• facebook
  • whatsapp
  • telegram

చేనేత కెరియర్‌కి చేయూత

డిప్లొమా, బీటెక్‌, బీఈ కోర్సుల్లో ప్రవేశాలు


హ్యాండ్లూమ్స్‌.. తరాలుగా వన్నె తరగని భారతదేశ వారసత్వ సంపద. సునిశితమైన పనితనంతో మనకు మాత్రమే సొంతమైన కళాకృతులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. అయితే ఒకప్పుడు కేవలం కొన్ని కుటుంబాల వారికే పరిమితమైన ఈ విద్య.. ప్రస్తుతం ప్రభుత్వాల చొరవతో విద్యార్థులు అభ్యసించి కెరియర్‌గా మలుచుకునేలా మారింది. సృజనాత్మకమైన ఆలోచనలు కలిగిన వారికి.. ఇది చక్కని ఉపాధి మార్గం.
 


 

చేనేత ప్రస్తుతం దేశంలో, ఉపాధి కల్పనలో ఒక ముఖ్య పరిశ్రమగా వర్ధిల్లుతోంది. మిగతా దేశాలతో పోలిస్తే నాణ్యంగా, తక్కువ ధరతో సరకు అందించే దేశాల్లో మనం ముందున్నాం. దీనివల్ల మనదేశంలో నుంచి వెళ్లే వస్తువులకు డిమాండ్‌ అధికంగా ఉంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీలు విద్యార్థులకు దీనికోసం తర్ఫీదు ఇచ్చి ఇందుకు సహకరిస్తున్నాయి. మనదేశ ఉత్పత్తులకు గిరాకీ ఉండేలా పరిశ్రమ కష్టపడుతోంది.


‣ ఇందులో విద్యార్థులు డిప్లొమా, బీటెక్, బీఈ కోర్సులు చదివే వీలుంది. ఆసక్తిని బట్టి కింది ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.

మనదేశంలో చేనేత చాలాకాలంపాటు అసంఘటిత రంగంగానే మిగిలిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తమ ఆధ్వర్యంలోకి తీసుకుని సంఘటితంగా మార్చినప్పటి నుంచి కళాకారులు ఎంతో కొంత లాభాలు చూడటం మొదలుపెట్టారు. 

చేనేత పరిశ్రమ అతి పురాతనమైనది. ఒకప్పుడు కుటీర పరిశ్రమలు చీరలు, ధోవతి, అంగవస్త్రాలను.. ప్రధానంగా సిల్క్, కాటన్‌ వస్త్రాలతో తయారుచేసేవి. ప్రస్తుతం వీటితోపాటు ఎన్నో రకాలైన గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు తయారుచేస్తున్నారు. ఇవి ప్రధానంగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.


   కోర్సులు..   

వీటిలో డిప్లొమాతోపాటు బీఈ, బీటెక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదోతరగతి, ఇంటర్‌ తర్వాత ఇందులో చేరదలిచే వారు సంబంధిత ప్రవేశాల ప్రకటనలను పరిశీలించి ముందుకు వెళ్లాలి. 

 ప్రస్తుతం తిరుపతి జిల్లా వెంకటగిరిలో శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఎస్పీకేఎం ఐఐహెచ్‌) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీటిలో హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ (లేటరల్‌ ఎంట్రీ) రెండు, మూడేళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కనీసం పదోతరగతి ఉత్తీర్ణత ఉన్నవారు చేరేందుకు అర్హులు. దరఖాస్తులకు జూన్‌ 1 ఆఖరు తేదీ.


  హ్యాండ్లూమ్‌   

టెక్నాలజిస్ట్‌:  వీరు వివిధ రకాలైన చేనేత తయారీకి ఉపయోగపడే మెటీరియల్స్‌తో పనిచేస్తారు. వీటిలో సహజసిద్ధమైన వస్త్రాలు, మనుషులు తయారుచేసే ప్లాస్టిక్స్, ఉన్ని, ఇతర పదార్థాలు ఉంటాయి. వీరు ఫర్నిషింగ్, ఇంట్లో వాడే వస్తువులు, క్లోతింగ్‌ వంటివి అభివృద్ధి చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తారు. హ్యాండ్లూమ్‌ టెక్నాలజిస్ట్‌ అవ్వాలంటే కొత్తకొత్తగా వస్తున్న ట్రెండ్స్‌ను అవగాహన చేసుకోవాలి. ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలి. సమస్యా పూరణ నైపుణ్యాలతోపాటు.. ప్రొడక్షన్‌ కంట్రోలింగ్, క్వాలిటీ స్టాండర్డ్స్‌ వంటి వాటి గురించి నేర్చుకోవాలి.


ఫ్యాబ్రికేషన్‌ డిజైనర్‌:  ఫ్యాబ్రికేషన్‌లో సమస్యలకు కారణాలు ఏమిటో కనుక్కుని వాటిని తీర్చడంలో ఫ్యాబ్రికేషన్‌ డిజైనర్‌ ముఖ్యపాత్ర పోషిస్తారు. ఉత్పత్తి గురించి నేర్చుకుని, టెక్నికల్‌ టీమ్‌తో కలిసి పనిచేయాలి అనుకునేవారికి ఇది ఆసక్తికరమైన కెరియర్‌. రోజువారీ పనిలో నాణ్యతాప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఇది ఉపయోగపడుతుంది.


ఎంబ్రాయిడరీ అండ్‌ నీడిల్‌ వర్కర్‌: స్వతహాగా దగ్గరుండి  సొంతంగా సరికొత్త కళాకృతులు సృష్టించాలి అనే ఆసక్తి ఉన్న వారికి ఇది బాగా నచ్చుతుంది. ఇప్పటికే ఉన్న పనితీరుల గురించి అభ్యాసం ద్వారా తెలుసుకుని.. వాటికి సృజనాత్మకతను జోడించే వీలుంటుంది. నిర్వహణతో సంబంధం లేకుండా ఉత్పత్తి మీదనే దృష్టి పెట్టాలి అనుకునేవారికి ఇది చక్కని ఎంపిక.


సొంతంగానూ: దీనికి సంబంధించి సొంతంగా సంస్థలను స్థాపించవచ్చు. హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండిక్రాఫ్ట్‌ డిజైనింగ్‌ చేసి వాటిని ఎగుమతులు చేయడం ద్వారా వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. అయితే ఇటువంటి సంస్థలు స్థాపించడానికి సరైన అవగాహనతోపాటు అనుభవం కూడా అవసరం. ప్రభుత్వం, సంబంధిత విభాగాలు పూర్తి సమాచారం, సహకారం అందిస్తాయి.


పాతకాలంలో హ్యాండ్లూమ్స్‌కు ప్రత్యేకమైన శిక్షణ అంటూ ఏదీ ఉండేది కాదు, ఒక తరం నుంచి మరోతరానికి విద్య నేర్పిస్తూ వచ్చేవారు. దీంతో భారత ప్రభుత్వం చేనేతలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఐఐహెచ్‌టీలను నెలకొల్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్రం తరఫున 6, రాష్ట్రాల ఆధ్వర్యంలో 4 హ్యాండ్లూమ్‌ శిక్షణ విద్యాసంస్థలు ఉన్నాయి. వారణాసి (ఉత్తరప్రదేశ్‌), సేలం (తమిళనాడు), గౌహతి (అస్సోం), జోథ్‌పూర్‌ (రాజస్థాన్‌), బార్గా (ఒడిశా), శాంతిపూర్‌ (పశ్చిమబెంగాల్‌)లో ఉన్నాయి. రాష్ట్రాల ఆధ్వర్యంలో వెంకటాద్రి (ఆంధ్రప్రదేశ్‌), గడాగ్‌ (కర్ణాటక), చంపా (ఛత్తీస్‌ఘడ్‌), కన్నూర్‌ (కేరళ)లోనూ.. ఇవేకాక మరెన్నో శిక్షణ కేంద్రాలున్నాయి.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలు

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలు

‣ నలుగురితో కలిసిపోవాలంటే...

‣ బృందంతో నడుస్తూ..!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

Posted Date: 30-05-2024


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌