• facebook
  • whatsapp
  • telegram

నిత్యనూతన కెరియర్‌... జర్నలిజం

సామాజిక స్పృహ, విశ్లేషణ సామర్థ్యం, ఉత్సాహంతో దూసుకుపోయే స్వభావం ఉండే యువతకు సరైన వృత్తి జర్నలిజం. మీడియా వ్యాప్తి, పెరుగుతున్న ప్రాముఖ్యం ఈ రంగంలో సరికొత్త ఉపాధి అవకాశాలకు దోహదపడుతున్నాయి. ప్రధానంగా ఎలక్ట్రానిక్‌, న్యూ మీడియాల విజృంభణ గణనీయమైన పరిణామం. తగిన శిక్షణతో ప్రతిభావిశేషాలకు మెరుగులు దిద్దుకుంటే అద్భుతాలు సృష్టించటానికి ఆకాశమే హద్దు!


                


   ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రోజూ ఎన్నో ఘటనలు జరుగుతుంటాయి. ఈ పరిణామాలు ప్రజల జీవనగతిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపిస్తాయి. అందుకే వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక ముఖ్యమైన సంఘటనపై వార్తా విశేషాలు మాత్రమే కాకుండా, సరైన విశ్లేషణ కూడా ఆశించేలా పాఠకుల అభిరుచులు విస్తరించాయి. భారతదేశంలాంటి ప్రజాస్వామిక దేశాల్లో జర్నలిజం ప్రధానపాత్ర వహిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని మలచటంలో మీడియాది ప్రత్యేక భూమిక.

వార్తాపత్రిక, టెలివిజన్‌, అంతర్జాల మాధ్యమాల ద్వారా పాఠకులు/వీక్షకులు వివిధ సంఘటనలను తమ ఇంట్లో కూర్చునే గ్రహించగలుగుతున్నారు. ఎందరో సుశిక్షితులైన జర్నలిస్టుల, సాంకేతిక నిపుణుల కృషి వల్లనే ఇది సాధ్యమవుతోంది. వీరు వివిధ దశల్లో నిర్వహించే రిపోర్టింగ్‌, రైటింగ్‌, ఎడిటింగ్‌, ఫొటోగ్రాఫింగ్‌ లాంటి ప్రక్రియల ఫలితంగా సమాచార సేకరణ, ప్రచురణ, ప్రసారాలు జరుగుతున్నాయి.

   ఈ కెరియర్‌ను ఎంచుకునేవారు సాధారణంగా డిగ్రీ తర్వాత అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (బి.సి.జె.)ను చదువుతారు. దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలూ ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇంగ్లిష్‌లోనే కాకుండా ప్రాంతీయ భాషామాధ్యమంలో కూడా ఈ కోర్సును అధ్యయనం చేయవచ్చు. పీజీ స్థాయిలో ఎం.సి.జె. కూడా ఉంది.

   సిలబస్‌ నవీకరణ, ప్రాయోగిక శిక్షణ, క్షేత్ర సందర్శనలు మొదలైన ఎన్నో అంశాల్లో విశ్వవిద్యాలయాలు నిర్వహించే జర్నలిజం కోర్సుల కంటే వార్తాపత్రికలు అందించే కోర్సులకే అధిక ప్రామాణికత ఉండటం విశేషం!

   ప్రముఖ జాతీయ, ప్రాంతీయ భాషాపత్రికలు తమ అవసరాల కోసం ప్రత్యేకంగా జర్నలిజం స్కూళ్ళను నడుపుతున్నాయి. ఏడాది వ్యవధి ఉండే పీజీ డిప్లొమా ప్రోగ్రాముల్లోకి రాతపరీక్ష, బృందచర్చ, మౌఖిక పరీక్షలు నిర్వహించి విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. కేంద్రీకృత శిక్షణ ఇచ్చి వారిని సుశిక్షితులుగా మలుస్తున్నాయి. సిలబస్‌ నవీకరణ, ప్రాయోగిక శిక్షణ, క్షేత్ర సందర్శనలు మొదలైన ఎన్నో అంశాల్లో విశ్వవిద్యాలయాలు నిర్వహించే కోర్సుల కంటే పత్రికలు నిర్వహించే కోర్సులకే అధిక ప్రామాణికత ఉండటం విశేషం!

విభిన్నమైన రంగాల్లో...
   జర్నలిజం కోర్సు పూర్తిచేసినవారికి పత్రికల్లోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా అవకాశాలు లభిస్తాయి. ఫ్యాషన్‌, బ్యూటీ, ఫ్యామిలీ, యూత్‌, ట్రావెల్‌, మెడికల్‌, సాంకేతికం, లైఫ్‌ స్త్టెల్‌, విద్య, క్రీడలు మొదలైన అంశాలపై వెలువడుతున్న ప్రత్యేక మ్యాగజీన్లు పాఠకాదరణ పొందుతున్నాయి. ఇవి వివిధ భాషల్లో వెలువడుతూ జర్నలిజం చేసినవారిని నియమించుకుంటున్నాయి. వాణిజ్య ప్రకటనల ఏజెన్సీలు, విద్యాసంస్థలు, మ్యాగజీన్లు, పోర్టల్స్‌, వెబ్‌సైట్లు, పబ్లిషింగ్‌ హౌసులు, టీవీ, రేడియో చానల్స్‌ మొదలైనవాటిలో ఉపాధికి అవకాశముంది.

   ఇది తీవ్రంగా పోటీ ఉండే రంగం. అంకితభావంతో అత్యుత్తమ స్థాయి ప్రతిభ చూపినవారే పేరు తెచ్చుకోగలుగుతారు. నిర్దిష్ట పనిగంటలు అని చూసుకోకుండా కష్టపడి పనిచేయాల్సివుంటుంది. వీటన్నిటికీ సిద్ధమైనవారే ఈ రంగంలో ప్రవేశించటం మంచిది.

జర్నలిజం బాధ్యతాయుతమైనదే కాకుండా ఆకర్షణీయమైనదీ, ఆసక్తికరమైనదీ. ఈ కెరియర్‌ ఎంచుకోదలిచినవారికి చక్కని మాట తీరు, ఆత్మవిశ్వాసం, సమాచారాన్ని కచ్చితంగా, సమగ్రంగా రాసే, ప్రదర్శించగలిగే సామర్థ్యం అవసరం. భాషా నైపుణ్యం తప్పనిసరి. రాజకీయాలు, ఆర్థికం, వాణిజ్యం, చరిత్ర, క్రీడలు, వినోదం లాంటి విభిన్న రంగాల సమాచారాన్ని అందించాల్సివుంటుంది కాబట్టి విస్తారంగా పరిజ్ఞానం పెంచుకోకతప్పదు.

మూడు విభాగాలు
   జర్నలిజం కోర్సు ప్రధానంగా మూడు విభాగాలుగా ఉంటుంది. అభ్యసించే దశలోనే విద్యార్థులు తమ ఆసక్తులను బట్టి ఏదో ఒక విభాగంలో నిర్దిష్టంగా శిక్షణ తీసుకోవచ్చు.

1. ప్రింట్‌ జర్నలిజం

   జర్నలిజానికి సంబంధించి ఇది సాంప్రదాయిక రూపం. వార్తాపత్రికలూ, మ్యాగజీన్లలో విధులు స్థూలంగా క్షేత్ర స్థాయిలో, డెస్కులో చేసేవిగా విభజించవచ్చు.

క్షేత్రస్థాయి: పెద్ద వార్తాపత్రికలూ, మ్యాగజీన్లలో ప్రతి రిపోర్టర్‌కూ ప్రత్యేకమైన అసైన్‌మెంట్‌ ఉంటుంది. రాజకీయం, కార్పొరేట్‌ వ్యవహారాలు, క్రీడలు, ఫ్యాషన్లు మొదలైన అంశాలకు ప్రత్యేకించిన జర్నలిస్టులుంటారు. వేగం, స్పష్టత, కచ్చితత్వం వీరికి అవసరం.

డెస్క్‌ వర్క్‌: వార్తాపత్రికలూ, మ్యాగజీన్లలో ఉండే న్యూస్‌డెస్క్‌లో సబ్‌ ఎడిటర్లు, కాపీ ఎడిటర్లు కథనాలను స్పష్టంగా, ఆసక్తికరంగా మలిచి, ఆకట్టుకునే శీర్షికలతో తీర్చిదిద్దుతారు. ఏ కథనమైనా వీలైనంత సమగ్రంగా, పక్షపాతం లేకుండా విషయనిష్ఠతో ఉండేలా చూడటం వారి బాధ్యత. వార్తాప్రాధాన్యం గుర్తించటం, పాఠకాసక్తి కోణాన్ని పసిగట్టటం వీరు రాణించేలా చేస్తాయి. చేసే పనిని బట్టి ఫొటో జర్నలిస్టు, కార్టూనిస్టు, కరస్పాండెంట్‌/ స్పెషల్‌ రిపోర్టర్‌, లీడర్‌ రైటర్‌, ఫీచర్‌ రైటర్‌ మొదలైన హోదాలు ఉంటాయి.

2. ఎలక్ట్రానిక్‌ జర్నలిజం

   మన రాష్ట్రం అత్యధిక వార్తా చానెళ్ళకు ప్రసిద్ధి. ఇరవై నాలుగు గంటల వార్తాప్రసారాలు ప్రజల నిత్యజీవితంలో భాగమైపోయాయి. సహజంగానే ఉపాధి అవకాశాలు కూడా వీటిలో బాగా పెరిగాయి. ఎలక్ట్రానిక్‌ జర్నలిజంలో ఉద్యోగాలు రిపోర్టింగ్‌, యాంకరింగ్‌, ప్రొడక్షన్‌ అనే మూడు రకాలుగా ఉంటాయి. మంచి రూపం, సమయస్ఫూర్తి, చక్కని భావవ్యక్తీకరణ నైపుణ్యాలుంటే దీనిలో బాగా రాణించవచ్చు. నిర్వహించే విధులను బట్టి ఈ విభాగంలో రిసెర్చర్లు, సౌండ్‌ టెక్నీషియన్లు, కెమెరా వర్కర్లు, ప్రెజెంటర్లు లాంటి హోదాలుంటాయి.

3. వెబ్‌ జర్నలిజం

   అంతర్జాలం (ఇంటర్నెట్‌) ప్రాబల్యం ప్రజాజీవితంలోని అన్ని రంగాలపైనా ప్రసరించింది. ఏకంగా వెబ్‌ జర్నలిజం అనే ప్రత్యేక శాఖే ఆవిర్భవించింది. అంతర్జాలం కోసం సమాచారాన్ని రూపొందించేవారే వెబ్‌ జర్నలిస్టులు. ప్రధాన వార్తాపత్రికలన్నీ నెట్‌ ఎడిషన్లను నిర్వహిస్తున్నాయి. తాజా వార్తలను తక్షణం అందించే సౌలభ్యం ఉండటం వల్ల వీటికి ఎంతో ఆదరణ ఉంది. కేవలం వెబ్‌ రూపంలో మాత్రమే కొనసాగుతున్న మ్యాగజీన్లు కూడా ఉన్నాయి. భవిష్యత్తు అపారంగా ఉన్న రంగం ఇది. వార్తలను పదునుగా, ఆసక్తికరంగా అందించటం దీనిలో ప్రధానం. పదునైన ఎడిటింగ్‌, ఆకట్టుకునే ప్రెజెంటేషన్‌, ఆసక్తికరమైన క్యాప్షన్లు రాయటంలో ప్రతిభ చూపటం ఈ విభాగంలో ముఖ్యావసరాలు.

   కొత్త సవాళ్ళు ఎదురవుతూ నిత్యనూతనంగా ఉండే జర్నలిజం ఉత్సాహవంతులైన యువతకు చక్కని కెరియర్‌ మార్గం. ఉపాధినివ్వటమే కాకుండా సమాజానికి కొంత మేలు చేసే అవకాశం కూడా దీనిలో ఉండటం విశేషం!

Posted Date: 20-08-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌