• facebook
  • whatsapp
  • telegram

కోర్సు పూర్తికాగానే కొలువులు!

ఇంటర్‌ తర్వాత నర్సింగ్‌ కోర్సులు

విశ్వవ్యాప్త ఆదరణ ఉన్న కోర్సు నర్సింగ్‌. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగానికి హామీ దీని ప్రత్యేకత. సబ్జెక్టుపై గట్టిపట్టు, ఆంగ్లంలో ప్రావీణ్యం ఉంటే విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో సమానంగా రాణించవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో అవకాశం వచ్చినవారు ఆకర్షణీయ వేతనంతో సేవలు అందించవచ్చు. రాష్ట్ర స్థాయుల్లోనూ వీరికి మంచి జీతాలే దక్కుతున్నాయి. అలాగే 2030 నాటికి ఒక్క మన దేశానికే ఇరవై లక్షల మంది సుశిక్షితులైన నర్సులు అవసరమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల నర్సింగ్‌ విద్యపై ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్‌ తర్వాత ఆ దిశగా అడుగులేయవచ్చు. 

నర్సింగ్‌ కోర్సుల్లో చేరడానికి కనీసం ఇంటర్మీయట్‌ పూర్తవ్వాలి. ప్లస్‌ టూలో చదివిన గ్రూపు ప్రకారం నర్సింగ్‌ కోర్సును ఎంచుకోవచ్చు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం కోర్సుల్లో ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ చేరవచ్చు. వీటిని చదువుకున్నవారికి నర్సింగ్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులోకి మాత్రం బైపీసీ విద్యార్థులే అర్హులు. ఈ కోర్సు సంబంధిత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుపుతారు. వీటిలో ఏఎన్‌ఎం కోర్సు ప్రాథమిక స్థాయిలో ఉంటుంది. అయితే దీన్ని పూర్తి చేసుకున్నవారూ ఉపాధి పొందవచ్చు. మేటి అవకాశాలు ఆశించేవారు జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యమివ్వాలి. ఆ తర్వాత ఎమ్మెస్సీ నర్సింగ్, ఆసక్తి ఉంటే నర్సింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసుకోవచ్చు. 

ఎక్కువ కళాశాలలు మహిళల కోసమే కోర్సులు అందిస్తున్నాయి. పరిమితంగానే మేల్‌ నర్సింగ్‌ విద్య అందుబాటులో ఉంది. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో చేరినవారికి ఆ ఏడాది డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండటం తప్పనిసరి.

ఏఎన్‌ఎం

ఆక్సిలరీ నర్స్‌ మిడ్‌వైఫరీ (ఏఎన్‌ఎం) కోర్సు వ్యవధి రెండేళ్లు. తెలుగు రాష్ట్రాల్లో పలు కళాశాలలు ఏఎన్‌ఎం చదువులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలు నేరుగా లభిస్తాయి. ఏఎన్‌ఎం అనంతరం వరుసగా జీఎన్‌ఎం, పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, పీహెచ్‌డీ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. ఏఎన్‌ఎం కోర్సు పూర్తిచేసుకున్నవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని ఉప కేంద్రాల్లో (హెల్త్‌ సబ్‌ సెంటర్స్‌) విధులు నిర్వర్తిస్తారు. చిన్నారులకు టీకాలు వేయించడం, బాలింతలకు పౌష్టికాహారం, సప్లిమెంట్లు ఇవ్వడం, సహజ కాన్పులను ప్రోత్సాహించడం, ప్రభుత్వ పథకాలు అందేలా చూడడం... వీరి విధుల్లో భాగం. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వీరు ప్రాథమిక సేవలు నిర్వర్తించవచ్చు.  

జీఎన్‌ఎం

జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ (జీఎన్‌ఎం) కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ అర్హులే. తెలుగు రాష్ట్రాల్లో పలు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ మార్కుల మెరిట్‌తో కోర్సులో చేరే అవకాశం లభిస్తుంది. దీన్ని పూర్తిచేసుకున్నవారు రెండేళ్ల వ్యవధితో పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు రెగ్యులర్‌ విధానంలో చదువుకోవచ్చు లేదా ఏదైనా సంస్థలో ఉద్యోగం చేసుకుంటూ దూరవిద్యలో ఇగ్నో నుంచి మూడేళ్ల వ్యవధితో పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసుకోవచ్చు. అనంతరం పోస్టు బేసిక్‌ డిప్లొమా లేదా ఎమ్మెస్సీ నర్సింగ్‌లో చేరవచ్చు. ఆ తర్వాత ఆసక్తి ఉంటే నర్సింగ్‌లో పీహెచ్‌డీ చేయవచ్చు. 

బీఎస్సీ నర్సింగ్‌ 

నర్సింగ్‌ విద్యలో ఎక్కువ ప్రాధాన్యం ఉన్న కోర్సు ఇది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. జాతీయ సంస్థలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి సంస్థల్లో సీటు గతంలో ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో లభించేది. ఇప్పుడు ఎంసెట్‌/ ఈఏపీసెట్‌/ నీట్‌ స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నారు. జాతీయ స్థాయి సంస్థలు ప్రవేశ పరీక్షతో అవకాశం కల్పిస్తున్నాయి. బీఎస్సీ నర్సింగ్‌ అనంతరం పోస్టు బేసిక్‌ డిప్లొమా లేదా ఎమ్మెస్సీ నర్సింగ్‌ ఆ తర్వాత పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్చు.

ఉన్నత విద్య

పోస్టు బేసిక్‌ డిప్లొమా: ఏదైనా విభాగంలో ప్రత్యేక సేవలు అందించాలనుకున్నవారు బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత ఏడాది వ్యవధితో ఉన్న పోస్టు బేసిక్‌ డిప్లొమా కోర్సులో చేరవచ్చు. కార్డియో థొరాసిక్, క్రిటికల్‌ కేర్, మిడ్‌ వైఫరీ, న్యూరో సైన్స్, అంకాలజీ, ఆర్థోపెడిక్‌ అండ్‌ రిహాబిలిటేషన్, సైకియాట్రిక్, నియోనటాల్, ఆపరేషన్‌ రూమ్, ఎమర్జెన్సీ అండ్‌ డిజాస్టర్, ఆప్తాల్మిక్, టీబీ, లెప్రసీ..ఇలా నచ్చిన స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్చు. 

ఎమ్మెస్సీ నర్సింగ్‌: ఇందులో కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్, ఆబ్సెస్ట్రిక్‌ అండ్‌ గైనకాలాజికల్‌ నర్సింగ్, మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్, చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్‌... తదితర స్పెషలైజేషన్లు ఉంటాయి. కోర్సుల వ్యవధి రెండేళ్లు. బీఎస్సీ నర్సింగ్, పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు వీటిలో నచ్చిన స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్చు. 

నర్స్‌ ప్రాక్టీషనర్‌ క్రిటికల్‌ కేర్‌ పీజీ రెసిడెన్సీ: బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత ఆసక్తి ఉన్నవారు కొన్ని సంస్థలు రెండేళ్ల వ్యవధితో అందిస్తోన్న నర్స్‌ ప్రాక్టీషనర్‌ క్రిటికల్‌ కేర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ రెసిడెన్సీలో చేరవచ్చు. ఈ కోర్సుకు ప్రాధాన్యం పెరుగుతోంది. డాక్టర్లు అందుబాటులో లేనప్పుడు అత్యవసర సేవలు అందించేందుకు ఈ కోర్సు రూపొందించారు. 

ఎంబీఏ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌: బీఎస్సీ నర్సింగ్‌ అనంతరం ఎంబీఏ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సునూ చదువుకోవచ్చు. 

నర్సింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా: ఇగ్నో నర్సింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా కోర్సు అందిస్తోంది. అదనపు నైపుణ్యాలు ఆశించేవారు ఇందులో చేరవచ్చు.

ఏం నేర్చుకుంటారు?

నర్సింగ్‌ కోర్సుల్లో చేరినవారు...హ్యూమన్‌ అనాటమీ, సోషియాలజీ, ఇంగ్లిష్, ఫార్మకాలజీ, న్యూట్రిషన్, పాథాలజీ, మెడికల్‌-సర్జికల్‌ నర్సింగ్, ఫిజియాలజీ, సైకాలజీ, చైల్డ్‌హెల్త్, కమ్యూనిటీ హెల్త్, మెంటల్‌ హెల్త్, నర్స్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్, గైనకాలజీ, సైకియాట్రీ గురించి తెలుసుకుంటారు. ఉన్నత చదువుల్లో చేరినవారు సంబంధిత స్పెషలైజేషన్‌లో పూర్తిస్థాయి శిక్షణ పొందుతారు.

ఏయే అవకాశాలు?: భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ సుశిక్షితులైన నర్సుల కొరతను ఎదుర్కొంటున్నాయి. అందువల్ల వీరికి మన దేశంతోపాటూ విదేశాల్లోనూ విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. శ్రమించే తత్వం, సహనం, వృత్తి నైపుణ్యం ఉన్నవారు తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. కొవిడ్‌ నేపథ్యంలో నర్సింగ్‌ వృత్తి ప్రాధాన్యం పెరిగింది. ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు, హెల్త్‌ సెంటర్లు, విద్యా సంస్థలు, ఓల్డేజ్‌ హోంలు, ఎన్జీవోలు, సేవా సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు..అన్ని చోట్లా నర్సులకు అవకాశాలుంటాయి. 

బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం కోర్సులు పూర్తిచేసుకున్నవారు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ రంగాల్లో ఆకర్షణీయ వేతనంతో రాణించవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేలు, ఇతర కేంద్రీయ సంస్థల్లో నర్సు ఉద్యోగం పొందినవారు రూ.44,900 మూలవేతనంతో మొదటి నెల నుంచే సుమారు రూ.75 వేలు అందుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసుకున్నవారిని పరీక్ష ద్వారా ఆర్మీలో నేరుగా లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుని రూ.లక్షకు పైగా వేతనం చెల్లిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్‌ సెంటర్లు, సంక్షేమ వసతి గృహాల్లో సేవలు అందించడానికి నర్స్‌ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీరికి ప్రారంభ మూలవేతనం సుమారు రూ.30 వేలు లభిస్తోంది. డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులతో మొదటి నెల నుంచే దాదాపు రూ.45 వేలు అందుకోవచ్చు. కార్పొరేట్‌ ఆసుపత్రులు బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసినవారికి ప్రారంభంలో రూ.18 వేల నుంచి రూ.30వేల వరకు వేతనం అందిస్తున్నాయి. పీజీ పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ జీతంతో కార్పొరేట్‌ స్పెషాలిటీ వైద్య విభాగాల్లో ప్రత్యేక సేవలు అందించవచ్చు. బోధన రంగాన్నీ ఎంచుకోవచ్చు. పీహెచ్‌డీతో నర్సింగ్‌ కళాశాలలకు ప్రిన్సిపల్‌గానూ, ఆసుపత్రుల్లో హెచ్‌ఓడీలగానూ రాణించవచ్చు. 

విదేశాల్లో....

సబ్జెక్టు ప్రావీణ్యం, ఆంగ్ల నైపుణ్యం ఉన్నవారు యూఎస్, కెనడా, సింగపూర్, గల్ఫ్, మిడిల్‌ ఈస్ట్‌... తదితర దేశాల్లో పెద్ద మొత్తంలో వేతనాలు అందుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగాన్ని ఆశించేవారు దేశాల వారీ నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించాలి. 

యూఎస్‌ కోసం ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్టు (టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీఎస్‌)లో స్కోరు, నేషనల్‌ కౌన్సిల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామినేషన్‌ - రిజిస్టర్డ్‌ నర్స్‌ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్‌ - ఆర్‌ఎన్‌)లో ఉత్తీర్ణత తప్పనిసరి. 

కెనడాలో కెరియర్‌ ఆశించేవారు కెనడియన్‌ రిజిస్టర్డ్‌ నర్సెస్‌ ఎగ్జామ్‌ (సీఆర్‌ఎ  న్‌ఈ), దుబాయ్‌లో పనిచేయడానికి దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ నిర్వహించే పరీక్ష, సౌదీ అరేబియాకు ప్రొమెట్రిక్‌ పరీక్ష, ఖతార్‌కు సుప్రీం కౌన్సిల్‌ ఆఫ్‌ హెల్త్‌ పరీక్ష రాయాలి. 

కొన్ని దేశాలు రెండు మూడేళ్ల అనుభవం ఉన్నవారిని ఎలాంటి పరీక్షలూ లేకుండా ఇంటర్వ్యూతోనే ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.

నర్సింగ్‌ కోర్సులందిస్తున్న కొన్ని మేటి విద్యాసంస్థలు 

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) న్యూదిల్లీతోపాటు భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, పట్నా, రాజ్‌పూర్, రుషికేష్‌ల్లో బీఎస్సీ నర్సింగ్‌ ఆనర్స్‌ కోర్సు మహిళల కోసం అందిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు.   

క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ (సీఎంసీ), వెల్లూరు 

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజ్‌ (ఏఎఫ్‌ఎంసీ), పుణె 

జిప్‌మర్, పుదుచ్చెరి 

పీజీఐఎంఆర్, చండీగఢ్‌ 

మణిపాల్‌ అకాడెమీ 

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నడుస్తోన్న కళాశాలలు  నిమ్స్, అపోలో, యశోదా.. తదితర సంస్థలు.

ఇవి అవసరం

నర్సింగ్‌ కోర్సుల్లో చేరినవారికి ఉండాల్సిన లక్షణాలు

ఓర్పు 

మానసిక సామర్థ్యం

వైద్య పరిజ్ఞానం

పరిశీలన

నిర్వహణ నైపుణ్యాలు 

ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం

సహాయపడే తత్వం

రాత్రివేళల్లో పని చేయడానికి సంసిద్ధత  

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

‣ ఆన్‌లైన్‌ పరీక్షలు రాసేముందు!

‣ ఆహార సంస్థలో అందుకోండి ఉద్యోగాలు!

‣ నీట్‌ కటాఫ్‌ ఎంత?

‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!

Posted Date: 19-09-2022


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌