• facebook
  • whatsapp
  • telegram

క్లిష్ట సమస్యలకు సులువైన కోడ్‌

పైతాన్‌ డెవలపర్లకు పెరుగుతున్న‌ డిమాండ్‌

క్లిష్ట సమస్యలను కూడా చాలా తక్కువ సమయంలో చిన్న కోడ్‌తో పరిష్కరించగలిగే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ‘పైతాన్‌’. నైపుణ్యం ఉన్న పైతాన్‌ డెవలపర్లకు మనదేశంలోని ప్రముఖ కంపెనీలు మంచి వేతనం అందిస్తున్నాయి. అమెరికాలో కూడా వీరికి చాలా డిమాండ్‌ ఉంటోంది. దీని విశిష్టతలు ఏమిటి? ఎలా నేర్చుకోవాలి? 

పైతాన్‌ డెవలపర్లకు గిరాకీ

ప్రోగ్రామింగ్, పైతాన్‌ లాంగ్వేజ్‌ అనేవి ఇటీవలి కాలంలో మనం తరచూ వింటున్న పదాలు. పైతాన్‌ అనేది ప్రపంచంలో ప్రస్తుతం ఎంతో డిమాండ్‌ ఉన్న ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లలో ఒకటి. 2020లో స్టాక్‌ ఓవర్‌ ఫ్లో నివేదిక ప్రకారం- మోస్ట్‌ వాంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో పైతాన్‌ది ఒకటో స్థానం. అలాగే డెవలపర్స్‌ చాలా ఇష్టపడే లాంగ్వేజెస్‌లో ఇది మూడో స్థానంలో ఉంది.

ప్రోగ్రామింగ్‌ అంటే ఒక కంప్యూటర్‌కి మీకు ఏం కావాలనుకుంటున్నారో వివరించడం. అలాగే సాఫ్ట్‌వేర్‌ అంటే మీకు కావాల్సినదాన్ని సూచనల (ఇన్‌స్ట్రక్షన్స్‌) రూపంలో కంప్యూటర్‌కి వివరించడం. వాటిని కోడ్‌ అనీ అంటారు . ప్రస్తుత కాలంలో రాయడం, చదవడం నేర్చుకోవడం ఎంత ముఖ్యమో ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవడమూ అంతే ముఖ్యంగా ఉంది. ప్రభుత్వం జాతీయ విద్యావిధానం- 2020 ప్రకారం ఆరో తరగతి నుంచి కోడింగ్‌ని తప్పనిసరి చేసిందంటే.. ప్రోగ్రామింగ్‌ ఎంత ముఖ్యమైనదో గ్రహించవచ్చు.  

ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ అంటే?

ఒక మనిషి ఇంకొక మనిషితో సంభాషించాలంటే భాషను ఉపయోగిస్తాం కదా? తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ లాంటివి. అదే విధంగా ఒక మనిషి ఒక కంప్యూటర్‌తో మాట్లాడాలంటే కూడా ఒక భాష అవసరం. అదే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌.  ప్రపంచంలో సుమారుగా 700 ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు ఉన్నాయి. అందులో  సి, పైతాన్‌Â, జావా, గో, జావా స్క్రిప్ట్, కొట్లిన్‌ మొదలైనవి చాలా ప్రాచుర్యం పొందాయి. సాధారణంగా ఒక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో మంచి నైపుణ్యం పెంపొందించుకుంటే  మిగతా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ను కూడా వాటి రూల్స్‌ చూసి త్వరగా నేర్చుకోవచ్చు. 

పైతాన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ 

హ్యాకర్‌ న్యూస్‌ హైరింగ్‌ ట్రెండ్స్‌ ప్రకారం- ఏటా ఈ పైతాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ గిరాకీ  సి, సి++, జావా లాంటి ఇతర ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌స్‌తో పోలిస్తే పెరుగుతూ వస్తోంది. మంచి నైపుణ్యం ఉన్న పైతాన్‌ డెవలపర్లకు మన భారత్‌లో ఒరాకిల్, అమెజాన్‌ లాంటి కంపెనీలు రూ. 18 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకూ వేతనం ఇస్తున్నాయి. ఈ పైతాన్‌ లాంగ్వేజ్‌ని ఒక స్థాయి వరకు బాగా నేర్చుకుంటే మూల వేతనం 6 లక్షల వరకు ఉంటుంది. అలాగే పే స్కేల్‌ ప్రకారం అమెరికాలో కూడా పైతాన్‌ డెవలపర్లకు చాలా ఎక్కువ డిమాండ్‌ ఉంది అక్కడ పైతాన్‌ డెవలపర్ల వేతనం సుమారు రూ. 66 లక్షల వరకు ఉంటుంది. 

వివిధ డొమైన్లలో..

పైతాన్‌ లాంగ్వేజ్‌ని ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌/ మెషిన్‌ లర్నింగ్‌ (ఏఐ/ ఎంఎల్‌), ఐఓటీ, బిగ్‌ డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్, టెస్టింగ్, గేమ్‌ డెవలప్‌మెంట్, బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్, సైబర్‌ సెక్యూరిటీ.. ఇలా మరెన్నో డొమైన్‌లలో ఉపయోగిస్తుంటారు. మీలో చాలా మంది ఏఐ/ ఎంఎల్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ లాంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలు నేర్చుకోవాలని అనుకుంటారు కదా.. అవి నేర్చుకోవాలంటే మొదట పైతాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ మీద మంచి పట్టు సాధించాలి. 

నేర్చుకోవడం ఎలా ?

లక్షల్లో వేతనాలు వచ్చే ఉద్యోగాలు AI/ML, ఐఓటీ, సైబర్‌ సెక్యూరిటీ లాంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలకు పునాది పైతాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌. అందుకే దీన్ని నేర్చుకోవడం చాలా అవసరం. యుడెమి, కోర్స్‌ ఎరా లాంటి వాటిలో  దీన్ని నేర్చుకోవచ్చు. ఇంకా ఎన్నో ప్రైవేటు శిక్షణ సంస్థలు నేర్పిస్తున్నాయి. ఐబీ హబ్స్, నెక్స్‌ట్‌ వేవ్‌ కంపెనీ వారు సీసీబీపీ ప్రోగ్రామ్స్‌ ద్వారా పైతాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ఫౌండేషన్స్‌తో 4.0 టెక్నాలజీల్లో ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ ఇస్తున్నారు (www. ccbp.in/professional). ఏ సంస్థ నడిపే కోర్సులో శిక్షణ పొందినా..సుశిక్షితులైతే  పరిశ్రమ అవసరాలకు సిద్ధమైనట్టే! ఉపాధి మార్గం ఏర్పరుచుకున్నట్టే!  

ఎందుకు నేర్చుకోవాలి? 

1. ప్రపంచంలో టాప్‌ టెక్‌ కంపెనీలైన గూగుల్,  ఫేస్‌బుక్, అమెజాన్,  మైక్రోసాఫ్ట్, ఉబర్, నెట్‌ ఫ్లిక్స్‌  లాంటివీ, మరెన్నో కంపెనీలూ ఈ పైతాన్‌ లాంగ్వేజ్‌ని చాలా విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.  

2. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో వివిధ రకాల జాబ్‌ రోల్స్‌లో కూడా పైతాన్‌ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి DevOps Engineer, Software Developer, Data Scientist, Data Analyst, ML Engineer, Python Developer లాంటి రోల్స్‌లో పనిచేసేవారు పైతాన్‌ని ఉపయోగిస్తారు. 

3. ఈ లాంగ్వేజ్‌ చాలా సులువైనది. దీనిలో సింటాక్స్‌.. అంటే కంప్యూటర్‌కి ఇచ్చే సూచనలు తేలిగ్గా ఉంటాయి. ఇతర ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌తో పోల్చుకుంటే దీని సింటాక్స్‌ చాలా చిన్నది. ఇది ఆంగ్ల భాషను పోలి ఉంటుంది.  ప్రొఫెషనల్సే కాకుండా ప్రోగ్రామింగ్‌లో అవగాహన లేనివారూ  పైతాన్‌ లాంగ్వేజ్‌ని సులభంగా నేర్చుకోవచ్చు.

4. ఈ లాంగ్వేజ్‌తో క్లిష్టమైన ప్రాబ్ల్లెమ్స్‌ని తక్కువ సమయంలో చిన్న కోడ్‌తో పరిష్కరించవచ్చు.  జావాలో మూడు లైన్లు రాసే ‘హలో వరల్డ్‌’ ప్రోగ్రాంని పైతాన్‌లో కేవలం ఒక చిన్న లైన్‌లో రాయవచ్చు. ఇంతే కాకుండా ఇతర ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో ఎక్కువ లైన్లతో క్లిష్టంగా ఉండే ప్రోగ్రాంలు కూడా పైతాన్‌లో  చిన్న కోడ్‌తో రాయవచ్చు.  

5. దీనికి ప్రపంచవ్యాప్తంగా  పెద్ద ఇంటర్నెట్‌ కమ్యూనిటీ ఉంది. అంటే పైతాన్‌ లాంగ్వేజ్‌ వాడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువ. ఒకవేళ మీకు ఏమైనా సాంకేతిక సమస్యలు వచ్చినా, ఏదైనా అర్ధం కాకపోయినా కమ్యూనిటీలో  త్వరగా సహాయం దొరుకుతుంది.  

Posted Date: 07-05-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌