• facebook
  • whatsapp
  • telegram

పత్రికారంగంలోకి ప్రవేశించాలంటే..?

   పత్రికా వ్యవస్థని సమాజానికి కావలి కుక్కగా పోలుస్తారు. అందుకే 'వెయ్యి తుపాకుల కంటే నాలుగు ప్రతికూల పత్రికలకు వణికిపోతా'నని నెపోలియన్‌ లాంటి వ్యక్తే అన్నాడు. అదీ జర్నలిజం శక్తి! అంత శక్తిమంతమైన మీడియాలోకి రావాలంటే ఎలా? ఏం కావాలి? ఏం నేర్వాలి?

   మనకు 'పత్రికలు లేని ప్రభుత్వం' ఉండాలా లేక 'ప్రభుత్వం లేని పత్రికలు' కావాలా అని నన్నడిగితే నా మొగ్గు రెండోదానివైపేనని చెప్పడానికి క్షణం కూడా సంశయించనన్నాడు ప్రజాస్వామ్య భావనలకి ప్రాణం పోసిన ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు థామస్‌ జఫర్సన్‌. ప్రజాస్వామ్యానికి పత్రికా వ్యవస్థ ఎంత ముఖ్యమో తెలుసుకోవడానికి ఈ ఒక్క వ్యాఖ్య చాలు!

జర్నలిజానికి చాలా నిర్వచనాలున్నాయి. నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమాచారాన్ని ఇస్తుంది కాబట్టి న్యూస్‌ (ఎన్‌-నార్త్‌, ఇ-ఈస్ట్‌, డబ్ల్యు- వెస్ట్‌, ఎస్‌-సౌత్‌) అంటారు కానీ, న్యూ (కొత్త)కి బహువచనమే న్యూస్‌ (కొత్త సంగతులు). తాజాగా ఉండేదే వార్త. అది ఎప్పుడూ ప్రపంచానికి కొత్తగా తెలియాలి. అందుకే పత్రికలు కాలంతో పోటీపడి పనిచేస్తాయి. కూడు, గూడు, గుడ్డలకు తోడు ఇప్పుడు సమాచారం కనీస అవసరంగా మారింది. ప్రపంచం దగ్గరవుతున్నకొద్దీ మాస్‌మీడియా అవసరం పెరుగుతోంది.

   పత్రికావార్తలంటే ఆదరాబాదరాగా రాసే చరిత్ర. హడావుడిగా రాసినా వార్తలకు నిర్దిష్ట లక్షణాలుండాలి. ఎవరు (హు), ఏమిటి (వాట్‌), ఎప్పుడు (వెన్‌), ఎక్కడ (వేర్‌), ఎందుకు (వై), ఎలా (హౌ) అన్న ఆరు ప్రశ్నలకు (5 డబ్ల్యుస్‌, 1 హెచ్‌) వార్తలు సమాధానం చెప్పాలి.

మూడు బాధ్యతలు ...

పత్రికల మౌలిక బాధ్యతలు ముఖ్యంగా మూడు. సమాచారం తెలపడం, జాగృతపరచడం, వినోదాన్ని పంచడం. ఏ పత్రిక అయినా ఈ మూడు విషయాలకు లోబడి పనిచేస్తుంది. పత్రికల చిరకాల మనుగడకు విశ్వసనీయతే ప్రాణవాయువు. మంచి పత్రికలకు ఉండాల్సిన ఐదు ముఖ్య లక్షణాలు- ప్రజాప్రయోజనం, జవాబుదారీతనం, కచ్చితత్వం, సత్యనిష్ఠ, వృత్తి నైపుణ్యం. గాంధీజీ సూక్ష్మంగా జర్నలిజం అంటే ప్రజాసేవ అని చెప్పారు. పత్రికలకి చెడ్డ విషయాలే మంచి వార్తలు (బ్యాడ్‌ న్యూస్‌ ఈజ్‌ గుడ్‌ న్యూస్‌) అన్న అభిప్రాయమో, విమర్శో కూడా ప్రబలంగా ఉంది.

ఏ నైపుణ్యాలుండాలి?

   పత్రికా మాధ్యమంలో ప్రవేశించడానికీ, ఎదగడానికీ ఎలాంటి అర్హతలు, నైపుణ్యాలు ఉండాలి మరి? ఇవిగో ఇవే ఎక్కువమంది నిపుణులు చెప్పిన కొలమానాలు- కుతూహలం, తపన, చొరవ, అభిప్రాయాల్ని స్వీకరించే గుణం, ధైర్యం, సునిశిత పరిశీలన, గ్రహణశక్తి, విషయపరిజ్ఞానం, భాషాపాటవం, భావవ్యక్తీకరణ, సాంకేతిక నైపుణ్యాలు.

                                                  - ఎం. నాగేశ్వరరావు ప్రిన్సిపల్‌, ఈనాడు జర్నలిజం స్కూలు

'ఈనాడు జర్నలిజం స్కూలు'

   జర్నలిజంలో స్థిరపడాలన్న బలమైన సంకల్పం, వివిధ విషయాలపట్ల ఆసక్తి, పత్రికలూ పుస్తకాలూ చదివే అలవాటు, సాదాసీదా ఉద్యోగం కాకుండా భిన్నమైన వ్యాపకం పట్ల అభిరుచి, ప్రజాసేవ పట్ల అనురక్తి ఉండే ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు. స్కూలు నిబంధనల ప్రకారం 30 ఏళ్లకు మించని పట్టభద్రులై ఉండాలి. ప్రవేశాలు పూర్తిగా ప్రతిభ, ఆసక్తులపై ఆధారపడి ఉంటాయి.

కొన్ని నమూనా ప్రశ్నలు ఇవి...

1. ఇచ్చిన పదసముదాయంలో (ఎ, బి, సి, డి) అక్షరదోషాలు లేని రాశి ఒకటే ఉంది. దాన్ని గుర్తించండి.
ఎ) కష్టనష్టాలు, అభీష్ఠం, కాష్టం, ముష్టి           బి) సిష్ఠులు, శ్రేష్ఠులు, పుష్పి, సృష్టి
సి) ప్రతిష్టాపన, ప్రతిష్టంభన, వసిష్ఠుడు, నిష్ఠ    డి) దుష్టులు, సౌష్ఠవం, పౌష్టికం, దాష్టీకం

2. ఇచ్చిన వాక్యాల్లో నిర్మాణలోపం లేనిదాన్ని గుర్తించండి.
ఎ) నిర్ణీత సమయంలో ఇంకా ఐదు నిమిషాలు ముందుగానే అతిథులు చేరుకున్నారు
బి) నేను ఎప్పుడూ అసత్యం పలుకను    సి) పెద్దలను గౌరవంగా వ్యవహరించాలి
డి) సమష్టికృషితో సాధించలేనిది ఉండదు

3. ఇచ్చిన మాట ఏ కవి విరచితమో గుర్తించండి.
    కలకంఠి కంట కన్నీరొలికిన
ఎ) పెద్దన    బి) బద్దెన    సి) సోమన    డి) ఎవరూ కాదు

4. ఇచ్చిన వాక్యాలకు సరైన భావాల్ని గుర్తించండి
     పుల్ల విరుపు మాటలతో మంచి మిత్రుల్ని దూరం చేసుకోవద్దు
ఎ) అవమానించే ఘాటు మాటలతో..    బి) కించపరిచే పరిహాసాలతో..
సి) గుట్టువిప్పే మాటలతో..     డి) ఏదీకాదు

5. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు?
ఎ) నిజమని రుజువయిన దానికి వేరే సాక్ష్యం ఎందుకు?
బి) లాభంలేని దానికోసం ఎందుకు ప్రయత్నించాలి
సి) అద్దంలో చూసుకుంటే అందం పెరుగుతుందా?

6. Pick the meaning of the words underlined, in the contest of that sentence.
     My uncle enjoys himself to pin my ear.
a) to tease me with his words    b) to put needle in my ear
c) to sing in my ears    d) to whisper in my ears

7.  Pick the other form of the sentence given that doesn't change the meaning
      Raghu is cleverer than Ravi
a) Raghu as well as Ravi is clever   b) Raghu is the cleverest boy
c) Raghu is not as clever as Ravi   d) Ravi is not as clever as Raghu

8. HTML is used for?
a) To write internet programming   b) To kill the virus
c) For sending an email   d) Database storage

9. What are Cookies?
a) Audio files   b) files created in the sub- directory
c) Temporary files of internet   d) operating system

రాతపరీక్ష:

పేపర్‌-1:
   రాత పరీక్షలో రెండు ప్రశ్నపత్రాలుంటాయి. మొదటిది 120 లఘు ప్రశ్నలతో కూడిన పేపర్‌-1. 90 నిమిషాల్లో దీన్ని పూర్తిచేయాలి. తెలుగు భాషా పరిజ్ఞానం, ఆంగ్లంపై పట్టు తెలుసుకోవడానికి 50 ప్రశ్నలుంటాయి. రాజకీయ విషయాలు, చట్టసభలు, ప్రభుత్వ పథకాలు, సంస్థలు- కార్యకలాపాలు, చరిత్ర, శాస్త్ర సాంకేతిక విషయాలు, క్రీడలూ, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య వైద్య రంగాలు, న్యాయశాస్త్రం, రచనలు- రచయితలు, వార్తల్లోని వ్యక్తులు, కంప్యూటర్‌ విజ్ఞానం, సినిమా, ఇంకా... పత్రికల్లో తరచూ వచ్చే అనేకానేక విషయాలపై 50 ప్రశ్నలుంటాయి. అభ్యర్థి దృక్పథం, ఆలోచనా సరళి, చురుకుదనం, మానసిక సామర్థ్యం తెలుసుకొనేందుకు మరో 20 ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో నెగ్గాలంటే 60 శాతం కంటే ఎక్కువ మార్కులైనా రావాలి. లేదా మొదటి 300 మందిలో అయినా ఉండాలి. ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్కు. తప్పు సమాధానాలకు పావు మార్కు కోత ఉంటుంది. ఇందులో నెగ్గిన అభ్యర్థుల పేపర్‌-2 సమాధానాలనే దిద్దుతారు.

పేపర్‌-2:
   లఘు ప్రశ్నలతో కూడిన పేపర్‌-1లో గట్టెక్కిన అభ్యర్థుల్లో లోతైన పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిందే ఈ ప్రశ్నపత్రం. ఇందులో మూడు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

* మొదటి ప్రశ్న భాషా పరిజ్ఞానానికి సంబంధించింది.
    ఉదా: మీరు ఇటీవల చదివిన ఒక పుస్తకాన్ని లేదా చూసిన సినిమాని పరిచయం చేస్తూ మీ స్నేహితుడికి 750 మాటలకు తగ్గకుండా లేఖ రాయండి.

* (2012) రెండో ప్రశ్న వర్తమాన వ్యవహారాలకు సంబంధించింది. 
    ఉదా: నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయితే దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో విశ్లేషించండి.

* మూడో ప్రశ్న అనువాద సామర్థ్యాన్ని పరీక్షించేది.
    మూడు ప్రశ్నలకూ 20 చొప్పున సమాన మార్కులు ఉంటాయి. ఈ మూడింటిలోనూ కనీస ప్రతిభ చూపినవారే బృంద చర్చలకూ, మౌఖిక పరీక్షలకూ ఎంపికవుతారు.

బృంద చర్చలు:

   సాధారణంగా చర్చా కార్యక్రమాలకు సమన్వయకర్త ఉంటారు. దీన్ని సమన్వయకర్త లేని బృంద చర్చ (లీడర్‌లెస్‌ గ్రూప్‌ డిస్కషన్‌) అంటారు. అభ్యర్థిలో బృంద స్ఫూర్తిని తెలుసుకోవడానికి ఉద్దేశించిన పరీక్ష ఇది. ఏడు నుంచి పది మంది వరకు ఉండే ఒక బృందానికి అప్పటికప్పుడు ఒక అంశం ఇచ్చి 45 నిమిషాలపాటు చర్చించమంటారు. చర్చ మధ్యలో బయటినుంచి ఎవరూ జోక్యం చేసుకోరు. అర్థవంతమైన ముగింపు కూడా బృంద సభ్యులే ఇవ్వాలి. అభ్యర్థి వైఖరినీ, నలుగురితో కలసి పనిచేసే గుణాన్నీ, నాయకత్వ లక్షణాల్నీ పరీక్షించడానికి ఐదుగురు పరిశీలకులు ఉంటారు. వారి ఉమ్మడి అభిప్రాయం ప్రకారం ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.

మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ):

   ఇది చివరి అంకం. అభ్యర్థి సంసిద్ధత, దృక్పథం, మీడియాలో స్థిరపడాలన్న అభ్యర్థి ఆసక్తిని పరీక్షించడానికి ఉద్దేశించిందే ఈ ఇంటర్వ్యూ. ఇందులో నెగ్గిన వారికి డిసెంబరు నెలలో శిక్షణ ప్రారంభమవుతుంది. ఇది నేర్చుకొంటూ సంపాదించుకునే చదువు. కోర్సులో ఉన్నప్పుడు శిక్షణ భృతి ఉంటుంది. పత్రికా మాధ్యమంలో ఉండే రిపోర్టింగ్‌ (క్షేత్ర), ఎడిటింగ్‌ (డెస్కు)లు రెండింటిలోనూ శిక్షణ ఇస్తారు. విద్యార్థులు సాధారణంగా స్కూల్లో ఏడు నెలలు, క్షేత్ర శిక్షణలో ఐదు నెలలు ఉంటారు. మండల కేంద్రం నుంచి రాజధానిలోని అన్ని విభాగాలనూ విద్యార్థులు దగ్గర్నుంచి పరీశీలించి, పని నేర్చుకునే అవకాశం లభిస్తుంది. పత్రికారంగంలో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. తాత్కాలిక ఉపాధి కోసం వచ్చేవారికి మాత్రం ఇది వృథా ప్రయాస. ప్రతిభ ఉండీ కష్టపడి పనిచేయనివారు, అంతగా ప్రతిభ లేకపోయినా కష్టపడి పనిచేసేవారిముందు ఓడిపోతుంటారన్న నిజం అన్ని వృత్తుల కన్నా జర్నలిజానికి బాగా నప్పుతుంది.

Posted Date: 03-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌