• facebook
  • whatsapp
  • telegram

డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు

పది తరువాత


కొన్నేళ్ల నుంచి విశ్వ వ్యాప్తంగా ఎక్కువమంది నోట మారుమోగుతోన్న మాట.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ). దీంతోపాటు బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ, మెషిన్‌ లెర్నింగ్, క్లౌడ్‌.. ఇవన్నీ తరచూ వినిపిస్తోన్న పదాలే. వీటిలో ప్రావీణ్యం ఉన్నవారు మేటి ఉద్యోగాలకు బాటలు వేసుకోవచ్చని నిపుణుల అభిప్రాయం. అయితే బీటెక్‌ వరకు వేచి చూడకుండా పది పూర్తికాగానే పాలిటెక్నిక్‌ డిప్లొమాలో భాగంగా వీటిని పూర్తిచేసుకోవచ్చు. ఇవేకాకుండా సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్, ప్యాకింగ్, ప్రింటింగ్, సిరామిక్, టెక్స్‌టైల్స్‌.. ఇలా ఎన్నో కోర్సులున్నాయి. వీటిని అభిరుచి, ఆసక్తి ప్రకారం ఎంచుకుంటే రాణించవచ్చు. 


ప్రస్తుతం డిప్లొమా కోర్సులు ఆధునిక అవసరాలు తీరేలా, వైవిధ్యంగా రూపొందుతున్నాయి. పలు బ్రాంచీల్లో చేరినవారు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలూ పొందవచ్చు లేదా స్వయం ఉపాధి, ఉన్నత విద్య దిశగా అడుగులేయవచ్చు. సాంకేతిక విజ్ఞానంపై ఆసక్తి ఉండి, తక్కువ వ్యవధిలో స్థిరపడాలని ఆశించేవారికి డిప్లొమాలు దారిచూపుతాయి. మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో పట్టున్నవారు రాణించగలరు. తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమాలో చేరడానికి పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్‌)లో అర్హత పొందాలి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు వీటిని అందిస్తున్నాయి.


  కోర్సులు   

సివిల్, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, గార్మెంట్‌ టెక్నాలజీ, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, హోమ్‌ సైన్స్, మెటలర్జికల్, కెమికల్, సిరామిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రో కెమికల్‌ టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, ఎంబడెడ్‌ సిస్టమ్స్, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, లెదర్‌ టెక్నాలజీ.. తదితర బ్రాంచీలను ఏపీ, తెలంగాణ పాలిటెక్నిక్‌ల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.  

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (ఏఐ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్, కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ, వెబ్‌ డిజైనింగ్, 3డీ యానిమేషన్‌ గ్రాఫిక్స్, యానిమేషన్‌-మల్టీ మీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ.. మొదలైన కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కళాశాలల్లో డిప్లొమాలో భాగంగా కొన్నేళ్ల నుంచి అందిస్తున్నారు. పాలీసెట్‌ స్కోరుతోనే వీటిలోనూ చేరవచ్చు. ఇవే కోర్సులను బీఎస్సీ/బీసీఏ/బీటెక్‌లో భాగంగా చదువుకోవచ్చు. అనంతరం ఎమ్మెస్సీ/ఎంసీఏ/ఎంటెక్‌ పూర్తిచేసుకోవచ్చు. 


   ఉద్యోగాలు   

కేంద్రంలో: రైల్వేలో జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) పోస్టులకు డిప్లొమాతోనే పోటీపడవచ్చు. అలాగే వివిధ కేంద్రీయ సంస్థల్లో జేఈ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) దాదాపు ఏటా ప్రకటన విడుదలచేస్తుంది. పరీక్షతో ఈ నియామకాలుంటాయి. ఇలా అవకాశం వచ్చినవారు లెవెల్‌-6 మూలవేతనం రూ.35,400తో మొదటి నెల నుంచే సుమారు రూ.60,000 జీతం పొందుతారు. రైల్వేలో లోకో పైలట్‌ పోస్టుకు సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా పూర్తిచేసుకున్నవారు పోటీపడొచ్చు. వీరికి లెవెల్‌-2 వేతనం అందుతుంది. రూ.19,900 మూలవేతనంతో మొదటి నెల నుంచే రూ.30,000కు పైగా పొందవచ్చు.  

రాష్ట్ర స్థాయిలో: విద్యుత్తు పంపిణీ, రహదారులు, భవనాలు; పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల్లో డిప్లొమాతో జూనియర్‌ /సబ్‌ ఇంజినీర్‌గా అవకాశాలుంటాయి. 

ప్రైవేటు: నిర్మాణ రంగం, ఆటోమొబైల్, పవర్‌ ప్లాంట్లు, ఇంజినీరింగ్‌ సంస్థల్లో సులువుగానే నిలదొక్కుకోవచ్చు. ప్రభుత్వ, పేరొందిన పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి. పలు రంగాల్లో సేవలు అందిస్తోన్న కార్పొరేట్‌ సంస్థలు ఆకర్షణీయ వేతనంతో వీరికి ఉద్యోగాలిస్తున్నాయి. 

కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలైన.. మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల్లో వీరు సేవలు అందించవచ్చు.

సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ బ్రాంచీలవారికి ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలుంటాయి. 

విద్యుదుత్పాదక, పంపిణీ సంస్థల్లో ఎలక్ట్రికల్‌ విభాగం వాళ్లు రాణించగలరు.

సివిల్‌ డిప్లొమాతో.. నీటిపారుదల శాఖ, ప్రజారోగ్యం, రహదారులు, రైల్వే, నిర్మాణ రంగంలో సేవలు అందించవచ్చు. 

రక్షణ రంగంలోనూ కొన్ని బ్రాంచీల వారికి కొలువులు ఉన్నాయి. ఎయిర్‌ ఫోర్సులో ఎక్స్, వై ట్రేడులు; కోస్టుగార్డులో యాంత్రిక్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. 

సౌదీ, దుబాయ్, సింగపూర్, మలేసియా.. మొదలైన దేశాల్లో డిప్లొమాతో ఉద్యోగాలు పొందవచ్చు. 


  ఉన్నత విద్య  

డిప్లొమా తర్వాత ఈసెట్‌తో నేరుగా బీటెక్‌ రెండో సంవత్సరం కోర్సుల్లో చేరిపోవచ్చు. వీరు ఎంసెట్‌/ఈఏపీసెట్, ఐఐటీ-జేఈఈ రాసుకోవచ్చు. డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవాళ్లు ఇంజినీర్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అందించే బీటెక్‌తో సమానమైన.. అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ది ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఏఎంఐఈ) పూర్తిచేసుకోవచ్చు. అనంతరం ఎంటెక్‌లో చేరవచ్చు. కొన్ని డిప్లొమాలతో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం కోర్సుల్లోకీ అనుమతిస్తున్నారు. 


   వ్యవసాయ డిప్లొమా  

గ్రామీణ విద్యార్థులు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అవకాశాలందుకోడానికి.. వ్యవసాయ డిప్లొమా కోర్సులను రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లు అందిస్తున్నాయి. వీటిని రెండేళ్లు/మూడేళ్ల వ్యవధితో రూపొందించారు. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ (ఆర్గానిక్‌ ఫార్మింగ్‌), డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ (సీడ్‌ టెక్నాలజీ) కోర్సులను రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. వీటిని పూర్తిచేసుకున్నవారు ఎరువులు, క్రిమిసంహారకాల తయారీ సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు లేదా ఆధునిక సాగుతో రాణించవచ్చు. ఉన్నత చదువులపై ఆసక్తి ఉంటే బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సు చదువుకోవచ్చు. వీరికి 20 శాతం సీట్లు అగ్రిసెట్‌తో సూపర్‌ న్యూమరరీ విధానంలో భర్తీ చేస్తారు. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ మూడేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. అనంతరం బీటెక్‌ అగ్రి ఇంజినీరింగ్‌ చదువుకోవచ్చు. వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పదో తరగతి గ్రేడ్‌ పాయింట్లు/మార్కులు లేదా పాలీసెట్‌తో లభిస్తుంది. రెండేళ్ల కోర్సులను తెలుగు మాధ్యమంలో చదువుకోవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లు చదివుండాలి ఏపీలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో.. ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో పలు అగ్రి పాలిటెక్నిక్‌లు నడుస్తున్నాయి.  


   యానిమల్‌ హజ్బెండ్రీ, డెయిరీ, ఫిషరీ   

మూగజీవాలకు సత్వర వైద్య సేవలు అందించే దిశగా వెటర్నరీ డిప్లొమా కోర్సులు రూపొందించారు. వీటిని పూర్తిచేసుకున్నవారికి పశు వైద్యశాలలు, డెయిరీ, ఆక్వా సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. సొంతంగా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు లేదా సంబంధిత యూనిట్‌ నెలకొల్పి స్వయం ఉపాధి పొందవచ్చు. యానిమల్‌ హజ్బెండ్రీ, డెయిరీ, ఫిషరీ - ఈ మూడు విభాగాల్లోనూ రెండేళ్ల వ్యవధితో తెలుగు మాధ్యమంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. డిప్లొమా తర్వాత వీరు బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్సీల్లో చేరవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లు చదవాలి. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్లు/మార్కులు లేదా పాలీసెట్‌తో సీట్లు భర్తీ చేస్తారు. ఏపీలో.. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి ఆధ్వర్యంలో కోర్సులు నడుపుతున్నారు. దీనికి అనుబంధంగా డెయిరీ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్, ఫిషరీ పాలిటెక్నిక్‌ కోర్సులను పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. తెలంగాణలో పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండేళ్ల వ్యవధితో యానిమల్‌ హజ్బెండ్రీ పాలిటెక్నిక్‌ కోర్సులు చదువుకోవచ్చు.


   ఉద్యాన డిప్లొమాలు  

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యానవన ఉత్పుత్తులకు గిరాకీ ఉంది. పదో తరగతి గ్రేడ్‌ పాయింట్లు/మార్కులు లేదా పాలీసెట్‌తో ఉద్యాన డిప్లొమాల్లో సీట్లు కేటాయిస్తారు. కోర్సు వ్యవధి రెండేళ్లు. తెలుగు మాధ్యమంలో బోధిస్తారు. వీరు డిప్లొమా అనంతరరం బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించారు. ఏపీ/ తెలంగాణల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లు చదివినవారు ప్రవేశానికి అర్హులు. ఏపీలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం ఆధ్వర్యంలో రెండేళ్ల హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. దీనికి అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. తెలంగాణలో శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిధిలో రెండేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ కోర్సు నడుస్తోంది.  


   హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ  

వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ ‘డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ’ కోర్సు మూడేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు సుమారు 50 సీట్లు కేటాయించారు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్లు/మార్కులతో ఎంపికచేస్తారు. ప్రతినెల ఉపకారవేతనం అందిస్తారు. చదువు పూర్తయిన తర్వాత టెక్స్‌టైల్స్‌ తయారీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్థాయి. తమిళనాడులోని సేలం, కర్ణాటకలోని గడగ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ సంస్థల్లో తెలుగు విద్యార్థుల కోసం కొన్ని సీట్లు కేటాయించారు.


   ప్లాస్టిక్‌ డిప్లొమా  

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌).. హైదరాబాద్, విజయవాడ క్యాంపస్‌ల్లో మూడేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ), డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీటీ) కోర్సులు అందిస్తున్నారు. ఈ సంస్థ నిర్వహించే పరీక్షతో కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లను నేరుగా పదో తరగతి విద్యార్హతతోనే భర్తీ చేస్తున్నారు. వీటిని పూర్తిచేసుకున్నవారు ప్లాస్టిక్, అనుబంధ పరిశ్రమలు, ప్లాస్టిక్‌ వినియోగ సంస్థల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్‌ స్పెషలైజేషన్‌తో బీటెక్‌ చదువుకోవచ్చు. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

‣ క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలుకుంటున్నారా?!

Posted Date: 20-06-2024


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌