• facebook
  • whatsapp
  • telegram

ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ సీట్ల కోసం జాతీయ స్థాయిలో పోటీ  

డిగ్రీ చదువులతోడు కొన్ని అదనపు కోర్సులు చేస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఇలాంటి ఉపాధి ఆధారిత కోర్సులకు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) చిరునామాగా మారింది. ఎంబీబీఎస్, బీఎస్సీ చదువులు పూర్తి చేసినవారికి ఎమ్మెస్సీ (అప్లయిడ్‌ న్యూట్రిషన్‌), ఎమ్మెస్సీ (స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌) కోర్సులు అందిస్తోంది. రెండు సంవత్సరాల వ్యవధి ఉండే ఈ కోర్సులు చేయడానికి జాతీయ స్థాయిలో ప్రవేశపరీక్ష ఉంటుంది. అయితే వీటికి పోటీపడుతున్న  తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అంతంతమాత్రమే! 


ఎంబీబీఎస్‌ లేదా బీఎస్సీలో హోంసైన్స్, అప్లయిడ్‌ న్యూట్రిషన్, బయో కెమిస్ట్రీ, నర్సింగ్, బీఎస్సీ విత్‌ న్యూట్రిషన్, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ తదితర కోర్సులు పూర్తిచేసుకున్న వారు ఎన్‌ఐఎన్‌ ఎమ్మెస్సీ కోర్సులకు దరఖాస్తు చేయవచ్చు.  ఆహార తయారీ సంస్థలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఆసుపత్రుల్లో, క్రీడా శిక్షణ సంస్థల్లో న్యూట్రిషన్ల అవసరం బాగా పెరుగుతోంది. ఎమ్మెస్సీ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌ కోర్సులో 24 సీట్లు, ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ కోర్సులో 18 సీట్లు ఉంటాయి. రెండేళ్ల పాటు సాగే ఈ కోర్సులకు జాతీయస్థాయిలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. 


కోర్సులు పూర్తిచేసిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కోర్సులు చేస్తున్న వారి సంఖ్య తక్కువే. సంస్థ కేంద్రం హైదరాబాద్‌లోనే ఉన్నా.. ఈ కోర్సులపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో తెలుగువారు ఎక్కువ సంఖ్యలో పోటీ పడడం లేదని ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసినవారు ఎన్‌ఐఎన్‌లో పీహెచ్‌డీతోపాటు.. విదేశాల్లో చదివి పరిశోధన విభాగాల్లో కూడా స్థిరపడుతున్నారు. 


ప్రవేశాలు ఇలా 

ఏటా మే/ జూన్‌ నెలల్లో ఈ కోర్సులకు నోటిఫికేషన్‌ వస్తుంది. జులై/ ఆగస్టుల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఎమ్మెస్సీ (అప్లయిడ్‌ న్యూట్రిషన్‌) కోర్సు కోసం మొదటి ఏడాది రూ.1,02,500, రెండో ఏడాది రూ.89 వేలు ఫీజు చెల్లించాలి. ఎమ్మెస్సీ (స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌) కోసం మొదటి సంవత్సరం రూ.1,05,000, రెండో సంవత్సరం రూ.92 వేలు చెల్లించాలి. ఎన్‌ఐఎన్‌ వెబ్‌సైట్‌ https://www.nin.res.in/ లోని అకడమిక్స్‌లోకి వెళ్తే ఈ కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలుంటాయి.                


- ఈనాడు, హైదరాబాద్‌ 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

‣ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

‣ ఇంటర్‌తో కేంద్ర సర్వీసుల్లోకి!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

Posted Date: 16-04-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌