• facebook
  • whatsapp
  • telegram

పిలుస్తోంది ప్రేమ్‌జీ యూనివర్సిటీ

యూజీ, పీజీల్లో ప్రవేశాలకు ప్ర‌క‌ట‌న విడుద‌ల‌
 

మేటి సంస్థల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రామాణిక విద్యను అభ్యసించాలనుకునేవారికి అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం వేదికగా నిలుస్తోంది. తక్కువ ఆదాయం ఉన్నవారు బోధన, వసతిని పూర్తి ఉచితంగా ఈ సంస్థలో పొందవచ్చు. ఇక్కడ బీఏ, బీఎస్‌సీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ బీఎడ్, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో వీటిలో ముందస్తు    ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా కోర్సుల్లోకి తీసుకుంటారు! 
 

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు వారిలో సామాజిక స్పృహ పెంచడానికి అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం గట్టిగా కృషి చేస్తోంది. మేటి ఫ్యాకల్టీ, ఆధునిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం అన్నింటి మేళవింపుతో బెంగళూరులో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. సామాజిక అవసరాలు నెరవేరేలా, నాణ్యమైన మానవ వనరులు అందించే లక్ష్యంతో కోర్సులను రూపొందించారు. సైన్సెస్, ఆర్ట్స్‌ హ్యుమానిటీస్, న్యాయవిద్య, బోధన రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ సంస్థలో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అన్ని కోర్సులవారికీ ఉమ్మడి కరిక్యులమ్‌ తోపాటు, ప్రతి కోర్సులోనూ మేజర్‌ (కంపల్సరీ), ఎలెక్టివ్‌లు ఉంటాయి. వీటికి ఎంపికైనవారికి ఆగస్టు నుంచి తరగతులు మొదలవుతాయి.
 

యూజీ పరీక్ష ఇలా
బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్‌ అన్ని కోర్సులకూ ఉమ్మడిగానే పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విభాగంలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ ఒక్కో దాంట్లో 18 చొప్పున 36 ప్రశ్నలు వస్తాయి. వీటిని 2 గంటల వ్యవధిలో పూర్తిచేయాలి. ప్రతి సరైన జవాబుకూ 2 మార్కులు. తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. మరో విభాగంలో ఎస్సే /డేటా ఎనాలిసిస్‌/ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ల్లో ఒక వ్యాసరూప ప్రశ్న వస్తుంది. అభ్యర్థి ఎంచుకున్న కోర్సుపై ఆధారపడి ఏదో ఒక విభాగం ప్రశ్నకు సమాధానం రాయాలి. వ్యవధి ఒక గంట. 
 

పీజీ పరీక్ష
ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు అన్నింటికీ పరీక్ష ఉమ్మడిగానే ఉంటుంది. ఇందులో 2 విభాగాలు ఉంటాయి. పార్ట్‌-1లో 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ 25, రీజనింగ్‌ ఎబిలిటీ 10, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 25, జనరల్‌ అండ్‌ సోషల్‌ అవేర్‌నెస్‌ 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌ -2లో ఎంఏ కోర్సులకు సంబంధించి అభ్యర్థి తొలి ప్రాధాన్యం ఇస్తున్న సబ్జెక్టుపై 500 పదాల్లో వ్యాసం రాయాలి. ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరాలనుకున్నవారికి 2 వ్యాసాలు ఇస్తారు. వాటిలో ఒకటి రాయాలి. ఈ విభాగం వ్యవధి ఒక గంట. 
 

ఫీజు సంగతి? 
బీఏ, బీఎస్‌సీ, బీఎస్‌సీ-బీఎడ్‌ ఏ కోర్సులో చేరినా తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4 లక్షలలోపు ఉంటే పూర్తి ఫీజు మినహాయింపు లభిస్తుంది. వసతి కూడా ఉచితమే. రూ.4-8 లక్షల లోపు ఉంటే 75 శాతం, 8-10 మధ్య 50 శాతం, 10-15 మధ్య ఉన్నవారికి 25 శాతం ఫీజు, వసతిలో రాయితీ లభిస్తుంది. పీజీ అన్ని కోర్సులకూ రూ. 2 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు చెందినవాకి పూర్తి మినహాయింపు లభిస్తుంది. 2 నుంచి 4 లక్షల లోపు ఉంటే 75 శాతం, 4-6 మధ్య ఉన్నవారికి 50 శాతం, 6-7 మధ్య ఉంటే 25 శాతం ఫీజు తగ్గిస్తారు. రుణ సౌకర్యం ఉంది.
 

ప్లేస్‌మెంట్లు
కోర్సులు పూర్తిచేసుకున్నవారికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ కంపెనీలు కోర్సు చివర్లో నియామకాలు చేపడతున్నాయి. ఇక్కడ పీజీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ బీఎడ్‌ కోర్సులు చదివినవారికి రూ.30 నుంచి 35 వేల నెల వేతనంతో వివిధ సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. అనుభవం ఉన్నవారికి ఇంతకంటే పెద్దమొత్తమే అందిస్తున్నాయి. 
 

ఇవీ కోర్సులు
 

యూజీలో...
బీఏ: ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిస్టరీ
బీఎస్సీ: ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ
బీఎస్సీ బీఎడ్‌: బయాలజీ, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్‌ 
అర్హత: సంబంధిత గ్రూప్‌లో 50 శాతం మార్కులతో 2020లో ఇంటర్‌ ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారై ఉండాలి. వయసు: 19 ఏళ్లలోపు ఉండాలి. 
 

పీజీలో...
ఎంఏ: ఎడ్యుకేషన్, డెవలప్‌మెంట్, పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, ఎకనామిక్స్‌ 
ఎల్‌ఎల్‌ఎం: లా అండ్‌ డెవలప్‌మెంట్‌ ఏడాది వ్యవధి కోర్సు
అర్హత: ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నా అర్హులే. ఎల్‌ఎల్‌ఎం: లా అండ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులోకి ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  
 

దరఖాస్తుకు చివరి తేదీ: యూజీ కోర్సులకు డిసెంబరు 25, పీజీ కోర్సులకు వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు డిసెంబరు 22, రెగ్యులర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 22  
 

పరీక్ష తేదీ: యూజీ, పీజీ రెండు కోర్సులకూ జనవరి 10. రెగ్యులర్‌ విద్యార్థులైతే పీజీ కోర్సులకు మార్చి 21న పరీక్ష ఉంటుంది. 
 

వెబ్‌సైట్‌: https://azimpremjiuniversity.edu.in
 

Posted Date: 07-12-2020


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌