• facebook
  • whatsapp
  • telegram

వృద్ధికీ ఉపాధికీ.. ఐఓటీ!

ఇంజినీరింగ్‌లో అధునాతన బ్రాంచి   

ఇంజినీరింగ్‌ విద్యలో విశేష ప్రాధాన్యం సంతరించుకున్న బ్రాంచీల్లో ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ (ఐఓటీ) ఒకటి. ఎన్నో పరిశ్రమలు ఐఓటీ ప్రయోజనాలను పొందుతున్నాయి. సమర్థత, సౌలభ్యం అవసరమున్న ప్రతిచోటా ఇది అవసరమవుతోంది. స్మార్ట్‌ సిటీ, స్మార్ట్‌ ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ, స్మార్ట్‌ అగ్రికల్చర్, హోమ్‌ ఆటోమేషన్‌ లాంటి రంగాల్లో ఐవోటీ అమలవుతోంది. రోజు రోజుకీ ఈ జాబితా పెరుగుతోంది. కొత్త రంగం కాబట్టి  అభివృద్ధికీ, ఉపాధికీ దీనిలో ఎంతో అవకాశం ఉంది.

మహేష్‌ ప్రతిరోజూ మెట్రోలో ఆఫీస్‌కి వెళుతుంటాడు. తొందరగా ఇంటికి రావాల్సివచ్చి ఆ రోజు స్కూటర్‌ మీద బయలుదేరాడు. పక్క సందులో వస్తున్న కారును గుర్తించలేక ఒత్తిడి వల్ల బండి అదుపు తప్పింది. ఐతే అతని మానసిక స్థితిలో వస్తున్న మార్పులను సెన్సార్ల ద్వారా గ్రహించిన అతని ‘స్మార్ట్‌ హెల్మెట్‌’ అవసరమైన సంకేతాలను అవతలి వైపున్న ‘స్మార్ట్‌ కార్‌’కి చేరవేసి వేగం తగ్గించమని అభ్యర్థన పంపింది. ఇంటర్నెట్‌ ద్వారా అందుకున్న ఈ సమాచారాన్ని  వెంటనే ప్రాసెస్‌ చేసి కారు వేగం తగ్గించింది. మహేష్‌కి పెద్ద ప్రమాదం తప్పింది. ఐఓటీ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసిన ఈ రెండు వస్తువులూ ‘ఆలోచించగలగటం’తో ప్రాణ రక్షణ సాధ్యమయింది.

ఇప్పటికే ఎన్నో ఐఓటీ పరికరాలు ఉపయోగంలో ఉన్నాయి. స్మార్ట్‌ ఫోన్‌లకు డేటాను పంపే ఫిట్‌నెస్‌ ట్రాకర్లు, వాయు కాలుష్యాన్ని కొలిచే సెన్సార్లు, ఒక యాప్‌ సహాయంతో నడిచే కార్లు.. మచ్చుకి కొన్ని. ఇప్పుడున్న ఐఓటీ పరికరాల సంఖ్య భవిష్యత్తులో ఉండబోయే పరికరాలతో పోలిస్తే ఒక లెక్క కాదు. సాంకేతిక విప్లవాన్ని మనం తప్పించుకోలేము. నిర్లక్ష్యం చేయడానికి వీలు కానన్ని ప్రయోజనాలను కనెక్టివిటీ తెస్తుంది. పైగా త్వరలోనే విద్యుత్‌ లేదా కుళాయి నీటి మాదిరి దైనందిన జీవనంలో ఒక అంతర్భాగంగా రూపాంతరం చెందబోతోంది.

ఏమిటిది? 

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ అనేది.. భౌతిక వస్తువుల, పరికరాల, ఇతర పరికరాల నెట్‌ వర్క్‌ ఇంటర్‌ఫేసింగ్‌నూ, కమ్యూనికేషన్‌నూ సూచిస్తుంది. అనేక కోవలకు చెందిన భౌతిక వస్తువుల, ఇతర పరికరాల మధ్య సమన్వయ లోపం లేకుండా కావలసిన పనిని పూర్తిచేసే సమాచారంతో అభివృద్ధి అయిన వ్యవస్థగా ఐఓటీని చెప్పవచ్చు.   
ఐఓటీ డేటా సేకరణపై ఆధారపడి ఉంటుంది. డిజిటల్‌ రూపంలోకి మార్చగిలిగిన ఏ డేటా అయినా సమాచారమయ్యే అవకాశం ఉంటుంది. గుండె కొట్టుకోవడం, ఉష్ణోగ్రత, వర్షపాతం అనేవి డేటాకు ఉదాహరణలు. వీటిని సేకరించవచ్చు. ఈ డేటాను విశ్లేషించి, కమ్యూనికేట్‌ చేసినప్పుడు ఆప్టిమైజ్‌ ప్రారంభమవుతుంది.
మనుషుల ప్రమేయం లేకుండా యంత్రాలు, మరలు స్వతంత్రంగా ‘మాట్లాడుకుని’ సందర్భానికి తగిన, అనుకూల నిర్ణయం తీసుకుని అమలుపరిచే అనుకూలతలను ఐఓటీ అందిస్తుంది. సమర్థ నిర్వహణ, ఉత్పత్తి ప్రక్రియలను ఆప్టిమైజ్‌ చేయడానికి పరిశ్రమలు ఐఓటీని ఉపయోగిస్తాయి. దీనితో తయారీ ప్రక్రియను మానవ ప్రయత్నం లేకుండా సమర్థంగా పర్యవేక్షించవచ్చు. ఐఓటీ టెక్నాలజీని సరిగ్గా అమలుపరచి సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే వ్యాపారాల వృద్ధికి ఎంతో ఉపయోగం.

ఏయే కెరియర్లు?

డెవలపర్లు

ఐఓటీ డెవలపర్లు పరికరాలు పనిచేయడానికి అనుమతించే అనువర్తనాలను అభివృద్ధి చేస్తారు. తమ పనిలో జావా, సీ‡++ లాంటి ప్రామాణిక ఏపీఐలు, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజిలను ఉపయోగిస్తారు. కాబట్టి బలమైన ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు తప్పనిసరి. 

బాధ్యతలు: నిర్దిష్ట ఐఒటీ అప్లికేషన్లకు నిర్వహించే, నియంత్రించే సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధినీ, సృష్టినీ వీరు పర్యవేక్షిస్తారు. ఇతర విధుల్లో డేటాను విశ్లేషించడానికి అల్గోరిద]ంలను ఉపయోగించడం, పెద్ద మొత్తంలో డేటాను నిర్వహించడానికి సాఫ్ట్‌వేర్‌ సాధనాలను ఉపయోగించడం, సిస్టమ్‌ లు ఓవర్‌లోడ్‌ కాకుండా ఉండటానికి అనవసరమైన డేటాను ముందస్తుగా వడపోయడం వీరి మౌలిక బాధ్యతలు. 2028 సంవత్సరానికి ఈ రంగంలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల పాత్ర దాదాపు 21 శాతం పెరుగుతుందని అంచనా

ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ డిజైనర్‌ 

ఐఓటీ కనెక్ట్‌ అయిన పరికరాల్లో ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ వ్యవస్థల్లో సెన్సార్‌లు, మైక్రోప్రాసెసర్‌లు, సిస్టమ్‌లను పని చేయించడంలో సహాయపడే సాఫ్ట్‌వేర్‌ ఉంటాయి. ఐఓటీ నెట్‌వర్క్‌ల ద్వారా కమ్యూనికేషన్‌ని సులభతరం చేయడానికి ఇవి అవసరం.

బాధ్యతలు: వీటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ (వీటికి ఫర్మ్‌వేర్‌ అని పేరు) అభివృద్ధి ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ డిజైనర్‌ల బాధ్యత. ఎంబెడెడ్‌ సిస్టమ్‌లు, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్, హార్డ్‌వేర్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ (సీ, సీ++ లాంటివి)పై అవగాహన ఈ కెరియర్‌ మార్గంలో సహాయకారిగా ఉంటుంది.

ఆర్కిటెక్ట్‌ 

ఐఓటీ ఆర్కిటెక్ట్‌లు కంపెనీ వ్యాప్త వ్యూహంపై సమగ్ర దృక్పథాన్ని అందిస్తారు. ఈ పాత్రకు పీహెచ్‌డీ లేదా ఫీల్డ్‌ అనుభవం అవసరం. 

బాధ్యతలు: ఆర్కిటెక్ట్‌లు ఐఓటీ ప్లాట్‌ఫారమ్‌లు, సెన్సార్‌లు, యాక్చువేటర్‌లను నిర్మించాల్సిన వ్యూహాల అభివృద్ధి, ఏ కనెక్టివ్‌ టెక్నాలజీలను ఉపయోగించాలి/అభివృద్ధి చేయాలి, క్లయింట్‌ అవసరాలను అత్యుత్తమంగా ఎలా తీర్చాలి లాంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ పాత్రలు సాధారణంగా పెద్ద ఐఓటీ అభివృద్ధి సంస్థల్లో కనిపిస్తాయి. దీర్ఘకాలిక కంపెనీ ప్రణాళిక చుట్టూ తిరుగుతాయి. ఐఓటీలో ఇంజినీరింగ్‌ డిగ్రీతో పాటు  ఇంటర్‌ పర్సనల్, కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు ఈ కెరియర్‌కి ముఖ్యం.

సొల్యూషన్స్‌ ఇంజినీర్‌ 

ఐఓటీ నెట్‌వర్క్‌లను వివిధ సందర్భాలకు అనుగుణమైన అవసరాలను తీర్చడం కోసం తేలికగా కస్టమైజ్‌ చేయవచ్చు. వ్యాపార సంస్థలు, వినియోగదారులు తమ వ్యాపారాలకు సంబంధించిన సమస్యలకు సముచిత పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడటం వంటి మౌలిక బాధ్యత ఈ ఇంజినీర్లది. 

బాధ్యతలు: ఐఓటీ సొల్యూషన్స్‌ ఇంజినీర్లు కస్టమర్ల అవసరాలను గుర్తించడానికి వారితో సన్నిహితంగా పనిచేయాలి. ఎలాంటి సెన్సార్‌లు, వైర్‌లెస్‌ టెక్నాలజీ, ఇతర కాంపోనెంట్‌లు వారికి అత్యుత్తమంగా పనిచేస్తాయో తెలుసుకోవడానికి అప్పటికప్పుడు నిర్ణయించడం (హ్యాండ్‌ ఆన్‌ అప్రోచ్‌), లేకపోతే మార్కెట్‌లో దొరికే విడి భాగాలు, పరికరాలు, ప్రోగ్రాంలు (ఆఫ్‌-ది-షెల్ఫ్‌ కాంపోనెంట్లను) ఉపయోగించాలని సూచించవచ్చు. అవసరమైతే అనుకూలీకరించిన వ్యవస్థను సృష్టించడానికి డెవలపర్లతో పనిచేయవచ్చు. ఐఓటీ సొల్యూషన్స్‌ ఇంజినీర్‌ క్లయింట్‌లకు వివిధ ఐఓటీ ఫీచర్లను స్పష్టంగా వివరించగలగాలి. అప్లికేషన్‌లు, పరికరాలు, సర్వర్లు, సైబర్‌ సెక్యూరిటీతో బలమైన పరిచయం అవసరం. సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఈ పాత్రలో వృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణను అందించగలదు.

ఈ ఉద్యోగావకాశాలన్నీ సీఎస్‌ఈ చేసినవారికి లభించే కొలువులకు అదనం అన్నమాట. పై చదువుల విషయానికి వస్తే ఎన్నో విశ్వవిద్యాలయాలు పోస్ట్‌ గ్రాడ్యుయేట్, రిసెర్చి స్థాయిలో ఇంజినీరింగ్‌ విద్యకు అవకాశం కల్పిస్తున్నాయి. భవిష్యత్తులో మనిషి కనీసం 65 రకాల వివిధ కనెక్షన్లు కలిగివుండే అవకాశం ఉందనీ, అందువల్ల అంచనాలకు మించి డేటా ఉత్పత్తి జరుగుతుందనీ, ఇవన్నీ ఇంటర్నెట్‌ ఆధారిత సేవలుగా ఉండబోతున్నాయనీ నిపుణుల అంచనా. అందుకే ఐఓటీ రంగం కొలువులకు నిలయమై వెలగగలదని పేరు తెచ్చుకుంది.

ఈ నాలుగూ పునాది 

ఐఓటీ రంగంలోనివారికి ప్రత్యేక అంశాల్లో నైపుణ్యం అవసరం. ఇక్కడ పేర్కొన్న నాలుగు మెలకువలను అర్థం చేసుకుంటే కెరియర్‌కు బలమైన పునాది సాధ్యమవుతుంది.  

ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ 

ఐఓటీ పరికరాలు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ల కలయికతో పనిచేస్తాయి. అందుకని చాలావరకు ఎంబెడెడ్‌ ప్రాసెసర్లు అవసరం. సెన్సార్‌లు, యాక్చువేటర్లు సరిగ్గా పనిచేయడానికి అవసరమైన పరికరాలు, ఫర్మ్‌వేర్‌ మధ్య కమ్యూనికేషన్‌ సులభతరం చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌లో ఈ ప్రాసెసర్‌లుంటాయి. సీ, సీ++.. ఇంకా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి రాస్ప్‌బెర్రీ మెలకువలు అవసరం.

నెట్‌వర్కింగ్‌ 

చాలా ఐఓటీ పరికరాలు క్లౌడ్‌లో అప్లికేషన్‌లు, సేవలతో పాటు ఇతర పరికరాలతో కమ్యూనికేట్‌ చేయడానికి వైర్‌లెస్‌ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలను ఉపయోగిస్తాయి. ఈ నెట్‌వర్క్‌ల డిజైన్, మేనేజ్‌మెంట్‌ ఐఓటీ ప్రొఫెషనల్స్‌ ఆవశ్యక విధులు. కనెక్ట్‌ అయిన పరికరాల భారీ సంఖ్య కారణంగా ఐఓటీ నెట్‌వర్క్‌లు సంక్లిష్టంగా ఉండవచ్చు. ప్రతి నెట్‌వర్క్‌ డిజైన్‌ నిర్ణయం వాటికి మద్దతు ఇవ్వడానికి లభ్యమయ్యే వివిధ ప్రమాణాలు, ప్రోటోకాల్స్, టెక్నాలజీల మీదా ఆధారపడి ఉంటుంది. అందువల్ల వివిధ ప్రమాణాల గురించి తెలిసి ఉండాలి

డేటా, ఏఐ 

కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ ప్రపంచంలో ప్రతిచోటా ఉంది, తన ఉనికిని చాటుకుంటోంది. ఐఓటీలో కూడా ఇది తన విశిష్ట ప్రభావం చూపిస్తోంది. పాత, కొత్త అనే వ్యత్యాసం లేకుండా అన్ని రకాల పరికరాలకూ కీలకాంశంగా మారింది. ఐఓటీ నెట్‌వర్క్‌లో డేటాకు అవసరమైన, ప్రతిస్పందనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, నమూనాలు గుర్తించడానికి, అసంబద్ధమైన డేటాను ఫిల్టర్‌ చేయడానికి కృత్రిమ మేధ సహాయపడుతుంది. ఏఐ విశ్లేషణ, ప్రోగ్రామింగ్‌లో, ఐఓటీలో బలమైన పునాది ఉన్న డెవలపర్లు ఈ రెండింటి అనుసంధానం ద్వారా మెరుగైన పరిష్కారాలు కనుక్కోగలరు.

సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలు 

అన్ని సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ఉద్యోగాల మాదిరిగానే కోడింగ్, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు ముఖ్యమైనవి. జావా, సీ++, ఇతర బేసిక్‌ కోడింగ్‌ భాషలలో నైపుణ్యం ఐఓటీ కెరియర్‌కు సహాయపడుతుంది.
 

Posted Date: 30-09-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌