‣ నిఫ్ట్ ప్రవేశ ప్రకటన
యువతరాన్ని ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ కోర్సులు ఆకర్షిస్తున్నాయి. ఈ విభాగంలో మేటి చదువులు అందించడానికి జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ పలు యూజీ, పీజీ కోర్సులు అందిస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో వీటిలో చేరడానికి ప్రకటన వెలువడింది. ఉమ్మడి పరీక్ష, ఇతర అంశాల్లో చూపిన ప్రతిభతో ప్రవేశాలు లభిస్తాయి!
దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 17 కేంద్రాల్లో నిఫ్ట్ క్యాంపస్‌లు నెలకొల్పారు. ఈ సంస్థల్లో నాలుగేళ్ల వ్యవధితో యూజీ, రెండేళ్ల వ్యవధితో పీజీ కోర్సులు అందిస్తున్నారు. యూజీలో డిజైన్‌లో 6 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి... యూక్సెసరీ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, లెదర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్. ఈ సంస్థ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సునూ యూజీలో అందిస్తోంది. పీజీలో డిజైన్, ఫ్యాషన్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులున్నాయి. సృజనాత్మకత, డిజైన్‌పై ఆసక్తి ఉన్నవారు వీటిలోచేరి ప్రతిభను మెరుగుపరచుకోవచ్చు.
నిఫ్ట్‌లో చదువుకున్నవారికి కార్పొరేట్ సంస్థలు ఆకర్షణీయ కొలువులు అందిస్తున్నాయి. ఆకట్టుకునేలా దుస్తులు, వివిధ వస్తువులను డిజైన్ చేయగలిగే విద్య అబ్బిందంటే రూ.లక్షల్లో సంపాదించవచ్చు. కోర్సులు పూర్తిచేసుకుంటే ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ రిటైలర్, పర్సనల్ స్టైలిస్ట్ తదితర హోదాలతో రాణించవచ్చు.
ఏ కోర్సులు? ఎవరికి?
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్
అర్హత: ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత. ఆఖరు సంవత్సరం చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్ ఉత్తీర్ణత లేదా మూడేళ్ల డిప్లొమా. ఆఖరు సంవత్సరం విద్యార్థులూ అర్హులే.
వయసు: పై రెండు కోర్సులకూ ఆగస్టు 1, 2022 నాటికి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయిదేళ్లు మినహాయింపు.
మాస్టర్ ఆఫ్ డిజైన్, ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా నిఫ్ట్ లేదా నిడ్ నుంచి కనీసం మూడేళ్ల వ్యవధితో యూజీ డిప్లొమా. మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు నిఫ్ట్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్) లేదా ఏదైనా సంస్థ నుంచి బీఈ/బీటెక్. ఆఖరు సంవత్సరం విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు నిబంధన లేదు.
కోర్సుల వారీ సీట్లు
‣ అన్ని నిఫ్ట్‌ల్లోనూ కలిపి యూజీ, పీజీ స్థాయుల్లో మొత్తం 5023 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
‣ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్‌లో ఫ్యాషన్ డిజైన్ 742, లెదర్ డిజైన్ 172, యాక్సెసరీ డిజైన్ 654, టెక్స్టైల్ డిజైన్ 653, నిట్వేర్ డిజైన్ 302, ఫ్యాషన్ కమ్యూనికేషన్ 742 సీట్లు ఉన్నాయి.
‣ బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో అపరల్ ప్రొడక్షన్ విభాగంలో 608 మందికి అవకాశం ఉంది..
‣ పీజీ కోర్సులైన మాస్టర్ ఆఫ్ డిజైన్‌లో 260, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్లో 742, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో 148 సీట్లు కేటాయించారు.
పరీక్ష ఇలా...
ఒక్కో కోర్సుకు ప్రశ్నపత్రం ఒక్కో విధంగా ఉంటుంది. రుణాత్మక మార్కులు లేవు. ప్రతి సరైన సమాధానానికీ ఒక మార్కు.
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి జనరల్ ఎబిలిటీ టెస్ట్ (జీఏటీ) నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/ హిందీ మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు.
పరీక్షలో: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ పరీక్షలో మొత్తం వంద ప్రశ్నలుంటాయి. వీటిలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు, కమ్యూనికేటివ్ ఎబిలిటీ నుంచి 25, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 25, ఎనలిటికల్ ఎబిలిటీ 15, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి.
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జనరల్ ఎబిలిటీ టెస్టు (జీఏటీ) నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిని మూడు గంటల్లో పూర్తిచేయాలి.
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షలో: క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 30, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 45, ఎనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ 25, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. కేస్ స్టడీకి 25 మార్కులు కేటాయించారు.
వెయిటేజీ ఎంత?
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో వంద శాతం జీఏటీ వెయిటేజీ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో సీఏటీ 50, జీఏటీ 30, సిచ్యుయేషన్ టెస్టుకి 20 శాతం వెయిటేజీ ఉంది. మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో సీఏటీ 40, జీఏటీ 30, జీడీ/పీఐ 30 శాతం వెయిటేజీ ఉంది. మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో జీఏటీ 70, జీడీ/పీఐ 30 శాతం వెయిటేజీ ఉంది. మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్లో జీఏటీ 70, జీడీ/పీఐ 30 శాతం వెయిటేజీ కల్పించారు.
ఈ అంశాల్లో ప్రశ్నలు
క్వాంటిటేటివ్ ఎబిలిటీ
కూడికలు, గుణింతాలు, భాగహారం, తీసివేతలు, శాతాలు, భిన్నాలు, వడ్డీ రేట్లు, పని-కాలం, దూరం-వేగం, నిష్పత్తి, సగటు..తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నల స్థాయి మరీ అంత కఠినంగా ఉండదు. హైస్కూల్ మ్యాథ్స్ పుస్తకాల నుంచి వీటిని చదువుకుంటే సరిపోతుంది.
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్
వర్తమాన అంశాలపై ప్రశ్నలడుగుతారు. జనరల్ నాలెడ్జ్‌లో అభ్యర్థికి సమాజం, పరిసరాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. తాజా పరిణామాలపై అవగాహన ఉంటే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలకు సులువుగానే సమాధానాలు రాయొచ్చు. రోజూ ఏదైనా పత్రిక చదివి ముఖ్యాంశాలను నోట్సు రూపంలో రాసుకుంటే సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు.
కేస్ స్టడీ
ఈ విభాగంలో ఫ్యాషన్ పరిశ్రమకు సంబంధించిన అంశం గురించి సమాచారం ఉంటుంది. అభ్యర్థి మేనేజీరియల్ నైపుణ్యం పరిశీలిస్తారు.
కమ్యూనికేషన్ ఎబిలిటీ
అభ్యర్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. రోజువారీ జీవితంలో మాట్లాడడానికి అవసరమైన పదసంపద, వ్యాకరణం ఉన్నాయో, లేదో పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఆంగ్లంలో పాసేజ్‌లు ఇచ్చి వాటిపై ప్రశ్నలడుగుతారు. ఈ విభాగంలోని ప్రశ్నలు హైస్కూల్ స్థాయిలో ఉంటాయి. వ్యాకరణ ప్రాథమిక నియమాలు, ప్రాథమిక స్థాయి పదజాల పరిజ్ఞానం ఉండాలి. సమానార్థాలు, వ్యతిరేకార్థాలు, సామెతలు, నుడికారాలు, సింగ్యులర్, ప్లూరల్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, స్పెలింగ్ కరెక్షన్ తదితర విభాగాల్లో ప్రశ్నలడుగుతారు.
ఎనలిటికల్ ఎబిలిటీ
అభ్యర్థి తర్కాన్ని పరీక్షించడానికి ఈ సెక్షన్‌ను కేటాయించారు. కొంత సమాచారం ఇచ్చి దాన్నుంచే జవాబులు రాబట్టే ప్రశ్నలు అడుగుతారు. ఈ సెక్షన్ ద్వారా అభ్యర్థి ఆలోచనా స్థాయిని కూడా పరీక్షిస్తారు. ఇచ్చిన సమాచారాన్ని బాగా విశ్లేషించగలిగితే సమాధానం గుర్తించడం సులువవుతుంది. గణితంలో పరిజ్ఞానం ఈ సెక్షన్ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి ఉపయోగపడుతుంది.
క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్
అభ్యర్థికి డిజైనింగ్‌లో సృజనాత్మకత ఎలా ఉందో ఈ పరీక్ష ద్వారా పరిశీలిస్తారు. రంగులను ఎలా ఉపయోగిస్తున్నారు, పరిశీలనాశక్తి ఏ విధంగా ఉంది, కొత్తదనం ఏమైనా ఉందా, ఇలస్ట్రేషన్, కళాత్మక నైపుణ్యం.. తదితర అంశాల మేళవింపుతో ఈ పరీక్ష ఉంటుంది.
రాత పరీక్షలో అర్హత సాధించినవాళ్లకు వారు ఎంపిక చేసుకున్న కోర్సును బట్టి సిచువేషన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
గ్రూప్ డిస్కషన్: ఏదైనా ఒక కేస్ స్టడీ ఇచ్చి దానిపై 15 నుంచి 20 నిమిషాలు చర్చించమంటారు. అభ్యర్థులు చర్చిస్తున్నప్పుడు నిర్ణేతలు ఆ కాన్సెప్ట్‌పై అభ్యర్థికి ఉన్న స్పష్టత, ఆ అంశంపై ఉన్న పరిజ్ఞానం, ఆ అంశంపై అభ్యర్థి సమావేశంలో ఎంతవరకు భాగస్వామి అయ్యారు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, కొత్త ఆలోచనలు ఏమైనా పంచుకున్నారా, సమస్య పరిష్కార దిశగా ఎలా స్పందిస్తున్నారు, నాయకత్వ లక్షణాలు, భావాలు పంచుకున్న తీరు, భావాల్లో పరిణతి, భాషలో స్పష్టత...ఇలా పలు కోణాల్లో పరిశీలిస్తారు.
ఇంటర్వ్యూలో: అభ్యర్థికి ఫ్యాషన్ కెరియర్‌పై ఏమేరకు ఆసక్తి ఉంది? ఈ రంగంపై పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉంది? అకడమిక్ ప్రతిభ, కో కరిక్యులర్ యాక్టివిటీస్, కమ్యూనికేషన్, జనరల్ అవేర్నెస్ అండ్ ఆప్టిట్యూడ్, క్రియేటివిటీ, లేటరల్ థింకింగ్..తదితర కోణాల్లో పరిశీలిస్తారు.
ఉపాధి అవకాశాలు
నిఫ్ట్‌లో చదువుకున్నవారికి కార్పొరేట్ సంస్థలు ప్రాంగణ నియామకాల ద్వారా ఆకర్షణీయ వేతనాలు, హోదాలు అందిస్తున్నాయి. హుందాగా కనిపించాలనే తపన యువతతోపాటు పెద్దవారిలోనూ పెరుగుతోంది. ఇలా కనిపించడంలో దుస్తుల, యాక్సెసరీస్ పాత్ర కీలకం కావడంతో డబ్బు విషయంలో వెనుకాడకుండా ఫ్యాషన్ ప్రపంచంవైపు జనాలు పరుగులు తీస్తున్నారు. కాబట్టి ఆకట్టుకునేలా దుస్తులు, వివిధ వస్తువులను డిజైన్ చేయగలిగే విద్య అబ్బిందంటే రూ.లక్షల్లో సంపాదించవచ్చు. కోర్సులు విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత ఫ్యాషన్ డిజైనర్, స్టైలిస్ట్ (స్టోర్స్), ఫ్యాషన్ రిటైలర్, ఫ్యాషన్ ఆంత్రప్రెన్యూర్, పర్సనల్ స్టైలిస్ట్/ సెలెబ్రిటీ స్టైలిస్ట్ తదితర హోదాలతో రాణించవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: జనవరి మొదటి వారం
ప్రవేశ పరీక్ష తేది: ఫిబ్రవరి మొదటి వారం
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
వెబ్సైట్: https://nift.ac.in/
*************************************
మరింత సమాచారం ... మీ కోసం!