• facebook
  • whatsapp
  • telegram

స్టూడియో సృష్టించే  అద్భుతాలు

విభిన్నమైన కెరియర్‌... వీఎఫ్‌ఎక్స్‌    

సృజనాత్మక దర్శకుడు విజువల్‌ ఎఫెక్ట్స్‌ (వీఎఫ్‌ఎక్స్‌)ను సమర్థంగా    ఉపయోగించుకుంటే ఎంతటి అద్భుతాలు సాధ్యమవుతాయో ‘బాహుబలి’ నిరూపించింది. మాహిష్మతీ సామ్రాజ్యంలో జరిగిన కథను ప్రేక్షకుల కళ్లకు కట్టేలా చెప్పటంలో వీఎఫ్‌ఎక్స్‌ పాత్ర ఎంతో! భూగోళంపై గ్రహాంతర వాసుల దాడులైనా, భీకరమైన బాంబు పేలుళ్లయినా, అసాధ్యమనిపించే సాహసాలైనా.. విజువల్‌ ఎఫెక్టుల మహిమ వల్లనే! సినిమాల పోస్ట్‌ ప్రొడక్షన్లో కీలకమైన ఈ వీఎఫ్‌ఎక్స్‌ను ఆసక్తి ఉన్నవారు చక్కని కెరియర్‌గానూ తీర్చిదిద్దుకోవచ్చు! 

గత దశాబ్ద కాలంలో భారతీయ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరిశ్రమకు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు తోడవటం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. ఉదాహరణకు ‘బాహుబలి’ విషయంలో హైదరాబాద్‌లోని ‘మకుట’ విజువల్‌ ఎఫెక్ట్‌ స్టూడియో పర్యవేక్షణలో ప్రపంచవ్యాప్తంగా 35 స్టూడియోలు పాలుపంచుకున్నాయి. అయితే కరోనా ప్రభావంతో మొన్నటిదాకా సినిమా షూటింగులు ఆగిపోయి ఈ రంగంలో కొంత స్తబ్ధత ఏర్పడింది. చిత్రీకరణలు ఎప్పటిలా పుంజుకుంటే వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలు పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలవుతుంది. అప్పుడు ఈ రంగంలో అవకాశాలు వెల్లువలా వచ్చిపడతాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంపై ఆసక్తి ఉన్నవారు సంబంధిత కోర్సులు చేసి ఈ పరిశ్రమలో చక్కని ఉపాధి అవకాశాలను చేజిక్కించుకోవచ్చు.  

విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలోకి ప్రవేశించాలనే ఆసక్తి ఉన్నవారు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న విజువల్‌ ఆర్ట్స్‌ డిగ్రీ కాలేజీలో బి.ఎ. విజువల్‌ ఆర్ట్స్‌ యానిమేషన్‌ అండ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ (3 ఏళ్ల కోర్సు)లో చేరవచ్చు. యూనివర్సిటీ వారి వెబ్‌సైట్‌లోకి వెళ్లి కళాశాలల వివరాలు తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ప్రైవేటు సంస్థలు కూడా విజువల్‌ ఎఫెక్ట్స్‌లో స్వల్ప వ్యవధి డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్ని అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరి విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

క్రీచర్‌ టీడీ

వీఎఫ్‌ఎక్స్‌ ప్రాజెక్టులోని జీవుల శరీరాలపై రెక్కలు, వెంట్రుకలు, చర్మం సహజంగా కనిపించేలా చేసే సాఫ్ట్‌వేర్లను తయారుచేసి ఆర్టిస్టులకు అందించేది క్రీచర్‌ టీడీలే. డిజిటల్‌ డైనోసార్లు, ఇతర జంతువులు, అద్భుతమైన చిరుతలు నిజంగా అడవిలోనివేనా అన్నట్టుగా ఉండేలా రూపుదిద్దే ప్రోగ్రామ్‌లు, డిజిటల్‌ టూల్స్‌ను సిద్ధం చేసేది కూడా వీరే. ఇలా తయారుచేసిన టూల్స్‌ను వీఎఫ్‌ఎక్స్‌ ప్రొడక్షన్‌ ప్రక్రియలో భాగం చేసేందుకు వీరు పైప్‌లైన్‌ టీడీలతో కలిసి పనిచేస్తారు.

ప్రీ విజువలైజేషన్‌ ఆర్టిస్టు

కాన్సెప్టు ఆర్టిస్టులు సృష్టించిన 2డీ స్టోరీబోర్డులతో ప్రీవిజువలైజేషన్‌ ఆర్టిస్టులు తమ పనిని ప్రారంభిస్తారు. సినిమా సీన్లను తలపించే ఊహాజనిత దృశ్య రూపాలను సృష్టించి, తమ ఎడిటింగ్, కంపోజిటింగ్‌ నైపుణ్యాలతో ఆ దృశ్యాలన్నింటినీ ఒకచోట చేరుస్తారు. ప్రీవిజ్‌ ప్రక్రియ ద్వారా రూపుదిద్దుకునే ఊహాజనిత దృశ్యాల ఆధారంగానే సినిమా సీన్ల చిత్రీకరణ ఎలా జరగాలి? ఎంతసేపు జరగాలి? సినిమా లేదా ప్రొడక్షన్‌ లోని పాత్రల కదలికలు ఎలా ఉండాలి? అనేదానిపై నిర్మాతలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.

వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌

మొత్తం వీఎఫ్‌ఎక్స్‌ ప్రక్రియను పర్యవేక్షించే, వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్టులు అందరికీ తగిన ఆదేశాలిస్తూ సమన్వయపరిచేది వీరేే. కంపెనీ లేదా స్టూడియోల ప్రాజెక్టుల్లో భాగంగా వీఎఫ్‌ఎక్స్‌కు సంబంధించి జరిగే అన్ని ప్రక్రియల బాధ్యత వీరిదే. ప్రీ ప్రొడక్షన్‌కు సంబంధించిన తొలి దశల నుంచే వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్లు ప్రాజెక్టులో పనిచేయడం ప్రారంభిస్తారు. సినిమా లేదా టీవీ ప్రోగ్రాంకు చెందిన డైరెక్టర్, ప్రొడ్యూసర్లు, వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోల మధ్య సమాచార వారధిగా వీరు వ్యవహరిస్తారు. సినిమాలోని సీన్లకు ఏ తరహాలో, ఎక్కడెక్కడ వీఎఫ్‌ఎక్స్‌ అవసరమనేది వీరంతా కలిసి నిర్ణయిస్తారు. అనంతరం వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ తన పరిధిలోని వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్టులతో కలిసి సీన్ల నమూనా ప్రొటోటైప్‌ మెటీరియల్ని సిద్ధం చేస్తారు. 

సీజీ సూపర్‌వైజర్‌

వీఎఫ్‌ఎక్స్‌ ప్రాజెక్టులోని 3డీ కంప్యూటర్‌ జనరేటెడ్‌ (సీజీ) రూపకల్పనల పంపిణీ, నాణ్యతలకు అంతిమంగా బాధ్యత వహించాల్సింది వీరే. సినిమా ప్రొడక్షన్‌ దశకు చేరడానికి ముందు .. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌లోని ఏ భాగాలను సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు అధ్యయనం చేయాల్సి ఉంటుందో సీజీ సూపర్‌ వైజర్లు గుర్తిస్తారు. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ను పొందికగా కూర్చే నమూనాను కూడా వారే డిజైన్‌ చేస్తారు. ఈ క్రమంలో ఏయే డిజిటల్‌ టూల్స్‌ను వాడాలి అనేది నిర్ణయించే టెక్నికల్‌ డైరెక్టర్ల టీం కూడా సీజీ సూపర్‌వైజర్ల పరిధిలోనే పనిచేస్తుంది. 

కంపోజిటర్‌

ఫ్రేం, షాట్‌ లేదా వీఎఫ్‌ఎక్స్‌ సీక్వెన్స్‌కు చెందిన తుది ఇమేజ్‌ను సృష్టించేది కంపోజిటర్లే. ప్రాజెక్టులోని సీజీ ఇమేజ్‌లు, లైవ్‌ యాక్షన్‌ ఫుటేజీ, మ్యాట్‌ పెయింటింగ్‌ వంటి అన్నిరకాల డిజిటల్‌ మెటీరియల్‌లు కలిసి .. ఒకే ఒక ఇమేజ్, షాట్‌గా కనిపించేలా చేసేది వీరే. సీన్‌ విజువల్‌ అంశాలను పరిశీలించేదీ, పర్యవేక్షించేదీ వీరే. లైటింగ్‌ వాస్తవికంగా ఉందా.. లేదా అనేది వీరు పరిశీలించే మరో ముఖ్య అంశం. లైటింగ్, కెమెరా లెన్స్‌ రెండూ నేరుగా ఎదురుపడకుండా చూడాల్సిన బాధ్యత కంపోజిటర్లదే. ఇమేజ్‌ మరింత స్పష్టంగా, కాంతిమంతంగా కనిపించేందుకు అవసరమైన రీ లైటింగ్‌ కూడా వీరే చేస్తారు. కంపోజిటర్లు క్రోమా కీయింగ్‌ (కీయింగ్‌) టెక్నిక్‌ను వాడుతుంటారు. 

పైప్‌ లైన్‌ టీడీ (టెక్నికల్‌ డైరెక్టర్‌)

వీఎఫ్‌ఎక్స్‌ ప్రాజెక్టులో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, అది సాఫీగా ముందుకు సాగేందుకు దోహదపడేది పైప్‌లైన్‌ టీడీలే. ప్రాజెక్టులోని అన్ని విభాగాలకు అవసరమైన సాంకేతిక ఉపకరణాలను సమకూర్చి, వారి వారి పనులు సకాలంలో, అత్యుత్తమ ప్రమాణాలతో పూర్తయ్యేందుకు వీరు సహకారం అందిస్తారు. వీఎఫ్‌ఎక్స్‌ ప్రాజెక్టు ఎలా పనిచేస్తుంది, అందులో ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వర్తిస్తారు అనే దానిపై వారికి పూర్తి అవగాహన ఉంటుంది. 

రిగ్గింగ్‌ టీడీ 

3డీ సీజీ మోడల్స్‌ కోసం డిజిటల్‌ స్కెలిటన్‌లను తయారు చేసేది రిగ్గింగ్‌ టెక్నికల్‌ డైరెక్టర్లే. రిగ్స్‌ను పప్పెట్లు అనీ పిలుస్తారు. రిగ్స్‌ కదలికలు వాస్తవికతకు అద్దం పట్టేలా అభివృద్ధి చేసే ప్రతిభ వీరి సొంతం. వీరు సృష్టించే డిజిటల్‌ స్కెలిటన్ల ప్రాతిపదికనే యానిమేటర్లు తమ యానిమేషన్‌ పనిని ప్రారంభిస్తారు. మోడలర్లు 3డీలో స్టాటిక్‌గా తయారుచేసిన సీజీ చిత్రాన్ని ఉపయోగించి డిజిటల్‌ స్కెలిటన్‌ను రూపొందిస్తారు. క్యారెక్టర్ల ముఖ కవళికల, ఆకారాల, హావభావాల 3 డీ మోడల్స్‌నూ వీరు డిజిటల్‌ స్కెలిటన్లుగా మలిచి, వాటికదలికలు ఎలా ఉండాలో నిర్ణయిస్తారు. క్యారెక్టర్‌ నవ్వినప్పుడు, పరిగెత్తినప్పుడు దానిలోని ఎముకల కదలికలు ఎలా ఉంటాయి అనేది నిర్దేశించే కంప్యూటర్‌ ప్రోగ్రాంను రూపొందిస్తారు. ఇలా తయారయ్యే రిగ్‌లను యానిమేటర్లు పరీక్షించి రిగ్గింగ్‌ టీడీలకు ఫీడ్‌ బ్యాక్‌ అందిస్తారు. దాని ప్రకారం వారిద్దరు పూర్తిగా సంతృప్తి చెందేవరకు రిగ్గింగ్‌ మోడల్స్‌లో మార్పులు చేర్పులు చేస్తారు. 

రోటో ఆర్టిస్టు

సినిమా ఫ్రేమ్‌ల చుట్టూ డ్రాయింగ్‌లు వేయడం, వాటి నుంచి ఆబ్జెక్ట్‌లు తొలగించడం (కట్‌ అవుట్‌) వంటి పనులు చేసేది వీరే. ఇలా ఇమేజ్‌లను అభివృద్ధి చేసే ప్రక్రియ రోటో స్కోపింగ్‌. కట్‌అవుట్‌ అనంతరం ఇమేజ్‌లో మిగిలిన భాగాన్ని ‘మ్యాట్స్‌’ అని పిలుస్తారు. లైవ్‌ యాక్షన్‌ ఫ్రేంలపైనా రోటో ఆర్టిస్టులు పనిచేస్తారు. ఇందులో కొన్ని సీజీ దృశ్యాలు లేదా లైవ్‌ యాక్షన్‌ దృశ్యాలు .. లైవ్‌ ఇమేజ్‌లలోకి కూడా ప్రవేశిస్తాయి. ఒకవేళ షాట్‌కు అనుగుణంగా లైవ్‌ యాక్షన్‌ కెమెరా కదలికలు లేకుంటే .. రోటో స్కోపింగ్‌ కేవలం ఒకే ఒక ఫ్రేంను ఉపయోగిస్తుంది. ఒకవేళ కెమెరా కదలికలు సాగిస్తుంటే.. షాట్‌లోని ప్రతి ఫ్రేంలో ఉండే సముచిత ప్రదేశాలను గుర్తిస్తారు. దీంతో సీజీ దృశ్యాలు పొందికగా లైవ్‌ యాక్షన్‌ లో ఇమిడిపోతాయి. ఇదంతా కచ్చితత్వంతో చేసేందుకు రోటో ఆర్టిస్టుకు నిశిత పరిశీలన చేయగలిగే దృష్టి ఉండాలి. 

ఎఫ్‌ఎక్స్‌ టీడీ

భారీ పేలుళ్లు, దట్టమైన పొగలు, జల ప్రవాహం వంటి ఎఫెక్ట్‌ లను వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్టులు సృష్టించేందుకు ఎఫ్‌ఎక్స్‌ టీడీలు సహాయం అందిస్తారు. వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్టుల అవసరాలకు అనుగుణంగా .. సీన్‌ సీక్వెన్స్‌లలో ఇమిడిపోయేలా ఈ ఎఫెక్ట్‌లను సృజిస్తారు. ఇందుకోసం కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ స్క్రిప్ట్‌ను రాస్తారు. వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్టులకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను అభివృద్ధి చేసి, వాటిని పరీక్షిస్తారు. ఇదంతా జరిగాక ఆ టూల్స్‌ను వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో ప్రొడక్షన్‌ ప్రక్రియతో అనుసంధానిస్తారు.

ప్రెప్‌ ఆర్టిస్టు

విజువల్‌ ఎఫెక్ట్స్‌ను జోడించేందుకు సిద్ధంగా ఉన్న లైవ్‌ యాక్షన్‌ ఫుటేజీలలోని బ్యాక్‌ గ్రౌండ్లను ప్రెప్‌ ఆర్టిస్టులు క్లీన్‌ చేస్తారు. అనంతరం కంపోజిటర్లు ఆ బ్యాక్‌ గ్రౌండ్‌పై ఎఫెక్ట్స్‌ను జోడిస్తారు. ఈ క్రమంలో ప్రెప్‌ ఆర్టిస్టులు ‘ప్లేట్స్‌’ అనే ఫిల్మ్‌ షాట్స్‌పై పనిచేస్తారు. అవి ఒక చోటు నుంచి మరో చోటుకు కదిల్చేందుకు అనువుగా లేదా స్థిరంగా ఒకేచోట ఉంచేలా ఉంటాయి. అయితే తెర ముందు జరిగే యాక్షన్, పాత్రల కదలికలతో వీరికి ఏ మాత్రం సంబంధం ఉండదు. ప్లేట్స్‌ను క్లీన్‌ చేసేందుకు ప్రెప్‌ ఆర్టిస్టులు ప్రత్యేక వీఎఫ్‌ఎక్స్‌ సాఫ్ట్‌వేర్‌లు వినియోగిస్తారు. ఫ్రేమ్‌లోని అవాంఛిత దుమ్ము, గీతలను వీరు తొలగిస్తారు. కెమెరా కదలికలు సరిగ్గా లేక .. బంధించలేకపోయిన ఫ్రేమ్స్‌ను గుర్తించి వేరు చేస్తారు. 

లే అవుట్‌ ఆర్టిస్టు

లే అవుట్‌ ఆర్టిస్టులు వర్చువల్‌ కెమెరా పొజిషన్‌ను అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తారు. దీంతోపాటు వీఎఫ్‌ఎక్స్‌ ద్వారా సేకరించిన సీజీ దృశ్యాల్లోని క్యారెక్టర్‌లను ‘బ్లాక్‌’ చేస్తాయి. అంటే ఆ క్యారెక్టర్లకు కొరియోగ్రాఫ్‌ చేసేది లే అవుట్‌ ఆర్టిస్టులే. సీన్‌లో.. క్యారెక్టర్‌ కదలికలు ఏ ప్రదేశంలో మొదలై ఎక్కడ ముగియాలి అనేది వీరే నిర్ణయిస్తారు. సినిమా షాట్‌ ఫ్రేమింగ్, కంపోజిషన్, కెమెరా కోణం, కెమెరా- పాత్రల కదలికలు, సన్నివేశ చిత్రీకరణ క్రమంలో లైట్‌ వాడకం అనే అంశాలను పర్యవేక్షించేది లే అవుట్‌ ఆర్టిస్టే. ప్రతి సీన్‌ ఫ్రేంలో అన్నిరకాల మౌలిక అంశాలు ఇమిడేలా వీరు జాగ్రత్తపడతారు.  

లైటింగ్‌ ఆర్టిస్ట్‌

సీజీ సీన్లకు వాస్తవికత, సహజత్వం ఇచ్చేది లైటింగ్‌ ఆర్టిస్టే.  సీజీ లైట్లలో ఎప్పుడు ఏ రంగు వాడాలి, ఎక్కడ, ఏ ప్రదేశంలో అమర్చాలి, వాటి వెలుతురులో హెచ్చుతగ్గులు ఎప్పుడు అవసరం అనేవి వీరే నిర్ణయిస్తారు. షూటింగ్‌ లొకేషన్‌లో తీసిన ఫొటోలను పరిశీలిస్తూ.. వాటికి అనుగుణంగా 3డీ దృశ్యాల్లో లైటింగ్‌ ఉందా లేదా అనేది సరిపోల్చే పనిని వీరే చేస్తారు.  

కంపోజిటింగ్‌ సూపర్‌వైజర్‌

విజువల్‌ ఎఫెక్ట్‌ షాట్లకు సంబంధించిన విభిన్న అంశాలను సేకరించి వాటిని కలగలిపే విభాగానికి ఇంచార్జిగా వ్యవహరించే వ్యక్తి వీరు. కంపోజిటర్లు వీరి పరిధిలోనే పనిచేస్తారు. ప్రాజెక్టు ఎలా జరుగుతోంది.. దాని నాణ్యత ఎలా ఉంది అనేది పర్యవేక్షించేది వీరే. షాట్లలో రంగుల పొందిక సరిగ్గా, సమతుల్యతతో ఉందా లేదా.. అనేది చూడాల్సిన బాధ్యత వీరిదే. కంపోజిటింగ్‌ సూపర్‌ వైజర్లకు కంపోజిటింగ్‌లో అనుభవం ఉంటుంది. సీజీ ఇమేజ్‌లు, లైవ్‌ యాక్షన్‌ ఫుటేజీలను సేకరించడంలో వాటన్నింటినీ కలిపి సమగ్రరూపం ఇవ్వడంలో వీరు నిపుణులు. 
 

Posted Date: 06-03-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌