజర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్‌ వంటి వివిధ పోస్టుల్లోకి వెళ్లవచ్చు. వీరికి ప్రోగ్రామింగ్, విజువల్‌ డిజైన్, స్టాటిస్టికల్‌ అనాలిసిస్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిపోర్టింగ్, మెషిన్‌ లెర్నింగ్, యూఎక్స్, యూఐపై అవగాహన ఉండాలి.

దీనికి సంబంధించిన కోర్సులు అన్ని ప్రముఖ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ వేదికల్లోనూ అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్స్‌ డిగ్రీ అందుకున్న అనంతరం వీటిని అభ్యసించడం ద్వారా అనుకున్న మార్గంలో పయనించవచ్చు. వీటితోపాటు ఏదైనా డేటా విజువలైజేషన్‌ టూల్‌లో ప్రావీణ్యం ఉండటం మరింత ఉపకరిస్తుంది.

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రముఖ వర్సిటీల్లో పీజీ

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

‣ ఎన్‌టీఆర్‌ఓలో సైంటిస్ట్‌ కొలువులు

‣ మార్పు స్వాగతించు.. విజయం సాధించు!

‣ ఐటీ కొలువు.. ఇలా సులువు!

‣ కొత్త ఏడాది.. కొంగొత్త అవకాశాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 02-01-2024


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌