• facebook
  • whatsapp
  • telegram

కామ‌ర్స్ ప్రొఫెష‌న‌ల్ కోర్సుల‌తో పీహెచ్‌డీలోకి ప్ర‌వేశం!

యూజీసీ నిర్ణ‌యంతో అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు

సీఏ/ సీఎంఏ/ సీఎస్‌ ఉత్తీర్ణులైన కామర్స్‌ ప్రొఫెషనల్స్‌ను పీజీ చేసినవారితో సమానంగా గుర్తిస్తున్నట్లు యూజీసీ ఇటీవల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం మూలంగా కామర్స్‌ వృత్తివిద్య చదివే విద్యార్థులకు ఏయే ప్రయోజనాలు లభించబోతున్నాయి? 

దాదాపు దశాబ్దకాలంగా ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ), ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ), ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) సంస్థలు సీఏ/ సీఎంఏ/ సీఎస్‌  కోర్సులకు పోస్టుగ్రాడ్యుయేషన్‌తో సమానంగా గుర్తింపును ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)కి చాలాసార్లు విజ్ఞప్తి చేస్తూ వచ్చాయి. ఇప్పటివరకూ సీఏ/ సీఎంఏ/ సీఎస్‌ అర్హత సాధించినవారు పీహెచ్‌డీ చేయడానికి దేశ విదేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలు అనుమతిని నిరాకరించేవి. యూజీసీ చేసిన ఈ ప్రకటనతో ఇకపై సీఏ/ సీఎంఏ/ సీఎస్‌ పూర్తిచేసినవారు కామర్స్‌లో ఎంకాం, ఎంఫిల్‌ చేసినవారిగా గుర్తింపు పొందుతారు. కాబట్టి వారు పీహెచ్‌డీ చేయడంతోపాటు యూజీసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నెట్, వివిధ రాష్ట్రాలు నిర్వహించే సెట్‌ లాంటి పరీక్షలకు అర్హత సాధిస్తారు. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ తదితర కోర్సులు అభ్యసించడానికి అవకాశం లభిస్తుంది. దీంతోపాటు తాము పనిచేసే బహుళజాతి సంస్థల్లో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.

ఈ సందర్భంగా మార్చి 16న ఐసీఏఐ (ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా) జారీ చేసిన పత్రికా ప్రకటనలోని ముఖ్యాంశాలు- 

సీఏ పూర్తిచేసినవారు యూజీసీ నిర్వహించే నెట్‌కు హాజరవ్వటానికి అర్హత సాధిస్తారు. దీనివల్ల దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లాంటి ఉపాధి అవకాశాలను చేజిక్కించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా అర్హతలు, నైపుణ్యాలను మూల్యాంకనం చేసే ప్రముఖ సంస్థ యూకే ఎన్‌ఏఆర్‌ఐసీ (ద నేషనల్‌ రికగ్నిషన్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ఫర్‌ ద యునైటెడ్‌ కింగ్‌డమ్‌) వారు మూల్యాంకనం చేసి గతంలోనే సీఏ అర్హతను అత్యుత్తమమైనదిగా గుర్తించారు.

ఇదివరకే సీఏ అర్హతతో పీహెచ్‌డీ చేయడానికి దేశంలోని 106 విశ్వవిద్యాలయాలు, రెండు ఐఐటీలు, ఏడు ఐఐఎంలు అనుమతినిచ్చాయి. యూజీసీ తాజా ప్రకటనతో దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంల్లో సీఏ విద్యార్థులు పీహెచ్‌డీ చేయొచ్చు.

సీఏ/ సీఎంఏ/ సీఎస్‌ వంటి కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు చేసేవారు బ్యాక్‌అప్‌ కోర్సుగా డిగ్రీ చేయడం మంచిది. ఒకవేళ వారు సీఏ/ సీఎంఏ/ సీఎస్‌ పూర్తి చేయలేకపోతే బ్యాక్‌అప్‌ డిగ్రీ ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదంటే వారిని కేవలం ఇంటర్‌ చదివినవారిగానే పరిగణిస్తారు. అందుకని సీఏ/ సీఎంఏ/ సీఎస్‌ కోర్సులు చదివేటప్పుడు డిగ్రీ చేయడం ఉత్తమం. 

ఏ ప్రయోజనాలు?

సీఏ/ సీఎంఏ/ సీఎస్‌ పూర్తిచేసినవారు ప్రత్యేకంగా డిగ్రీ, పీజీ చదవాల్సిన అవసరం లేదు.

నేరుగా పీహెచ్‌డీ, ఇతర ఉన్నత విద్యలు అభ్యసించవచ్చు.

విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎలాంటి పీజీ, తత్సమాన పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. నేరుగా ఉన్నతవిద్యను అభ్యసించవచ్చు.

ఎంకాం, ఎంఫిల్‌ చదవనవసరం లేకుండానే కామర్స్‌లో పీహెచ్‌డీ చేయొచ్చు.

విశ్వవిద్యాలయాలు ఇచ్చే పీజీ డిగ్రీ అవసరం లేకుండానే నేరుగా నెట్‌/ సెట్‌ లాంటి పరీక్షలకు హాజరు కావొచ్చు.

Posted Date: 01-04-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌