• facebook
  • whatsapp
  • telegram

టీచింగ్‌ ట్రైనింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు

ఆర్‌ఐఈలలో ప్రవేశ నోటిఫికేషన్‌ వివరాలు


 

కొత్త కోర్సులు ఎన్ని వచ్చినా ఎవర్‌ గ్రీన్‌ కెరియర్‌ టీచింగ్‌. ఈ వృత్తిలో రాణించడానికి డిప్లొమా లేదా బ్యాచిలర్‌ స్థాయిలో ఎడ్యుకేషన్‌ కోర్సులు పూర్తిచేయడం తప్పనిసరి. మేటి సంస్థల్లో చదువుకున్నవారు ఆకర్షణీయ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. అలాంటివాటిలో రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌ఐఈ)లు ముఖ్యమైనవి. నాణ్యమైన ఉపాధ్యాయ విద్యను అందించడానికి వీటిని నెలకొల్పారు. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఈ సంస్థలు బీఎస్సీ బీఎడ్, బీఏ బీఎడ్, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు డిగ్రీ విద్యార్థుల కోసం బీఎడ్, ఎంఎడ్, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌-ఎంఎడ్‌ కోర్సులూ ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 


ఉపాధ్యాయ విద్యలో ఆర్‌ఐఈలు దేశంలో పేరున్న సంస్థలు. ఇక్కడ చదువులు పూర్తిచేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో ఎంపికై, తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోగలరు. అందువల్ల బోధన రంగంలో రాణించాలనుకున్న ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు ఆర్‌ఐఈల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ సంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఏ/బీఎస్సీ- ఎడ్‌ కోర్సుల్లో చేరినవాళ్లు నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్‌ పూర్తిచేసుకోవచ్చు. దీంతో ఏడాది సమయం ఆదాతోపాటు నాణ్యమైన ఉపాధ్యాయ విద్యా దక్కుతుంది. అలాగే ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులైతే ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సులో చేరి ఆరేళ్లకే ఎమ్మెస్సీతోపాటు బీఎడ్‌ పూర్తి చేసుకుని ఏడాది కాలాన్ని ఆదా చేసుకోవచ్చు. డిగ్రీ విద్యార్థులైతే నేరుగా ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌-ఎంఎడ్‌ కోర్సును మూడేళ్లలో పూర్తి చేసుకోవచ్చు. విడిగా ఈ రెండు కోర్సులూ చదవడానికి నాలుగేళ్లు అవసరం.  


     ఏమిటి ప్రత్యేకత?   

ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సులను పేరున్న సంస్థల్లో చదివినవారు మంచి నైపుణ్యాలను పెంపొందించుకోగలరు. ఎందుకంటే వీరికి తొలి సెమిస్టరు నుంచే బోధనపై ప్రత్యేక శిక్షణ అందిస్తారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికీ సులువుగానే వీరు పోటీ పడగలరు. నాణ్యమైన శిక్షణ కారణంగా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పే సమర్థతా దక్కుతుంది. ఈ విధానంలో చదువుకున్నవారికి మెథడాలజీలో నైపుణ్యం మెరుగవుతుంది. ఆర్‌ఐఈల్లో ఇంటిగ్రేటెడ్‌ టీచింగ్‌ కోర్సులు చదివినవారికి జాతీయ స్థాయిలో పేరున్న కార్పొరేట్, అంతర్జాతీయ విద్యా సంస్థలు ప్రాంగణ నియామకాలతో బోధకులుగా అవకాశం కల్పిస్తున్నాయి. బీఏ/ బీఎస్సీ ఎడ్‌ పూర్తిచేసిన వారికి నెలకు రూ.50 వేలు, ఎమ్మెస్సీఎడ్‌ కోర్సుల వారికి రూ.60 వేల చొప్పున అవకాశాలు దక్కుతున్నాయి. 


     ఆర్‌ఐఈలు.. సీట్లు   

ఆజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూరుల్లో ఇవి ఉన్నాయి. ఒక్కో సంస్థనూ రాష్ట్రాల వారీ విభజించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఆర్‌ఐఈ మైసూరు పరిధిలోకి వస్తాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చెరి, లక్షద్వీప్‌లు కూడా ఈ సంస్థ కిందే ఉంటాయి. ఇందులోని సీట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా విభజించారు. మైసూరులో బీఎస్సీబీఎడ్‌ (ఫిజికల్‌ సైన్స్‌)లో 55, బీఎస్సీబీఎడ్‌ (బయలాజికల్‌ సైన్స్‌)లో 55, బీఏబీఎడ్‌లో 55 సీట్లు ఉన్నాయి. విడిగా బీఎడ్‌ కోర్సుకు సంబంధించి సైన్స్‌ అండ్‌ మ్యాథ్స్‌ గ్రూపులో 55, సోషల్‌ సైన్స్‌ అండ్‌ లాంగ్వేజ్‌ గ్రూపులో 55 సీట్లు లభిస్తున్నాయి. అలాగే ఈ సంస్థలో ఎంఎడ్‌లో 55, ఎమ్మెస్సీఎడ్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్టులో 22 చొప్పున సీట్లు ఉన్నాయి. ఎమ్మెస్సీ ఎడ్‌ సీట్లకు మాత్రం దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. రాష్ట్రాల కోటా వర్తించదు. అలాగే ఆరేళ్లూ కొనసాగాలి. ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సు పూర్తిచేసినవారు మైసూరులోనే ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేసుకునే సౌకర్యం ఉంది. అలాగే ఆర్‌ఐఈ, భోపాల్‌లోనే అందించే ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్, ఎంఎడ్‌ మూడేళ్ల కోర్సులో 55 సీట్లు ఉన్నాయి. వీటికి దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. హర్యానాలోని ఎస్‌ఐఏఎస్‌టీఈ సంస్థ అందించే బీఏ/బీఎస్సీ-ఎడ్‌ కోర్సుల్లో 20 శాతం సీట్లకు దేశవ్యాప్తంగా అందరికీ అవకాశం ఉంది. ఆర్‌ఐఈల్లో చేరిన ఎస్సీ, ఎస్టీలందరికీ స్కాలర్‌షిప్పులు లభిస్తాయి. మిగిలిన అభ్యర్థుల్లో సగం మందికి తల్లిదండ్రుల వార్షికాదాయం ప్రాతిపదికన వీటిని అందజేస్తారు. 


    అర్హత   

బీఎస్సీ బీఎడ్‌ కోర్సులో చేరడానికి ఇంటర్‌ ఎంపీసీ / బైపీసీ విద్యార్థులు అర్హులు. ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సుకు ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులే అర్హులు. బీఏ బీఎడ్‌ కోర్సుకు సైన్స్‌ / ఆర్ట్స్‌/ కామర్స్‌ ఏదైనా స్ట్రీమ్‌తో ఇంటర్‌ చదివినవాళ్లు అర్హులు. ఈ కోర్సులన్నింటికీ ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. బీఎడ్, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌-ఎంఎడ్‌ కోర్సులకు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. ఎంఎడ్‌ కోర్సుకు 50 శాతం మార్కులతో బీఎడ్‌ లేదా ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ లేదా డీఎడ్‌తోపాటు డిగ్రీ ఉత్తీర్ణత అవసరం. అన్ని కోర్సులకూ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45 శాతం మార్కులు సరిపోతాయి. బీఎస్సీ/బీఏ/ఎమ్మెస్సీ-ఎడ్‌ కోర్సులకు 2024, 2023, 2022లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారే అర్హులు. బీఎడ్, బీఎడ్‌-ఎంఎడ్, ఎంఎడ్‌ కోర్సులకు ఏ సంవత్సరంలో ఉత్తీర్ణులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 


    ఎంపిక   

పరీక్షలో చూపిన ప్రతిభ, అకడమిక్స్‌ల్లో సాధించిన మార్కులతో కోర్సులోకి తీసుకుంటారు. ఆర్‌ఐఈల్లో సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ)ను ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహిస్తోంది. రాత పరీక్షకు 60 శాతం, ఇంటర్‌/డిగ్రీ/బీఎడ్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ. ఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరీక్షలో.. భాషా నైపుణ్యాలు, టీచింగ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీల నుంచి మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 20, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌/యాటిట్యూడ్‌ 30, రీజనింగ్‌ ఎబిలిటీ 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకీ అర మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. విభాగాలవారీ సిలబస్, పాత ప్రశ్నపత్రాలు ఆర్‌ఐఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 


     ప్రశ్నలిలా..   

లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ: కాంప్రహెన్షన్, వాక్యాలను క్రమ పద్ధతిలో అమర్చడం, ఖాళీలను సరైన పదంతో పూరించడం, వాక్యంలో ఉన్న తప్పుని గుర్తించడం, ఇచ్చిన ఫ్రేజ్‌కు సరైన అర్థం ఇచ్చే ఆప్షన్‌ గుర్తించడం, అసంపూర్ణంగా ఉన్న వాక్యానికి సరైన పదం చేర్చి పూర్తిచేయడం, సీక్వెన్సింగ్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, ప్రిపొజిషన్స్, టెన్సెస్, ఆర్టికల్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. 

టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌: ఎడ్యుకేషన్‌ ఆటిట్యూడ్, విద్యార్థులు, ఉపాధ్యాయవృత్తి, వృత్తిపరమైన ఆసక్తి, నాయకత్వ లక్షణాలు, బృంద నిర్వహణ, ఎమోషనల్‌ అండ్‌ సోషల్‌ అడ్జెస్ట్‌మెంట్, ఇంట్రాపర్సనల్, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, పాఠశాల విద్యకు సంబంధించి వర్తమాన సంఘటనలపైన అవగాహనను పరిశీలిస్తారు. 

రీజనింగ్‌ ఎబిలిటీ: వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్, మిస్సింగ్‌ నంబర్స్, నంబర్‌ సిరీస్, లెటర్‌ సిరీస్, థీమ్‌ ఫైండింగ్, జంబ్లింగ్, ఎనాలజీ, భిన్నమైనది గుర్తించడం, వాక్యాలను క్రమ పద్ధతిలో అమర్చడం, స్టేట్‌మెంట్‌ కన్‌క్లూజన్లు, సిలాజిజం, లాజికల్‌ ప్రాబ్లమ్స్, రిలేషన్‌షిప్స్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌ల్లో ప్రశ్నలు సంధిస్తారు. 


     మరికొన్ని సంస్థలు   

శస్త్ర డీమ్డ్‌ యూనివర్సిటీ, తంజావూర్‌: బీఏ(ఇంగ్లిష్‌) బీఎడ్, బీఎస్సీ (మ్యాథ్స్‌) బీఎడ్, బీఎస్సీ (ఫిజిక్స్‌) బీఎడ్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్, గుజరాత్‌ (గాంధీనగర్‌): ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్, బీఎస్సీ బీఎడ్, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఎంఎడ్, ఎమ్మెస్సీ ఎంఎడ్‌ కోర్సులు అందిస్తోంది.

 గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్, తమిళనాడు (దిండిగల్‌): బీఎస్సీ బీఎడ్‌ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)

 లవ్‌ లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ బీఎ బీఎడ్, బీఎస్సీ బీఎడ్‌ కోర్సులు ఉన్నాయి.

 తేజ్‌పూర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ కోర్సును మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో అందిస్తోంది.

(ఈ సంస్థలు సీయూఈటీ-యూజీ స్కోరు లేదా ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో ప్రవేశం కల్పిస్తున్నాయి)

దరఖాస్తు గడువు తేదీ: మే 31 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యుఎస్‌కు రూ.600. మిగిలిన అందరికీ రూ.1200

పరీక్ష తేదీ: జూన్‌ 16

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ

వెబ్‌సైట్‌: https://cee.ncert.gov.in/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలుspan>

‣ నలుగురితో కలిసిపోవాలంటే...

‣ బృందంతో నడుస్తూ..!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

Posted Date: 29-05-2024


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌