• facebook
  • whatsapp
  • telegram

కళ్లకు కట్టినట్టు.. కళతో కనికట్టు!

విజువల్‌ ఆర్ట్స్‌ - విభిన్నమైన కెరియర్‌ 

 

 

కళకు మానవ జీవితంలో ప్రముఖ స్థానం ఉంది. సమ్మోహనపరిచే దృశ్యకావ్యాల్ని ఆవిష్కరించాలన్నా.. మంత్రముగ్ధుల్ని చేసే మనోహర రూపాలతో మైమరపించాలన్నా అది కళాకారునికే సాధ్యం. కళ్లతో చూసి ఆనందించగలిగిన కళారూపాలే విజువల్‌ ఆర్ట్స్‌. వీటిని సాధన చేసే ‘విజువల్‌ ఆర్టిస్ట్‌’ ఓ విభిన్నమైన కెరియర్‌ ఆప్షన్‌..

 

వీటిని చదువుకునే విద్యార్థులు తమ కళారూపం ద్వారా చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం ఎలాగో నేర్చుకుంటారు. బేసిక్‌ మెటీరియల్స్, టెక్నిక్స్‌ను వాడటం అభ్యసిస్తారు. డిజైన్‌ తయారీ, రంగుల వాడకం, థియరీ ఆఫ్‌ కంపోజిషన్‌ అనేవి ఇందులో ప్రధానం. వీటిలో మనదేశంలో ఎక్కువగా ఆదరణ పొందుతున్న కోర్సులపై విహంగ వీక్షణం ఇది...

 

భావోద్వేగాలనూ, ఆలోచనలనూ, సమాచారాన్నీ కళాత్మకంగా చెప్పే విజువల్‌ ఆర్ట్స్‌ ప్రధానంగా 3 రకాలు.

1. ఫైన్‌ ఆర్ట్స్‌ (పెయింటింగ్, డ్రాయింగ్, గ్రాఫిక్స్, స్కల్ప్‌చర్, ఆర్కిటెక్చర్‌ మొదలైనవి.)

2. డెకరేటివ్‌ ఆర్ట్‌ (టాపెస్ట్రీ, సిరామిక్స్, మొసాయిక్‌ ఆర్ట్, గ్లాస్‌ ఆర్ట్, జ్యువెలరీ ఆర్ట్‌ తదితరాలు.)

3. కాంటెంపరరీ ఆర్ట్‌ (ఫొటోగ్రఫీ, ఆర్ట్‌ ప్రింట్, వీడియో ఆర్ట్, యానిమేషన్, గ్రాఫిటీ ఆర్ట్‌...)

 

పెయింటింగ్‌: దేశంలోని వివిధ విద్యాలయాల్లో బి.ఎ.పెయింటింగ్, బి.ఎ.పెయింటింగ్‌ అండ్‌ స్కల్ప్‌చర్‌ అప్లైడ్‌ ఆర్ట్స్, బి.ఎఫ్‌.ఎ.పెయింటింగ్, సర్టిఫికెట్‌ కోర్సు, డిప్లొమా కోర్సులు చేసే అవకాశం ఉంది. వీటి తర్వాత మాస్టర్స్, పీహెచ్‌డీ చేయొచ్చు. ఇలా చదివిన వారు వివిధ విద్యాసంస్థల్లో పెయింటింగ్‌ బోధించే అధ్యాపకులుగా స్థిరపడొచ్చు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ఎం.ఎ.డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్, ఎం.ఎఫ్‌.ఎ.పెయింటింగ్‌ ముఖ్యమైనవి. ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, యోగివేమన యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.

 

సిరామిక్స్‌: డెకరేటివ్‌ ఆర్ట్‌ పీసెస్‌ తయారీలో సిరామిక్స్‌ ఎంతో ప్రత్యేకమైనది. అప్లైడ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చేసినవారెవరైనా ఇందులో రాణించవచ్చు. సిరామిసిస్ట్, మోడల్‌ మేకర్, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైనర్, సిరామిక్‌ ఇంజినీర్‌ వంటి పోస్టులతో ఈ వృత్తిలో స్థిరపడొచ్చు. ప్రొడక్ట్‌ డిజైనింగ్‌ కంపెనీలు, మ్యూజియాలు, ఆర్ట్‌ గ్యాలరీల్లో వీరి అవసరం ఎంతో ఉంటుంది.

 

గ్రాఫిక్స్‌: బ్లాగ్స్, వెబ్‌సైట్స్, ప్రింట్‌ పేజెస్‌ను స్టైలింగ్‌ చేయడం ఇందులో ప్రధాన భాగం. అడ్వర్టైజ్‌మెంట్స్, మ్యాగజైన్స్, వీడియోగేమ్స్, పోస్టర్స్, మూవీస్‌.. ఇలా వీటి పరిధి చాలా విస్తృతమైంది. సర్టిఫికేషన్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎందులో చేరాలన్నా ప్లస్‌టూ కనీస అర్హత. గ్రాఫిక్‌ డిజైన్స్‌లోనూ మళ్లీ అనేక విభాగాలున్నాయి. ఇది నేర్చుకోవాలంటే కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఫొటోషాప్‌ పరిచయం తప్పనిసరి. ఎన్‌ఐడీ, ఏఐఈఈ, ఐఐఏఈ, టీడీవీ వంటి ప్రవేశపరీక్షల ద్వారా దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో గ్రాఫిక్‌ డిజైనింగ్‌ కోర్సు చదవొచ్చు. అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలు, ప్రింట్‌ - పబ్లిషింగ్‌ హౌస్‌లు, వెబ్‌ డిజైన్‌ స్టూడియోల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

 

స్కల్ప్‌చర్‌: ఇది ఫైన్‌ ఆర్ట్స్‌లోనే మరో ముఖ్య భాగం. త్రీడీలో మౌల్డింగ్, క్యాస్టింగ్, వెల్డింగ్, కార్వింగ్‌ చేయాల్సి ఉంటుంది. రాయి, చెక్క, మట్టి, లోహం ఇలా పలు రకాల పదార్థాలతో కళాకృతులను తయారుచేయొచ్చు. ప్రస్తుతం ఇందులో టెక్నాలజీ కూడా అంతర్భాగమైంది. కంప్యూటర్‌ తెరపై ‘వర్చువల్‌ క్లే’ను ఉపయోగిస్తూ కూడా విగ్రహాలు తయారుచేస్తున్నారు. అతి పెద్ద ఆకృతుల నుంచి కంటికి కనిపించని సూక్ష్మ కళారూపాల వరకూ అన్నీ ఈ కోవలోకే వస్తాయి. పెయింటింగ్‌ మాదిరిగానే ఇందులోనూ పీహెచ్‌డీ వరకూ కోర్సులున్నాయి. దీనికి తగిన ఉద్యోగావకాశాలూ ఉన్నాయి. 

 

ఫొటోగ్రఫీ: గత ఇరవై ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది ఫొటోగ్రఫీ. వినూత్నంగా ఆలోచించే వారికి ఫొటోగ్రఫీ ఆర్థికంగా ఎంతో లాభదాయకమైన కెరియర్‌ను ఇవ్వగలదు. ఇందులో స్పోర్ట్స్, వైల్డ్‌లైఫ్, ఫ్యాషన్, ప్రొడక్ట్, నేచర్‌ అండ్‌ ల్యాండ్‌స్కేప్, ఈవెంట్, ఫైన్‌ ఆర్ట్, ఆటోమొబైల్‌ ఫొటోగ్రఫీ వంటి రకాలున్నాయి. కేవలం క్లిక్‌ చేయడమే కాకుండా గేర్‌ అడ్జస్ట్‌మెంట్, లెన్స్‌ ఎంపిక, లైటింగ్, ఎడిటింగ్, ప్రింటింగ్‌ వంటి అంశాలన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బి.ఎ.ఫొటోగ్రఫీ, బి.ఎ.ఫొటోగ్రఫీ అండ్‌ సినిమాటోగ్రఫీ, డిప్లొమా ఇన్‌ డిజిటల్‌ ఫొటోగ్రఫీ, డిప్లొమా ఇన్‌ ఫొటో జర్నలిజం... ఇంకా అనేక కోర్సులు చేసే అవకాశం ఉంది. ఇక మన ఆసక్తికి తగ్గట్టు ఎంచుకోవడమే తరువాయి.

 

జ్యువెలరీ ఆర్ట్‌: అలంకార ప్రియులు ఉన్నంత వరకూ ఆభరణాల డిజైన్‌కు డిమాండ్‌ ఉంటూనే ఉంటుంది. జ్యువెలరీ డిజైన్‌లో బీడీఎస్, బీఎస్సీ, బీఏ వంటి కోర్సులు చదువుకునే అవకాశం ఉంది. ఏ సబ్జెక్టు చదువుకున్న విద్యార్థులైనా ఈ కోర్సుల్లో చేరేలా విద్యాసంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్, జీడీ గోయింకా డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్, జీఎల్‌ఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్, పెరల్‌ ఎకాడమీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ల ద్వారా ప్రముఖ కాలేజీల్లో సీటు సంపాదించొచ్చు. జ్యువెలరీ డిజైనర్, జెమాలజిస్ట్, జ్యువలరీ కన్సల్టెంట్‌గా స్థిరపడే అవకాశం ఉన్న ఈ రంగం ఎంతో సృజనాత్మకంగా ఉంటుంది.

 

యానిమేషన్‌: మొత్తం ఆర్ట్‌ ఫామ్స్‌లో ఇది అత్యంత ఆదరణ ఉన్న రంగం. మిగతా వాటితో పోలిస్తే దీని వయసు తక్కువే అయినా... అవకాశాలు, జీతాలు మాత్రం ఎక్కువే! కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్స్‌ను ఉపయోగిస్తూ టూడీ, త్రీడీలో యానిమేషన్స్‌ చేయాల్సి ఉంటుంది. కాంతి, రంగు, నీడలను అనుసంధానిస్తూ ఇమేజెస్‌ కదులుతున్న భావన కలిగించడం ఇందులోని ప్రధాన విధి. సినిమాలు, వీడియోగేమ్స్‌ వంటివేకాక ఇతర డిజైనింగ్‌ కంపెనీల్లోనూ ఉద్యోగావకాశాలుంటాయి. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలెన్నో ఈ కోర్సులను అందిస్తున్నాయి. యానిమేటర్, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ఆర్టిస్ట్, క్యారెక్టర్‌ యానిమేటర్, కాంపొసిటర్‌ వంటి అనేక ఉద్యోగాల్లో స్థిరపడొచ్చు.

 

విభిన్నంగా ఆలోచించే యువత కోసం ఇవేకాక... డెస్క్‌టాప్‌ పబ్లిషర్, డ్రాఫ్టర్, క్రాఫ్ట్‌ ఆర్టిస్ట్, ఎగ్జిబిషన్‌ డిజైనర్, గ్లాస్‌ బ్లోవర్, ఇలస్ట్రేటర్‌ వంటి అనేక ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయి! 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పరిశోధనలకు పునాది

‣ సాంకేతికతపై పట్టు.. మార్కులు సాధించిపెట్టు!

‣ ఉన్నత సంస్థల్లో ఉపాధ్యాయ విద్య!

‣ పోటీ కోణంలో జీవశాస్త్రం

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 04-05-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌