• facebook
  • whatsapp
  • telegram

క్లౌడ్‌ కంప్యూటర్‌లో ఉద్యోగాల మథనం

‣ జాబ్‌ స్కిల్స్‌ - 2024



ప్రకృతి ద్వారా ఆకృతి పొందే మేఘం సరళ స్వభావంతో కాస్త చల్లని గాలులు వీస్తే వర్షిస్తుంది. కానీ ఇందుకు భిన్నం క్లౌడ్‌ కంప్యూటింగ్‌. సాంకేతిక నిర్మాణంలో ఏర్పడ్డ క్లౌడ్‌ దృఢమైంది. ఎటువంటి పవనాలనూ మన్నించదు. క్లౌడ్‌ కంప్యూటర్‌ నిర్మించడంలోనూ ఎన్నో జాబ్‌ పొజిషన్లు,ఆపద ఎదురుకాకుండా చూసేందుకు మరిన్ని ఉద్యోగాలు! కంప్యూటర్‌ క్లౌడ్‌ ఉద్యోగాలను అందుకొని ఆకర్షణీయమైన కెరియర్‌ నిర్మించుకోవడమే నేటి తరం ముందున్న సవాలు.


క్లౌడ్‌ రూపం ఏదైనా వాటి వ్యవస్థాపన, నిర్వహణ, నిరంతర పహరాలకు సాంకేతిక నిపుణులు కావలసిందే. వివిధ రూపాల క్లౌడ్లు పెరుగుతున్న కొద్దీ వృత్తి నిపుణుల అవసరం ఎక్కువవుతోంది. సీనియర్లకూ, ఫ్రెషర్లకూ అవకాశం ఏర్పడుతోంది 


క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అనంత సమాచారాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. లెక్కకు మించిన సాఫ్ట్‌వేర్లు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్‌లను తనలో ఇముడ్చుకుంటుంది. ఆపై ఎవరికి ఏ అవసరం వచ్చినా తన అమ్ముల పొది నుంచి తీసి అందిస్తుంది. కంపెనీలు ప్రయోజనం పొందుతాయి. క్లౌడ్‌లో తమ సంపత్తిని దాచుకున్న కంపెనీలు భరోసాగా, దిలాసాగా ఉంటాయి. క్లౌడ్‌ కంప్యూటర్‌లో వివిధ రకాలున్నాయి.  


పబ్లిక్‌ క్లౌడ్‌: ఇంటర్నెట్‌ వేదికగా మూడో పక్షం (థర్డ్‌ పార్టీ) నిర్వహించేది. భారీ సర్వర్లతో విశాలమైన డేటా స్టోరేజి సౌకర్యం ఉండే పబ్లిక్‌ క్లౌడ్‌ సేవలు ఎవరైనా వినియోగించుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ అజర్‌.. దీనికో ఉదాహరణ. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ ఇతర ఐటీ మౌలిక సదుపాయాలు ఈ తరహా థర్డ్‌ పార్టీ పబ్లిక్‌ క్లౌడ్‌లో అందుబాటులో ఉంటాయి.  


ప్రైవేట్‌ క్లౌడ్‌: విస్తృత అవసరాలున్న భారీ ప్రైవేట్‌ కంపెనీలు, వాణిజ్య సంస్థలు తమకోసం ప్రత్యేకించి నిర్వహించుకునేవాటిని ప్రైవేట్‌ క్లౌడ్‌గా పరిగణిస్తారు. వీటిలో రెండు రకాలుంటాయి. కొన్ని కంపెనీలు తాము స్వయంగానే క్లౌడ్‌ను నిర్వహించుకుంటే మరికొన్ని తమ డేటా సెంటర్, ఇతర సదుపాయాల నిర్వహణను ఏదైనా ఇతర ఏజెన్సీకి అప్పగిస్తాయి.  


హైబ్రిడ్‌ క్లౌడ్‌: పబ్లిక్, ప్రైవేట్‌ అవసరాలను తీర్చే ఉమ్మడి సాంకేతిక ఏర్పాటు ఇది. ఉమ్మడి డేటాను, ప్రోగ్రామ్‌లను పబ్లిక్, ప్రైవేట్‌ అవసరాల్లో వినియోగిస్తారు. రెండింటికీ వినియోగపడేలా ఈ మౌలిక వ్యవస్థను నిర్వహిస్తారు. 


వివిధ ఉద్యోగావకాశాలు


వేగంగా ఎదుగుతున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో వివిధ ఉద్యోగ  అవకాశాలను ఆకళింపు చేసుకుందాం.  


ఆర్కిటెక్ట్‌: ఒక కంపెనీ సాంకేతిక విషయాలకు అనుగుణంగా క్లౌడ్‌ను నిర్మించే నిపుణుడే క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌. కంపెనీ వ్యాపార అవసరాలను అర్థం చేసుకొని వాటిని క్లౌడ్‌కు తగినవిధంగా రూపాంతరం చేస్తాడు. వాణిజ్యపరంగా ఎదురయ్యే సంక్లిష్ట సమస్యలకు క్లౌడ్‌ పరిష్కారాలు చూపుతాడు. ఈ హోదా అందుకోవాలంటే.. నిర్వహణ నైపుణ్యాలు, నెట్‌వర్కింగ్‌ పరిజ్ఞానం, ఒరాకిల్‌ క్లౌడ్‌ లేదా మైక్రోసాఫ్ట్‌ అజర్, జావా స్రిఫ్ట్, పైతాన్, సీ++ వంటివి అవసరం. క్లౌడ్‌ ఆర్కిటెక్టుకు మంచి డిమాండ్‌ ఉంది. ఫ్రెషర్స్‌ నుంచి అనుభవం ప్రాతిపదికగా రూ.6.5 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వార్షిక వేతనం పొందవచ్చు. సగటు వార్షిక వేతనం రూ.21 లక్షలు.  


ఇంజినీర్‌: క్లౌడ్‌ అంటే సమాచారాన్ని భద్రపరిచే సాధారణ ఆవాసం కాదు. కొన్ని ప్రత్యేక రక్షణలతో నిర్మించిన సాంకేతిక సౌధం. దీనిలో డేటాను నిల్వచేయాలన్నా, అప్లికేషన్లు పంపాలన్నా, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలన్నా కొన్ని మర్యాదలు (ప్రొటోకాల్స్‌) పాటించాలి. తగిన సాంకేతిక విలువలు జోడించాలి. ఇక్కడే విభిన్న ఉద్యోగావకాశాలు ఉద్భవిస్తున్నాయి. క్లౌడ్, నాన్‌-క్లౌడ్‌లను సమన్వయం చేసే ఉద్యోగావకాశాల్లో క్లౌడ్‌ ఇంజినీర్‌ ఒకటి. క్లౌడ్‌లోకి పంపే సమాచారం, సాధనాలకు వివిధ అప్లికేషన్స్‌ రూపొందించడమే క్లౌడ్‌ ఇంజినీర్‌ చేసే పని. పైతాన్, పవర్‌షెల్, షెల్‌ స్క్రిప్టింగ్, టెర్రాఫార్మ్, గో-రూబీ, పెరల్‌ వంటి ప్రోగ్రామ్‌ స్క్రిప్టింగ్‌ భాషలపై పట్టుండాలి. క్లౌడ్‌ డెవలప్‌మెంట్, గిట్‌ వంటి సాధనాలపై పనిచేసిన అనుభవం ఉంటే మంచిది. క్లౌడ్‌ ఫార్మేషన్, ఫ్యాక్టరీ వంటి వాటిపై అవగాహన ఉండాలి. 

ఈ పొజిషన్‌కు ఫ్రెషర్స్‌ వార్షిక వేతనం రూ.4 లక్షల నుంచి ప్రారంభమైనా రూ. 15 లక్షల వరకు చేరవచ్చు. సగటు వేతనం ఆరు లక్షలకు తగ్గదు. 



కన్సల్టెంట్‌: క్లౌడ్‌కూ, నాన్‌-క్లౌడ్‌ సంపత్తికీ సమన్వయం కుదరడమనే సవాలు అనేక ఉద్యోగాలను సృష్టిస్తుంటే సంస్థల వాణిజ్య అవసరాలు, క్లౌడ్‌ ప్రపంచం మధ్య వారధి వేసే సవాలు మరికొన్ని జాబ్‌ పొజిషన్లకు ద్వారాలు తెరుస్తోంది. వాటిల్లో క్లౌడ్‌  కన్సల్టెంట్‌ ఒకటి. క్లౌడ్‌ టెక్నాలజీపై పట్టు గల కన్సల్టెంట్‌ వాణిజ్య సంస్థల అవసరాలను అర్థం చేసుకొని క్లౌడ్‌తో సమన్వయం చేస్తాడు.  

ఈ పొజిషన్‌ ఆశించేవారికి క్లౌడ్‌ నిర్మితి, ఆకృతులపై అవగాహన ఉండాలి. పప్పెట్, చెఫ్, టెర్రాఫార్మ్, సాల్ట్‌స్టాక్‌ వంటి ఆటోమేషన్‌ సాధనాలపై పట్టుండాలి. భారీస్థాయి సర్వర్లు, క్లౌడ్‌ నిర్మాణాలపై అవగాహన పెంచుకోవాలి. జెన్‌కింగ్స్, జిట్‌హుక్‌ వంటి వెబ్‌ అస్త్రాల గురించి తెలిసుండాలి. క్లౌడ్‌ కన్సల్టెంట్‌కి ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆఫర్‌ చేస్తున్నారు. సగటు వార్షిక వేతనం రూ.10 లక్షలు. 


డెవలపర్‌: క్లౌడ్‌లోకి అడుగుపెట్టాలంటే, క్లౌడ్‌లో నడక సాగించి మనకు కావలసిన పనులు నడుపుకోవాలంటే నిర్దిష్ట సాంకేతిక మర్యాదలు పాటించాలి. అప్పుడే మన సరంజామాను క్లౌడ్‌ కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇటువంటి మర్యాదలకు సంబంధించిన వివిధ సాంకేతిక దశలను ఆటోమేషన్‌ చేసి కంపెనీ ప్రయోజనాలు ఆ చట్రంలోకి ఇమిడిపోయేలా చూసే వృత్తి నిపుణుడే క్లౌడ్‌ డెవలపర్‌. నిర్వహణ, పర్యవేక్షణలను పరిశీలిస్తూ ఏదైనా సవాలు ఎదురైతే క్లౌడ్‌ డెవలపర్‌ పరిష్కారాలు సూచిస్తాడు.

ఈ పొజిషన్‌ కోరుకునేవారు క్లౌడ్‌ నిర్మాణాన్ని అర్థం చేసుకోగలగాలి.కంపెనీ డేటా, ప్రోగ్రామ్స్‌ ఇతర సాంకేతిక ఉపకరణాల గమనంపై అవగాహనతో ఉండాలి. జావా, జావా స్క్రిఫ్ట్, యాంగ్యులర్, రియాక్ట్‌ భాషల్లో ప్రోగ్రామ్స్‌ను సమర్థంగా రూపొందించగలిగే నైపుణ్యం ఉండాలి. నైపుణ్య స్థాయిని బట్టి ఏడాదికి రూ.3 లక్షల నుంచి 25 లక్షలు ఇచ్చే కంపెనీలున్నాయి. సగటున రూ. 8 లక్షలకు తగ్గకుండా క్లౌడ్‌ డెవలపర్‌ సంపాదించుకోవచ్చు.


సెక్యూరిటీ ఇంజినీర్‌: కంపెనీలకు కావలసిన క్లౌడ్‌ వ్యవస్థ (నెట్‌వర్క్‌) నిర్మాణం, నిర్వహణ ఎప్పటికప్పుడు మెరుగుపరచడం, ఏ సంక్షోభం ఎదురైనా పరిష్కారాలతో సిద్ధంగా ఉండటం సెక్యూరిటీ ఇంజినీర్‌ బాధ్యత. క్లౌడ్‌కు తగిన భద్రతా ప్రమాణాలను సెక్యూరిటీ ఇంజినీర్‌ రూపొందిస్తాడు. పైతాన్, పవర్‌షెల్, బాష్, కంప్యూటర్‌ రేంజ్‌లలో సాఫ్ట్‌వేర్‌ రూపొందించగల నైపుణ్యంతోపాటు క్యూబర్‌నెట్స్, డాకర్‌లపై తగిన అవగాహన ఉందాలి. టెర్రాఫార్మ్‌ జెన్‌కింగ్స్, గిట్‌ వంటి వెబ్‌ భద్రతా సాధనాలపై పనిచేసిన అనుభవం ఉపకరిస్తుంది. 

క్లౌడ్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌కి వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆఫర్‌ చేస్తారు. సగటు ఏడాది వేతనం రూ.8.5 లక్షలు.


ఆటోమేషన్‌ ఇంజినీర్‌: బ్యాంకులో మనం వ్యక్తిగతంగా ఒక లాకర్‌ తీసుకుంటేనే కొన్ని విధివిధానాలను పాటించాలి. మరి క్లౌడ్‌ వంటి సువిశాలమైన, ఎల్లలు లేని రక్షణ సామ్రాజ్యంలోకి ప్రవేశించాలంటే క్లౌడ్‌ విధానాలను అనుసరించాలి కదా? ఈ బాధ్యత నిర్వహించే పొజిషనే క్లౌడ్‌ ఆటోమేషన్‌ ఇంజినీర్‌. క్లౌడ్‌ విధానాలు, సంప్రదాయాలను పాటించడంతోపాటు ఇందుకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌ కూడా ఇతడి బాధ్యతే. టెర్రాఫార్మ్, క్లౌడ్‌ ఫార్మేషన్‌ వంటి క్లౌడ్‌ ఆటోమేషన్‌ సాంకేతిక సాధనాలపై పట్టుండాలి. క్లౌడ్‌ ఆధారిత సాంకేతిక వేదికలు అజర్, ఏడబ్ల్యూఎస్‌లపై అవగాహన అవసరం. జావా, పైతాన్, సీ++ వంటి స్క్రిప్టింగ్‌ లాంగ్వేజెస్‌ తెలిసివుండాలి. వీటితోపాటు ఎప్పుడు ఏ సవాలు ఎదురైనా తక్షణం అప్రమత్తమై పరిష్కరించగలిగే నైపుణ్యం ఈ ఇంజినీర్‌ని మంచి ప్యాకేజీలవైపు నడిపిస్తుంది.


వర్చువలైజేషన్‌ ఇంజినీర్‌: కంపెనీ క్లౌడ్‌ సమస్త అవసరాలు, అనివార్యతలపై ఓ కన్నేసి వుంచే పొజిషన్‌ ఇది. క్లౌడ్‌ అవసరాలు, నిర్మాణం, అప్లికేషన్స్, సవాళ్లు, పరిష్కారాలపై ఇతడు దృష్టిపెడతాడు. క్లయింట్‌ లేదా కంపెనీ సర్వర్‌ పనితీరు, అవసరాలను నిశితంగా గమనిస్తుంటాడు. ఈ హోదాకు డేటా సెంటర్‌ నిర్మాణం, నియంత్రించే సాఫ్ట్‌వేర్లపై అవగాహన అవసరం. ప్రోగ్రామింగ్‌ భాషలపై పట్టు తప్పనిసరి. నెట్‌వర్క్‌ క్లౌడ్‌ నిర్మాణ మౌలిక విషయాలపై లోతైన అవగాహన ఉండాలి. ఈ పొజిషన్‌కి ప్రస్తుతం ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఆఫర్‌ చేస్తున్నారు. సగటు వార్షిక వేతనం రూ.8 లక్షలు.


మేనేజర్‌: నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పి పర్యవేక్షించేందుకు ఈ హోదా ఏర్పడింది. కంపెనీ లేదా క్లయింట్‌ క్లౌడ్‌ వ్యవస్థ ప్రమాణాలు పాటిస్తోందా, వివిధ బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులు తగిన నాణ్యతా ప్రమాణాలు అనుసరిస్తున్నారా.. లేదా? అని క్లౌడ్‌ మేనేజర్‌ పరిశీలిస్తుంటాడు. సర్వర్లు, డేటా సెంటర్లకు విపత్కర పరిస్థితులు ఎదురుకాకుండా కాపు కాస్తుండటం, ఒకవేళ అనుకోని ఉపద్రవం వస్తే దాని పరిష్కార అనంతరం విశ్లేషణ, భవిష్యత్తు భద్రతా కార్యాచరణ వంటి కీలక బాధ్యతలను క్లౌడ్‌ మేనేజర్‌ పర్యవేక్షిస్తాడు.  

ఈ పొజిషన్‌కి ఏడబ్ల్యూఎస్‌ ఆర్కిటెక్చర్‌ నిర్వహణ, ఆటోమేషన్‌ సరళిపై అనుభవం అవసరం. క్లౌడ్‌ అనుసంధానం మొదలూ - తుదీ తెలిసుండాలి. నెట్‌వర్కింగ్‌పై గట్టి పట్టుండాలి. ముఖ్యంగా ట్రబుల్‌ షూటింగ్‌  (సమస్యా పరిష్కార) నైపుణ్యం అలవర్చుకొని ఉంటే ఏడాదికి రూ.10 లక్షల ప్యాకేజీ నుంచి రూ.40 లక్షల ప్యాకేజీ వరకు  పొందవచ్చు. వీరి వార్షిక సగటు వేతనం రూ.20 లక్షలు. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోర్సు కొనసాగించాలా.. వదిలేయాలా?

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?

‣ చేనేత కెరియర్‌కి చేయూత

‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

Posted Date: 17-06-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌