• facebook
  • whatsapp
  • telegram

ఏఐ నైపుణ్యం.. తక్షణ కర్తవ్యం!

వివిధ ఉద్యోగావకాశాల వివరాలుఉద్యోగ నియామకాలూ, ఆర్థిక వ్యవస్థా పరస్పర ఆధారితాలు. ఆర్థిక వ్యవస్థ పచ్చగా ఉండి మార్కెట్‌లో అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా భూగర్భ జలంలా ఊరుతుంటే కంపెనీలు దూకుడుగా అవసరానికి మించి నియామకాలు చేసుకొని అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు కాచుక్కూర్చుంటాయి. అదే.. ఆర్థిక వ్యవస్థ గమనంపై సందేహాలు ముసురుకుంటున్నప్పుడు మార్కెట్‌ అవకాశాలు మందగిస్తాయేమోనన్న భీతి కంపెనీల పరుగుకు కళ్లాలు వేస్తాయి. కొత్త నియామకాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తాయి. ఇలాంటప్పుడు ఉద్యోగార్ధికి రక్షణ కవచంలా ఉపయోగపడేవే ‘నైపుణ్యాలు’.


కొత్తగా ఉద్యోగ మార్కెట్లోకి అడుగుపెట్టబోయే అభ్యర్థులూ, విద్యార్థులూ కింది వాస్తవాలను అవగాహన చేసుకుని ముందడుగు వేయాలి.


తగ్గుతున్న ప్లేస్‌మెంట్లు

ఆర్థిక మాంద్యం విపణి వాకిట తారాడుతున్న నేపథ్యంలో తాజా నియామకాలు తగ్గుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 2.30 లక్షల కొత్త రిక్రూట్‌మెంట్లు జరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 70 వేల నూతన నియామకాలకు కోతపడి 1.60 లక్షల మందినే కొత్తగా తీసుకోనున్నారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు పట్టా పుచ్చుకొంటుండగా ఉద్యోగ పట్టాలు ఎక్కాలనుకునే ప్రతి పదిమందిలో ఒక్కరికే కొలువుల రైల్లో చోటు దొరుకుతుంది. పదిమందిలో అగ్రభాగాన నిలవాలనుకున్న ఉద్యోగార్థిలో ఏదో ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. ఏమిటది? 

మార్కెట్‌కు ఏం కావాలో కంపెనీలు అన్వేషిస్తుంటాయి. మార్కెట్‌లో ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతున్న లోటు (గ్యాప్‌)ను పూడ్చేందుకు తగిన ఉత్పత్తులతో వచ్చే కంపెనీలు రాణిస్తుంటాయి. అందుకే కంపెనీలు శరవేగంగా మారే స్వభావంగల విపణిపై ఒక కన్నేసి ఉంటాయి. దీన్నే రిసెర్చ్‌ వింగ్‌ అంటుంటాం. మరి కంపెనీలకు ఏం కావాలో ఉద్యోగార్థులు ఇలాగే ఒక కన్నేసి ఉంచాలి. మారుతున్న కంపెనీ అవసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఇలా ఇప్పుడు కంపెనీలకు అత్యవసరమైన ఉద్యోగ నిపుణులు ఎవరో తెలుసా?


ఏఐ స్పెషలిస్టులు

కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు అన్ని రంగాలనూ కమ్మేస్తోంది. ప్రతి పరిశ్రమకూ పాకుతోంది. సంస్థలన్నీ అప్రమత్తమవుతూ కొత్త అభ్యర్థుల్లో ఏఐ నైపుణ్యాలున్నవారు తారసపడితే వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నాయి. మరోపక్క ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో ఔెత్సాహికులను ఏఐ స్కిల్స్‌ నేర్చుకోమంటూ కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. మొత్తమ్మీద ఉద్యోగ నైపుణ్య సాధనంగా ఏఐ మారిపోయింది.


జనరేటివ్‌ ఏఐ 

ఉన్న వనరులను వినియోగించుకుంటూ నూతన సృజన చేయడమే జనరేటివ్‌ ఏఐ. దీన్నే ఉత్పాదక కృత్రిమ మేధ అంటున్నాం. వెబ్‌ ప్రపంచంలో పోగైవున్న అపార సమాచార రాశి (డేటా) నుంచి కావలసినమేరకు తీసుకొని దేనికీ అనుకరణ లేకుండా నూతన సృష్టి చేయడమే జనరేటివ్‌ ఏఐ. కృత్రిమ మేధను శక్తిమంతంగా వినియోగించుకుంటూ తమ కంపెనీకి కావలసిన కొత్త ఉత్పత్తిని సృష్టించాల్సిందెవరు? ఆ పని చేయాల్సింది తిరిగి మానవ మేధే. ఈ అవసరం రీత్యా ఉత్పన్నమైన కొత్త ఉద్యోగమే ఏఐ ప్రామ్టింగ్‌ ఇంజినీర్‌. నెట్టింట నిక్షిప్తమైన సమాచారం, చిత్రాలు, శబ్దాలు, యానిమేషన్, 3 డీ మోడల్స్‌ లాంటి విభిన్న డేటాలో ఉత్తమమైనవాటిని మూలవనరుగా (మెయిన్‌ సోర్స్‌) వినియోగించుకుంటూ సరికొత్త ప్రొడక్ట్‌ని జనరేటివ్‌ ఏఐ ఇంజినీర్లే సృష్టిస్తారు. 

జనరేటివ్‌ ఏఐ ప్రామ్టింగ్‌ ఇంజినీర్ల అవసరం కంపెనీలకు పెద్దఎత్తున ఏర్పడింది. అయితే ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉండరు కదా? ఈ ధోరణి (ట్రెండ్‌) గుర్తించి ఇంజినీరింగ్‌తో పాటు ఏఐపై కాస్త అవగాహనతో ప్రాజెక్టు వర్క్‌ చేసిన విద్యార్థులను ప్రాంగణ నియామకాల్లో కంపెనీలు ఎగరేసుకుపోతున్నాయి. అందుకే కొన్ని విద్యాసంస్థలు ఇంజినీరింగ్‌తో పాటు మూడు నెలల సర్టిఫికెట్‌ కోర్సుగా ఏఐ ప్రామ్టింగ్‌ నైపుణ్యాలు కల్పిస్తున్నాయి. ఫలితంగా ప్లేస్‌మెంట్‌లో వీళ్లని ముందు వరుసలో సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయి.


వినోద రంగంలోనూ విన్యాసాలు

బీటెక్, ఎంటెక్‌ ల్లాంటి కోర్సులు చేయకపోయినా ఇంటర్‌తోనో లేదా సాధారణ డిగ్రీతోనో చదువు చాలించి ఉద్యోగం కావాలనుకునేవారికీ వినోద పరిశ్రమలో ఏఐ ప్రవేశం కొత్త అవకాశాలు కల్పిస్తోంది. వీడియో గేమ్స్‌ నుంచి చిత్ర నిర్మాణం వరకు కల్పనా జగత్తు (వర్చువల్‌ రియాలిటీ) సృష్టికి జనరేటివ్‌ ఏఐ నిపుణుల అవసరం ఉంది. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారూ, ఇప్పటికే యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోర్సులు చేసిన తాజా అభ్యర్థులూ జనరేటివ్‌ ఏఐలోనూ ప్రవేశం పొందితే చక్కని, స్థిరమైన అవకాశాలు పొందవచ్చు. 


హెల్త్‌కేర్, లైఫ్‌ సైన్సెస్‌ 

జీవశాస్త్ర, ఆరోగ్యరంగాల్లోనూ కృత్రిమ మేధ పరిజ్ఞానం వేగంగా వ్యాపిస్తోంది. శస్త్ర చికిత్సల్లో కీ హోల్‌ రోబోటిక్‌ సాంకేతిక పరిజ్ఞానం ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో ఏఐనూ ప్రభావవంతంగా వినియోగించేందుకు హెల్త్‌కేర్‌ రంగం ఉవ్విళ్లూరుతోంది. హెల్త్‌ సైన్సెస్‌తో పాటు ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకున్న ఫ్రెషర్లకు ఈ రంగంలో మంచి రాణింపు ఉంటుంది. అనుబంధ ఫార్మా పరిశ్రమలోనూ ప్రోటీన్‌ సీక్వెన్స్‌ రూపొందించేందుకు ఏఐని వినియోగించడానికి కంపెనీల పరిశోధన విభాగాలు ఉద్యుక్తమవుతున్నాయి. వైద్యరంగంలో స్క్రైబింగ్, కోడింగ్, మెడికల్‌ ఇమేజింగ్‌లో ఏఐ వినియోగం ఇప్పటికే మొదలైంది. బీఎస్సీ లాంటి సాంప్రదాయిక కోర్సులతో పాటు ఏఐ స్వల్పకాలిక కోర్సు చేసిన ఫ్రెÆషర్లకు ఉద్యోగావకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.


కోటి వేతనం ఎలా?

కొన్ని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ప్రాంగణ నియామకాల్లో ఏటా కోటి రూపాయల వేతనంతో తాజా గ్రాడ్యుయేట్లను కంపెనీలు తీసుకుంటున్నాయన్న వార్తలు వింటుంటాం. అలాంటప్పుడు ‘అబ్బ.. ఏమి లక్కీ ఛాన్స్‌ బ్రో’ అంటూ ఓ కామెంట్‌తో సరిపెట్టి ఊరుకోకుండా ‘అసలా విద్యార్థులు అంతటి మేధను ఇంకా ఉద్యోగంలో ప్రవేశించకుండానే ఎలా సాధించార’ని ఆలోచిస్తే రహస్యం బోధపడుతుంది. కంపెనీలు తమకు అవసరమైన గ్రాడ్యుయేషన్‌తోపాటు తాము అన్వేషిస్తున్న టెక్నాలజీపై పట్టు సాధించిన విద్యార్థిని నిరుద్యోగిగా చూడవు. తమ సంస్థకు భవిష్యత్‌ ఆశాజ్యోతిగా భావిస్తాయి. కళ్లు చెదిరే ప్యాకేజీతో ఎర్ర తివాచీ పరుస్తాయని గ్రహించాలి.


కొత్త ట్రెండ్‌ను గుర్తించి ఇంజినీరింగ్‌తో పాటు ఏఐపై కాస్త అవగాహనతో ప్రాజెక్టు వర్క్‌ చేసిన విద్యార్థులను ప్రాంగణ నియామకాల్లో కంపెనీలు ఎగరేసుకుపోతున్నాయి. అందుకే కొన్ని విద్యాసంస్థలు ఇంజినీరింగ్‌తో పాటు మూడు నెలల సర్టిఫికెట్‌ కోర్సుగా ఏఐ ప్రామ్టింగ్‌ నైపుణ్యాలు కల్పిస్తున్నాయి. 


వైద్యరంగంలో స్క్రైబింగ్, కోడింగ్, మెడికల్‌ ఇమేజింగ్‌లో ఏఐ వినియోగం ఇప్పటికే మొదలైంది. బీఎస్సీ లాంటి సాంప్రదాయిక కోర్సులతో పాటు ఏఐ స్వల్పకాలిక కోర్సు చేసిన ఫ్రెÆషర్లకు ఉద్యోగావకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న ప్రణాళికతో మెరుగైన కెరియర్‌

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 10-01-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌