• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో ఖగోళ పరిశోధన 

డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్పేస్‌ కోర్సుల వివరాలు



చంద్రయాన్‌-3 విజయవంతమైన వేళ.. దేశం మొత్తం గర్వంతో తలెత్తుకున్న వేళ.. వేలాది మంది విద్యార్థుల్లో తామూ అంతరిక్ష పరిశోధనల్లో రాణించాలనే స్ఫూర్తి రగిలింది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమూ సాధించని అరుదైన ఘనత తమ దేశానికి తెచ్చిపెట్టిన శాస్త్రవేత్తల మాదిరిగానే ఖగోళ ప్రయోగాల్లో దూసుకుపోవాలనే కల వేళ్లూనుకుంది. మరి ఇంతటి విశిష్ట ఆశయ సాధనకు ఏ దిశగా అడుగులు వేయాలో.. ఎలా సన్నద్ధం కావాలో చూద్దామా..


ఇంటర్‌ తర్వాత ఖగోళ పరిశోధనలవైపు అడుగులు వేయాలంటే.. ఈ కింది కోర్సుల్లో ఏదైనా ఎంచుకోవచ్చు.

ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ 

ఏవియానిక్స్‌ ఇంజినీరింగ్‌ 

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌.

ఆప్టికల్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ 

ఫిజిక్స్, ఆస్ట్రానమీలో పీహెచ్‌డీ 

ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ 

ఫిజిక్స్‌ - సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఎర్త్‌ సిస్టం సైన్సెస్‌లో ఎంఎస్‌.


ఖగోళ శాస్త్రవేత్తలు ప్రధానంగా రెండు రకాలు.. ఒకరు ఫిజిసిస్ట్, మరొకరు ఆస్ట్రానమర్‌. ఫిజిసిస్ట్‌లు థియరీ అంశాలు, ల్యాబ్‌ పరికరాల గురించి అధ్యయనం చేస్తారు. తాము తయారుచేసిన పరికరాలు అంతరిక్షంలో ఎలా పనిచేయగలవో పరిశోధిస్తారు. ఆస్ట్రానమర్‌లు విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు వంటి వాటిని పరిశీలిస్తారు. అక్కడ వాతావరణం, పరిస్థితులు, ప్రయోగాలకున్న అవకాశాలు.. వంటివన్నీ తెలుసుకుంటారు. ఇవేకాక మరిన్ని విభాగాలు కూడా ఉంటాయి.. అన్ని విధాలైన ఇంజినీరింగ్‌ శాఖలకు వీటితో సంబంధం, పని ఉంటుంది. వీటన్నింటి అంతిమ ధ్యేయం అంతరిక్ష పరిశోధనే!


విద్యాసంస్థలు

జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్, బిట్‌శాట్‌.. వంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపడం ద్వారా దేశంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్‌ - టెక్నాలజీ కళాశాలల్లో సీటు దక్కించుకోవచ్చు. 

ఐఐఎస్‌సీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌) - బెంగళూరు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) - త్రివేండ్రం, ఐఐటీలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ది ఇంటర్‌ - యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ - పుణె, సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సైన్సెస్‌ (యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌), రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - బెంగళూరు... వంటి సంస్థల్లో విద్య అభ్యసించినవారు పరిశోధన దిశగా స్థిరమైన అడుగులు వేయొచ్చు.


ఎలా?

ఇంటర్మీడియట్‌ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను మంచి మార్కులతో పూర్తి చేయాలి.  చిన్న తరగతుల నుంచే మ్యాథ్స్, సైన్స్‌ల్లో గట్టి పట్టు అవసరం. ఇంటర్‌ తర్వాత గ్రాడ్యుయేషన్‌లో సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ పూర్తి చేయాలి. 

విద్యార్థులు జియోఫిజిక్స్, జియోఇన్ఫర్మేటిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌ వంటి సబ్జెక్టుల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ చేయడం ద్వారా పరిశోధనారంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునే వీలుంటుంది. 

కేవలం ఇస్రోలోనే కాకుండా.. ఇండియాలో ఉన్న ఇతర స్పేస్‌ టెక్నాలజీ సంస్థల్లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. రాకెట్ల తయారీ, స్పేస్‌ క్రాఫ్ట్స్, లాంచర్స్, శాటిలైట్స్‌.. సపోర్టింగ్‌ సిస్టమ్స్‌ - టూల్స్‌ తయారీ.. ఇటువంటి వాటి కోసం పనిచేసే సంస్థల్లో చేరే వీలుంటుంది. ఇవి మాత్రమే కాక విదేశాల్లోనూ వీరికి మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి.


ఇస్రోకి నేరుగా..

ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌)కు నేరుగా శాస్త్రవేత్తలను ఎంపిక చేసేలా తన సొంత సంస్థ ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బి) పనిచేస్తుంది. గ్రాడ్యుయేషన్‌ అర్హతతో దీనికి దరఖాస్తు చేయవచ్చు. ఇది కొన్నిసార్లు ప్రాంగణ ఎంపికలు కూడా చేస్తుంది. ఈ సంస్థ నిర్వహించే పరీక్షలు రాయడానికి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్, మెకానికల్, వేరే ఏదైనా సంబంధిత సబ్జెక్టుతో బీటెక్‌ లేదా బీఈ చదివుండాలి. ప్రాథమిక పరీక్ష ఉత్తీర్ణులకు తదుపరి దశల్లో రాత పరీక్షలు, ముఖాముఖిలకు ఆహ్వానిస్తారు. 

ఇక్కడే కాకుండా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించేందుకు ఇస్రో నియామక పరీక్షలు నిర్వహిస్తుంది. ఖాళీలను అనుసరించి ఎంపికలుంటాయి. 

ఎంపికైన విద్యార్థులు ఏవియానిక్స్‌ టెక్నీషియన్, ఆస్ట్రానమర్, ఏరోస్పేస్‌ ఇంజినీర్, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్, మెకానికల్‌ ఇంజినీర్, స్పేస్‌ సైంటిస్ట్‌.. వంటి పలు పోస్టుల్లో విధులు నిర్వర్తిస్తారు.


ఖగోళ పరిశోధనలకు సహకరించే మరిన్ని సంస్థలు..

ఏంట్రిక్స్‌ కార్పొరేషన్‌

న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ 

ఈ రెండు సంస్థలు శాటిలైట్‌ సిస్టమ్స్, లాంచ్‌ వెహికల్స్, టెక్నాలజీను అభివృద్ధి చేస్తాయి. 

ఇవేకాక.. గోద్రేజ్‌ ఏరోస్పేస్, లార్సెన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ), అగ్నికుల్‌ కాస్మోస్, ధ్రువ స్పేస్‌.. వంటి పలు సంస్థల్లోనూ పనిచేయవచ్చు.


పరిశోధనే ప్రాణమైతే..

ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థలో భాగం కావాలని ప్రతి విద్యార్థీ కోరుకోవాలి. ఇది పెద్ద పెద్ద నగరాల్లో చదివిన వారికే అనుకుంటే పొరపాటు. సాధారణ పట్టణాల నుంచి వచ్చినవారు కూడా సాధించగలరు. మాది అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గవరవరం గ్రామం. ఆరో తరగతి వరకూ అక్కడే చదివి, తర్వాత నాన్న ఉద్యోగ రీత్యా అనంతపురం వెళ్లాను. పదోతరగతి వరకూ అక్కడే ఉన్నాను. ఇంటర్‌ విజయవాడలో చదివాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంక్‌ రావడంతో ఐఐఎస్‌టీ - త్రివేండ్రంలో సీటు దొరికింది. మన దేశంలో అంతరిక్ష విద్యకు అత్యున్నత సంస్థల్లో ఇది ముఖ్యమైంది. క్యాంపస్‌ వాతావరణం చాలా బాగుంటుంది. అలాగే సీఆర్పీఎఫ్‌ రక్షణా ఉంటుంది. విద్యార్థుల శ్రద్ధ అంతా డిగ్రీ, పరిశోధనపైనే ఉండేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడే ఏవియానిక్స్‌లో బీటెక్‌ పూర్తిచేశాను. అకడమిక్‌లో మెరుగైన ప్రతిభ కనబరచడంతో పరీక్షల అనంతరం ఇస్రోకి ఎంపికయ్యాను. త్వరలో పీజీ చేయాలి అనుకుంటున్నాను. ఖగోళశాస్త్రంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు భౌతికశాస్త్రంతోపాటు లెక్కలు బాగా అధ్యయనం చేయాలి. ఈ సబ్జెక్టుల్లో రాణించినవారు.. స్పేస్‌ సైన్స్‌ కోర్సులు పూర్తిచేసుకుంటే.. మన దేశాన్ని అంతరిక్ష పరిశోధనల్లో అగ్రస్థానంలో నిలబెట్టగలం. విద్యార్థులకు అంతరిక్షంపై అవగాహన కల్పించడం కోసం ఏటా అక్టోబరు 4 నుంచి 10వ తేదీ వరకూ ‘వరల్డ్‌ స్పేస్‌ అవేర్‌నెస్‌ వీక్‌’ నిర్వహిస్తున్నారు. చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో ఈసారి మరింత ఉత్సాహంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. - కొమ్మనమంచి భరద్వాజ్, యువ శాస్త్రవేత్త, ఇస్రో, శ్రీహరికోట.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘పవర్‌ బీఐ’తో బెస్ట్‌ కెరియర్‌

‣ కోర్సుల్లో ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇలా!

‣ దూరవిద్యలో వైవిధ్య కోర్సులెన్నో!

‣ ఒత్తిడిని ఓడించేద్దాం..!

‣ పేద విద్యార్థులకు ఉచితంగా అమెరికా విద్య!

Posted Date: 05-09-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌