• facebook
  • whatsapp
  • telegram

సీఏ కోర్సు వేగవంతం!

కొత్త విధానంతో కాలం ఆదా

మారుతున్న సమాజావసరాలకు అనుగుణంగా ఆధునికమవుతూ చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) మేటి కోర్సుగా రూపొందింది. ఇంటర్మీడియట్‌ పూర్తయ్యేవరకూ ఆగకుండా పదో తరగతి తర్వాతే సీఏ ఫౌండేషన్‌కు పేరు నమోదు చేసుకునే అవకాశాన్ని ఐసీఏఐ కొత్తగా కల్పించింది. మరోపక్క చార్టర్డ్‌ అకౌంటెంట్లకు గిరాకీ పెరిగి, ప్రాంగణ నియామకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సీఏ కెరియర్‌ను లక్ష్యం చేసుకున్నవారు ఏ విషయాలు గమనించాలి? ఎలా ముందుకు అడుగెయ్యాలి? 

ఇంటర్మీడియట్‌తోపాటు సీఏనూ సమాంతరంగా చదువుకోవాలనుకునేవారికి శుభవార్త. సీఏ కోర్సు విధానం ప్రకారం.. 3 దశల్లో పూర్తిచేయాలి. సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్‌. ఒక విద్యార్థి ఇంటర్‌లో ఎంఈసీ/ సీఈసీ/ ఎంపీసీ/ హెచ్‌ఈసీల్లో ఏదో ఒక గ్రూపు తీసుకుని చదివి, ఇంటర్‌ పూర్తయ్యాక సీఏ ఫౌండేషన్‌కు నమోదు చేసుకుని, నాలుగు నెలలకు పరీక్ష రాసేవారు. అంటే సీఏ ఫౌండేషన్‌కు నమోదు చేయించుకోవాలంటే తప్పనిసరిగా ఇంటర్‌ పూర్తిచేయాల్సి ఉండేది. 

సీఏ ఫౌండేషన్‌ను ఏటా రెండుసార్లు- మే, నవంబరుల్లో నిర్వహిస్తారు. మార్చిలో ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థి పరీక్ష ఫలితాలు ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల అయ్యేవి. అంటే ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించినవారు సీఏ ఫౌండేషన్‌ అదే ఏడాది ఏప్రిల్‌లో నమోదు చేయించుకోవాల్సి ఉండేది. అంటే విద్యార్థులకు అదే ఏడాది మేలో జరిగే పరీక్ష రాసే అవకాశం ఉండేది కాదు. దీనివల్ల సీఏ చదవాలనుకునేవారు కొంత నిరుత్సాహానికి గురయ్యేవారు. ఈ ఏడాది నుంచి ఈ విషయంలో విద్యార్థులకు అనుకూలమైన మార్పు వచ్చింది.

నూతన విధానం ప్రకారం..
విద్యార్థులు, లెక్చరర్లు, కొన్ని విద్యాసంస్థలు, కొంతమంది సీఏలు చేసిన విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని ఐసీఏఐ (ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా) సీఏ ఫౌండేషన్‌ కోర్సులో కొత్త విధానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం విద్యార్థి ఇంటర్‌ పూర్తవ్వగానే మేలో సీఏ ఫౌండేషన్‌ రాయాలనుకుంటే సాధ్యమవుతుంది. పది పూర్తికాగానే సీఏకి నమోదు చేయించుకుని ఇంటర్‌తోపాటు దీన్నీ సమాంతరంగా చదివి, ఇంటర్‌ పూర్తికాగానే సీఏ ఫౌండేషన్‌ పరీక్ష రాయొచ్చు.

ఉదాహరణకు- ఒక విద్యార్థి 2020 ఏప్రిల్‌లో పదో తరగతి పూర్తిచేశాడనుకుంటే.. వెంటనే సీఏ ఫౌండేషన్‌ కోర్సుకి నమోదు చేసుకోవచ్చు. 2020లో పది పూర్తిచేసిన విద్యార్థి ఇంటర్‌ (ఎంపీసీ/ సీఈసీ) కోర్సు పూర్తిచేసి అదే ఏడాది మేలో నిర్వహించే సీఏ ఫౌండేషన్‌ పరీక్ష రాయొచ్చు. సీఏ ఫౌండేషన్‌లో ఈ కొత్త విధానం తీసుకురాకుండా ఉంటే ఆ విద్యార్థి 2022 నవంబరులో సీఏ ఫౌండేషన్‌ పరీక్ష రాయాల్సి వచ్చేది. దీనివల్ల అతనికి సుమారు ఆరు నెలల సమయం వృథా అయ్యేది.

మరో ఉదాహరణ చూద్దాం. ఓ విద్యార్థి 2020 మార్చిలో జూనియర్‌ ఇంటర్‌ పరీక్ష రాశాడని అనుకుంటే.. అతను కూడా ఇంటర్‌ పూర్తిచేసిన (2021లో) వెంటనే సీఏ ఫౌండేషన్‌ పరీక్ష రాయొచ్చు. అదే ఈ నూతన విధానం రాకపోయుంటే అతను 2021 నవంబరులో పరీక్ష రాయాల్సి వచ్చేది. అతనికి కూడా 6 నెలల సమయం వృథా అయ్యేది. కాబట్టి, విద్యార్థులకు సీఏ చేయాలనే కోరిక ఉంటే.. పదోతరగతి పూర్తికాగానే సీఏకు నమోదు చేసుకోవడం ఉత్తమం. ఆపై ఇంటర్‌తోపాటుగా సీఏ ఫౌండేషన్‌ కోర్సును కూడా చదివి, సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు పూర్తి కాగానే సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు రాయడం ఉత్తమ పద్ధతి.

అవకాశాల జోరు
ఆర్థిక నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల్లో సలహాలను అందించేవారే చార్టర్డ్‌ అకౌంటెంట్లు. చట్ట ప్రకారం ఏ సంస్థ అయినా ఆర్థిక కార్యకలాపాల రికార్డులూ, కంపెనీ ఆడిట్లను నిర్వహించాల్సివుంటుంది. వీటి బాధ్యత సీఏలదే. కరోనా కారణంగా చాలా రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గాయి. ఆర్థికవ్యవస్థ దెబ్బతిన్న ఈ తరుణంలో ప్రభావం సీఏలపైనా ఉంటుందని అందరూ భావించారు. కానీ, సీఏ ఇన్‌స్టిట్యూట్‌ (ఐసీఏఐ) ఈ ఏడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం 37% వరకూ ఉపాధి అవకాశాలు పెరిగాయి. సెప్టెంబరు 22 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లోనూ ఎప్పుడూ ఎంపికయ్యే విద్యార్థుల శాతం కంటే 37% పెరిగింది. సీఏ పూర్తిచేసినవారికి సీఏ ఇన్‌స్టిట్యూట్‌ 1995 నుంచీ ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తోంది. ఈసారి ఈ ఎంపికలు కొవిడ్‌ కారణంగా వర్చువల్‌ విధానంలో జరిగాయి. ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బ్యాంకింగ్‌ సర్వీసెస్, ఐటీ, బీపీఓ, సీఏ సంస్థలు 80% ఉద్యోగాలను ప్రాంగణ నియామకాల ద్వారా భర్తీ చేశాయి. సంస్థలు వాటి ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన సలహాలకు సీఏలపై ఆధారపడుతుంటాయి. ప్రస్తుత సమయంలో వీరిపై ఆధారపడటం ఇంకా పెరిగింది.

దీంతో సీఏలకు అవకాశాలు ఇంకా పెరిగాయి. సీఏ ఇన్‌స్టిట్యూట్‌ తాజాగా చదువు పూర్తిచేసినవారికే కాకుండా గతంలో సీఏ చేసి, ఉద్యోగాలు చేస్తున్నవారికీ అవకాశమిచ్చింది. ఎంపిక చేసుకోవడానికి ముందుకు వచ్చిన సంస్థల సంఖ్యా గతంతో పోలిస్తే పెరిగింది. దేశంలో సీఏ చేసినవారందరికీ ఇదే మొత్తం వేతనంతో ఉద్యోగాలు వస్తాయని కాదు. కానీ.. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో రంగాల్లో ఎందరో ఉద్యోగాలను కోల్పోయారు. కానీ సీఏలకు ఈ పరిస్థితి ఎదురవలేదు. కాబట్టి, ఈ ఏడాది నవంబరులో సీఏ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఉద్యోగావకాశాలకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉద్యోగావకాశాలు గతంతో పోలిస్తే ఇంకా మెరుగైన స్థాయిలోనే ఉన్నాయి. కాబట్టి, విద్యార్థులు ఆందోళన చెందకుండా సన్నద్ధతపై దృష్టిపెట్టాలి.

బహుముఖ అవకాశాలు
సీఏలకు వైవిధ్యకరమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి.
చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ సంస్థల్లో 
కాపిటల్‌ మార్కెట్‌ సర్వీస్‌లో
బిజినెస్‌ హౌసెస్, పరిశ్రమల్లో 
కన్సల్టెన్సీ సంస్థల్లో 
భారీ సంస్థలూ, ఇన్‌స్టిట్యూషన్లలో 
ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో
స్వతంత్రంగా సీఏ ప్రాక్టీస్‌ 

ప్రొవిజనల్‌ రిజిస్ట్రేషన్‌ 
పదోతరగతి పూర్తిచేసినవారు సీఏ చదవాలనుకుంటే ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసేలోగా ఏ సమయంలోనైనా సీఏ ఫౌండేషన్‌ కోర్సుకి నమోదు చేయించుకోవచ్చు. దీన్నే ‘ప్రొవిజనల్‌ రిజిస్ట్రేషన్‌’ అంటారు. ఉదాహరణకు- ఒక విద్యార్థి 2022 మేలో సీఏ ఫౌండేషన్‌ పరీక్ష రాయాలనుకుంటే ముందు ఏడాది (2021) డిసెంబరు 31లోగా సీఏ ఫౌండేషన్‌ కోర్సుకు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అదే 2020 మార్చికి జూనియర్‌ ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థి 2020 డిసెంబరు 31లోగా సీఏ ఫౌండేషన్‌ కోర్సుకి నమోదు చేసుకుని ఉంటే అతను 2021 మేలో సీఏ ఫౌండేషన్‌ పరీక్ష రాయవచ్చు. సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు ప్రచురించిన ఈ నూతన విధానానికి సంబంధించిన ప్రకటనలో సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు మే లేదా జూన్‌ నెలలో నిర్వహిస్తామని స్పష్టంగా తెలియజేశారు. అలాగే నవంబరు/ డిసెంబరు నెలల్లో సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు నిర్వహించే అవకాశముందని స్పష్టం చేశారు. ఇంటర్‌లో ఎంఈసీ/ సీఈసీ చదివి, సీఏ కోర్సు లక్ష్యంగా ఉన్నవారికి ఈ నూతన విధానం కలిసొచ్చే అంశం. దీనిద్వారా గతంతో పోలిస్తే... అర్ధ సంవత్సర సమయం ఆదా అవుతుంది.     
 

Posted Date: 02-12-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌