• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక సాంకేతిక‌త‌.. అవ‌కాశాల వెల్లువ‌

ఉద్యోగావ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల్సిన త‌రుణ‌మిది!

సాంకేతికతదే భవిష్యత్తు! దీనితో అనుసంధానమవటం అంటే కెరియర్‌ అవకాశాలెన్నిటికో వీలు కల్పించుకున్నట్టే!  రోబోటిక్స్, కంప్యూటర్‌ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, డేటాసైన్స్, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌), మెషిన్‌ లర్నింగ్‌ లాంటి సాంకేతిక ఆధారిత కోర్సులను చదవడం వల్ల మెరుగైన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ సందర్భంగా బోధన, అభ్యాసాల్లో వస్తున్న మార్పులను గమనించటం ముఖ్యం. 

వర్చువల్‌ తరగతులు, ఆన్‌లైన్‌ పాఠాలు... త్రీడీ గేమింగ్‌లు... ఇవన్నీ సాంకేతికత ఎంత పెరిగిందో రుజువు చేస్తున్నాయి. ఈ దిశగా పరిజ్ఞానాన్ని పెంచుకుంటే ఎన్నో ఉద్యోగావకాశాలను సులువుగా అందిపుచ్చుకోవచ్చు. నూతన విద్యా విధానంలో సాంకేతిక పరిజ్ఞానానిదే ప్రధాన పాత్ర. సరికొత్త ఆవిష్కరణలు, ఆలోచనా పరిధి విస్తరణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనేక విద్యాసంస్థలు ఇప్పటికే వినియోగిస్తున్నాయి.  

కరోనా కారణంగా మారిన పరిస్థితుల వల్ల ఇంటి నుంచి నేర్చుకోవడం ఒక్కటే మార్గంగా మిగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోంది. గ్యాలప్‌ జరిపిన తాజా అధ్యయనం ప్రకారం.. తరగతి బోధనకు డిజిటల్‌ లర్నింగ్‌నే సాధనంగా 81 శాతం ఉపాధ్యాయులు, 88 శాతం ప్రిన్సిపల్స్‌ ఎంచుకున్నట్టు వెల్లడైంది. కాబట్టి ప్రస్తుత, సమీప భవిష్యత్‌ విద్యా విధానంలో సాంకేతిక పరిజ్ఞానం ఎలాంటి మార్పులు తెస్తోందో తెలుసుకుందాం.

పర్సనలైజ్డ్‌ లెర్నింగ్‌: కృత్రిమ మేధ ఈ వ్యక్తిగతీకరించిన అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. బోధనా విధానంతో పురోగతిని సాధించినడానికి పాఠశాలలు ఈ విధానం వైపు మొగ్గుచూపుతున్నాయి. విద్యార్థులందరికీ ఒకే విధంగా బోధించే పాత పద్ధతి కంటే.. ఈ విధానంలో విద్యార్థులు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. కృత్రిమ మేధను వినియోగించడం వల్ల విద్యార్థులకు విషయ అవగాహన కలిగించడానికి టీచర్లకు ఎక్కువ సాధనాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు అసైన్‌మెంట్లు పూర్తిచేయడంలోనూ కృత్రిమ మేధ తోడ్పడుతుంది.

స్మార్ట్‌ కంటెంట్‌: పాఠశాలలూ, ఉన్నత విద్యాసంస్థల్లో ఇది ప్రభావాన్ని చూపుతోంది. ఇలస్ట్రేటివ్‌ వీడియో లెక్చర్లు, కొన్ని సబ్జెక్టుల కోసం ప్రత్యేకించి రూపొందించిన పాఠ్యపుస్తకాలు, డిజిటల్‌ పుస్తకాలు, ఆన్‌లైన్‌ అసైన్‌మెంట్‌ టెస్టులు, ఆన్‌లైన్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రాములు.. ఇవన్నీ స్మార్ట్‌ కంటెంట్‌ కిందికే వస్తాయి. వీఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇమ్మర్సివ్‌ లర్నింగ్‌ ఓ ముఖ్యాంశం. ఫ్యాక్టరీలకు వర్చువల్‌ టూర్స్‌ నిర్వహించడం లాంటివి విద్యార్థుల దృష్టి కోణాన్ని విస్తరిస్తాయి. 

కాంపిటెన్సీ బేస్డ్‌ లర్నింగ్‌: విద్యార్థుల నైపుణ్యాన్ని ఈ సమర్థత ఆధారిత అభ్యాసం పెంచుతుంది. భవిష్యత్తులో నేర్చుకునే మార్గాలను విస్తరింపజేస్తుంది. దీంట్లో భాగంగా విద్యార్థి వ్యక్తిగత ప్రతిభను పారదర్శకంగా ఉంచుతారు. దాంతో ఉపాధ్యాయులకు విద్యార్థుల ప్రతిభను గుర్తించడం తేలికవుతుంది. విద్యార్థులకు తమ బలాబలాల గురించి స్పష్టమైన అవగాహన వస్తుంది. ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో గుర్తించి మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచే దిశగా కొత్త ప్రోగ్రామ్‌లను రూపొందించే వీలుంటుంది. తరగతి గదిలో గడిపే సమయాని కంటే ఎక్కువగా విద్యార్థులు అదనంగా నేర్చుకునే వీలుంటుంది. 

వర్చువల్‌ లర్నింగ్‌ ఎన్విరాన్‌మెంట్‌: కృత్రిమ మేధ సహాయంతో విద్యార్థుల సందేహాలకు ఉపాధ్యాయులు సమాధానాలు చెప్పే వీలుంటుంది. దీంట్లో భాగంగా.. అనేకమంది విద్యార్థులకు ఒకేసారి సమాధానం చెప్పే అవకాశమూ ఉంటుంది. దూరప్రాంతాల్లోని విద్యాసంస్థలు, సైన్స్‌ ల్యాబొరేటరీలకు విద్యార్థులు వెళ్లకుండానే అక్కడ స్వయంగా ఉన్నట్టుగా అనుభూతిని చెందుతూ నేర్చుకునే వీలుంటుంది. దీంతో సమయమూ వృథా కాదు. 

ఆటోమేటింగ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ టాస్క్స్‌: విద్యాసంస్థల పాలనాపరమైన కార్యక్రమాలను ఈ పద్ధతిలో సులువుగా పూర్తిచేయొచ్చు. ఈ విధానంలో సమయం ఆదా అవుతుంది. గ్రేడింగ్‌ అసెస్‌మెంట్ల విషయంలో టీచర్ల పనిని సులువు చేస్తుంది. దాంతో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికీ తగినంత సమయాన్ని కేటాయించగలుగుతారు. 
 

Posted Date: 20-05-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌