• facebook
  • whatsapp
  • telegram

క్యాట్‌ నగారా  

ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) కళాశాలల్లో ఎంబీఏ చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశపరీక్షే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌). దేశవ్యాప్తంగా ఉన్న 13 ఐఐఎం కళాశాలలే స్వయంగా ఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మేనేజ్‌మెంట్‌ విద్య చదవాలనుకుంటే క్యాట్‌ ప్రకటన రాకముందే సన్నద్ధత ప్రారంభించటం ఉత్తమం!

ఏటా అక్టోబర్‌- నవంబర్‌ నెలల్లో ఆన్‌లైన్‌ విధానంలో క్యాట్‌ను నిర్వహిస్తారు. ఇందులో సాధించిన పర్సంటైల్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్‌ స్కోరు ఆధారంగానే ఢిల్లీలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్స్‌, గుర్గావ్‌లోని ఎండీఐ తదితర కళాశాలలు కూడా తమ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తాయి.

అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయి బోధన, మౌలిక సౌకర్యాలు ఐఐఎంలలో ఉంటాయి. ఉన్నత సంస్థల్లో ప్రారంభంలోనే మంచి స్థానాల్లో ఉద్యోగాలను దక్కించుకునేలా విద్యాప్రమాణాలు ఉంటాయి. కేవలం పాఠాలు చెప్పడం, పరీక్షలు నిర్వహించడం వరకు మాత్రమే పరిమితమైన కోర్సు ఉండదు. అకడమిక్‌ పరిధి దాటి, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తారు. ప్రాజెక్టులు, ప్రజెంటేషన్లు, పోటీలు.. ఇలా భిన్న పద్ధతుల్లో రెండేళ్లపాటు విద్యార్థులు ఎంబీఏ పూర్తిచేస్తారు.

ఐఐఎంలలో ప్రవేశానికి ముందు, తర్వాత పరిశీలిస్తే అభ్యర్థిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. నాయకత్వ లక్షణాల్లో, భావ వ్యక్తీకరణలో, ఆత్మవిశ్వాసంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్లలో ఎంబీఏ చేసిన విద్యార్థులు ముందుంటారు. అందుకే చాలామంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ దశ ముగియకముందే క్యాట్‌లో అత్యధిక పర్సంటైల్‌ లక్ష్యంగా సన్నద్ధత ప్రారంభిస్తారు.

పరీక్ష ఎలా ఉంటుంది?

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ అభ్యర్థుల మానసిక, ఆంగ్ల సామర్థ్యాలను పరీక్షించేలా ఉంటుంది. అంశాలపరంగా సులువుగా అనిపించినా ప్రశ్నల తీరు కఠినంగా ఉంటుంది. సాధారణంగా పరీక్ష తీరు ఏటా మారుతూ ఉంటుంది (అయితే గత రెండేళ్లలో మార్పు లేకుండా స్థిరంగా వస్తూ ఉంది). దీంతో విద్యార్థులు సమయస్ఫూర్తిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొత్త రీతిలో వచ్చినా పరీక్షలోని అంశాలు అవే ఉంటాయి. అయితే ప్రశ్నపత్రం పూర్తిస్థాయిలో వేగంగా అవగాహన చేసుకుని, మంచి పర్సంటైల్‌ సాధించేలా అక్కడికక్కడే ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల నిర్ణయ సామర్థ్యం కీలకపాత్ర పోషిస్తుంది.

గత రెండేళ్లుగా పరీక్షలో రెండు సెక్షన్లతో ప్రశ్నపత్రం ఇస్తున్నారు..

1. సెక్షన్‌-1: క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (30 ప్రశ్నలు, 70 నిమిషాలు)

2. సెక్షన్‌-2: వెర్బల్‌ అండ్‌ రీజనింగ్‌ (30 ప్రశ్నలు, 70 నిమిషాలు)

ప్రతి సెక్షన్‌లోనూ ప్రశ్నలస్థాయి కఠినంగా ఉంటుంది. తక్కువ సమయంలో సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలు చేసినవారికి మాత్రమే సీటు దక్కుతుంది.

అంశాలవారీగా పరిశీలిస్తే...

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో నంబర్‌సిస్టమ్‌, అరిథ్‌మెటిక్‌, ఆల్‌జీబ్రా, జామెట్రీ.. తదితర అంశాలుంటాయి. వెర్బల్‌లో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌ తదితర అంశాలు; రీజనింగ్‌లో సిలాజిసం, అరేంజ్‌మెంట్‌ ప్రాబ్లమ్స్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

కాన్సెప్టులు తప్పనిసరి

క్యాట్‌లాంటి పరీక్షల్లో మంచి పర్సంటైల్‌ సాధించేందుకు అన్ని అంశాల్లో మౌలిక భావనలపై (బేసిక్‌ కాన్సెప్ట్స్‌) పూర్తిగా పట్టు సాధించాలి. ప్రశ్నలు తికమకగా ఉంటాయి. అభ్యర్థుల గణిత సామర్థ్యాన్ని మాత్రమే పరీక్షించేలా కాకుండా వారిలో విశ్లేషణ, ఆలోచన శక్తులను పరీక్షించేలా ఉంటాయి. షార్ట్‌కట్స్‌/ చిట్కాలు నేర్చుకున్నంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉండదు. భావనలు నేర్చుకున్నవారు మాత్రమే ఈ పరీక్షలో ప్రశ్న ఎలా వచ్చినా సమాధానం కనుక్కోగలుగుతారు.

రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో కొందరు నిఘంటువును బట్టీ పట్టడం అనే వృథా ప్రయత్నం చేస్తుంటారు. చాలామంది సాధ్యమైనన్ని ఎక్కువ పదాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే సందర్భోచితంగా పదాలను ఎలా అర్థం చేసుకోగలుగుతారన్న అంశం ఆధారంగా ప్రశ్నలు ఇస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ ఇంగ్లిష్‌ సాహిత్యం చదవడం ద్వారా దీనిని తేలికగా చేయొచ్చు.

రెండు దశల్లో సన్నద్ధత

ఈ తరహా పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి సన్నద్ధత రెండు దశల్లో జరగాలి.

1. సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశంలో పూర్తిస్థాయిలో అవగాహన, వాటిని తేలికగా చేసే విధానాలు

2. సాధన.

వీటిలో ఏది లేకపోయినా అనుకున్న స్థాయిలో పర్సంటైల్‌ సాధించడం వీలుపడదు. సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో మొత్తం సిలబస్‌లోని ప్రాథమిక అంశాలపై అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాత పూర్తిస్థాయి మాదిరి పరీక్షలను రాస్తూ వెళ్లాలి. పరీక్ష అయిన తరువాత ఎక్కువగా ఏ అధ్యాయంలో తప్పులు వస్తున్నాయో/ ఏ విభాగంలో తప్పులు చేస్తున్నారో సరిచూసుకుని దానికి తగ్గట్టుగా ఆయా అంశాలను పూర్తిస్థాయిలో చదవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్‌

క్యాట్‌ సాధారణంగా అక్టోబర్‌- నవంబర్‌ నెలల్లో ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్ష కాబట్టి ప్రతిరోజూ నిర్వహిస్తారు. ప్రకటన వెలువడిన తర్వాత అభ్యర్థులే స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

50% పర్సంటేజీ సాధించిన గ్రాడ్యుయేట్లు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45% మార్కులు సాధిస్తే అర్హులు. ఫలితాలు జనవరిలో వెలువడతాయి. ఆ తర్వాత కటాఫ్‌ స్కోరు నిర్ణయిస్తారు. వచ్చిన స్కోరు ఆధారంగా వివిధ పద్ధతుల్లో కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు. సాధారణంగా బృందచర్చ, వ్యాసరచన, మౌఖికపరీక్షల్లో ఏదేని ఒకటి/ రెండు ప్రక్రియల ద్వారా ఎంపిక చేస్తారు.

ఇంటర్‌తోనూ.. ఐఐఎంలో ఎంబీఏ

ఇంటర్‌ అర్హతతో అయిదు సంవత్సరాల ఎంబీఏ కోర్సుకు ఐఐఎం (ఇండోర్‌) ప్రకటన వెలువరించింది. ఈ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌కు ఆప్టిట్యూడ్‌ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో 60% ప్రశ్నలు క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి, 40% ప్రశ్నలు వెర్బల్‌ ఎబిలిటీ విభాగం నుంచి వస్తాయి. ఆ తర్వాత వ్యక్తిగత మౌఖికపరీక్ష ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

Posted Date: 21-10-2020


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌