• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో ఐఐఎంలో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ

10+2 రెండో సంవత్సరం చదువుతున్న వారు అర్హులే!

ఎంబీఏ కోర్సులకు దేశంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు ప్రసిద్ధ సంస్థలు. ఇప్పుడివి ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఇంటిగ్రేటెడ్‌ విధానంలో మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఇటీవల ఐఐఎం రోహ్‌తక్‌ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రొగ్రాం ఇన్‌ లా (ఐపీఎల్‌) కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది. ఇంటర్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో సీట్లు కేటాయిస్తారు. ప్రకటనలకు సంబంధించిన పూర్తి వివరాలు..

ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సు ప్రారంభించిన మొదటి ఐఐఎంగా ఇందౌర్‌ గుర్తింపు పొందింది. ఆ తర్వాత నుంచి మరికొన్ని ఐఐఎంలు ఈ విధానంలో చదువులు అందిస్తున్నాయి. 2019 నుంచి ఐఐఎం రోహ్‌తక్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ బాట పట్టింది. ఇంటర్‌ తర్వాత మేనేజ్‌మెంట్‌ విద్య చదవాలనుకున్నవారికి ఐపీఎం ఎంతో ప్రయోజనం. ఏడాదికి మూడు చొప్పున ఐదేళ్ల కోర్సులో 15 టర్మ్‌లు ఉంటాయి. ఒక్కో టర్మ్‌ 3 నెలలు. మొత్తం కోర్సులో రెండు భాగాలుంటాయి. మొదటి భాగంలో ప్రాథమికాంశాలపై దృష్టి సారిస్తారు. రెండో భాగంటో మేనేజ్‌మెంట్‌ విద్యలో మెలకువలు అందిస్తారు. ప్రతి అకడమిక్‌ సంవత్సరం చివరలోనూ ఇంటర్న్‌షిప్‌లు పూర్తిచేయాలి. కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఐఐఎం రోహ్‌తక్‌ ఎంబీఏతోపాటు బీబీఏ డిగ్రీను ప్రదానం చేస్తుంది. మూడేళ్ల తర్వాత వైదొలిగినవారికి బీబీఎ డిగ్రీ అందిస్తారు. మొత్తం 180 సీట్లు ఉన్నాయి. ఐదేళ్లకూ కోర్సు ఫీజు సుమారు రూ.35 లక్షలు. బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చు. 

పరీక్ష ఇలా..

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, వెర్బల్‌ ఎబిలిటీ ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగాన్నీ 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం పరీక్ష వ్యవధి రెండు గంటలు. అన్నీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలే. సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. 

పర్సనల్‌ ఇంటర్వ్యూ

ఆప్టిట్యూడ్‌ టెస్టులో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ జూన్‌ రెండోవారంలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అకడమిక్స్, జనరల్‌ అవేర్‌నెస్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పరిశీలిస్తారు. 

ఐపీఎల్‌

ఐఐఎం రోహ్‌తక్‌ న్యాయవిద్యలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సునూ అందిస్తోంది. 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీఎంకు వర్తించే అర్హత నిబంధనలే దీనికీ ఉన్నాయి. జూన్‌ 30, 2023 నాటికి వయసు 20 ఏళ్లకు మించరాదు. 

క్లాట్‌లో చూపిన ప్రతిభతో సీట్లు భర్తీ చేస్తారు. అందువల్ల ఈ సంస్థలో చదవాలనుకునేవారు క్లాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 20 వరకు అవకాశం ఉంది. లేదా ఐపీఎం (ఐదేళ్ల ఎంబీఏ) పరీక్షతోనూ ఐపీఎల్‌లో చేరవచ్చు. ఆ పరీక్షలో ఉన్న అంశాలకు అదనంగా లీగల్‌ రీజనింగ్‌ విభాగంలో ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 20 నిమిషాలు. పరీక్షలో ప్రతిభ చూపినవారికి జూన్‌ రెండోవారంలో ఇంటర్వ్యూ నిర్వహించి, సీట్లు కేటాయిస్తారు. కోర్సు ఫీజు రూ.28.35 లక్షలు. ఐదేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి బీబీఏ-ఎల్‌ఎల్‌బీ డిగ్రీని ప్రదానం చేస్తారు.

వెయిటేజీ

ఆప్టిట్యూడ్‌ టెస్టు స్కోర్‌కు 45 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూ 15 శాతం, పాస్ట్‌ అకడమిక్స్‌ 40 (పదో తరగతికి 20, ఇంటర్మీడియట్‌కు 20) శాతం వెయిటేజీ ఉంటాయి. ఫలితాలు జులై మొదటి వారంలో వెలువడతాయి. ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తారు. 

అర్హత: పదోతరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం తప్పనిసరి. వయసు జూన్‌ 30, 2023 నాటికి 20 ఏళ్లలోపు ఉండాలి. 

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్‌ 10

పరీక్ష తేదీ: మే 20

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం 

వెబ్‌సైట్‌: https://www.iimrohtak.ac.in/index.php/en/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ సత్వర ఉద్యోగానికి.. స్వయం ఉపాధికి!

‣ కెనడాలో కోర్సులు చేసేద్దాం!

‣ సెంట్రల్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్‌ల భర్తీ

‣ ప్రణాళికను పాటిస్తూ.. సన్నద్ధతను సమీక్షిస్తూ!

‣ మెరుగైన పీజీకి మేలైన మార్గం!

‣ చివరి వరకు స్ఫూర్తిని కొనసాగించాలంటే?

‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!

Posted Date: 29-03-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌